Jadavpur university
-
రైతు బిడ్డకు రూ. 1.8 కోట్ల భారీ ప్యాకేజీతో జాబ్
కోల్‌కతా: ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన బిడ్డ.. తండ్రి కష్టం చూసి కష్టపడి చదివాడు. ఆ కష్టం ఇప్పుడు ఫలించింది. భారీ ప్యాకేజీతో ఉద్యోగం దక్కింది. అదీ ఫేస్బుక్లో. తమ బిడ్డ సాధించిన ఘనతకు ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. కోల్‌కతా జాదవ్‌పూర్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఫైనలియర్ చదువుతున్న బిశాక్ మోండాల్‌కు.. హయ్యెస్ట్పే ప్యాకేజీతో జాబ్ దక్కింది. అతనిది ఒక సాదాసీదా రైతు కుటుంబం. బీర్భూమ్లోని రామ్‌పూర్‌హట్‌లో ఉంటోంది అతని కుటుంబం. తండ్రి రైతుకాగా.. తల్లి అంగన్వాడీ వర్కర్. తమ బిడ్డను తమను గర్వపడేలా చేశాడని ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. బిశాఖ్ సెప్టెంబర్‌లో లండన్‌లోని ఫేస్బుక్లో జాయిన్ కాబోతున్నాడు. కోటి 80 లక్షల రూపాయల ప్యాకేజ్. అయితే ఫేస్బుక్ కంటే ముందు అతనికి గూగుల్, అమెజాన్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. ప్యాకేజీ ఎక్కువగా ఉండడంతో ఫేస్బుక్ వైపు మొగ్గు చూపించినట్లు తెలిపాడు. గతంలో కోటి కంటే ఎక్కువ జీతంతో తొమ్మిది మంది జేయూ విద్యార్థులు ఈ ఘనత సాధించగా.. ఆ అందరిలోకెల్లా హయ్యెస్ట్ ప్యాకేజీ దక్కించుకుంది మాత్రం బిశాఖ్ కావడం గమనార్హం. -
జేయూలోనూ జేఎన్‌యూ రగడ..
కోల్‌కతా : జేఎన్‌యూ ఘటనపై జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్ధులు, బీజేపీ కార్యకర్తలు సోమవారం సాయంత్రం బాహాబాహీకి దిగడంతో జేయూ రణరంగమైంది. నగరంలోని జనసమ్మర్థ సులేఖ మోర్ ప్రాంతం వద్ద ఇరు వర్గాలు ఎదురుపడటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్ధులు, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు తలపడటంతో కోల్‌కతా పోలీసులు లాఠీచార్జి జరిపి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు తమపై లాఠీచార్జి జరిపి భాష్పవాయుగోళాలను ప్రయోగించారని జేయూ విద్యార్ధులు నిరసనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు గంటల పాటు రహదారిని నిర్భందించిన అనంతరం స్ధానిక పోలీస్ స్టేషన్లో పోలీసులు తమపై అనుచితంగా ప్రవర్తించారని, విద్యార్ధినులను తోసివేశారని జేయూ విద్యార్ధులు ఫిర్యాదు చేశారు. పోలీసుల వ్యవహారశైలిపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ బహిరంగ క్షమాపణలు కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది. అంతకుముందు జేయూ విద్యార్ధులు జేఎన్‌యూ ఘటనను నిరసిస్తూ క్యాంపస్‌లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన విద్యార్ధులకు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు వర్సిటీ మీదుగా జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్ వరకూ ఏబీవీపీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న జేయూ విద్యార్ధులు పెద్ద సంఖ్యలో క్యాంపస్ వెలుపలకు వచ్చి బీజేపీ ప్రదర్శనను అడ్డుకునేందుకు సిద్ధపడ్డారు. విద్యార్ధులు బీజేపీ జెండాను దగ్ధం చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు బారికేడ్లను దాటి విద్యార్ధులపైకి రావడంతో పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. -
ప్రొఫెసర్‌పై బీజేపీ కార్యకర్తల దాడి..
కోల్‌కతా : జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో బీజేపీ మద్దతుదారులైన కొందరు మహిళా కార్యకర్తలు తనపై దాడి చేశారని వర్సిటీ ప్రొఫెసర్ ఆరోపించారు. ఓ వర్గాన్ని కించపరుస్తూ జాదవ్‌పూర్ వర్సిటీ ప్రతిష్టను మసకబార్చేలా ఆ పార్టీ కార్యకర్త చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తనను గాయపరిచారని ఆమె వెల్లడించారు. కాగా వర్సిటీ ప్రొఫెసర్‌పై తమ పార్టీ కార్యకర్తలెవరూ దాడిచేయలేదని, క్యాంపస్ వద్ద జరిగిన తమ పార్టీ సమావేశంలో లెఫ్ట్ మద్దతుదారులు ఆందోళన చేపట్టినా సంయమనం పాటించామని బీజేపీ నాయకత్వం పేర్కొంది. మరోవైపు తనపై జరిగిన దాడిని ఆంగ్ల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ దొయితా మజుందార్ సోషల్ మీడియాలో వివరించారు. పౌర చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొని తాను వెనుదిరిగి వస్తుండగా క్యాంపస్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం జరుగుతోందని, ఆ పార్టీ నేతలు విద్వేషపూరిత ప్రసంగం చేస్తున్నారని తెలిపారు. అన్ని అనర్ధాలకు ఈ యూనివర్సిటీ కారణమని, ఇక్కడ ప్రతిరోజూ వారంతా అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తుంటారని ఓ వక్త చెబుతుండగా తాను అవి అసత్యాలని బిగ్గరగా అరిచానని ఆమె చెప్పుకొచ్చారు. తాను ప్రతిఘటించిన వెంటనే తనను పలువురు బీజేపీ మహిళా కార్యకర్తలు చుట్టుముట్టి దారుణంగా కొట్టారని చెప్పారు. అడ్డగించిన మరో వ్యక్తిని కూడా వారు గాయపరిచారని అన్నారు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ప్రొఫెసర్ వెల్లడించారు. కాగా క్యాంపస్ వెలుపల తాము నిర్వహించిన సమావేశానికి కొందరు లెఫ్ట్ మద్దతుదారులు హాజరై నినాదాలు చేశారని, తమ కార్యకర్తలపై దాడి చేసినా తాము సంయమనం వహించామని బీజేపీ నేత షమిక్ భట్టాచార్య తెలిపారు. కాగా ప్రొఫెసర్ ఫిర్యాదుపై విచారణ చేపట్టి తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. -
గవర్నర్‌ను అడ్డుకున్న విద్యార్ధులు
కోల్‌కతా : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. మంగళవారం జాదవ్‌పూర్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంకర్‌ను వరుసగా రెండో రోజూ విద్యార్ధులు చుట్టుముట్టడంతో ఉద్రిక్తంగా మారింది. చట్టానికి మద్దతుగా గవర్నర్ బహిరంగ ప్రకటనలు చేయడంపై విద్యార్ధులు భగ్గుమంటూ నల్లజెండాలు చేబూని ఆయనను అడ్డుకున్నారు. మరోవైపు విద్యార్ధుల నిరసనపై గవర్నర్ మండిపడుతూ ఇలాంటి పరిస్థితి నెలకొనేలా యూనివర్సిటీ ఎందుకు అనుమతించిందో తనకు అర్ధం కావడం లేదని, ఇది తనకు దిగ్ర్భాంతి కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. విద్యార్ధుల నిరసనల నేపథ్యంలో వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని గవర్నర్ ధంకర్ వ్యాఖ్యానించారు. జాదప్‌పూర్ యూనివర్సిటీ చాన్సలర్‌గా వ్యవహరిస్తున్న గవర్నర్‌ను విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించి విద్యార్ధులకు పట్టాలను అందచేసేందుకు ఆహ్వానించారు. అయితే గవర్నర్‌ను మాట్లాడనివ్వకుండా విద్యార్ధులు అడ్డుకున్నారు. కొద్దిమంది విద్యార్ధులు మాత్రమే కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని, వ్యవస్థలు ధ్వంసం చేయడం సరికాదని, అది విపరిణామాలకు దారితీస్తుందని గవర్నర్ హెచ్చరించారు. కనుచూపు మేర చట్ట నిబంధనలు కనిపించడంలేదని, రాజ్యాంగ అధిపతిగా ఇది తనను ఆందోళనకు గురిచేస్తోందని ధంకర్ ట్వీట్ చేశారు. కాగా యూనివర్సిటీ ఉన్నతాధికారులతో సమావేశం సందర్భంగా సోమవారం క్యాంపస్‌కు చేరుకున్న సందర్భంలోనూ గవర్నర్‌కు విద్యార్ధులు నల్లజెండాలు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. -
ఇక ఆ స్వీట్ ఆరునెలల పాటు పాడవదు..
కోల్‌కతా : రెండేళ్ల కిందట జియో ట్యాగింగ్ పొందిన నోరూరించే బెంగాలీ స్వీట్ రస్గుల్లాను అంతర్జాతీయంగా మార్కెట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో కలిసి జాదవ్‌పూర్ యూనివర్సిటీ పనిచేస్తోంది. బెంగాల్ రుచులను ప్రపంచానికి చాటిన రస్గుల్లా ఎంతకాలమైనా పాడవకుండా ఉండేలా జాదవ్‌పూర్ వర్సిటీ ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ చర్యలు చేపడుతోంది. రస్గుల్లా నిల్వ చేసుకునే గడువును కనీసం ఆరు నెలల పాటు పొడిగించేందుకు పరిశోధన అభివృద్ధి విభాగం అవసరమైన ప్రిజర్వేటివ్స్పై కసరత్తు సాగిస్తోందని జాదవ్‌పూర్ వర్సిటీ ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు చెందిన సీనియర్ ప్రొఫెసర్ తెలిపారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుని రస్గుల్లా రుచులను ఆస్వాదించేందుకు ఇది త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన అనంతరం వర్సిటీ నిపుణులు సూచించిన పద్ధతుల్లో ఆటోమేటెడ్ యంత్రాలపై రస్గుల్లా తయారీని చేపట్టి మదర్ డైరీ బ్రాండ్‌పై విక్రయిస్తామని బెంగాల్ పశుసంవర్థక శాఖ మంత్రి స్వపన్ దేవ్‌నాధ్ తెలిపారు. మరోవైపు మధుమేహులు తినేందుకు వెసులుబాటు కల్పిస్తూ డయాబెటిక్ రస్గుల్లాను కూడా తయారుచేయడంపై కసరత్తు చేస్తున్నామని జాదవ్‌పూర్ వర్సిటీ ప్రొఫెసర్ వెల్లడించారు. -
‘మీ కొడుక్కి ఎలాంటి హాని చేయను’
కోల్‌కతా: రెండు రోజుల క్రితం కోల్‌కతా జాదవ్‌పూర్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న సంగతి తెలిసిందే. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు హాజరైన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో రాకకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో విద్యార్థులు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. సెమినార్ అనంతరం ఆయన తిరిగి వెళుతుండగా కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనపై దాడి చేయడమే కాక జుట్టుపట్టుకు లాగిన ఓ విద్యార్థి ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు బాబుల్ సుప్రియో. సదరు విద్యార్థి పేరు దేబంజన్ బల్లవ్‌గా పేర్కొన్నారు. కొద్ది గంటల్లోనే ఈ ఫోటోలు తెగ వైరలయ్యాయి. దాంతో దేబంజన్ తల్లి రూపాలి బల్లవ్ మీడియా ముందుకు వచ్చి తన కుమారుడిని ఏం చేయవద్దంటూ ప్రాధేయపడింది. This is the guy who led the assault in #JadavpurUniversity .. we will find him out and then see what @MamataOfficial does to him in terms of charging him for assault without ANY PROVOCATION whatsoever from our/my side@CPKolkata @BJP4Bengal @ABVPVoice @BJYM pic.twitter.com/RzImVk7r5C — Babul Supriyo (@SuPriyoBabul) September 20, 2019 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. నా కుమారుడికి ఏం తెలియదు. చిన్నపిల్లవాడు. దయచేసి నా కుమారుడిని ఏం చేయవద్దు’ అంటూ కన్నీళ్లతో వేడుకుంది. ఈ విషయం కాస్త బాబుల్ సుప్రియో దృష్టికి వచ్చింది. దాంతో ఆయన ‘ఆంటీ దయచేసి మీరు బాధపడకండి. నేను కానీ నా కార్యకర్తలు కానీ మీ కుమారుడికి ఎలాంటి హాని చేయం.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయం. మీ కుమారుడు తను చేసిన తప్పు గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అతడి ఫోటోలు షేర్ చేశాను. మీ కుమారుడి గురించి ఆందోళన చెందకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ సుప్రియో ట్వీట్ చేశారు. -
కేంద్ర మంత్రికి చేదు అనుభవం
కోల్‌కతా: కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబూల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుప్రియోను ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఐఏ, ఏఎఫ్‌ఎస్‌యూ, ఎఫ్‌ఈటీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు ఘెరావ్ చేశాయి. దీంతో ఆయన్ను కాపాడేందుకు సాక్షాత్తూ గవర్నర్ ధనకర్‌తో పాటు భారీగా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు హాజరైన సుప్రియో రాకను నిరసిస్తూ భారీసంఖ్యలో విద్యార్థులు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. సెమినార్ అనంతరం ఆయన తిరిగివెళుతుండగా కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు తన జుట్టు పట్టుకుని లాగారనీ, దాడిచేశారని సుప్రియో ఆరోపించారు. అయితే సుప్రియో వర్సిటీ విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారని ఏఎస్‌ఎఫ్‌యూ నేత దెబ్రాజ్ దేబ్నాథ్ విమర్శించారు. ఈ ఉద్రిక్తత గురించి తెలుసుకున్న గవర్నర్ ధనకర్ హుటాహుటిన విశ్వవిద్యాలయానికి చేరుకుని సుప్రియోను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ఘటన అనంతరం ఏబీవీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. క్యాంపస్‌లోని ఏఎఫ్‌ఎస్‌యూ కార్యాలయంలోని కంప్యూటర్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సుప్రియోపై దాడి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పశ్చిమబెంగాల్ సీఎస్‌ను గవర్నర్ ఆదేశించారు. -
‘నా జుట్టు పట్టుకు లాగారు.. కింద పడేశారు’
కోల్‌కతా: బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రీయోకు విద్యార్థుల నిరసన సెగ తగిలింది. గురువారం కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి బాబుల్ సుప్రియో హాజరయ్యారు. ఈ క్రమంలో కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బాబుల్ సుప్రియోను కొందరు విద్యార్థులు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీరంతా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అసోసియేషన్‌కు(ఏఎస్ఎఫ్ఏ) చెందిన వారు కావడం విశేషం. విద్యార్థుల నిరసన నేపథ్యంలో బాబుల్ సుప్రియో క్యాంపస్‌లోకి వెళ్లకుండానే వెను తిరిగారు. ఈ సందర్భగా బాబుల్ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాలు చేయడం కోసం ఇక్కడకు రాలేదు. కానీ విద్యార్థుల ప్రవర్తన చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. వారు నన్ను అడ్డుకున్నారు. నా జుట్టు పట్టుకు లాగారు. కింద పడేసారు. వారంతా తమను తాము నక్సల్స్‌గా పిలుచుకుని నన్ను రెచ్చగొట్టాలని చూశారు. కానీ వారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నన్ను రెచ్చగొట్టలేరు’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో గవర్నర్ జగదీప్ ధంఖర్, యూనివర్సిటీ చాన్సిలర్ అక్కడే ఉన్నారు. జరిగిన విషయాన్ని గవర్నర్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. -
‘కన్యత్వంలేని అమ్మాయిలు సీల్‌లేని బాటిళ్లు!’
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలు సీల్‌లేని బాటిళ్ల వంటివారని ప్రొ.కనక్ సర్కార్ వ్యాఖ్యానించారు. సీల్ తీసిన కూల్‌డ్రింక్ బాటిల్‌ను, బిస్కెట్ ప్యాకెట్‌ను కొనుగోలు చేసేందుకు మీరు ఇష్టపడతారా? అని ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. అంతేకాకుండా చాలామంది యువకులకు కన్యత్వం ఉన్న అమ్మాయిలు దేవకన్యల వంటివారని సెలవిచ్చారు. ప్రొ.కనక్ సర్కార్ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ వివాదాస్పదం కావడంతో భావప్రకటన స్వేచ్ఛ కింద అభిప్రాయాలను వెల్లడించానని స్పష్టం చేశారు. ఈ విషయం మీడియాలో వైరల్కావడంతో సర్కార్ తన పోస్టింగ్‌ను తొలగించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కనక్ సర్కార్‌ను తక్షణం విధుల్లోంచి తప్పించడంతో పాటు వర్సిటీ ప్రాంగణంలో అడుగుపెట్టకుండా వైస్ ఛాన్స్లర్ సురంజన్‌దాస్ ఆదేశాలు జారీచేశారు. జాతీయ మహిళా హక్కుల కమిషన్, పశ్చిమబెంగాల్ మహిళా హక్కుల కమిషన్ ఆయనకు నోటీసులు జారీచేశాయి. కమిషన్ల విచారణ పూర్తయ్యేవరకూ సర్కార్‌ను విధుల్లోకి తీసుకోబోమని వీసీ ప్రకటించారు. -
అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్‌పై చర్యలు
సాక్షి, కోల్‌కతా : యువతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనక్ సర్కార్‌పై వర్సిటీ తీవ్ర చర్యలు చేపట్టింది. వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ను క్లాస్‌లు తీసుకోకుండా నిలిపివేయడంతో పాటు క్యాంపస్‌లో అడుగుపెట్టరాదని ఆంక్షలు విధించింది. విద్యార్ధులు చేసిన ఫిర్యాదులపై వైస్ ఛాన్స్‌లర్‌తో భేటీ అనంతరం ప్రొఫెసర్‌పై తీసుకున్న చర్యలను వర్సిటీ అంతర్జాతీయ సంబంధాల విభాగం హెడ్ ఓంప్రకాష్ మిశ్రా వెల్లడించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ కనక్ సర్కార్‌ను వర్సిటీ నుంచి తొలగించాలని విద్యార్ధులు పట్టుబట్టారని మిశ్రా తెలిపారు. కన్యత్వం లేని యువతులను ఎవరూ వివాహం చేసుకోరాదని తన ఫేస్బుక్ పేజ్‌లో కనక్ సర్కార్ చేసిన పోస్ట్‌లు కలకలం రేపాయి. కన్యత్వం కలిగిన యువతిని సీల్ చేసిన బాటిల్‌తో ఆయన పోల్చడం వివాదాస్పదమైంది. మరోవైపు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కనక్ సర్కార్‌పై విచారణ జరిపి కఠిన చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ డీజీపీని కోరింది. -
జాతి వ్యతిరేకులకు అడ్డాగా జేయూ: బీజేపీ
కోల్‌కతా: జాదవపూర్ యూనివర్సిటీ(జేయూ) జాతి వ్యతిరేకులకు అడ్డాగా మారిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మండిపడింది. 'సీపీఎంకి చెందిన విద్యార్థులు చట్టవిరుద్ధంగా సినిమా షూటింగ్‌ను అడ్డుకున్నారు. వారి భావజాలానికి వ్యతిరేకంగా ఉంటే ఎలాంటి చర్యలకైనా వామపక్ష విద్యార్థులు తెగిస్తున్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. దీన్ని మేము ఖండిస్తున్నాం' అని పశ్చిమబెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ గోష్ అన్నారు. జేయూ వైస్ ఛాన్స్లర్ కూడా వారికి అండగా ఉంటున్నారని ఆరోపించారు. శుక్రవారం జేయూలో సినిమా షూటింగ్ వివాదం జరిగిన విషయం తెలిసిందే. జాదవపూర్ యూనివర్సిటీకి చెందిన ఏబీవీపీ, లెఫ్ట్ వింగ్ మద్ధతుదారుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఏబీవీపీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ మూవీ 'బుద్ధా ఇన్ ఏ ట్రాఫిక్ జామ్' వివాదాస్పదమైంది. జాదవపూర్ వర్సిటీలో శుక్రవారం రాత్రి ఈ డైరెక్టర్ కు నల్లజెండాలతో నిరసన తెలిపడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోవాలని వామపక్ష వర్గానికి చెందినవారు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ మూవీ యూనిట్ కు మద్ధతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
ఈ ఫిల్టర్‌తో విషం మాయం
కోల్‌కతా: కోల్‌కతాలోని జాదవ్ పూర్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీర్లు నీటిలో విష రసాయనాలను తొలగించే సరికొత్త వాటర్ ఫిల్టర్‌ను తయారు చేశారు. జాదవ్ పూర్ వర్సిటీ సివిల్ ఇంజనీర్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అందించిన సాంకేతిక సహకారంతో ఫిల్టర్‌ను తయారు చేశారు. ఈ నీటి శుద్ధి యంత్రాన్ని 24 దక్షిణ పరగణ జిల్లాలోని బరూయ్‌పూర్ గ్రామ సమీపంలోని ఓ పాఠశాలలో విజయవంతంగా అమర్చారు. ఇది రోజుకు 10 వేల లీటర్లను శుద్ధిచేస్తుంది. ‘జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు విషరసాయనాలతో కాలుష్య కాసారమైపోయాయి. ఈ వ్యర్థమైన నీటిని తాగునీటిగా మార్చేందుకుగాను ఈసీఏఆర్ (ఎలక్ట్రో కెమికల్ ఆర్సెనిక్ రెమిడియేషన్) సాంకేతికతను ఉపయోగిస్తున్నాము. కేవలం నీటిలోని విషరసాయనాలకే కాక ఇతర వ్యర్థాలను కూడా ఈ వాటర్ ఫిల్టర్ తొలగిస్తుంద’ని ఈ ప్రాజెక్టు సమన్వయకర్త జాయ్‌శ్రీ రాయ్ చెప్పారు. -
జేయూలో అఫ్జల్ పోస్టర్ల సంచలనం
కశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలంటూ రాతలు ♦ జాదవ్‌పూర్ వర్సిటీలో సంచలనం ♦ ఘటనతో తమకు సంబంధం లేదన్న విద్యార్థి సంఘాలు కోల్‌కతా: మంగళవారం అఫ్జల్‌కు అనుకూలంగా నినాదాలు.. బుధవారం కశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌లకు స్వాతంత్య్రం కావాలంటూ పోస్టర్లు. ఇదీ పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ వర్సిటీలో తాజా పరిస్థితి. జేఎన్‌యూలో అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడిన విద్యార్థులు, ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేయాలంటూ.. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ వర్సిలీలో మొదలైన ఆందోళన.. పోస్టర్ల దాకా వెళ్లింది. ‘కశ్మీర్, మణిపూర్, నాగాలాండ్‌లకు స్వాతంత్య్రం కావాలి.’ అంటూ ‘రాడికల్’ గ్రూపు పేరుతో పోస్టర్లు వెలిశాయి. ‘దీనిపై విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశమయ్యాను. వారంతా పోస్టర్ల వివాదానికి దూరంగా ఉన్నట్లు తెలిపారు’ అని వర్సిటీ వీసీ సృజన్ దాస్ తెలిపారు. తాజా పరిస్థితిపై పోలీసులకు ఫిర్యాదు చేయటం లేదన్నారు. మరోవైపు మంగళవారం అఫ్జల్ అనుకూల నినాదాలతో జరిగిన ర్యాలీకి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. కాగా, అఫ్జల్ అనుకూల నినాదాల ర్యాలీతో తమకేం సంబంధం లేదని ఎస్ఎఫ్ఐ తెలిపింది. ‘ఎవరో ఒక వర్గం చేసిన పనికి మొత్తం జేయూ విద్యార్థులపై విమర్శలు సరికాదు. ’ అని ఓ పక్రటనలో ఎస్ఎఫ్ఐ తెలిపింది. అయితే.. ఫిబ్రవరి 15న జేఎన్‌యూ విద్యార్థి నాయకుల అరెస్టును నిరసిస్తూ.. ఎస్‌ఎఫ్‌ఐతోపాటు వామపక్ష విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఫిబ్రవరి 16వ తేదీన కొందరు విద్యార్థులు ఆరెస్సెస్, మోదీ వ్యతిరేక నినాదాలతో అఫ్జల్ ఉరిని వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, పోస్టర్ల విడుదలపై నివేదిక ఇవ్వాలని కేంద్రం.. పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉద్యోగ సమాచారం
ఇంటెలిజెన్స బ్యూరోలో పర్సనల్ అసిస్టెంట్లు కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స బ్యూరో.. పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 69. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 20. వివరాలకు www.mha.nic.in చూడొచ్చు. ఎన్హెచ్ఆర్సీలో ఖాళీలు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ).. వివిధ విభాగాల్లో ప్రజెంటింగ్ ఆఫీసర్, జాయింట్ రిజిస్ట్రార్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 24. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 22. వివరాలకు www.nhrc.nic.in చూడొచ్చు. ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో 22 పోస్టులు బెంగళూరులోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్.. వివిధ విభాగాల్లో కన్సల్టెంట్, ఎస్ఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 22. ఇంటర్వ్యూ తేదీలు ఫిబ్రవరి 12, 15. వివరాలకు www.nbsslup.in చూడొచ్చు. రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్‌లో అవకాశాలు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ సంస్కృతి సంస్థాన్ వర్సిటీ.. వివిధ విభాగాల్లో టీచింగ్ (ఖాళీలు-8), నాన్ టీచింగ్ (ఖాళీలు-5) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 29. వివరాలకు www.sanskrit.nic.in చూడొచ్చు. ఐఐఎస్ఎస్లో రీసెర్చ్ అసోసియేట్లు భోపాల్‌లోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స (ఐఐఎస్ఎస్) వివిధ విభాగాల్లో రీసెర్చ అసోసియేట్, సీనియర్ రీసెర్చ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 8. ఇంటర్వ్యూ తేదీలు ఫిబ్రవరి 16, 18, 20. వివరాలకు www.iiss.nic.in చూడొచ్చు. పాట్నా ఎయిమ్స్‌లో స్పెషల్ రిక్రూట్మెంట్ పాట్నాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) వికలాం గుల కోటాలో వివిధ విభాగాల్లో స్టాఫ్ నర్స, హాస్పిటల్ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 27. వివరాలకు www.aiimspatna.org చూడొచ్చు. జాదవ్‌పూర్ వ ర్సిటీలో 211 ఖాళీలు కోల్‌కతాలోని జాదవ్‌పూర్ వర్సిటీ.. వివిధ విభాగాల్లో జూనియర్ మెకానిక్, జూని యర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ , ప్యూన్, హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 211. దరఖాస్తుకు చివరి తేది మార్చి 1. వివరాలకు www.jaduniv.edu.in చూడొచ్చు. స్పేస్ సెంటర్లో జేఆర్ఎఫ్, ఆర్ఏలు తిరువనంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ).. వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ ఫెలోషిప్, రీసెర్చ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 22. వివరాలకు www.isro.gov.in చూడొచ్చు. లెదర్ రీసెర్చ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆఫీసర్లు సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ లెదర్ రీసెర్చ ఇన్స్టిట్యూట్.. వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 15. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 23. వివరాలకు www.clri.org చూడొచ్చు. పవర్ ఫైనాన్స కార్పొరేషన్లో వేకెన్సీలు న్యూఢిల్లీలోని పవర్ ఫైనాన్స కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 29. వివరాలకు www.pfcindia.com చూడొచ్చు. సీఎస్ఐఓలో టెక్నికల్, హార్టికల్చర్ అసిస్టెంట్లు సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్.. వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 10. దరఖాస్తుకు చివరి తేది మార్చి 8. వివరాలకు www.csio.res.in చూడొచ్చు. -
మళ్లీ హ్యాకయిన యూనివర్సిటీ వెబ్సైట్
జాదవ్‌పూర్ యూనివర్సిటీ వెబ్సైట్ మళ్లీ హ్యాకింగ్‌కు గురైంది. ఆ సైట్‌ను ఎవరైనా క్లిక్ చేస్తే.. నేరుగా ఓ బూతు సైట్లోకి లింకు వెళ్లిపోతోంది. అంతేతప్ప అందులో అడ్మిషన్లు, ఇతర సమాచారం ఎక్కడా కనిపించడంలేదు. అయితే.. ఈ సమస్యను తక్కువ సమయంలోనే అధిగమించారు. పోలీసులకు కూడా ఈ విషయం తెలిపామని, రెండోసారి తమ సైట్ హ్యాకింగ్‌కు గురి కావడంతో దానికి బాధ్యులు ఎవరన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ పీకే ఘోష్ తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాటి వైస్ ఛాన్స్లర్ అభిజిత్ చక్రవర్తిని తొలగించాలని భారీ స్థాయిలో ఉద్యమం జరిగినప్పుడు ఇలాగే సైట్ ఓసారి హ్యాకింగ్‌కు గురైంది. అప్పట్లో ఏకంగా వైస్ ఛాన్స్లర్ పేజీయే హ్యాకింగ్‌కు గురై.. దాన్ని క్లిక్ చేసినప్పుడు 'సారీ' అనే సందేశం కనపడేది. నాటి అల్లర్లలో పోలసీఉలు లాఠీ ఛార్జిచేయడంతో చాలామంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వీసీపై ఆరోపణలు వచ్చాయి. -
కోల్ కతాకు పాకిన 'కిస్ ఆఫ్ లవ్'
కోల్ కతా: నైతికతపై కర్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ కేరళలోని కొచ్చిలో మొదలైన 'కిస్ ఆఫ్ లవ్' నిరసన ఇప్పడు కోల్‌కతాకు పాకింది. మోరల్ పోలీసింగ్, లింగ వివక్షకు వ్యతిరేకంగా రెండు యూనివర్సిటీల విద్యార్థులు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ విద్యార్థులు గురువారం ఇండియన్ కాఫీ హౌస్ ఎదురుగా గుమిగూడి 'కిస్ ఆఫ్ లవ్'కు సంఘీభావంగా ప్లకార్డులు ప్రదర్శించారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కలిసి దాదాపు 300 మంది బుధవారం సాయంత్రం జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. పరస్పరం ఆలింగనం చేసుకుని, ముద్దులు పెట్టుకుని నిరసన తెలిపారు. 'మా దేహం, మా ఆలోచన, మోరల్ పోలీసింగ్ ను ఒప్పుకోం' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తమ స్వేచ్ఛను అడ్డుకుంటున్నందుకు, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామని విద్యార్థులు తెలిపారు. -
కరెంట్ కట్ చేసి చావబాదారు
విద్యార్థినులను జుట్టు పట్టుకుని ఈడ్చి పడేశారు. విద్యార్థులను కాళ్లతో తన్నుతూ చితకబాదారు. ఇది కచ్చితంగా వీధి రౌడీల పనే అయివుంటుందని అనుకుంటున్నారా. అయితే మీరు పప్పులో కాలేశారు. ఇదంతా చేసింది ప్రజలను కాపాడాల్సిన రక్షక భటులు అంటే నమ్మాల్సిందే. పశ్చిమ బెంగాల్ లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఖాకీలు బుధవారం బీభత్సకాండ సృష్టించారు. ఇంతకీ విద్యార్థులు చేసిన తప్పు ఏంటంటే తమ డిమాండ్ల సాధన కోసం వైస్ ఛాన్సలర్ ను శాంతియుతంగా అడ్డుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తమ మార్క్ జులుం ప్రదర్శించారు. క్యాంపస్ గేట్లు మూసేసి పదినిమిషాల పాటు భయోత్పాతం సృష్టించారు. కరెంట్ కట్ చేసి విద్యార్థులను విచక్షణారహితంగా బాదారు. మఫ్టీలో వచ్చిన ఖాకీలు తమపై దౌర్జన్యం చేయడమే కాకుండా, అసభ్యంగా ప్రవర్తించారని బాధిత విద్యార్థినులు ఆరోపించారు. తమ బట్టలు చించారని, ఛాతీపై కొట్టారని, బలవంతంగా మగాళ్లపైకి తోసారని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. ఖాకీల వికృత ప్రవర్తనపై ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థుల్లో ఇద్దరు ఐసీయూలో ఉన్నారు. పోలీసుల దమనకాండను విద్యార్థి సంఘాలు తీవ్రంగా నిరసించాయి. -
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రాలేదని ఆత్మహత్య!
కోల్ కతా: క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆశించిన ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జాదవ్ పూర్ యూనివర్సిటీలో మంగళవారం చోటు చేసుకుంది. మనీష్ టాండన్ అనే విద్యార్ధి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం రాలేదని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. మనీష్ తెలివైన విద్యార్ధి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఉద్యోగం వస్తుందని ఆశపెట్టుకున్నాడు. కాని దురదృష్టం వెంటాడింది. రెండు కంపెనీల్లోనూ ఉద్యోగం లభించలేదు. దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు అని ఐటీ హెడ్ సమిరాన్ చటర్జీ తెలిపారు. మనీష్ మరణవార్తతో జాదవ్ పూర్ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. -
‘ఐకాన్ ఎస్డబ్ల్యూఎం-2014’ ఎవరికో!
రాష్ట్రంలో పది మున్సిపాలిటీలకు స్థానం విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి, సాలూరు ఈనెల 28 నుంచి 30 వరకూ రాజధానిలో ప్రదర్శన బొబ్బిలి, న్యూస్‌లైన్: చెత్తపై సమరభేరి మోగించి ఆదర్శంగా నిలిచిన పురపాలక సంఘాలు ఇప్పుడు అంతర్జాతీయ అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. పురపాలక శాఖ ప్రకటించిన 4వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్(ఐకాన్ఎస్డబ్ల్యుఎం)-2014 కోసం రాష్ర్ట వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆయా పురపాలక సంఘాల్లో అమలవుతున్న ఇంటింటి చెత్త సేకరణ, చెత్తశుద్ధి, సద్వినియోగం వంటివాటిపై అడిగిన ప్రశ్నావళిలో సంతృప్తికరంగా సమాధానం చెప్పిన 10 పురపాలక సంఘాలను ఈ అవార్డుకు పరిశీలన నిమిత్తం ఎంపిక చేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల అధికారులు గత శనివారం హైదరాబాద్‌లో మునిసిపల్ మంత్రి మహీధర్‌రెడ్డి ముందు పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అధికారుల చొరవే కీలకం: కాలువల్లో చెత్తలు పేరుకుపోవడం, ప్లాస్టిక్, పాలిథీన్ వినియోగం ఇష్టారాజ్యంగా ఉండటం, పట్టణాల్లో శుభ్రత లేకపోవడం, పురపాలక సంఘాల్లో నిధుల కొరత వంటివి వెంటాడేవి. మునిసిపాలిటీల కమిషనర్లు, పాలకవర్గాలు ప్రత్యేక చొరవ తీసుకుని అనంతపురం జిల్లా తాడిపత్రి, విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. చెత్తలేని పురపాలక సంఘంగా నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట కూడా ఆదర్శంగా నిలిచింది. ఆదర్శ మునిసిపాలిటీగా బొబ్బిలి: రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బొబ్బిలి పురపాలక సంఘంలో చెత్తశుద్ధి పార్కు ఏర్పాటుతో పాటు ప్లాస్టిక్, వాటర్ ప్యాకెట్ల నిషేధం అమలును ప్రారంభించారు. అప్పటి కమిషనర్ కరుణాకరం ప్రసాద్, అప్పటి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ కృష్ణ రంగారావుల సహాయంతో విజయవంతంగా నడుపుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శ మున్సిపాలిటీగా పేరు వచ్చింది. ఇక్కడ అమలవుతున్న ఇంటింటి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం పరిశీలనకు డిల్లీ నుంచి కూడా ప్రతినిధులు వచ్చి వెళ్లారు. సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్ పార్కు నిర్మాణం చేసి గోబర్ గ్యాస్ ఉత్పత్తి, వర్మీ కంపోస్టు, వ్యర్థ పదార్థాల అమ్మకం వంటివి నిర్వహిస్తూ ఆదాయాన్ని పెంచుకోవడంతో బొబ్బిలి మునిసిపాలిటీయే రాష్ట్రంలో ముందంజలో ఉంది. పక్కనే ఉన్న సాలూరు మున్సిపాలిటీ కూడా దీనిని అమలు చేస్తూ ఇప్పుడు బొబ్బిలి సరసన చేరింది. ఈ కార్యక్రమాలను బాగా అమలు చేస్తున్న పురపాలక సంఘాల్లో ప్రస్తు తం అధికారులు, అనధికారులతో కూడిన థర్డ్ పార్టీ పరిశీలన చేస్తుంది. ఈనెల 28 నుంచి 30 వరకూ హైదరాబాద్‌లో సెమినార్లు జరగనున్నాయి. అక్కడ ఎంపికైన పురపాలక సంఘాలన్నీ వారు చేపట్టిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, నివేదికలను కమిటీకి అందించాల్సి ఉంటుంది. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూన్సివర్సిటీ ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీఆర్ అగ్రికల్చరల్ యూనివర్సీటీ ప్రాంగణంలో ఈ ఎంపిక జరగనుంది. (నిరుడు కర్ణాటక రాష్ట్రం మైసూర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు.) జనవరి 28 నుంచి 30 వరకూ జరిగే సెమినార్లో 814 మంది డెలిగేట్స్ పాల్గొననున్నారు. అవార్డు పరిశీలనకు రాష్ట్రం నుంచి ఎంపికైన మునిసిపాలిటీలు విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, సాలూరులతో పాటు పలమనేరు, తెనాలి, సూర్యాపేట, తాండూరు, వరంగల్, కోదాడ, కర్నూలు, గుంతకల్లు.