కోల్‌కతా : రెండేళ్ల కిందట జియో ట్యాగింగ్ పొందిన నోరూరించే బెంగాలీ స్వీట్ రస్‌గుల్లాను అంతర్జాతీయంగా మార్కెట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో కలిసి జాదవ్‌పూర్ యూనివర్సిటీ పనిచేస్తోంది. బెంగాల్ రుచులను ప్రపంచానికి చాటిన రస్‌గుల్లా ఎంతకాలమైనా పాడవకుండా ఉండేలా జాదవ్‌పూర్ వర్సిటీ ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ చర్యలు చేపడుతోంది. రస్‌గుల్లా నిల్వ చేసుకునే గడువును కనీసం ఆరు నెలల పాటు పొడిగించేందుకు పరిశోధన అభివృద్ధి విభాగం అవసరమైన ప్రిజర్వేటివ్స్‌పై కసరత్తు సాగిస్తోందని జాదవ్‌పూర్ వర్సిటీ ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనియర్ ప్రొఫెసర్ తెలిపారు.
ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుని రస్‌గుల్లా రుచులను ఆస్వాదించేందుకు ఇది త్వరలోనే మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన అనంతరం వర్సిటీ నిపుణులు సూచించిన పద్ధతుల్లో ఆటోమేటెడ్ యంత్రాలపై రస్‌గుల్లా తయారీని చేపట్టి మదర్ డైరీ బ్రాండ్‌పై విక్రయిస్తామని బెంగాల్ పశుసంవర్థక శాఖ మంత్రి స్వపన్ దేవ్‌నాధ్ తెలిపారు. మరోవైపు మధుమేహులు తినేందుకు వెసులుబాటు కల్పిస్తూ డయాబెటిక్ రస్‌గుల్లాను కూడా తయారుచేయడంపై కసరత్తు చేస్తున్నామని జాదవ్‌పూర్ వర్సిటీ ప్రొఫెసర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment