Rasgulla
-
రసగుల్లాతో ఐస్‌క్రీం..ఎప్పుడైనా ట్రై చేశారా? అదిరిపోద్దంతే!
రసగుల్లా ఐస్‌క్రీమ్ తయారీకి కావల్సినవి: వెనీలా ఐస్‌క్రీమ్ – నాలుగు కప్పులు; రసగుల్లాలు – ఎనిమిది; స్ట్రాబెరీ – ఆరు; బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానమిలా: గడ్డకట్టిన ఐస్‌క్రీమ్‌ను రిఫ్రిజిరేటర్ నుంచి తీసి పదినిమిషాలు బయటపెట్టాలి ∙రసగుల్లాలను గట్టిగా పిండి సిరప్‌ను తీసేయాలి. పూర్తిగా పిండకూడదు. కొద్దిగా సిరప్ తేమ ఉండేలా పిండాలి ∙పిండిన రసగుల్లాలను చిన్నచిన్న ముక్కలు చేయాలి. స్ట్రాబెరీలను కూడా కడిగి సన్నగా తరగాలి ∙ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లో రసగుల్లా ముక్కలు వేసి కలపాలి . దీనిలో స్ట్రాబెరీ ముక్కలు, బాదం పలుకులు వేసి మరోసారి చక్కగా కలపాలి. ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని గిన్నెలో వేసి మూతపెట్టి రాత్రంతా లేదా కనీసం నాలుగు గంటల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి . రిఫ్రిజిరేటర్లో నుంచి తీసిన పదిహేను నిమిషాల తరువాత రసగుల్లా ఐస్‌క్రీమ్‌ను సర్వ్‌చేసుకోవాలి. -
రస్మలై ఇష్టమా! ఈ పదార్థాలు ఉంటే చాలు ఇంట్లోనే ఇలా ఈజీగా..
తీపిని ఇష్టపడే వారు ఇలా ఇంట్లోనే రస్మలై తయారు చేసుకోండి. నోరూరించే స్వీట్‌తో ఈ హోలీని సెలబ్రేట్ చేసుకోండి! రస్మలై తయారీకి కావాల్సినవి: ►రసగుల్లాలు – 15 (ఇంట్లో చేయడం కుదరకపోతే రెడీమేడ్‌వి తీసుకోవచ్చు) ►పాలు – లీటరు ►చక్కెర – 5 టేబుల్ స్పూన్లు ►బాదం –10 ; పిస్తా– 10 ►యాలకుల పొడి– టీ స్పూన్ ►కుంకుమ పువ్వు – 20 రేకలు తయారీ: ►అరకప్పు వేడి నీటిలో బాదం, పిస్తాలను అరగంట సేపు నానబెట్టి పొట్టు తీసి తరగాలి. ►పావు కప్పు వేడి పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి. ►మందపాటి బాణలిలో పాలు మరిగించాలి. ►పైకి తేలిన మీగడను స్పూన్‌తో తీసి ఒక గిన్నెలో వేసుకుంటూ పాలు అడుగు పట్టకుండా కలుపుతూ, పాలు సగమయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు చక్కెర వేసి కరిగే వరకు కలుపుతూ మరిగించాలి. ►యాలకుల పొడి, బాదం, పిస్తా (సగం), కుంకుమ పువ్వు పాలు కలిపి వీటి రుచి పాలకు పట్టే వరకు సన్నమంట మీద మరిగించాలి. ►ఇప్పుడు రసగుల్లాను ఒక ప్లేట్లోకి తీసుకుని గరిటె లేదా అట్లకాడ సాయంతో లేదా వేళ్లతో చక్కెర పాకం జారిపోయేటట్లు మెల్లగా నొక్కాలి. ►ఇలా రసగుల్లాలన్నింటినీ నొక్కి జాగ్రత్తగా పాలలో వేయాలి. ►రెండు నిమిషాలపాటు పాలలో ఉడకనిచ్చి స్టవ్ ఆపేయాలి. ►రసమలై చల్లారిన తర్వాత కప్పులో వేసి మీగడ(ఇష్టమైతే), బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Rice Kheer Recipe: హోలీకి రైస్ ఖీర్ తయారు చేసుకోండిలా! Rasgulla Recipe: రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పాకం వస్తే అంతే సంగతి! -
నోరూరించే రసగుల్ల తయారీ ఇలా! చక్కెర ద్రవం పలుచగా ఉంటేనే..
Holi Recipes 2023: రంగుల పండుగ వస్తోంది. రంగరంగ వైభవంగా వస్తోంది. తీపి జ్ఞాపకాలను తెస్తోంది. రుచులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ ఏటి హోలీ ఇచ్చిన తీపి రుచిని... రాబోయే హోలీ వరకు మర్చిపోదు మది. రసగుల్ల తయారీ విధానం ఇలా: కావలసినవి: ►పాలు – లీటరు (వెన్న తీయనివి) ►నిమ్మరసం– 3 టేబుల్ స్పూన్లు ►చక్కెర – 2 కప్పులు ►నీరు – లీటరు ►పాలు – టేబుల్ స్పూన్ ►ఉప్మారవ్వ– టీ స్పూన్ ►పిస్తాపలుకులు : 20 తయారీ: ►పాలను మందపాటి పాత్రలో పోసి స్టవ్ మీద పెట్టాలి. ►బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి నిమ్మరసం వేసి కలపాలి. ►ముందు సగం నిమ్మరసం వేసి కలిపి చూసి, పాలు బాగా విరిగితే మిగిలిన రసాన్ని ఆపేయాలి. ►పాలు సరిగ్గా విరగకపోతే మొత్తం రసాన్ని వేసి కలపాలి (పాశ్చరైజేషన్ జరగని పాలకు ఒక స్పూన్ నిమ్మరసం సరిపోతుంది). ►విరిగిన పాలను పలుచని వస్త్రంలో పోసి మూట కట్టి ఏదైనా కొక్కేనికి వేలాడదీయాలి. ►ఓ అరగంట తర్వాత నీరు పోయేలా చేత్తో గట్టిగా నొక్కాలి. ►ఆ తర్వాత పైన బరువు పెట్టాలి. ఇలా చేయడం వల్ల నీరంతా కారిపోతుంది. ►పాల విరుగు మాత్రం మూటలో మిగులుతుంది. ►పాలవిరుగులో రవ్వ వేసి వేళ్లతో నలుపుతూ కలపాలి. ఇలా చేస్తూ ఉంటే ముందుగా పాల విరుగు పొడిగా మారుతుంది. ►మరికొంత సేపటికి ముద్దగా అవుతుంది. ►ఇప్పుడు ఆ ముద్దను చిన్న చిన్న గోళీలుగా చేయాలి. ►వెడల్పుగా, లోతుగా ఉన్న కడాయిలో చక్కెర, నీరు పోసి వేడి చేయాలి. ►చక్కెర కరిగిన తరవాత అందులో టేబుల్ స్పూన్ పాలు వేయాలి. ►రెండు నిమిషాలకు చక్కెర ద్రవం శుభ్ర పడి అందులోని మలినాలు నల్లగా పైకి తేలుతాయి. ►స్పూన్‌తో కానీ చిల్లుల గరిటెతో తీసేయాలి లేదా పలుచని వస్త్రంలో వడపోయడం మంచిది. ►వడపోసిన ద్రవాన్ని మళ్లీ కడాయిలో పోసి మరిగించాలి. ►ఇప్పుడు చక్కెర ద్రవంలో పాల విరుగుతో చేసిన గోళీలను వేసి నాలుగైదు నిమిషాల సేపు మీడియం మంట మీద ఉడికించాలి (పెద్ద మంట మీద ఉడికిస్తే రసగుల్లాలు విరిగిపోతాయి). ►చిన్న గోళీలుగా వేసిన రసగుల్లాలు చక్కెర పాకాన్ని పీల్చుకుని పెద్దవవుతాయి. ►అప్పుడు స్టవ్ ఆపేయాలి. ►వేడి తగ్గిన తరవాత కప్పులో రసగుల్లాతోపాటు ఒక టేబుల్ స్పూన్ సిరప్, పిస్తా వేసి సర్వ్ చేయాలి. గమనిక: రసగుల్లాలకు చేసే చక్కెర ద్రవం పలుచగా ఉండాలి. పాకం రాకూడదు. ఇవి కూడా ట్రై చేయండి: వంకాయ బోండా.. భలే రుచి.. ఇలా తయారు చేసుకోండి! బనానా, ఓట్స్‌తో కజ్జికాయలు తయారు చేసుకోండిలా! -
ఒక ఊరికథ..మంచిపని ఊరకే పోలేదు...ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇచ్చింది
బాలాసోర్ జిల్లా(ఒడిశా) బస్తా బ్లాక్‌లోని అంబక్చౌ అనే గ్రామం అది. ఊరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కరువు కావచ్చు కరోనా కావచ్చు మరేదైనా కష్టం కావచ్చు. ఉపాధి కష్టమయ్యేది. ఊళ్లోని మగవాళ్లు పనుల కోసం పట్టణాలు వెదుక్కుంటూ వెళ్లేవాళ్లు. అలా పట్టణాలకు వెళ్లి కొత్త అలవాట్లు నేర్చుకొని కష్టపడిన సొమ్మును మద్యానికి తగలేసిన వారు కూడా ఉన్నారు. ఇక ఆ ఊళ్లో మహిళల విషయానికి వస్తే ఊరు దాటిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇంటిపనులు పూర్తయిన తరువాత, ఆరుబయట కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ‘మనం ఎందుకు వ్యాపారం మొదలుపెట్టకూడదు!’ అన్నారు ఒకరు. కొందరు నవ్వారు. కొందరు ఆలోచించారు. ఆ మాట ఈ మాట పూర్తయిన తరువాత అందరూ ఒక ఆలోచనకు వచ్చారు. ఆవులను కొనాలని. తాము కూడబెట్టుకున్న డబ్బు, అప్పు చేసిన సొమ్ముతో 13 మంది మహిళలు కలిసి 10 ఆవులను కొనుగోలు చేశారు. ‘శివశంకర్’ పేరుతో స్వయంసహాయక బృందంగా ఏర్పడ్డారు. ‘వాటిని మేపడానికే మీ జీవితం సరిపోతుంది’ అని వెక్కిరించిన వాళ్లు ఉన్నారు. బృందంలోని సభ్యులలో చాలామంది భర్తల మూలంగా ఇబ్బంది పడ్డారు. భర్తలు భరించలేదు! ‘వాళ్ల మాటలు విని డబ్బు తగలేస్తావా?’ అంటాడు ఒక భర్త. ‘ఇంత డబ్బు నీ దగ్గర ఉందని ఎప్పుడూ చెప్పలేదేం’ అని ఈసడిస్తాడు ఒక భర్త. అయితే వారు వేటికీ చలించలేదు. మొదట పాలవ్యాపారం. ఆ తరువాత పెరుగు, నెయ్యి, వెన్న... మొదలైనవి అమ్మడం మొదలుపెట్టారు. ఆ ఊళ్లోనే కాదు... చుట్టు పక్కల ఊళ్లో నుంచి కూడా పాల ఉత్పత్తులు కొనడానికి వచ్చేవాళ్లు. ఆ తరువాత...రసగుల్లతో పాటు ఆ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘చెన’లాంటి స్వీట్ల తయారీ మొదలుపెట్టారు. సమీప పట్టణమైన బాలాసోర్‌లో ఈ స్వీట్లను అమ్మే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ‘పట్టణాల్లో మీ పల్లె మిఠాయిలు ఎవరు కొంటారు? అక్కడ పెద్ద పెద్ద స్వీట్‌షాప్‌లు ఉంటాయి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు కొందరు. అయితే వారు వెనక్కి తగ్గలేదు. స్వీట్ హిట్æ ‘శివశంకర్ స్వీట్’ సూపర్ హిట్ అయింది! బాలాసోర్‌లోనే కాదు బధ్రక్, మహారాజ్‌గంజ్... మొదలైన పట్టణాలతో పాటు పశ్చిమబెంగాల్‌కు కూడా విస్తరించింది స్వీట్ల వ్యాపారం. ‘మొదట్లో భయమేసి వెనక్కి తగ్గుదాం అనుకున్నాను. కాని ఆతరువాత నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కొనసాగాను. శివశంకర్ బృందంలో నేను కూడా భాగం అయినందుకు గర్విస్తున్నాను’ అంటుంది మాలతి. ‘వారి మాటల్లోని నిజాయితీ, వారి ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తుంది. ఎక్కడా కల్తీ ఉండదు. నాణ్యంగా ఉంటాయి’ అంటున్నాడు బాలాసోర్‌కు చెందిన వైద్యుడు చందన్. ఇది అతడి మాట మాత్రమే కాదు ఎంతోమంది మాట. అందుకే ‘శివశంకర్’ పాల ఉత్పత్తులకు మంచి పేరు వచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఉపయోగించడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఒక మంచిపని ఊరకే పోదు! ఎన్నో ఊళ్లకు స్ఫూర్తిని ఇస్తుందని గెలుపుజెండా ఎగరేసి నిరూపించారు పదమూడు మంది మహిళలు. -
అక్కడికి వెళ్తే ఈ స్వీట్ తినడం మాత్రం మర్చిపోకండి.. అద్భుతం.!
ఢిల్లీకి వెళ్తే చోలే భచూరా రుచి చూడకుండ ఉండలేరు. చెన్నై మురుకులు, హైదరాబాద్ దమ్ బిర్యానీ తినందే అక్కడి నుంచి కదలరు భోజనప్రియులు. ఇంకా బెనారస్ లస్సీ, అమృత్సర్ జిలేబీ, అహ్మదాబాద్ డోక్లా, ముంబాయ్ వడాపావ్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. అలాగే దేశీ వంటకాల్లో కలకత్తా రసగుల్లా కూడా చాలా ఫేమస్ అండీ! ఇటీవల బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్ కోల్‌కతా సందర్శించారు. ఇంకేముంది అక్కడి ఫేమస్ స్వీట్లలో ఒకటైన రసగుల్లాను రుచి చూసేశారు. రసగుల్లాకి ఫిదా అయిపోయారు. దీని రుచిని గురించి తెల్పుతూ ట్విటర్లో పోస్ట్ కూడా పెట్టారు. ‘ఇండియాలోనే స్వీటెస్ట్ సిటీ అయిన కలకత్తాలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. కేసీ దాస్ ఔట్‌లెట్‌లోని ఫేమస్ స్వీట్లలో ఒకటైన రసగుల్లాను రుచిచూశాను’ అని బెంగాళీ భాషలో రాశారు. ముఖం మీద చిరునవ్వుతో మట్టిపాత్రలోని రసగుల్లాను తింటున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ స్వీట్‌ను రుచి చూడమనని రిఫర్ చేశారు కూడా. ఈ పోస్ట్‌ను చూసిన ఫాలోవర్లు, అభిమానులు మాత్రం కామెంట్ల రూపంలో తమ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది కోల్‌కతాలోని ఇతర ప్రసిద్ధ వంటకాలు, స్వీట్లను కూడా రుచి చూడమని కోరారు. తాజాగా ప్రముఖ పారిశ్రమిక వేత్త హర్ష్ గొయెంకా కూడా దేశంలోనే కోల్‌కతా స్ట్రీట్ ఫుడ్ బెస్ట్ అని ట్విటర్లో పేర్కొనడం విశేషం. చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!! ভারতের সবথেকে মিষ্টি শহর কলকাতায় এসে বড়োই আনন্দিত আমি। এখানকার এসপ্লানেডের কে. সি. দাসের আউটলেটে আমি চেখে দেখলাম দারুণ স্বাদের "বাংলার রসগোল্লা"। pic.twitter.com/m2tirphBML — Alex Ellis (@AlexWEllis) September 26, 2021 -
బెడిసికొట్టిన రసగుల్లా బిర్యానీ; నెటిజన్ల ఫైర్
కొత్త కొత్త వంటకాల ప్రయోగం చేయాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. విభిన్న రకాల ఐటమ్స్‌ను కలిపి నూతన వంటకాన్ని కనుగొని అందరితో షేర్ చేయాలని అనుకుంటారు. కానీ అన్నిసార్లు అనుకున్నట్లు కుదరవు. కొన్ని అద్భుతంగా రుచికరమైనవిగా వస్తే మరి కొన్ని ఊహించని విధంగా బెడిసి కొడతాయి. ఇలా సోషల్ మీడియాలో నెటిజన్ల కోపానికి గురైన ప్రయోగాలు అనేకమున్నాయి. స్వీటీ మ్యాగీ, గులాబ్ జామున్కీ సబ్జీ, చికెన్ ఫ్రైడ్ రైస్ డిప్ప్‌డ్ ఇన్ చాకొలెట్ సాస్, మసాలా ఛాయ్ విత్ ఐస్ క్రీం. ఇవ్వన్నీ కూడా గతంలో నెట్టింట్లో అట్టర్ ప్లాప్ అయిన వంటకాలు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో వంటకం చేరింది. అదే అంగూరి రసగుల్లా బిర్యానీ. చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో మాడ్లీ ఫుడ్ లవర్ అనే ఫేస్బుక్ పేజీ ‘అంగూరి రసగుల్లా బిర్యానీ’ వీడియోను పోస్టు చేసింది. నమ్మకపోతే బిర్యానీ నుంచి రాస్గుల్లాను కూడా ఈ వీడియోలో చూపిస్తోంది. ‘ఇది రసగుల్లా బిర్యానీ. మీరు నమ్మడం లేదా. ఇప్పుడే హరా భారా కేబాబ్, ఆలూ చాప్ మరియు దహి కా చట్నీ, ఫిర్నిలతో పాటు అంగూరి రసగుల్లా బిర్యానీని తిన్నాను. అంటూ పోస్టు చేశారు. అక్టోబర్ 4న షేర్చేసిన ఈ వీడియో నెటిజన్లను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ వంటకం గురించి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు ఇలాంటి వంటకం ఉంటుందని ఊహించలేదని, దయచేసి మరోసారి ఈ వంటకాన్ని చేయొద్దని వేడుకుంటున్నారు. మరొకరు ‘ముందుగా కోవిడ్.. ఇప్పుడు ఈ వంట.. 2020 నిజంగా వేస్ట్’ అంటూ విమర్శిస్తున్నారు. మరి ఈ వంటకాన్ని ట్రై చేయడానికి మీకు ధైర్యం ఉందా!. చదవండి: గోబీ మంచూరియా లాగిద్దామా.. -
ఇక ఆ స్వీట్ ఆరునెలల పాటు పాడవదు..
కోల్‌కతా : రెండేళ్ల కిందట జియో ట్యాగింగ్ పొందిన నోరూరించే బెంగాలీ స్వీట్ రస్గుల్లాను అంతర్జాతీయంగా మార్కెట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో కలిసి జాదవ్‌పూర్ యూనివర్సిటీ పనిచేస్తోంది. బెంగాల్ రుచులను ప్రపంచానికి చాటిన రస్గుల్లా ఎంతకాలమైనా పాడవకుండా ఉండేలా జాదవ్‌పూర్ వర్సిటీ ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ చర్యలు చేపడుతోంది. రస్గుల్లా నిల్వ చేసుకునే గడువును కనీసం ఆరు నెలల పాటు పొడిగించేందుకు పరిశోధన అభివృద్ధి విభాగం అవసరమైన ప్రిజర్వేటివ్స్పై కసరత్తు సాగిస్తోందని జాదవ్‌పూర్ వర్సిటీ ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు చెందిన సీనియర్ ప్రొఫెసర్ తెలిపారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచుకుని రస్గుల్లా రుచులను ఆస్వాదించేందుకు ఇది త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన అనంతరం వర్సిటీ నిపుణులు సూచించిన పద్ధతుల్లో ఆటోమేటెడ్ యంత్రాలపై రస్గుల్లా తయారీని చేపట్టి మదర్ డైరీ బ్రాండ్‌పై విక్రయిస్తామని బెంగాల్ పశుసంవర్థక శాఖ మంత్రి స్వపన్ దేవ్‌నాధ్ తెలిపారు. మరోవైపు మధుమేహులు తినేందుకు వెసులుబాటు కల్పిస్తూ డయాబెటిక్ రస్గుల్లాను కూడా తయారుచేయడంపై కసరత్తు చేస్తున్నామని జాదవ్‌పూర్ వర్సిటీ ప్రొఫెసర్ వెల్లడించారు. -
మూడ్రోజులు రసగుల్లా ఫెస్ట్
కోల్‌కతా: మూడ్రోజుల పాటు రసగుల్లా ఫెస్ట్‌ను నిర్వహిస్తూ కోల్‌కతా ఈ ఏడాదికి తీయని వేడు కతో ముగింపు పలకనుంది. రసగుల్లా స్వీట్‌ను కనుగొన్న నోబిన్ చంద్ర దాస్‌కు నివాళిగా ఈ వేడుకను నిర్వహించనుంది. బెంగాల్ రసగుల్లాకు గతేడాది భౌగోళిక గు ర్తింపు లభించింది. రసగుల్లాను కనుగొని 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 28 నుంచి మూడ్రోజులు ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రస గుల్లాను కనుగొన్న దాస్ కు నివాళిగా తొలిసారిగా బాగ్‌బజార్–ఒ–రసగుల్లా ఉత్సవ్‌ను అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ బాగ్‌బజార్ చరిత్ర, సంస్కృతిని కూడా చాటి చెప్తుందని మంత్రి శశి పంజా పేర్కొన్నారు. స్వీట్ వ్యాపారులు తమ వంటకాలను రుచి చూపించడానికి ఈ ఫెస్ట్ మంచి అవకాశమని వెల్లడించారు. -
రాజస్తానీ రస్‌గుల్ల..
చిన్నచిన్న పట్టణాల నుంచి హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ఎక్కడ చూసినా మిఠాయి దుకాణాలు రాజస్తానీలవే ఎక్కువగా ఉంటాయి. రకరకాల మిఠాయిలు తయారు చేయడంలో రాజస్తానీలది అందెవేసిన చెయ్యి. రాజస్తాన్‌లో పాటి కులానికి చెందిన అత్యధిక మంది మిఠాయిల వ్యాపారమే చేసుకొని జీవనం సాగిస్తారు. ఇలా మిఠాయి వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వారిలో వికారాబాద్ జిల్లాలో సుమారు 150 కుటుంబాలు ఉంటాయి. వీరంతా దాదాపు 40ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి చిన్నపాటిగా మిఠాయిల వ్యాపారం ప్రారంభించారు. వికారాబాద్ అర్బన్ : రాజస్తాని మిఠాయిలు ఈ ప్రాంత ప్రజలకు రుచి చూపించడంతో వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పట్టణాల్లో అక్కడక్కడ స్థానికుల మిఠాయి దుకాణాలున్నా, రజస్తానీ మిఠాయిల రుచిలో పోటీ పడటం లేదు. రాజస్తానీ మిఠాయిల గుమగుమలు అందరిని నోరూరిస్తాయి. శుభకార్యాలకు, 15 ఆగస్టు, 26 జనవరి, ఇతర వేడుకలకు స్థానికులు రాజస్తానీ మిఠాయిల దుకాణాల నుంచే అధికంగా కొనుగోలు చేసి తీసుకవెళుతుంటారు. పట్టణంలోని ఒక్కో రాజస్తానీ మిఠాయి దుకాణాల్లో సుమారు వంద రకాల స్వీట్లు తయారు చేసి అమ్ముతున్నారంటే వారు ఏ స్థాయిలో మిఠాయిలు తయారు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు వినని మిఠాయిల పేర్లతో, రంగు రంగులుగా ఆకర్షణీయంగా తయారు చేసి వినియోగదారుల నోరూరింపజేస్తున్నారు. మిఠాయిల రకాలు.. ఈ ప్రాంతంలో అత్యధిక మంది ప్రజలకు జిలేబీ, మైసూర్‌పాక్, పేడా, గులాబ్ జామ్ వంటి కొన్ని పేర్లు మాత్రమే తెలుసు. మిఠాయిలు కొనడానికి రాజస్తానీ మిఠాయి దుకాణాలకు వెళితే అక్కడ రంగురంగులతో ఉన్న మిఠాయిల పేర్లు తెలియక ఇదేమి స్వీటని అడగడం, ఆ పేరు చెబితే కొత్తగా ఉందని అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఎందకంటే వందల రకాల స్వీట్లు అక్కడ ఉంచడం, గతంలో మనం ఎప్పుడు పేరు వినకపోవడం, చూడక పోవడంతో ఆ ఆలోచన కలుగుతుంది. మిఠాయి దుకాణాల్లో ఇన్ని రకాల స్వీట్లు చూశాక, ఇన్ని పేర్లతో స్వీట్లు ఉంటాయా అనుకునే వారే అధికం. రాజస్తానీ మిఠాయి దుకాణాల్లో ప్రధానంగా అజ్మీర్ కళాఖన్, గేవర్ సంక్రాంత్రి ప్రత్యేకం, రస్గుల్లా, దూద్ రఫిడి, ఖాజు కత్లా, అంజూర్ కోన్, ఖాజు రోల్, ముందాల్ అల్వా, అంజీర్ కత్తి, ఖాజు కత్తి, కేసర్ కత్తి, ఫిస్తా కత్తి, అంజీర్ కళాఖాన్, రస్ మధురీ, రఫిడి, టమన్ టోక్లా వంటి రకరకాల స్వీట్లు తయారు చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం దశాబ్దాల క్రితం మిఠాయి వ్యాపారం కోసం రాజస్తాన్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన పాటి కులస్తులు ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో ఉన్న సుమారు 150 కుటుంబాలే కాకుండా ఆ మిఠాయి తయారీ కేంద్రాల్లో పనిచేసే వారిలో కూడా అత్యధిక మంది రాజస్తానీ యువకులే పనిచేస్తున్నారు. సుదూర ప్రాంతం వచ్చి స్థిరపడ్డ ఆ ప్రాంత యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ప్రాంతంలో జరిగే పండగులను వారు జరుపుకుంటూ, వేడుకల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రం వేరైనా ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలతో మమేకమైపోయారు. ఇలా రాజస్తానీ మిఠాయి నేడు మారుమూల మండలాలైన మర్పల్లి, మోమిన్ పేట్, నవాబు పేట, బంట్వారం వంటి మండలాల్లో కూడా మంచి ఆదరణ కలిగి ఉంది. 30ఏళ్ల క్రితం వచ్చాం.. మిఠాయి వ్యాపారం చేసేందుకు ఇక్కడికి 30ఏళ్ల క్రితమే వచ్చాం. రాజస్తాన్‌లో వందల రకాల మిఠాయి తయారు చేస్తారు. అక్కడ తయారు చేసే అనేక మిఠాయిలను తయారు చేసి ఈ ప్రాంత ప్రజలకు దగ్గర చేశాం. జిల్లాలో చాలా మంది మా వారు ఉన్నారు. వారందరిని ఈ ప్రాంత ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మమ్మల్ని ఈ ప్రాంత వారుగానే, స్థానికులుగానే చూస్తారు. దశాబ్దాలుగా ఉండటంతో ఈ సంస్కృతిలో కలిసి పోయాం. ఇక్కడి పండగులు, వేడుకలు చాలా వరకు ఆచరిస్తాం. – జీత్‌మల్ పాటి, మిఠాయి వ్యాపారి, వికారాబాద్ -
బెంగాలీలకు తీపి వార్తే ఇది..
కోల్‌కతా: బెంగాలీలకు తీపి వార్తే ఇది..రసగుల్లా..ఈ పేరు చెబితే నోరూరుతుంది. ఈ రసగుల్లా స్వీట్ మా ప్రాంతానిదేనంటూ భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు పోటీపడ్డాయి. అయితే, ఈ రసగుల్లా పశ్చిమ బెంగాల్‌కే చెందుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన అనుబంధ సంస్థ జీఐ గుర్తింపునిచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్ తమతో పోటీ పడ్డ ఒడిశా మీద విజయం సాధించినట్లయింది. రసగుల్లా స్వీట్ పశ్చిమ బెంగాల్‌దేనని దీనికి భౌగోళిక గుర్తింపు లభించడం బెంగాలీ ప్రజలందరికీ తీయని వార్త అని ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. -
రసగుల్లా..రుచి చూడరా మళ్లా..
రసగుల్లా అంటే ఇష్టపడనివారుండరు.. ఈ బెంగాలీ స్వీట్ అంటే దేశమంతా పడిచస్తారు. ఇన్నాళ్లూ మనం తిన్న, చూసిన రసగుల్లా వేరు.. ఇప్పుడు చెప్పుకోబోయేది వేరు.. మీరు చాలాసార్లు హాట్ అండ్ సౌర్ సూప్ తాగి ఉంటారు.. మరి హాట్ అండ్ సౌర్ రసగుల్లా తిన్నారా.. పోనీ న్యూడిల్స్ రసగుల్లా.. పచ్చి మిరప రసగుల్లా.. ఈ మాత్రానికే ఆశ్చర్యపోతే ఎలా.. కోల్‌కతాకు చెందిన స్వాతి సరాఫ్ వద్ద రసగుల్లాల్లో వందల వెరైటీలు ఉన్నాయి మరి.. అన్ని రకాల ఫ్రూట్, ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లతోపాటు బబుల్గమ్, కిళ్లీ, మల్లెపూలు, వోడ్కా రసగుల్లాలు కూడా ఉన్నాయి. స్వాతి సరాఫ్ ఏడాదిన్నర క్రితం వరకూ గృహిణి.. మరిప్పుడు ఓ విజయవంతమైన వ్యాపారవేత్త.. రసగుల్లా రోజూ తినీ తినీ.. బెంగాలీల్లో ఈ స్వీట్ అంటే కాస్త ఆసక్తి తగ్గడాన్ని స్వాతి గమనించారు. దీనికితోడు మధుమేహం వంటి కారణాల వల్ల పెద్దలు సైతం దీన్ని తినడం తగ్గించారు. ఈ పరిస్థితులనే తన వ్యాపారానికి అనుకూలంగా మలచుకున్నారు. రసగుల్లా తయారీలో మార్పులు చేసి.. పంచదార వంటి వాటి వినియోగాన్ని తగ్గించి.. హెల్తీ రసగుల్లా కాన్సెప్ట్‌ను తెచ్చారు. అంతేకాదు.. రసగుల్లాల్లో బోలెడన్ని వెరైటీలనూ తీసుకువచ్చారు. కాకరకాయ, లవంగాలు, జీలకర్ర ఇలా ఎన్నో.. అంతే.. ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు రోజుకు వేల సంఖ్యలో రసగుల్లాలను విక్రయిస్తున్నారు. పచ్చి మిరప రసగుల్లా అంటే వినియోగదారులు తెగ మక్కువ చూపుతారట. ఈ మిఠాయిలన్నిటినీ ఆమె తన కుటుంబ సభ్యుల సహకారంతో తయారుచేస్తున్నారు. త్వరలో మిగిలిన నగరాల్లోనూ తన వ్యాపారాన్ని విస్తరించాలని స్వాతి యోచిస్తున్నారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
రసగుల్లా మాదే...కాదు మాదే!
రసగుల్లా... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. ఆ మిఠాయి కోసం ఇప్పుడు రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. నీళ్లు, సరిహద్దు సమస్యలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొంటే ఇక్కడ మాత్రం రసగుల్లా మాదంటే ...మాదని వాదిస్తున్నాయి. రసగుల్లాపై పేటెంట్ తమకే దక్కాలని ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. ఇందుకోసం ఆ స్వీట్ తమ ప్రాంతానిదని చెప్పే ఆధారాల కోసం వెదుకుతున్నాయి. రసగుల్లా తమ ప్రాంతంలో పుట్టిందంటే తమ ప్రాంతంలో పుట్టిందని ఒడిశా, పశ్చిమ బెంగాల్ వాదిస్తు...హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో ఒక వంటకానికి బాగా పేరొస్తే అది ఆ ప్రాంతానికే చెందింది అని నిరూపించుకునేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం మేథోహక్కుల విభాగంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద అనుమతి తీసుకోవాలి. అలా అనుమతి వచ్చిన తర్వాత ఆ ప్రాంతం, రాష్ట్రానికి మాత్రమే ఆ వంటకంపై పూర్తి హక్కులు చెందుతాయి. అలా జరిగితే మరే ఇతర ప్రాంతం ఆ వంటకం తమదిగా చెప్పుకోడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు అందరికీ సుపరిచితమైన రసగుల్లా మిఠాయిపై ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు హక్కు తమదంటే తమదని గొడవకు దిగుతున్నాయి. మిఠాయి పుట్టింది తమ దగ్గరకే కాబట్టి అది తమ రాష్ట్ర వంటకం కింద గుర్తించాలని పట్టుబడుతున్నాయి. జీఐ హక్కు, గుర్తింపు తమకే చెందుతాయని వాదులాడుకుంటున్నాయి. ప్రఖ్యాత పూరి జగన్నాథస్వామి ఆలయంలో రసగుల్లా 12వ శతాబ్దంలో ప్రసాదంగా పుట్టిందని, ఆ తర్వాత మిఠాయి ఒడిశా రాష్ట్ర ప్రజల్లోను, చరిత్ర, సంస్కృతి, జీవన విధానంలో భాగమైందని ఒడిశా ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. అందుకే జీఐ హక్కులు తమకే ఇవ్వాలని చెబుతోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ కూడా అదేరీతిలో వాదనలు వినిపిస్తోంది. ఈ మిఠాయి తమ వద్దే పుట్టిందని, జీఐ హక్కులు కూడా వచ్చాయని పేచీ పెడుతోంది. దీంతో ఇప్పుడు ఈ మిఠాయి చరిత్ర, నేపథ్యానికి సంబంధించిన ఆధారాలు వెదికే పనిలో పడ్డాయి. మరి చివరకు రసగుల్లా ఎవరికి దక్కుతుందో చూడాలి. -
బెంగాల్, ఒడిస్సాల మధ్య రసగుల్ల పోరు!