రాజస్తానీ రస్‌గుల్ల.. | Rajasthani Rasgulla | Sakshi
Sakshi News home page

రాజస్తానీ రస్‌గుల్ల..

Published Fri, Aug 24 2018 10:47 AM | Last Updated on Fri, Aug 24 2018 11:04 AM

Rajasthani Rasgulla - Sakshi

రస్‌గుల్లా

చిన్నచిన్న పట్టణాల నుంచి హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరాల్లో ఎక్కడ చూసినా మిఠాయి దుకాణాలు రాజస్తానీలవే ఎక్కువగా ఉంటాయి. రకరకాల మిఠాయిలు తయారు చేయడంలో రాజస్తానీలది అందెవేసిన చెయ్యి. రాజస్తాన్‌లో పాటి కులానికి చెందిన అత్యధిక మంది మిఠాయిల వ్యాపారమే చేసుకొని జీవనం సాగిస్తారు.

ఇలా మిఠాయి వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వారిలో వికారాబాద్‌ జిల్లాలో సుమారు 150 కుటుంబాలు ఉంటాయి. వీరంతా దాదాపు 40ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి చిన్నపాటిగా మిఠాయిల వ్యాపారం ప్రారంభించారు.

వికారాబాద్‌ అర్బన్‌ : రాజస్తాని మిఠాయిలు ఈ ప్రాంత ప్రజలకు రుచి చూపించడంతో వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. పట్టణాల్లో అక్కడక్కడ స్థానికుల మిఠాయి దుకాణాలున్నా, రజస్తానీ మిఠాయిల రుచిలో పోటీ పడటం లేదు. రాజస్తానీ మిఠాయిల గుమగుమలు అందరిని నోరూరిస్తాయి. శుభకార్యాలకు, 15 ఆగస్టు, 26 జనవరి, ఇతర వేడుకలకు స్థానికులు రాజస్తానీ మిఠాయిల దుకాణాల నుంచే అధికంగా కొనుగోలు చేసి తీసుకవెళుతుంటారు.

పట్టణంలోని ఒక్కో రాజస్తానీ మిఠాయి దుకాణాల్లో సుమారు వంద రకాల స్వీట్లు తయారు చేసి అమ్ముతున్నారంటే వారు ఏ స్థాయిలో మిఠాయిలు తయారు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు వినని మిఠాయిల పేర్లతో, రంగు రంగులుగా ఆకర్షణీయంగా తయారు చేసి వినియోగదారుల నోరూరింపజేస్తున్నారు. 

మిఠాయిల రకాలు.. 

ఈ ప్రాంతంలో అత్యధిక మంది ప్రజలకు జిలేబీ, మైసూర్‌పాక్, పేడా, గులాబ్‌ జామ్‌ వంటి కొన్ని పేర్లు మాత్రమే తెలుసు. మిఠాయిలు కొనడానికి రాజస్తానీ మిఠాయి దుకాణాలకు వెళితే అక్కడ రంగురంగులతో ఉన్న మిఠాయిల పేర్లు తెలియక ఇదేమి స్వీటని అడగడం, ఆ పేరు చెబితే కొత్తగా ఉందని అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఎందకంటే వందల రకాల స్వీట్లు అక్కడ ఉంచడం, గతంలో మనం ఎప్పుడు పేరు వినకపోవడం, చూడక పోవడంతో ఆ ఆలోచన కలుగుతుంది.

మిఠాయి దుకాణాల్లో ఇన్ని రకాల స్వీట్లు చూశాక, ఇన్ని పేర్లతో స్వీట్లు ఉంటాయా అనుకునే వారే అధికం. రాజస్తానీ మిఠాయి దుకాణాల్లో ప్రధానంగా అజ్మీర్‌ కళాఖన్, గేవర్‌ సంక్రాంత్రి ప్రత్యేకం, రస్‌గుల్లా, దూద్‌ రఫిడి, ఖాజు కత్‌లా, అంజూర్‌ కోన్, ఖాజు రోల్, ముందాల్‌ అల్వా, అంజీర్‌ కత్తి, ఖాజు కత్తి, కేసర్‌ కత్తి, ఫిస్తా కత్తి, అంజీర్‌ కళాఖాన్, రస్‌ మధురీ, రఫిడి, టమన్‌ టోక్లా వంటి రకరకాల స్వీట్లు తయారు చేస్తున్నారు. 

దశాబ్దాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం 

దశాబ్దాల క్రితం మిఠాయి వ్యాపారం కోసం రాజస్తాన్‌ నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన పాటి కులస్తులు ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో ఉన్న సుమారు 150 కుటుంబాలే కాకుండా ఆ మిఠాయి తయారీ కేంద్రాల్లో పనిచేసే వారిలో కూడా అత్యధిక మంది రాజస్తానీ యువకులే పనిచేస్తున్నారు. సుదూర ప్రాంతం వచ్చి స్థిరపడ్డ ఆ ప్రాంత యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ప్రాంతంలో జరిగే పండగులను వారు జరుపుకుంటూ, వేడుకల్లో పాల్గొంటున్నారు.

రాష్ట్రం వేరైనా ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలతో మమేకమైపోయారు. ఇలా రాజస్తానీ మిఠాయి నేడు మారుమూల మండలాలైన మర్పల్లి, మోమిన్‌ పేట్, నవాబు పేట, బంట్వారం వంటి మండలాల్లో కూడా మంచి ఆదరణ కలిగి ఉంది.

30ఏళ్ల క్రితం వచ్చాం.. 

మిఠాయి వ్యాపారం చేసేందుకు ఇక్కడికి  30ఏళ్ల క్రితమే వచ్చాం. రాజస్తాన్‌లో వందల రకాల మిఠాయి తయారు చేస్తారు. అక్కడ తయారు చేసే అనేక మిఠాయిలను తయారు చేసి ఈ ప్రాంత ప్రజలకు దగ్గర చేశాం. జిల్లాలో చాలా మంది మా వారు ఉన్నారు. వారందరిని ఈ ప్రాంత ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మమ్మల్ని ఈ ప్రాంత వారుగానే, స్థానికులుగానే చూస్తారు. దశాబ్దాలుగా ఉండటంతో ఈ సంస్కృతిలో కలిసి పోయాం. ఇక్కడి పండగులు, వేడుకలు చాలా వరకు ఆచరిస్తాం.

– జీత్‌మల్‌ పాటి, మిఠాయి వ్యాపారి, వికారాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement