బషీరాబాద్, వికారాబాద్ : మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు వస్తుందని హత్య చేయించింది ఓ వదిన. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో జరిగింది. పోలీసులు, హతుడి కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల ప్రకారం.. నవల్గాకు చెందిన మాల శ్యామప్ప (39) గ్రామ గేటు సమీపంలో హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అడ్డు తొలగిస్తే.. ఆస్తి దక్కుతుందని..
నవల్గాకు చెందిన మాల మల్లమ్మకు మాల నర్సిములు, శ్యామప్ప (39), శ్యామమ్మ సంతానం. అయితే శ్యామప్ప భార్య నాలుగేళ్ల క్రితం భర్తను వదిలేసి కూతురును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శ్యామప్ప తన చెల్లితో కలిసి ఉంటున్నాడు. అదే ఇంట్లోని రెండో భాగంలో అన్న నర్సిములు, వదిన సుగుణ నివసిస్తున్నారు. మరిదిని అంతమొందిస్తే ఇల్లు పూర్తిగా తమ సొంతం అవుతుందని భావించింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొత్త విజయ్, విశ్వనాథ్, శివకుమార్‌లతో కలిసి వారం రోజుల క్రితం శ్యామప్ప హత్యకు పథకం వేసింది. అతన్ని చంపితే రూ.50 వేలు ఇస్తానని చెప్పి, శనివారం అడ్వాన్స్‌గా రూ.10 వేలు అందజేసింది. ఈ క్రమంలో సుపారీ తీసుకున్న ముగ్గురు శ్యామప్ప హత్యకు పక్కా ప్లాన్ వేశారు.
సోమవారం సాయంత్రం బషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గ్లౌజ్‌లు తీసుకున్నారు. మద్యం తాగేందుకని రాత్రి శ్యామప్పను తీసుకుని గ్రామ శివారులోని ఓ పొలంలోకి వెళ్లారు. మద్యం తాగిన తర్వాత శ్యామప్ప తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పొలానికి ఆనుకుని ఉన్న బషీరాబాద్– తాండూరు ప్రధాన మార్గం వద్దకు ఈడ్చుకెళ్లి పడేశారు. హత్య సమాచారం అందుకున్న ఎస్‌ఐ శంకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్ హత్య తీరును పరిశీలించారు.
హతుడి తల్లి మల్లమ్మ, సోదరి శ్యామమ్మను విచారించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. అనుమానం వచి్చన పోలీసులు వదిన సుగుణను ఠాణాకు తరలించి విచారించారు. హత్యకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని సీఐ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment