రసగుల్లా..రుచి చూడరా మళ్లా..
రసగుల్లా అంటే ఇష్టపడనివారుండరు.. ఈ బెంగాలీ స్వీట్ అంటే దేశమంతా పడిచస్తారు. ఇన్నాళ్లూ మనం తిన్న, చూసిన రసగుల్లా వేరు.. ఇప్పుడు చెప్పుకోబోయేది వేరు.. మీరు చాలాసార్లు హాట్ అండ్ సౌర్ సూప్ తాగి ఉంటారు.. మరి హాట్ అండ్ సౌర్ రసగుల్లా తిన్నారా.. పోనీ న్యూడిల్స్ రసగుల్లా.. పచ్చి మిరప రసగుల్లా.. ఈ మాత్రానికే ఆశ్చర్యపోతే ఎలా.. కోల్‌కతాకు చెందిన స్వాతి సరాఫ్ వద్ద రసగుల్లాల్లో వందల వెరైటీలు ఉన్నాయి మరి.. అన్ని రకాల ఫ్రూట్, ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లతోపాటు బబుల్‌గమ్, కిళ్లీ, మల్లెపూలు, వోడ్కా రసగుల్లాలు కూడా ఉన్నాయి.
స్వాతి సరాఫ్ ఏడాదిన్నర క్రితం వరకూ గృహిణి.. మరిప్పుడు ఓ విజయవంతమైన వ్యాపారవేత్త.. రసగుల్లా రోజూ తినీ తినీ.. బెంగాలీల్లో ఈ స్వీట్ అంటే కాస్త ఆసక్తి తగ్గడాన్ని స్వాతి గమనించారు. దీనికితోడు మధుమేహం వంటి కారణాల వల్ల పెద్దలు సైతం దీన్ని తినడం తగ్గించారు. ఈ పరిస్థితులనే తన వ్యాపారానికి అనుకూలంగా మలచుకున్నారు. రసగుల్లా తయారీలో మార్పులు చేసి.. పంచదార వంటి వాటి వినియోగాన్ని తగ్గించి.. హెల్తీ రసగుల్లా కాన్సెప్ట్‌ను తెచ్చారు.
అంతేకాదు.. రసగుల్లాల్లో బోలెడన్ని వెరైటీలనూ తీసుకువచ్చారు. కాకరకాయ, లవంగాలు, జీలకర్ర ఇలా ఎన్నో.. అంతే.. ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు రోజుకు వేల సంఖ్యలో రసగుల్లాలను విక్రయిస్తున్నారు. పచ్చి మిరప రసగుల్లా అంటే వినియోగదారులు తెగ మక్కువ చూపుతారట. ఈ మిఠాయిలన్నిటినీ ఆమె తన కుటుంబ సభ్యుల సహకారంతో తయారుచేస్తున్నారు. త్వరలో మిగిలిన నగరాల్లోనూ తన వ్యాపారాన్ని విస్తరించాలని స్వాతి యోచిస్తున్నారు.
– సాక్షి, తెలంగాణ డెస్క్