రసగుల్లా మాదే...కాదు మాదే!
రసగుల్లా... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. ఆ మిఠాయి కోసం ఇప్పుడు రెండు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. నీళ్లు, సరిహద్దు సమస్యలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొంటే ఇక్కడ మాత్రం రసగుల్లా మాదంటే ...మాదని వాదిస్తున్నాయి. రసగుల్లాపై పేటెంట్ తమకే దక్కాలని ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. ఇందుకోసం ఆ స్వీట్ తమ ప్రాంతానిదని చెప్పే ఆధారాల కోసం వెదుకుతున్నాయి.
రసగుల్లా తమ ప్రాంతంలో పుట్టిందంటే తమ ప్రాంతంలో పుట్టిందని ఒడిశా, పశ్చిమ బెంగాల్ వాదిస్తు...హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో ఒక వంటకానికి బాగా పేరొస్తే అది ఆ ప్రాంతానికే చెందింది అని నిరూపించుకునేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం మేథోహక్కుల విభాగంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద అనుమతి తీసుకోవాలి. అలా అనుమతి వచ్చిన తర్వాత ఆ ప్రాంతం, రాష్ట్రానికి మాత్రమే ఆ వంటకంపై పూర్తి హక్కులు చెందుతాయి. అలా జరిగితే మరే ఇతర ప్రాంతం ఆ వంటకం తమదిగా చెప్పుకోడానికి వీల్లేదు.
అయితే ఇప్పుడు అందరికీ సుపరిచితమైన రసగుల్లా మిఠాయిపై ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు హక్కు తమదంటే తమదని గొడవకు దిగుతున్నాయి. మిఠాయి పుట్టింది తమ దగ్గరకే కాబట్టి అది తమ రాష్ట్ర వంటకం కింద గుర్తించాలని పట్టుబడుతున్నాయి. జీఐ హక్కు, గుర్తింపు తమకే చెందుతాయని వాదులాడుకుంటున్నాయి.
ప్రఖ్యాత పూరి జగన్నాథస్వామి ఆలయంలో రసగుల్లా 12వ శతాబ్దంలో ప్రసాదంగా పుట్టిందని, ఆ తర్వాత మిఠాయి ఒడిశా రాష్ట్ర ప్రజల్లోను, చరిత్ర, సంస్కృతి, జీవన విధానంలో భాగమైందని ఒడిశా ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. అందుకే జీఐ హక్కులు తమకే ఇవ్వాలని చెబుతోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ కూడా అదేరీతిలో వాదనలు వినిపిస్తోంది. ఈ మిఠాయి తమ వద్దే పుట్టిందని, జీఐ హక్కులు కూడా వచ్చాయని పేచీ పెడుతోంది. దీంతో ఇప్పుడు ఈ మిఠాయి చరిత్ర, నేపథ్యానికి సంబంధించిన ఆధారాలు వెదికే పనిలో పడ్డాయి. మరి చివరకు రసగుల్లా ఎవరికి దక్కుతుందో చూడాలి.