సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపాను ‘దానా’ తీరం దాటింది. అర్ధరాత్రి 1:30 నుండి 3:30 మధ్య తీరాన్ని తాకింది. ఒడిశాలోని బిత్తర్‌కని నేషనల్ పార్క్, ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒడిశా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్ర పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
భద్రక్, జగత్సింగ్‌పూర్, బాలాసోర్‌లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఒడిశాలో 7వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లొతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో ఏకంగా 400లకు పైగా రైళ్లు రద్దు అయ్యాయి. కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌ల్లో సేవలను గురువారం సాయంత్రం నుంచే నిలిపివేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను కదలికలను ఇస్రో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–06), ఇన్‌శాట్–3డీఆర్ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాయని ఇస్రో తన అధికారిక వెబ్‌సైట్‌లో గురువారం తెలియజేసింది. 2022 నవంబర్ 26న పీఎస్‌ఎల్‌వీ సీ–54 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈఓఎస్–06, 2016 సెప్టెంబర్ 8న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–05 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇన్‌శాట్–3డీఆర్ ఉపగ్రహాలు విపత్తులను ముందస్తుగా గుర్తించి మానవాళికి మేలు చేస్తుండటంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం.
ఈ నెల 20న బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సముద్రపు గాలి నమూనాలను బట్టి ఈఓఎస్–06 ఉపగ్రహం ముందస్తుగా గుర్తించింది. మేఘాలను బట్టి ఇన్‌శాట్–3డీఆర్ ఉపగ్రహం ఈ తుపానును ముందస్తుగా గుర్తించింది. తుపాను బెంగాల్, ఒడిశా మీదుగా వెళ్లి తీరం దాటింది. ఈ విషయాన్ని ఈ రెండు ఉపగ్రహాలు ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకునే అవకాశం చిక్కింది.
Comments
Please login to add a commentAdd a comment