( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదిలే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 22వ తేదీ నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
తొలుత ఇది ఏపీ, ఒడిశా మధ్య తీరం దాటవచ్చని భావించారు. కానీ ఏపీ–ఒడిశా తీరం వైపు వచ్చినా.. మధ్యలో దిశ మార్చుకుని ఉత్తర ఒడిశా–పశ్చిమబెంగాల్ వైపు కదులుతుందని తాజాగా అంచనా వేస్తున్నారు. ఏపీలో 15 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. అదే సమయంలో పశ్చిమబెంగాల్ తీరంలో సముద్ర ఉష్ణోగ్రతలు ఇక్కడికంటే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల తుపాను పశ్చిమబెంగాల్‌వైపు కదిలేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని, వాతావరణంలో అనూహ్య మార్పులు జరిగితే తప్ప ఏపీకి తుపాను ప్రభావం ఉండదని వాతావరణ శాఖ చెబుతోంది.
అయితే, దీని ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే వీలుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో 7.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం దళపతిగూడలో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రకాశం, ఏలూరు, అల్లూరి, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వచ్చే రెండు రోజులు ఇలాగే మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment