భయపెడుతున్న దానా.. ప్రచండ గాలులతో వర్ష సూచన! | Cyclone Dana: Kolkata Airport To Suspend Flight Operations On Thursday, 3 Lakh People Evacuated In Odisha | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న దానా.. ప్రచండ గాలులతో వర్ష సూచన!

Published Thu, Oct 24 2024 8:07 AM | Last Updated on Thu, Oct 24 2024 10:57 AM

Cyclone Dana: Kolkata suspend flight operations

Dana Cyclone Updates:

తీవ్ర తుఫానుగా ‘దానా’ వాయువ్య బంగాళాఖాతంలో కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 12 కి.మీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. పారాదీప్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 260 కి.మీ, ధమర (ఒడిశా)కి 290 కి.మీ, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణంగా 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతం అయినట్లు  వాతావరణ అధికారుతెలిపారు.


దానా తుపాను ప్రభావంతో  ఒడిశాలో  భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్‌ మనోరమా మొహంతి తెలిపారు. ఈ రాత్రి (గురువారం) అత్యధిక వేగంతో గాలి వీస్తుందని చెప్పారు.‘‘ దానా తుపాను గత అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారింది. ఇది గత 6 గంటల్లో 12 కి.మీ/గంట వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. బంగాళాఖాతం వాయువ్య దిశలో తీవ్ర తుపానుగా కదులుతోంది’’అని అన్నారు.

దానా తుపాను భయపెడుతున్న నేపథ్యంలో తీరం దాటకముందే ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. సుమారు 10 లక్షల మందిని తరలించాలని ప్రభుత్వం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దానా తుపాను.. గురువారం లేదా శుక్రవారం భిటార్కనికా , ధమ్రా మధ్య  తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. మరోవైపు.. దానా తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. కోల్‌కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో నేటి నుంచి రేపు(శుక్రవారం) ఉదయం వరకు కార్యకలాపాలు నిలిపివేసింది.

 

ఒడిశాలోని అనేక తీర జిల్లాల నుంచి దాదాపు 10 లక్షల మంది ప్రజలను తరలించడానికి ఒడిశాలోని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. 120 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ దానా తుపాను ఒడిశాలోని సగం జనాభా ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

ఈ తుపాను బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి  పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 330 కి.మీల దూరంలో, ధమర (ఒడిశా)కి 360 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ-ఆగ్నేయంగా 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే..  ఈ తుపాను ఒడిశాలోని భిటార్కనికా నేషనల్ పార్క్ , ధామ్రా ఓడరేవుల మధ్య తీరం దాట వచ్చని వాతావరణ అధికారులు  అంచనా వేస్తున్నారు.

 

మరోవైపు.. దానా తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా , పశ్చిమ మెదినీపూర్, ఝర్‌గ్రామ్, కోల్‌కతా, హౌరా , హుగ్లీ జిల్లాల్లో గురువారం, శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతా విమానాశ్రయం గురువారం సాయంత్రం 6 గంటల నుండి రేపు(శుక్రవారం) ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేసింది.

 

అదేవిధంగా భువనేశ్వర్ విమానాశ్రయం ఈరోజు సాయంత్రం 5 నుండి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. ఇక.. దానా తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల మీదుగా నడిచే దాదాపు 200 రైళ్లను రద్దు చేశారు. ఒడిశాలో, బుధవారం సాయంత్రం నాటికి సుమారు 3 లక్షల మందిని, పశ్చిమ బెంగాల్ 1.14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement