తీవ్ర తుపానుతో 120 కిలోమీటర్ల వేగంతో గాలులు
పశ్చిమబెంగాల్‌లో అత్యంత భారీ వర్షాలు
లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు
విమానాలు, రైళ్లు రద్దు
కోల్‌కతా: తీవ్ర తుపాను ‘రెమాల్’ ధాటికి పశ్చిమబెంగాల్ అతలాకుతలమవుతోంది. దీని ప్రభావంతో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్ తీరప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది.
తీరప్రాంతాల నుంచి 1.1 లక్షల మందిని ఆదివారం యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రెమాల్‌తో నష్టం తక్కువేనని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లాల్లోని బలహీన నిర్మాణాలు, విద్యుత్, సమాచార వ్యవస్థలు, కచ్చా రోడ్లు, పంటలు, తోటలకు నష్టం వాటిల్లవచ్చని చెప్పారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈస్టర్న్, సౌత్ ఈస్టర్న్ రైల్వేలు ఆది, సోమవారాల్లో కొన్ని రైళ్లను రద్దు చేశాయి. కోల్‌కతా విమానాశ్రయం అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటలపాటు బయలుదేరాల్సిన, రావాల్సిన 394 సరీ్వసులను రద్దు చేశారు.
పోలీసులు, ఫైర్ సిబ్బందితోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. బెంగాల్‌తోపాటు ఉత్తర ఒడిశాలో 26, 27వ తేదీల్లో తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ తుపాను ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేసింది. రక్షణ, సహాయక కార్యక్రమాల సన్నద్ధతపై అధికారులతో ప్రధాని మోదీ ఆదివారం సమీక్ష జరిపారు.
బంగ్లాదేశ్‌లో...
బంగ్లాదేశ్‌లోని పేరా, మోంగ్లా పోర్టుల్లో అత్యంత ప్రమాద 10వ నంబర్ హెచ్చరికను, కోక్స్ బజార్, చిట్టోగ్రామ్‌లలో 9వ నంబర్ హెచ్చరికలను ఎగురవేశారు. అలలు సాధారణం కంటే 8 నుంచి 12 అడుగుల వరకు ఎత్తులో ఎగసిపడుతున్నాయి. 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిట్టగాంగ్ ఎయిర్‌పోర్టులో విమాన సరీ్వసులను రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment