తర్వాత చితకబాది ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
రోడ్డుపై ఆకతాయిల చేష్టలపై ఫిర్యాదు చేయడానికి వచ్చి దారుణాన్ని చవిచూసిన కాబోయే జంట
ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి కేసును సీఐడీకి బదిలీ చేసిన ఒడిశా సర్కార్
వెల్లువెత్తిన విపక్షాల విమర్శలు
భువనేశ్వర్: న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేసిన దారుణ ఘటనలో విస్తుగొలిపే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను ఒడిశా సర్కార్ సస్పెండ్‌చేసి కేసును సీఐడీకి అప్పగించింది.
అసలేం జరిగింది?
పశ్చిమ బెంగాల్‌లో ఆర్మీ మేజర్‌గా పనిచేసే ఒక యువ ఆర్మీ అధికారి తన కాబోయే భార్యను భువనేశ్వర్‌లో సెప్టెంబర్ 14వ తేదీన ఆమెకు చెందిన రెస్టారెంట్ వద్ద కలిశారు. తర్వాత రెస్టారెంట్ మూసేసి ఇద్దరూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కారులో ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొందరు ఆకతాయిలు వీరిని కారు ఆపి వేధించారు.
ఆకతాయిలపై ఫిర్యాదుచేసేందుకు వీరిద్దరూ దగ్గర్లోని భరత్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగిందని బాధిత మహిళ చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో గురువారం బెయిల్‌పై విడుదలయ్యాక గాయాలతో ఆమె ప్రస్తుతం భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ‘‘ఆకతాయిలపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఎఫ్‌ఐఆర్ నమోదుచేయడానికి నిరాకరించారు. పైగా బూతులు తిట్టారు.
వాగ్వాదానికి దిగిన ఆర్మీ ఆఫీసర్‌ను లాకప్‌లో పడేశారు. అదేంటని ప్రశ్నించినందుకు నన్ను అక్కడి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కట్టేసి లాకప్‌లో పడేశారు. చాలా సేపటి తర్వాత ఒక పోలీసు అధికారి ఒకతను గదిలోకి వచ్చి నా ఛాతీ మీద చాలా సార్లు కొట్టాడు. తర్వాత నా ప్యాంట్ విప్పి అతని ప్యాంట్ కూడా విప్పాడు. జననాంగం చూపిస్తూ ‘‘అరవకుండా నువ్వు నోరు మూసుకుని ఉండటానికి నీకు ఎంత సమయం కావాలి?’ అని బెదిరించాడని వివరించింది. ఘటనను జాతీయ మహిళా కమిషన్ సూమోటోగా స్వీకరించింది. మూడ్రోజుల్లోగా ఘటనపై నివేదించాలని ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వైబీ ఖురానియాను ఆదేశించింది.
జ్యుడీషియల్ విచారణ జరపాలి: పటా్నయక్
ఘటనపై మాజీ సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘హేయమైన ఘటనలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. కోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరిపించాలి’’ అని శాసనసభలో పట్నాయక్ డిమాండ్‌చేశారు. శనివారం రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తామని బీజేడీ ప్రకటించింది. ‘‘కాషాయపార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ పోలీసులు రక్షకులుగా కంటే భక్షకులుగా తయారయ్యాయి. మహిళకు పోలీస్‌స్టేషన్‌లో ఇంతటి అవమానం జరిగితే, ఆర్మీ కెప్టెన్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రధాని ఒక్కమాటైనా మాట్లాడరా?. బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది?’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్‌భవన్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ధర్నాకు దిగారు.
పోలీసుల సస్పెన్షన్
ఘటనపై భారత సైన్యం సైతం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఒడిశా సర్కార్‌ను కోరింది. దీంతో ఈ ఉదంతంలో సంబంధం ఉన్న భరత్‌పూర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జ్ దినకృష్ణ మిశ్రా, సబ్ ఇన్‌స్పెక్టర్లు వైశాలిని పాండా, సలిలామయీ సాహో, సాగరికా రథ్, కానిస్టేబుల్ బలరాం హన్స్‌డాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసును సీఐడీకి బదిలీచేయగా సస్పెండ్ అయిన పోలీసులపై శుక్రవారం కేసు నమోదుచేశారు. ‘‘నా కూతురును దవడ కదిలిపోయేలా దారుణంగా కొట్టారు. న్యాయం కోసం వస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ బాధిత మహిళ తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన సైన్యంలో బ్రిగేడియర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ జంటను వేధించిన ఏడుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment