Bhubaneswar
-
ఆగిన గుండె.. 90 నిమిషాలకు తిరిగి కొట్టుకుంది!
భువనేశ్వర్: ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను.. తిరిగి కొట్టుకునేలా చేసి ఆ వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు. శుభాకాంత్ సాహు అనే ఈ జవాను వయసు 24 ఏళ్లు. అక్టోబర్ 1వ తేదీన తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతనికి చికిత్స కొనసాగుతోంది. అయితే..ఉన్నట్లుండి ఈ మధ్య అతని గుండె ఆగిపోయింది. దీంతో డాక్టర్లు సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అయినా చలనం లేకపోవడంతో ఎక్స్ట్రాకార్పోరియల్ కార్డియోపల్మనరీ రిససిటేషన్ (ఈసీపీఆర్) చేశారు. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. ఆపై 30 గంటల గుండె లయబద్ధంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరో 96 గంటల తర్వాత అతనికి ఎక్మోను తొలగించారు. ఇలా..ఒడిషా భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ బృందం అతని ప్రాణాలు నిలబెట్టింది. సాంకేతికంగా ఈసీపీఆర్ విధానం అనేది సవాళ్లతో కూడుకున్నదని, అయినప్పటికీ గుండె ఆగిన సందర్భాల్లో చికిత్సకు అనువైందని డాక్టర్ శ్రీకాంత్ బెహరా చెబుతున్నారు. ప్రస్తుతం శుభాకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారాయన. -
కల్కి అవతారమంటూ బాలుడికి పూజలు
భువనేశ్వర్: రాష్ట్రంలో ఓ బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ వైఖరి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎస్సీపీసీఆర్) స్వయంగా కేసు నమోదు చేసింది. స్థానిక ఖండగిరి ప్రాంతంలో శ్రీ వైకుంఠ ధామం ప్రాంగణంలో బాలుడు కల్కి అవతారిగా పూజలు అందుకుంటున్న ప్రసారం ఆధారంగా భరత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో దుమారం తార స్థాయికి తాకింది. బాలల హక్కుల సంఘం ఈ మేరకు సమగ్ర నివేదిక దాఖలు చేయాలని భరత్పూర్ ఠాణా పోలీసులకు తాఖీదులు జారీ చేసింది. ఈ మేరకు 15 రోజుల గడువు మంజూరు చేసింది. బాలల సంక్షేమ కమిటి ఈ ప్రసారంపై విచారణ చేపట్టాలని ఎస్సీపీసీఆర్ ఆదేశించింది. వివాదంలో చిక్కుకున్న కల్కి అవతార బాలుడు ప్రముఖ భాష్యకారుడు కాశీనాథ్ మిశ్రా కుమారుడు. సాంఘిక మాధ్యమంలో ప్రసారమైన ఫొటోలు అభూత కల్పనగా ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాలపై లోతుగా విచారణ చేపట్టి వాస్తవాస్తవాల్ని వెలుగులోకి తేవాలని ఆయన అభ్యరి్థంచారు. -
ఛాతీపై కొట్టి, లైంగికంగా వేధించి.. ఆర్మీ ఆఫీసర్‌కు కాబోయే భార్యపై పోలీసుల దాష్టీకం
భువనేశ్వర్: న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేసిన దారుణ ఘటనలో విస్తుగొలిపే వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను ఒడిశా సర్కార్ సస్పెండ్‌చేసి కేసును సీఐడీకి అప్పగించింది. అసలేం జరిగింది? పశ్చిమ బెంగాల్లో ఆర్మీ మేజర్‌గా పనిచేసే ఒక యువ ఆర్మీ అధికారి తన కాబోయే భార్యను భువనేశ్వర్‌లో సెప్టెంబర్ 14వ తేదీన ఆమెకు చెందిన రెస్టారెంట్ వద్ద కలిశారు. తర్వాత రెస్టారెంట్ మూసేసి ఇద్దరూ అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో కారులో ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొందరు ఆకతాయిలు వీరిని కారు ఆపి వేధించారు. ఆకతాయిలపై ఫిర్యాదుచేసేందుకు వీరిద్దరూ దగ్గర్లోని భరత్పూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అయితే అక్కడ తమకు ఘోర అవమానం జరిగిందని బాధిత మహిళ చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో గురువారం బెయిల్‌పై విడుదలయ్యాక గాయాలతో ఆమె ప్రస్తుతం భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ‘‘ఆకతాయిలపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ నమోదుచేయడానికి నిరాకరించారు. పైగా బూతులు తిట్టారు. వాగ్వాదానికి దిగిన ఆర్మీ ఆఫీసర్‌ను లాకప్‌లో పడేశారు. అదేంటని ప్రశ్నించినందుకు నన్ను అక్కడి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కట్టేసి లాకప్‌లో పడేశారు. చాలా సేపటి తర్వాత ఒక పోలీసు అధికారి ఒకతను గదిలోకి వచ్చి నా ఛాతీ మీద చాలా సార్లు కొట్టాడు. తర్వాత నా ప్యాంట్ విప్పి అతని ప్యాంట్ కూడా విప్పాడు. జననాంగం చూపిస్తూ ‘‘అరవకుండా నువ్వు నోరు మూసుకుని ఉండటానికి నీకు ఎంత సమయం కావాలి?’ అని బెదిరించాడని వివరించింది. ఘటనను జాతీయ మహిళా కమిషన్ సూమోటోగా స్వీకరించింది. మూడ్రోజుల్లోగా ఘటనపై నివేదించాలని ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) వైబీ ఖురానియాను ఆదేశించింది. జ్యుడీషియల్ విచారణ జరపాలి: పటా్నయక్ ఘటనపై మాజీ సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘హేయమైన ఘటనలో జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. కోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు జరిపించాలి’’ అని శాసనసభలో పట్నాయక్ డిమాండ్‌చేశారు. శనివారం రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేస్తామని బీజేడీ ప్రకటించింది. ‘‘కాషాయపార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ పోలీసులు రక్షకులుగా కంటే భక్షకులుగా తయారయ్యాయి. మహిళకు పోలీస్‌స్టేషన్‌లో ఇంతటి అవమానం జరిగితే, ఆర్మీ కెప్టెన్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రధాని ఒక్కమాటైనా మాట్లాడరా?. బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది?’’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్భవన్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ధర్నాకు దిగారు.పోలీసుల సస్పెన్షన్ ఘటనపై భారత సైన్యం సైతం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఒడిశా సర్కార్‌ను కోరింది. దీంతో ఈ ఉదంతంలో సంబంధం ఉన్న భరత్పూర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జ్ దినకృష్ణ మిశ్రా, సబ్ ఇన్స్పెక్టర్లు వైశాలిని పాండా, సలిలామయీ సాహో, సాగరికా రథ్, కానిస్టేబుల్ బలరాం హన్స్డాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసును సీఐడీకి బదిలీచేయగా సస్పెండ్ అయిన పోలీసులపై శుక్రవారం కేసు నమోదుచేశారు. ‘‘నా కూతురును దవడ కదిలిపోయేలా దారుణంగా కొట్టారు. న్యాయం కోసం వస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ బాధిత మహిళ తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన సైన్యంలో బ్రిగేడియర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ జంటను వేధించిన ఏడుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
గణపతి పూజలో పాల్గొన్నా కాంగ్రెస్‌కు నచ్చట్లేదు
భువనేశ్వర్: సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో పాల్గొన్నందుకు తనపై విమర్శలు పెంచిన కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ మంగళవారం దీటుగా బదులిచ్చారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ గణేశ్ ఉత్సవం దేశంలో కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన వేడుక కాదు. దేశ స్వాతం్రత్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉత్సవం. ఆకాలంలో బ్రిటిష్ పాలకులు సైతం గణేశ్ ఉత్సవాలను ద్వేషించాలంటూ భారత్‌లో విభజించు, పాలించు కుట్రను అమలుచేశారు. ఇప్పుడు కూడా అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న కొందరు గణపతి పూజలో పాల్గొంటే సమస్యలొస్తాయంటూ సమాజాన్ని విభజించే పనిలో బిజీగా మారారు. గణపతి పూజలో పాల్గొన్న నాపై కాంగ్రెస్, దాని మిత్రపక్షాల్లో పీకలదాకా కోపముంది. కాంగ్రెస్‌పాలిత కర్ణాటకలో గొడవలు జరుగుతాయంటూ ఏకంగా గణపతి విగ్రహాన్నే కటాకటాల వెనక్కి నెట్టారు. పోలీస్‌వ్యాన్‌లో గణపతి విగ్రహం ఫొటో చూసి యావత్భారతావని బాధపడింది. ఇక ఇలాంటి విద్వేష శక్తుల ఆట కట్టించాల్సిందే. దేశాన్ని కుల, మత ప్రాతిపదికన బ్రిటిషర్లు విభజించాలని చూస్తే లోకమాన్య తిలక్ గణేశ్ ఉత్సవాలతో దేశ సమైక్య స్ఫూర్తిని మరింతగా రగిల్చారు. కుల మతాలకతీతంగా ఐక్యంగా ఎలా ఉండాలో గణేష్ ఉత్సవాలు మనకు చాటిచెప్పాయి’’ అని మోదీ అన్నారు. రూ.2,871 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభం తన నాయకత్వంలో మూడోదఫా పాలన మొదలై 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళవారం మోదీ ఒడిశాలో రూ.2,871 కోట్ల విలువైన రైల్వే, జాతీయరహదారులకు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపనలు చేసి కొన్నింటిని ప్రారంభించారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వ కీలక పథకం ‘ సుభద్ర యోజన’ను ప్రారంభించారు. భువనేశ్వర్‌లోని సబర్ సాహీ మురికివాడలో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన(పట్టణ) 20 మంది లబి్ధదారుల ఇళ్లను మోదీ స్వయంగా ప్రారంభించి వారితో మోదీ ముచ్చటించారు. పుట్టినరోజున తమ ఇంటికొచి్చన మోదీకి ఆ గిరిజనులు అంగవస్త్రం ఇచ్చి ఆహా్వనించి నుదుటిన గంధం»ొట్టు పెట్టారు. ప్రేమతో తనకు వారు ఇచి్చన తీపి వంటకం ఖీర్‌ను మోదీ రుచిచూశారు. -
Ratna Bhandar: తెరిచి ఉన్న చెక్క పెట్టెలు!
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరం రత్న భాండాగారం స్థితిగతుల పట్ల సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రత్న భాండాగారం ఉన్నత స్థాయి తనిఖీ పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ విశ్వనాథ్ రథ్ తాజా ప్రకటన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రత్న భాండాగారం లోపలి గదిలో ఓ ఇనుప పెట్టె ఉంది. దీనికి 2 తాళాలు వేసేందుకు సదుపాయం ఉంది. ఒక తాళం సరిగ్గా ఉండగా, మరొకటి వదులుగా వేలాడుతుందని పేర్కొన్నారు. అలాగే మరో 2 చెక్క పెట్టెలు తాళాలు లేకుండా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. 1978లో రత్న భాండాగారంలోకి ప్రవేశించిన వారు ఇలా తాళాలు వేయకుండా బయటకు వచ్చారని తాను నమ్మలేకపోతున్నానని రథ్ పేర్కొనడం గమనార్హం. -
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
భువనేశ్వర్: విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం గాల్లో ప్రయాణిస్తుండగా వడగళ్ల వాన వల్ల దెబ్బతింది. విమానం విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.భువనేశ్వర్తోపాటు పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వడగండ్ల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ నుంచి ఢిల్లీ విమానం టేకాఫ్ అయిన కేవలం పది నిమిషాల్లో తిరిగి ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానంలో ప్రయాణిస్తున్న ఉన్న 169 మంది ప్రయాణికులు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.వడగళ్ల వాన వల్ల విస్తారా విమానం దెబ్బతిన్నట్లు బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. వడగళ్ల వల్ల విమానం విండ్‌షీల్డ్ పగుళ్లిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు తెలిపారు. విమానంలోని 169 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. -
Brain Dead: బాలుడి అవయవాలు దానం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఒడిశాలో బ్రెయిన్ డెడ్‌తో మరణించిన ఎనిమిదేళ్ల బాలుడి అవయవాలను అతని తల్లిదండ్రులు దానం చేశారు. బాలుడి మృతదేహాన్ని ఒడిశా ప్రభుత్వం సోమవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. భువనేశ్వర్‌కుచెందిన శుభజిత్ సాహు రెండో తరగతి చదువుతున్నారు. ఇటీవల పరీక్షకు హాజరవుతుండగా మూర్ఛతో కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్చగా.. కోమాలోకి వెళ్లిన్నట్లు వైద్యులు వెల్లడించారు. క్రమంగా అతడి మెదడు పనిచేయడం మానేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బాలుని అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రి వైద్యులకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. బాలుడిమూత్ర పిండాలు, ఇతర అవయవాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించి భద్రపరిచి పార్థివ దేహాన్ని వారికి అప్పగించారు. అవయవ దానం చేసిన వారికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయించింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జంట నగరాల పోలీస్ కమిషనర్ సంజీవ్ పండా, ఇతర అధికారుల సమక్షంలో సత్యనగర్ రుద్రభూమిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
రూ.2వేల నోట్లు మార్చడానికి కిరాయి మనుషులు.. ఆర్బీఐ ఆఫీస్ వద్ద హల్చల్!
రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మార్పిడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. ఆ తర్వాత అక్టోబర్ 8 నుంచి ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లు మార్చుకునేందుకు వీలు కల్పించారు. దీంతో ఇంకా తమ వద్ద రూ.2 వేల నోట్లు ఉన్నవారు ఆర్బీఐ కార్యాలయాలకు వచ్చి మార్చుకుంటున్నారు. అయితే కొంత మంది కిరాయి వ్యక్తులు క్యూలైన్లలో హల్చల్ చేస్తున్నారు. ఈ మేరకు మీడియాలో రావడంతో ఒడిశా పోలీస్ శాఖలోని ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు భువనేశ్వర్‌లోని ఆర్బీఐ కార్యాలయానికి చేరుకున్నారు. రూ. 2 వేల నోట్లు మార్చుకునేందుకు ఇక్కడి క్యూ లైన్లలో నిలబడిన వ్యక్తులను.. తమ నోట్లే మార్చుకుంటున్నారా లేదా వేరొకరి కోసం వచ్చారా అని ఆరా తీశారు. ఒక్కొక్కరికి రూ.300! నోట్ల మార్పిడి కోసం ఆర్బీఐ కార్యాలయం వద్ద క్యూలో ఉన్నంటున్న వారిలో కొంతమంది వేరొకరి నోట్లను మార్చడం కోసం క్యూలో నిల్చుంటున్నారని, ఇందు కోసం రూ.300 కిరాయి తీసుకుంటున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. ఆర్బీఐ కౌంటర్లో రూ. 2,000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు కొంతమంది కిరాయి వ్యక్తులు వస్తున్నట్లు మీడియా కథనాలు రావడంతో తాము ఇక్కడికి వచ్చినట్లు ప్రత్యేక బృందానికి చెందిన ఒక అధికారి తెలిపారు. నోట్లను మార్చుకోవడానికి క్యూలో నిలబడిన వ్యక్తుల ఆధార్ కార్డులను పరిశీలించామని, వారి వృత్తి గురించి కూడా అడిగామని చెప్పారు. క్యూలో చాలా మంది కచ్చితంగా 10 రూ. 2,000 నోట్లను పట్టుకుని కనిపించారని మరో అధికారి తెలిపారు. కాగా ఆర్బీఐ కార్యాలయాల కౌంటర్లలో ఒక్కొక్కరు గరిష్టంగా 10 రూ.2 వేల నోట్లు అంటే రూ.20 వేలు మాత్రమే మార్చుకునేందుకు వీలుంది. ఈ నేపథ్యంలో క్యూలో నిల్చున్న వ్యక్తులను ప్రశ్నించడమే కాకుండా అక్కడి సీసీటీవీ ఫుటేజీని కూడా అధికారులు తనిఖీ చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఒడిశా పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు తనను కలవలేదని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ ఎస్పీ మహంతి తెలిపారు. క్యూలో అనుమానిత వ్యక్తులను వారు ఆరా తీసి ఉండవచ్చని, దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థ వివరణ కోరడానికి వస్తే పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు. -
గాల్లోకి కరెన్సీ నోట్లు
భువనేశ్వర్: సిబ్బందితో వాగ్వాదం వలన వినియోగదారులు కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరిన విచిత్ర ఘటన స్థానిక భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కార్యాలయం ఆవరణలో బుధవారం చోటుచేసుకుంది. పలువురు వ్యక్తులు చిరిగిన మరియు తడిసిన ఇతరేతర కారణాలతో పాడైన నగదు నోట్లను మార్చి, కొత్త నోట్లు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకును సందర్శించారు. అయితే చెడిపోయిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర నిరుత్సాహానికి గురైన వినియోగదారులు తమ దగ్గర అక్కరకు రాకుండా ఉన్న నగదు నోట్లను గాలిలోకి రువ్వి వినూత్న రీతిలో నిరసన ప్రదర్శించారు. ఫలితంగా రూ.100, రూ.200, రూ.500ల విలువైన చెడిపోయిన కరెన్సీ నోట్లు ఆర్బీఐ కార్యాలయం ఆవరణ మరియు ఎదురుగా ఉన్న వీధిలో పడి ఉండడంతో అసాధారణ పరిస్థితి నెలకొంది. చెడిపోయిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు వచ్చాం. బ్యాంకు ఉద్యోగులు ఆ నోట్లను స్వీకరించలేదు. అందుకే ఇలా నిరసనగా నోట్లను గాలిలోకి విసిరినట్లు కొంతమంది బాధిత వర్గాలు తెలిపారు. నోట్ల మార్పిడి కౌంటర్ మూసివేత ఈనెల 3వ తేదీ నుంచి చెడిపోయిన నోట్ల మార్పిడి కౌంటర్‌ను మూసివేసినట్లు బ్యాంకు అధికారులు తెలియజేసి వినియోగదారులను నచ్చజెప్పేందుకు విఫలయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఖాతాదారులు వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. బ్యాంకు అధికారులు, ఖాతాదారుల మధ్య మాటల తూటాలు పేలడంతో పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించి ఆందోళనకారులను శాంతింపజేశారు. తడిసిన, చిరిగిన, మరియు పాడైన నోట్లను మార్చుకోవాలని మరియు నాణేలు, నోట్లను ప్రజల నుంచి లావాదేవీలు లేదా మార్పిడి కోసం స్వీకరించాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు సూచించినట్లు భారత రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. దీనికోసం ప్రజలు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యవహారంలో ఖాతాదారులు, వినియోగదారులకు అసౌకర్యం లేకుండా బ్యాంకు వర్గాలు స్పందించాల్సి ఉంది. -
హాస్టల్ భోజనంలో చచ్చిన కప్ప.. షాకైన విద్యార్థి
రెస్టారెంట్, హోట్సల్, హాస్టల్స్, ఇలా ప్రతిచోట సర్వ్ చేస్తున్న భోజనంలో కీటకాలు, పురుగు దర్వనమిస్తుండటం కలవరం రేపుతోంది. భోజనంలో బల్లులు, ఎలుకలు, బొద్దింకలు, కప్పలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒడిశాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ(కేఐఐటీ) హాస్టల్ భోజనంలో ఓ విద్యార్థికి చచ్చిన కప్ప ప్రత్యక్షమైంది. కేఐఐటీ భువనేశ్వర్ విద్యార్థి ఆర్యన్ష్ హాస్టల్లో భోజనం చేస్తుండగా పేరుగన్నంలో కప్ప కనిపించింది. దీంతో ఖంగుతున్న విద్యార్థి వెంటనే ఆ ఆహారాన్ని పడవేశాడు. తనకు ఎదురైన అనుభవాన్ని విద్యార్థి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ విద్యాసంస్థల్లో పరిస్థిని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: డిసెంబర్లోనే అయోధ్య ఎయిర్పోర్ట్ సేవలు! This is KIT Bhubaneswar, ranked ~42 among engineering colleges in India, where parents pay approx 17.5 lakhs to get their child an engineering degree. This is the food being served at the college hostel. Then we wonder why students from India migrate to other countries for… pic.twitter.com/QmPaz4mD82 — Aaraynsh (@aaraynsh) September 23, 2023 ‘ఇది దేశంలోనే ఇంజనీరింగ్ కళాశాలలో 47వ ర్యాంక్ కలిగిన కేఐటీ భువనేశ్వర్ కాలేజ్. ఇక్కడ ఓ విద్యార్థి తమ డిగ్రీని పూర్తి చేసేందుకు తల్లిదండ్రులు దాదాపు 17.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అంత డబ్బులు తీసుకుని కాలేజీ హాస్టల్లో ఇలాంటి ఆహారాన్ని అందిస్తున్నారు. మెరుగైన విద్య, సౌకర్యాల కోసం ఇండియా నుంచి విదేశాలకు ఎందుకు విద్యార్థులు వలస వెళ్తున్నారో మాకు ఇప్పుడు అర్థమవతుంది’ అని ఆహారంలో కప్ప కనపడిన ఫోటోను షేర్ చేశాడు. ఆర్యాన్ష్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కేఐఐటీ కళాశాల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోస్టు చేసిన కొన్ని గంటలకే స్పందించిన కళాశాల యాజమాన్యం మెస్ కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. హాస్టల్లో అందిస్తున్న ఆహారం పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని, భోజనంపై విద్యార్థులు అసంతృప్తి చెందారని ఇనిస్టిట్యూట్ పేర్కొంది. కిచెన్, స్టోర్, వంట సరుకులు పరిశుశ్రంగా ఉంచుకోవాలని, ఆహారం తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తూ.. పనిష్మెంట్గా ఓ రోజు పేమెంట్‌ను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. So, this is the value of human life. The hostel where the frog was served, at Bhubaneswar University, in an attempt to do damage control, decided to deduct only one day's payment from the mess provider company! Just wow. pic.twitter.com/2BSDhUwI8I — Aaraynsh (@aaraynsh) September 24, 2023 అయితే కేవలం ఒక్క రోజు పేమెంట్‌ను మాత్రమే కట్ చేస్తూ తమ వర్సిటీ స్పందించిన తీరుపై ఆర్యాన్ష్ మండిపడ్డాడు. వర్సిటీ పరువును కాపాడుకోవడానికే ఈ చర్య తీసుకుందని, మనిషి జీవితానికి ఉండే విలులు ఇదేనని అసహనం వ్యక్తం చేశాడు. -
క్షేత్రస్థాయిలో బీజేపీ బలాబలాలపై ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన 119 బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆరా తీయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు నాయకత్వం అప్పగించిన బాధ్యతల్లో నిమగ్నమవుతారు. వారంతా తమకు కేటాయించిన నియోజకవర్గాలకు శనివారంరాత్రి బయలుదేరివెళ్లారు. ‘ఎమ్మెల్యే ప్రవాస్ యోజన’లో భాగంగా తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రానికి, వివిధవర్గాలకు చేకూరినప్రయోజనాలు, కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీస్తారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ప్రజల నుంచి సమాచారం సేకరించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని స్థాయిల పార్టీ నేతలు, కార్యకర్తలను కలుసుకుని అభిప్రాయాలు తెలుసుకుంటారు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం, వివరాల ఆధారంగా జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పించనున్నారు. శనివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, అస్సాం, పుదుచ్చేరిలకు చెందిన 119 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్‌షాపు నిర్వహించి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర పార్టీ నాయకులు అవగాహన కల్పించారు. కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చాచార్జీ ప్రకాష్ జవదేకర్ 119 ఎమ్మెల్యేలకు 18 పాయింట్ల ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కల్పించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి తమకు అందిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ఈ నెల 28–31 తేదీల మధ్య నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తామని ఎమ్మెల్యే వర్క్‌షాపు తెలంగాణ ఇన్చార్జీ, భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి తెలిపారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోరాడి అధికారంలోకి వస్తుందని, బీఆర్ఎస్తో పొత్తు లేదా అవగాహనకు ఆస్కారం లేదని ఆమె స్పష్టం చేశారు. వర్క్‌షాపులో పార్టీ నేతలు డీకే అరుణ, మురళీధర్‌రావు, అర్వింద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. -
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వందకుపైగా ట్రైన్లు రద్దు
తాటిచెట్లపాలెం/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని ఖుర్దా రోడ్ డివిజన్లో భువనేశ్వర్–మంచేశ్వర్, హరిదాస్పూర్–ధన్మండల్ సెక్షన్ పరిధిలలో మూడో లైన్ నిర్మాణంలో భాగంగా జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల కోసం ఈ మార్గంలో ప్రయాణించే, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే వందకు పైగా రైళ్లను ఈ నెల 14 నుంచి 30వ తేదీల మధ్య వివిధ రోజుల్లో రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం త్రిపాఠి శనివారం తెలిపారు. కొన్ని రైళ్ల గమ్యాన్ని కుదించడంతోపాటు మరికొన్ని రైళ్లు దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈ నెల 14 నుంచి 20 వరకు కాకినాడ–విశాఖపట్నం–కాకినాడ (17267/17268) ఎక్స్‌ప్రెస్, రాజమండ్రి–విశాఖపట్నం–రాజమండ్రి(07466/07467) స్పెషల్ పాసింజర్, విశాఖపట్నం–విజయవాడ–విశాఖపట్నం (22701/22702) ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం–గుంటూరు–విశాఖపట్నం(17240/17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రెండు వైపులా రద్దు చేసినట్లు వివరించారు. విజయవాడ డివిజన్లో... విజయవాడ డివిజన్లో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగా, కొన్ని పాక్షికంగా రద్దు చేయడంతోపాటు మరికొన్ని దారిమళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ–బిట్రగుంట (07978) రైలు ఈ నెల 13 నుంచి 19 వరకు, బిట్రగుంట–విజయవాడ (07977) రైలు ఈ నెల 14 నుంచి 20 వరకు, బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238) ఈ నెల 16 నుంచి 18 వరకు, విజయవాడ–గూడూరు (07500)రైలు ఈ నెల 16 నుంచి 20 వరకు, గూడూరు–విజయవాడ (07458) రైలు ఈ నెల 17 నుంచి 20 వరకు రద్దు చేశారు. కాగా, నర్సాపూర్–గుంటూరు (17282/17281) రైలును ఈ నెల 14 నుంచి 20 వరకు విజయవాడ–గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. యర్నాకుళం–పాట్నా (22643) రైలును ఈ నెల 14, 15 తేదీల్లో, బెంగళూరు–గౌహతి (12509) రైలును ఈ నెల 16, 17, 18 తేదీల్లో, కోయంబత్తూర్–సిల్చర్ (12515) రైలును ఈ నెల 13, 20 తేదీల్లో, భావనగర్ టెరి్మనల్–కాకినాడ పోర్ట్ (12756) రైలును ఈ నెల 12, 19 తేదీల్లో విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు. -
దీర్ఘకాలం సీఎంగా కొనసాగిన జాబితాలో నవీన్ పట్నాయక్ రికార్డు..
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశంలో దీర్ఘకాల ముఖ్యమంత్రిగా కొనసాగిన ప్రముఖుల జాబితాలో చేరనున్నారు. జాతీయ స్థాయిలో రెండో దీర్ఘకాలిక సీఎంగా సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. నవీన్ ప్రత్యక్ష రాజకీయ జీవితంలో ఇదో సుస్థిర మైలురాయిగా నిలుస్తుందని బిజూ జనతాదళ్ శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత జ్యోతి బసు తరువాత దీర్ఘకాలం ఈ పదవిలో కొనసాగిన రికార్డు ఆక్రయించనున్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ఒడిశా పరివర్తన ప్రధాన కార్యాచరణ ఆయనకు ఈ రికార్డు సాధకులుగా చరిత్రలో నిలుపుతుంది. జ్యోతి బసు సమగ్రంగా 23 సంవత్సరాల 138 రోజులు నిరవధికంగా పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ 24 ఏళ్ల 166 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ స్థానం సాధించడం విశేషం. ఆయన వరుసగా 5సార్లు సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఈనెల 22తో ముఖ్యమంత్రి పాలన సమగ్రంగా 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకుంటుంది. గతంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు ఇదే కాల పరిమితిలో గతంలో దీర్ఘకాలిక ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొలిపారు. తాజా రికార్డుతో నవీన్ ఆయన సరసన చోటు దిక్కించుకుకోవడం విశేషం. జాతీయ స్థాయిలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా ఎదిగేందుకు స్వల్ప దూరంలో ఉన్నారు. 2000, 2004, 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ రాష్ట్ర శాసనసభకు వరుసగా ఎన్నికయ్యారు. ఆయన అకుంఠిత కార్యదక్షత ముఖ్యమంత్రి హోదాని సొంతం చేసింది. ఎత్తుకు ప్రత్యర్థులు చిత్తు.. మహిళ, రైతు సాధికారిత ఇతరేతర రంగాల్లో సంస్కరణలు రాష్ట్రానికి సరికొత్త రూపురేఖలు అద్దాయి. సేవాభావం, సామాజిక శ్రేయస్సు పట్ల అంకితభావం ప్రజా ప్రాతినిధ్యానికి ప్రామాణికంగా రుజువు చేసిన దాఖలాలు కోకొల్లలు. గంజాం జిల్లా అసికా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మహిళా స్వయం సహాయక సంఘం సాధికార మహిళ ప్రమీల బిసొయిని ఎంపీగా గెలిపించుకున్న తీరు.. బిజూ జనతాదళ్ అధ్యక్షుడుగా నవీన్ పట్నాయక్ సాధించిన అపురూప విజయం. ప్రత్యర్థుల్లో ధీటైన సభ్యులను సమయోచితంగా ఆకట్టుకుని, పార్టీని బలోపేతం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలను ఖంగు తినిపించడంలో ఆయన ధీరత్వానికి ప్రతీక. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల కంచుకోటలుగా నిలిచిన పలు నియోజక వర్గాలను బీజేడీ ఖాతాలో చేర్చుకున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఒడిశా సమగ్రంగా కై వసం చేసుకునే వ్యూహంతో పావులు కదుపుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో.. గంజాం జిల్లా హింజిలికాట్ నవీనపట్నాయక్కు కలిసి వచ్చిన నియోజకవర్గంగా మిగిలింది. దీనితో పాటు పాలనలో విపత్కర పరిస్థితులను అవలీలగా అధిగమించి, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల విశేష గుర్తింపుతో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచారు. రాష్ట్రంలో ఆకలి చావులకు తెరదించిన దిశలో ఆయన కృషి అనన్యమని చెప్పవచ్చు. ప్రజలకు పారదర్శక పాలన ఇంటి ముంగిటకు చేర్చడంలో సాధించిన విజయం అత్యద్భుతం. ప్రభుత్వ సేవలు ప్రజలకు నిర్థారిత కాల పరిమితిలో కల్పించడమే ధ్యేయంగా చేపట్టిన 5టీ కార్యాచరణ రాష్ట్ర పరివర్తనలో సరికొత్త మలుపు తిప్పింది. అవినీతి రహిత పాలన కార్యాచరణ సులభతరం చేసిన సాటిలేని ముఖ్యమంత్రిగా పేరొందారు. సమాచారం, రవాణా, బాహ్య ప్రపంచంతో రాష్ట్రాన్ని అనుసంధానం చేయడం.. జాతీయ, అంతర్జాతీయ వర్తక వ్యాపారాలు, పారిశ్రామిక విస్తరణతో రాష్ట్ర పురోగతిలో వేగం పుంజుకుంది. విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలు సకాలంలో అక్కరకు వచ్చే రీతిలో ప్రవేశ పెట్టిన పథకాలు, కార్యక్రమాలు జాతీయ స్థాయిలో మార్గదర్శకంగా నిలిచాయి. -
ఝరపడా జైలుకు నిందితుల తరలింపు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో అరెస్టయిన ముగ్గురు నిందితుల రిమాండ్ గడువు శుక్రవారంతో ముగిసింది. ఈ ముగ్గురినీ ఝరపడా జైలుకు తరలించారు. ఈనెల 7న స్థానిక ప్రత్యేక సీబీఐ కోర్టు నిందితులకు 5 రోజుల రిమాండ్ విధించింది. కేసు విచారణ మరింత లోతుగా నిర్వహించాల్సి ఉందనే అభ్యర్థనతో దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) న్యాయస్థానాన్ని కోరడంతో ఈనెల 11న కోర్టు రిమాండ్‌ను మరో 4 రోజులు పొడిగించేందుకు అనుమతించింది. ఈ వ్యవధి పూర్తి కావడంతో ముగ్గురు నిందితులు(సీనియర్ సెక్షన్ ఇంజనీర్(సిగ్నల్) అరుణ్‌కుమార్ మహంత, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్‌ఖాన్, టెక్నీషియన్ పప్పుకుమార్)ను స్థానిక జైలుకు తరలించారు. కేసు తదుపరి విచారణను ఈనెల 27కి కోర్టు వాయిదా వేసినట్లు ప్రకటించింది. జైలుకు తరలించిన వారిని ఈనెల 7న సీబీఐ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. వీరికి వ్యతిరేకంగా ఐిపీసీ సెక్షన్లు 304(మరణానికి కారకులు), 201(సాక్ష్యాధారాల గల్లంతు) ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. నార్త్ సిగ్నల్ గూమ్టీ(స్టేషన్) వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్ మార్పులో లోపం కారణంగా ప్రమాదం జరిగింది. ఇది మానవ తప్పిదమని ఆగ్నేయ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్) విచారణ నివేదికలో వెల్లడించింది. నలుగురు ఉద్యోగులపై.. బహనాగా బజార్ రైలు దుర్ఘటన ఘటనలో మరో నలుగురు ఉద్యోగులను సీబీఐ దర్యాప్తు బృందం ప్రశ్నిస్తోంది. స్థానిక ఝరపడా జైలు ప్రాంగణంలో ఈ విచారణ కొనసాగుతోంది. వీరిలో ఇద్దరు సిగ్నల్ ఆపరేటర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, స్టేషన్ మాస్టర్ ఉన్నారు. వీరందరినీ రైల్వేశాఖ విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
ఒడిశా రైలు ప్రమాద ఘటన.. నిందితుల రిమాండ్ పొడిగింపు
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ స్టేషన్ వద్ద ట్రిపుల్ ట్రైన్స్ యాక్సిడెంట్ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌ను భువనేశ్వర్ ప్రత్యేక సీబీఐ కోర్టు పొడిగించేందుకు అనుమతించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అభ్యర్థన మేరకు కోర్టు అంగీకారం తెలిపింది. లోగడ జూలై 7న నిందితులకు 5 రోజుల రిమాండ్‌ను కోర్టు మంజూరు చేసింది. రిమాండ్‌ను మరో నాలుగు రోజులు పొడిగించాలని కోర్టుకు దరఖాస్తు చేయడంతో అనుమతించినట్లు మంగళవారం కోర్టు ప్రకటించింది. ఈ సందర్భంగా నిందితులు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్ మరియు టెక్నీషియన్ పప్పు కుమార్‌ని కోర్టులో హాజరుపరిచారు. లోతుగా విచారణ ఈ దుర్ఘటన వెనక అసలు నిజాలు బట్టబయలు చేసే దిశలో సీబీఐ విచారణ లోతుగా కొనసాగుతోంది. తొలి దశలో ముగ్గురుని అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్న దర్యాప్తు బృందం తాజాగా మరో ఇద్దరు రైల్వే సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. వీరిలో బహనాగా బజార్ రైల్వేస్టేషను మాస్టర్ ఒకరు. సీబీఐ వీరిని సోమవారం నుంచి విచారించింది. స్టేషను మాస్టరుతో సహా మరో సిబ్బందిని ప్రశ్నించింది. కాగా తాజాగా మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. వీరిని బుధవారం నుంచి ప్రశ్నించడం ఆరంభిస్తుంది. ఈ లెక్కన దర్యాప్తు బృందం 8 మందిపై దృష్టి సారించింది. లోగడ ముగ్గురు నిందితులను జూలై 7న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరికి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్లు 304 (హత్య కాకున్న మరణానికి హేతువు) మరియు 201 (సాక్ష్యాధారాల గల్లంతు) కింద కేసులు నమోదు చేశారు. వీరిలో అరుణ్ కుమార్ మహంత మరియు అమీర్ ఖాన్ బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. సీఆర్ఎస్ విచారణలో... రైల్వే భద్రతా కమిషనర్ (ఆగ్నేయ సర్కిల్) సీఆర్ఎస్ విచారణ నివేదికలో నార్త్ సిగ్నల్ గూమ్టీ (స్టేషన్) వద్ద సిగ్నలింగ్ సర్క్యూట్ మార్పులో లోపం కారణంగా ప్రమాదం జరిగిందని పేర్కొంది. జూన్ 2వ తేదీ సాయంత్రం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బహనాగా బజార్ స్టేషన్లో స్థిరంగా ఉన్న సరుకు రవాణా రైలును ఢీకొట్టింది. అనంతరం దాని పట్టాలు తప్పిన కొన్ని కోచ్‌లను పక్క ట్రాక్‌పై వస్తున్న యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 293 మంది మరణించారు. ఇప్పటికీ పలువురి ఆచూకీ తెలియక మృతదేహాలు కంటైనర్లలో మగ్గుతున్నాయి. స్థానిక ఎయిమ్స్ ప్రాంగణంలో కంటైనర్లలో 41 శవాలు ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నాయి. వీటిలో 10 శవాల డీఎన్ఏ పరీక్షల నివేదిక అందడంతో బంధు వర్గాలకు అప్పగించేందుకు సన్నాహాలు చేపట్టారు. నిబంధనల మేరకు మృతదేహాలను అప్పగిస్తారు. స్వస్థలాలకు తరలించలేని పరిస్థితుల్లో స్థానికంగా అంత్యక్రియలు ఉచితంగా నిర్వహించేందుకు స్థానిక నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేసింది. -
మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం
భువనేశ్వర్: మాజీ మంత్రి నవ కిషోర్ దాస్ హత్యలో కీలక పరిణామం శుక్రవారం చోటుచేసుకుంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఒడిశా క్రైమ్ బ్రాంచ్ 540 పేజీలకు పైగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ విషాద ఘటనలో ప్రధాన నిందితుడు గోపాల్ కృష్ణ దాస్ (53) వ్యతిరేకంగా ఆయుధాల చట్టం ప్రకారం 307, 302, 27 (1) సెక్షన్లు కింద అభియోగాలు నమోదు చేశారు. పాత వైరం కారణంగా నిందితుడు దారుణ హత్యకు పాల్పడినట్లు విచారణలో ధ్రువీకరించినట్లు చార్జ్‌షీటులో వెల్లడించారు. జనవరి 29న హత్య ఈ ఏడాది జనవరి 29న మంత్రి అధికారిక కార్యక్రమం పర్యటనలో నడి రోడ్డమీద జన సందోహం మధ్య నిందితుడు తుపాకీ గురిపెట్టి పేల్చడంతో మంత్రి అక్కడిక్కడే కుప్పకూలిపోయిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, శాసీ్త్రయ బృందం పరిశీలన నివేదికల ఆధారంగా నిందిత ఏఎస్ఐ గోపాల కృష్ణ దాస్‌ని విధుల నుంచి బహిష్కరించారు. మంత్రితో బ్రజ్‌రాజ్‌నగర్ ఠాణా ఇన్చార్జి ఇన్స్పెక్టర్ (ఐఐసీ) పి.కె.స్వంయి మరో సిబ్బంది జీవన్ కుమార్ నాయక్‌ని హత్య చేసేందుకు నిందితుడు విఫలయత్నం చేసినట్లు ఝార్సుగుడ ఎస్డీజేఎం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ మీడియాకు తెలియజేసింది. ముందస్తు ప్రణాళికతోనే... నిందితుడు ఏఎస్ఐ గోపాల్‌కృష్ణ దాస్ తెలివిగా ముందస్తు ప్రణాళికతో ఈ నేరానికి పాల్పడ్డాడని క్రైం బ్రాంచ్ తెలిపింది. అతని మానసిక పరిస్థితి స్థిరంగా, సాధారణమైనదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎటువంటి మానసిక అనారోగ్య లక్షణాలు దర్యాప్తులో బయటపడనట్లు వివరించింది. సంచలనాత్మక హత్య సంఘటనకు సంబంధించిన అన్ని రకాల సాక్ష్యాలను పరిశీలించి విశ్లేషించింది. ఈ నేపథ్యంలో మౌఖిక, దస్తావేజులు, మెడికో–లీగల్, సైబర్ ఫోరెన్సిక్ మరియు బాలిస్టిక్ నివేదికలను క్రైం శాఖ లోతుగా సమీక్షించింది. ఈ సమీక్షలో నిందితుడు గోపాల్ కృష్ణ దాస్ దివంగత మంత్రి నవ కిషోర్ దాస్ మరియు అతని అనుచరులతో తనకు ప్రాణాపాయం ఉన్నట్లు భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంత్రి అనుచర వర్గాలు తరచు ఆయనకు ప్రాణాపాయ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో మంత్రిపై వ్యక్తిగత ద్వేషం బలపడి మానసిక వేదనతో మంత్రిని నిలువునా హత్య చేసి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టమైంది. అభద్రతా భావంతోనే మంత్రి హత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. దీనికోసం పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకుని బెడిసి కొట్టని వ్యూహంతో తుపాకీ గురి పెట్టి ఘటనా స్థలంలో మంత్రిని కుప్పకూల్చినట్లు క్రైం శాఖ తెలిపింది. ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ, కొన్ని నివేదికలు, వివరణలను పొందడం కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. మానసిక రోగి: కుటుంబ సభ్యులు నిందితుడి కుటుంబ సభ్యులు గోపాల్ కృష్ణదాస్ చాలాకాలంగా మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కొంతకాలంగా బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని అంటున్నారు. అయితే అనుబంధ చికిత్స కొనసాగుతుందని దర్యాప్తు వర్గాలు విచారణలో పేర్కొన్నాయి. మానసిక ఇబ్బందుల విషయం ధ్రువీకరించేందుకు వైద్య విద్య మరియు శిక్షణ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు అనుబంధ పరీక్షలను నిర్వహించి, నిందితుడిలో మానసిక అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు లేవని స్పష్టం చేసింది. స్థానికులు, సహోద్యోగుల వాంగ్మూలం వైద్య బోర్డు అభిప్రాయానికి చేరువగా ఉన్నట్లు క్రైమ్ శాఖ తెలిపింది. నిందితుడు సాదాసీదాగా కలిసిమెలిసి తిరుగాడే వ్యక్తిగా తోటి వ్యక్తుల వాంగ్మూలం దర్యాప్తు బృందం నమోదు చేసింది. ఇలా పరిసరాల పరిశీలన, అనుబంధ విశ్లేషణలో నిందితుని మానసిక పరిస్థితి చాలా సాధారణంగా ఉందని, ఎటువంటి అసాధారణత లేదని నిర్ధారించారు. విచారణకు నిందితుడు సంతృప్తికరంగా సహకరించారని, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. అధికారిక రివాల్వరే హత్యాస్త్రం విధి నిర్వహణలో ఉండగా పోలీసు ఏఎస్ఐ గోపాల్ కృష్ణ దాస్ హత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తన దగ్గర ఉన్న అధికారిక రివాల్వర్‌తో సిటింగు ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నవ కిషోర్ దాస్‌ను జన సందోహం మధ్య కాల్చి నడిరోడ్డు మీద కుప్పకూల్చేశాడు. ఈ హత్య వెనుక కుట్ర ఉందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు నిలువెత్తున ఆరోపించాయి. విచారణ చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసిన క్రైమ్ బ్రాంచ్ విచారణలో కుట్ర కోణం జాడ లేనట్లు వెల్లడించింది. 10 బృందాలతో దర్యాప్తు సిటింగ్ మంత్రి హత్య జరిగిన రోజు నుంచే క్రైమ్ బ్రాంచ్, బ్రజరాజ్‌నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోతైన దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్ 10 బృందాలను ఏర్పాటు చేసింది. హత్య వ్యూహం పూర్వాపరాలను ఆరా తీసేందుకు రాష్ట్రంలో ఝార్సుగుడ, భువనేశ్వర్, బరంపురం మరియు పలు ఇతర రాష్ట్రేతర ప్రాంతాలు సందర్శించి దర్యాప్తు బృందాలు పూర్వాపరాలు ఆరా తీశాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు వర్గాలు 89 మంది సాక్షులను ప్రశ్నించారు. తుపాకీలు, లైవ్ కాట్రిడ్జ్‌లు, ఖాళీ కాట్రిడ్జ్‌లు ఇతరేతర పలు రుజువుపూరిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ జరిగింది ఝార్సుగూడ జిల్లాలో మంత్రి కార్యక్రమం పురస్కరించుకుని నిందిత ఏఎస్ఐ గోపాల్ కృష్ణదాస్‌ని ట్రాఫిక్ క్లియరెన్స్ డ్యూటీ కోసం నియమించారు. ఈ అవకాశాన్ని వ్యూహాత్మకంగా మలచుకుని తన దగ్గర ఉన్న 9 ఎంఎం సర్వీస్ పిస్టల్ని ఉపయోగించి అతి సమీపం నుంచి మంత్రిపై కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో కూరుకుపోయిన మంత్రిని హెలికాప్టర్లో హుటాహుటిన భువనేశ్వర్‌కు తరలించారు. అయితే అంతర్గత రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ మంత్రి తుదిశ్వాస విడిచాడు. నిందితుడు 2013లో ఝార్సుగుడ జిల్లాలో పోలీసు ఉద్యోగం పొందాడు. తన ఉద్యోగ జీవితంలో నిందిత గోపాల కృష్ణ దాస్ శ్రేష్టమైన పనితీరుకు తొమ్మిది రివార్డులు, 18 ప్రశంసా పత్రాలు పొందడం విశేషం. అతని కుటుంబం బరంపురం శివారులోని జలేశ్వరఖండిలో ఉంటుంది. విచారణలో భాగంగా నిందితుడికి మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రేతర (బెంగుళూరు) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్‌కు తీసుకెళ్లాలన్న అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించింది. -
స్పీకర్‌గా తప్పించి.. మంత్రిగా..
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం తన కొలువులో కొద్దిపాటి మార్పులు చేపట్టారు. ముగ్గురు కొత్త మంత్రులకు కేబినెట్లో స్థానం కల్పించారు. ఖాళీ పదవుల్లో వారికి సర్దుబాటు చేయడం విశేషం. స్థానిక లోక్‌సేవా భవన్లో సోమవారం ఉదయం జరిగిన మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో కొత్తగా చేరిన సభ్యులు బిక్రమ్‌కేశరి అరుఖా, శారదాప్రసాద్ నాయక్, సుదామ్ మరండిలతో గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరయ్యారు. విక్రమ్ అరూఖ్ 2008 నుంచి ప్రభుత్వ చీఫ్ విప్, స్పీకర్, గ్రామీణాభివృద్ధి, న్యాయ, అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పు, శాసనసభ వ్యవహారాలు, సమాచారం–ప్రజా సంబంధాలు, సహకారం ప్రభుత్వరంగ సంస్థలు తదితర శాఖల్లో మంత్రిగా కీలకమైన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. నవీన్ కొలువులో మరో మాజీమంత్రి సుధామ్ మరాండీకి పాఠశాలలు, సామూహిక విద్యాశాఖను కేటాయించారు. గతవారం విద్యాశాఖ మాజీమంత్రి సమీర్‌రంజన్ దాస్ పదవికి రాజీనామా చేయడంతో ఈ మంత్రిత్వ శాఖ ఖాళీ అయ్యింది. నిరంజన పూజారికి ఆరోగ్యశాఖ.. మరాండి గతంలో క్రీడలు–యువజన వ్యవహారా లు, షెడ్యూల్డ్ తెగలు–కులాల అభివృద్ధి(గిరిజన సంక్షేమం), రెవెన్యూ, విపత్తు నిర్వహణ సహాయమంత్రిగా పని చేశారు. ఈదఫా మరాండీని కేబినెట్ హోదాకు ప్రమోషన్ కల్పించారు. అదే విధంగా శ్రీకాంత సాహు గతవారం రాజీనామా చేయడంతో ఖాళీ అయిన కార్మిక శాఖను శారదాప్రసాద్ నాయక్‌కు కేటాయించారు. నాయక్ 2009 నుంచి 2012 వరకు రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమం, గృహనిర్మాణం, నగర అభివృద్ధి, అబ్కారీ శా ఖ సహాయ మంత్రిగా పని చేశారు. నవీన్ కేబినెట్లో సీనియర్ మంత్రి, మాజీ స్పీకర్ విక్రమ్ కేశరీ అరూఖ్ కు ఆర్థికశాఖ కేటాయించారు. ఈ ఏడాది జనవరి 29న ఝార్సుగుడలో నవకిషోర్ దాస్ హత్యతో ఖాళీ అయిన ఆరోగ్యశాఖను ప్రస్తుత ఆర్థికమంత్రి నిరంజన్ పూజారికి ఇన్చార్జిగా స్థిరపరిచారు. స్పీకర్‌గా తప్పించి.. మంత్రిగా.. గంజాం ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆది నుంచి బీజేడీకి కంచుకోటగా ఈ ప్రాంతం చలామణి అవుతోంది. ఈ పరపతి ఏమాత్రం సడలి పోకుండా శంఖం దళం అధ్యక్షుడిగా సీఎం నవీన్ సకాలంలో స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ జిల్లా నుంచి విక్రమకేశరి అరూఖ్ బలమైన నాయకుడిగా అధ్యక్షుడి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి కట్టబెట్టడంతో సొంత జిల్లా, నియోజకవర్గ పురోగతి అనుబంధ కార్యకలాపాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు సమయం అనుకూలించని పరిస్థితులు తలెత్తాయి. దీని దృష్ట్యా ఆయనకు స్పీకర్ పదవి బరువు బాధ్యతలను తొలగించి, మంత్రి పదవితో జిల్లాలో పట్టు సాధించేందుకు సువిశాల అవకాశం కల్పించడం పునర్వ్యవస్థీకరణ వ్యూహంగా స్పష్టం అవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో గంజాం జిల్లాలోని 13 స్థానాల్లో 12 స్థానాలను కై వసం చేసుకుంది. ఈ పట్టును రానున్న ఎన్నికల్లో ఏమాత్రం చేజార్చుకోకుండా జాగ్రత్త వహించడంలో విక్రమ అరూఖ్ తగిన అభ్యర్థిగా భావించి కొలువులో చోటు కల్పించారు. ఆయన రాజకీయ శైలితో జిల్లాలో బీజేడీ కంచుకోట పట్టు యథాతధంగా కొనసాగుతుందని భావిస్తున్నారు. బలోపేతమే లక్ష్యంగా.. సుందరగడ్, మయూర్భంజ్ జిల్లాల్లో బిజూ జనతాదళ్ గత ఎన్నికల్లో నిరాశజనకమైన ఫలితాలతో సరిబెట్టుకుంది. మయూర్భంజ్ లోని 9 స్థానాల్లో బీజేడీ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. సుందరగడ్ 7 స్థానాల్లో నామమాత్రంగా 2 స్థానాలకే పరిమితమైంది. ఈ రెండూ గిరిజన ప్రభావిత జిల్లాలు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేడీ నిరవధిక కృషికి ఫలితంగా 2022లో జరిగిన జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు సాధించింది. ఈ ప్రేరణతో రానున్న ఎన్నికల్లో బలం పుంజుకునేందుకు ఇద్దరు అనుభవజ్ఞులకు మంత్రి పదవులతో పట్టం గట్టింది. ఈ జిల్లాల నుంచి మంత్రి పదవులు పొందిన సుధాం మరాండి, శారదాప్రసాద్ నాయక్‌కు రానున్న ఎన్నికలు కత్తిమీద సాములాంటి సవాల్‌గా మారాయి. ఈ సందర్భంలో పార్టీ బలం పటిష్ట పరచడం ఇరువురి లక్ష్యంగా కార్యాచరణ కొనసాగించాల్సి ఉంటుంది. నవీన్ చతురత.. భువనేశ్వర్: మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రానున్న ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ను బలోపేతం చేయడం సంకల్పంగా స్పష్టం అవుతోంది. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలం పుంజుకునేలా చేయడంతో గట్టి ప్రభావం ఉన్న ప్రాంతంలో పట్టు సడలిపోకుండా అత్యంత జాగరూకత ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ పురస్కరించుకుని గంజాం, సుందర్‌గడ్, మయూర్భంజ్ జిల్లాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరించారు. ఈ ప్రాంతాల నుంచి మాజీ మంత్రులకు పదవులు కట్టబెట్టారు. గంజాం నుంచి విక్రమకేశరి అరూఖ్, మయూర్భంజ్ నుంచి సుధాం మరాండి, సుందరగడ్ నుంచి శారదాప్రసాద్ నాయక్‌కు మంత్రి పదవులు వరించాయి. గంజాం జిల్లాలో బీజేడీ కోటను మరింత బలోపేతం చేసేందుకు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సరైన రీతిలో రాణించని సుందర్‌గడ్, మయూర్భంజ్ జిల్లాలలో బీజేడీ బలాన్ని పెంచడానికి అనుభవజ్ఞులను ఎంపిక చేసి, మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ పదవులతో సొంత జిల్లాల్లో పురోగతి దిశలో కృషి చేసేందుకు మార్గం సుగమం అవుతుందనే దృక్పథంతో కేబినెట్ విస్తరణ పురస్కరించుకుని నవీన్ పట్నాయక్ ఆచితూచి మార్పుచేర్పులు చేపట్టడం విశేషం. -
సభాపతి ఎవరు.. అనుభవం కలిగిన నేత కోసం వెతుకులాట
భువనేశ్వర్: రాష్ట్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవుల పట్ల ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుతం శాసనసభ తదుపరి స్పీకర్ ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. ఈ పదవి కోసం పలువురు సీనియర్లు రేసులో ఉన్నట్లు సమాచారం. వీరిలో ప్రఫుల్ల సామల్, దేవీప్రసాద్ మిశ్రా, అమర్‌ప్రసాద్ శత్పతి, బద్రి నారాయణ్ పాత్రొ స్పీకర్ ముందున్నారు. మహిళా అభ్యర్థి స్నేహాంగిని చురియా పేరు కూడా ప్రచారంలో ఉంది. బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ప్రతి చోటా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆమెకు అదృష్టం కలిసి రావచ్చని సర్వత్రా చర్చ సాగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో అస్కా లోక్‌సభ ఎన్నికలో మహిళా కార్డు బీజేడీకి దిగ్విజయం కల్పించింది. ఈ నియోజకవర్గం మహిళా స్వయం సహాయక బృందం అధినేత ప్రమీలా బిసోయ్తో చేసిన ప్రయోగం పార్టీకి విశేష గుర్తింపు సాధించింది. అయితే ధామ్‌నగర్ ఉప ఎన్నికలో ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. మహిళా సాధికారత మంత్రం నిరంతరం ఫలప్రదం కావడం కష్టతరమని ఈ ఎన్నిక రుజువు చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహంతో ఆచితూచి అడుగు వేయకుంటే రానున్న ఎన్నికల్లో పార్టీ బలం పుంజుకోవడం బలహీన పడుతుందని బీజేడీ శిబిరంలో జోరుగా చర్చ సాగుతోంది. నవీన్ నిర్ణయంపైనే.. మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో స్పీకర్ విక్రమ్‌కేశరి ఆరూఖ్తో రాజినామా చేయించారు. ఈ స్థానం భర్తీ తదుపరి ఎన్నికలకు లాభసాటిగా ఉండేలా అభ్యర్థి ఎంపిక పట్ల బీజేడీ అధిష్టానం పదునైన ప్రక్రియతో కసరత్తు చేస్తోంది. స్పీకర్ ఆశావహుల్లో ప్రఫుల్ల సామల్, దేబీప్రసాద్ మిశ్రా, అమర్‌ప్రసాద్ శత్పతి తగిన అనుభవం అలాగే శాసన విధానాలపై పూర్తి అవగాహన కలిగిన ప్రతినిధులుగా పేరొందారు. వీరిలో ఒకరికి ప్రతిష్టాత్మక సభాపతి పదవిని కట్టబెట్టే యోచన శిబిరంలో గింగుర్లు కొడుతోంది. అయితే మహిళా మంత్రంతో ఈ నిర్ణయం ఊగిసలాడుతోంది. అయితే ప్రయోగాలు చేయడానికి సమయం కాదని, అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సమర్థత కలిగిన అభ్యర్థిని మాత్రమే స్పీకర్‌గా నియమించాలని సీఎం నవీన్ పట్నాయక్ భావిస్తున్నట్లు సమాచారం. -
వీధినపడిన బొలంగీర్ రాజ కుటుంబీకుల అంతర్గత విబేధాలు
భువనేశ్వర్: బొలంగీర్ జిల్లా రాజ వంశీకుల కుటుంబ కలహాలు వీధికెక్కాయి. ఈ కుటుంబంలో యువరాజు అర్కేష్ నారాయణ సింఘ్‌దేవ్ దంపతుల వివాదం రాజభవనం దాటి పోలీసు ఠాణాకు చేరింది. అర్కేష్ వ్యతిరేకంగా ఆయన భార్య అద్రిజా గృహహింస ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను అర్కేష్ సింఘ్‌దేవ్ ఖండించారు. దాదాపు 6నెలల క్రితం ఈ ఫిర్యాదు నమోదైంది. ఈ నేపథ్యంలో తాను ఇల్లు వదిలి వెళ్లిపోయానని ఆయన తెలిపారు. ‘ఆమె నాపై గృహహింస కేసు పెట్టడంతో నేను ఇల్లు వదిలి వెళ్లిపోయాను. ప్రస్తుతం, ఆమె సోదరి అక్కడ నివసిస్తున్నారు. ఆమె తండ్రి కూడా ప్రతినెలా 15 రోజులు రాజ భవానాన్ని సందర్శించేవారు. అవసరమైన వస్తువులు తీసుకునేందుకు నెలకోసారి మాత్రమే ఇంటికి వెళ్తున్నాను. పోలీసుల సలహా మేరకు ఆమె, నా భద్రతను నిర్థారించడానికి ఇంట్లో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేయించా. అయితే వాటిని అద్రిజా ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులకు పంపించా’నని అర్కేష్ వివరించారు. మూడు రోజుల క్రితం అద్రిజా తండ్రి తమ వద్దకు వచ్చి చేసిన డిమాండ్ పట్ల ప్రతికూలించినట్లు అర్కేష్ నారాయణ సింఘ్‌దేవ్ తెలిపారు. వివాదం కోర్టు విచారణ పరిధిలో ఉన్నందున న్యాయస్థానం నిర్ణయం మేరకు కొనసాగడం జరుగుతుందని పదేపదే ప్రాధేయపడినా.. ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, సహరాపూర్‌లోని కొందరు ల్యాండ్ మాఫియాతో తన మామకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తన ఇంటిపైకి దౌర్జన్యంగా 10మంది వ్యక్తులను పంపించారని, ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించగా.. అవసరమైతే 100 మందితో వస్తానని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అద్రిజా ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ తన భర్త 2022 ఆగస్టులో విడాకులు కోరినట్లు తెలిపారన్నారు. డీజీపీని కలిసి.. ఇదిలా ఉండగా.. అర్కేష్ సింఘ్‌దేవ్ భార్య అద్రిజా భర్తతో పాటు మామ అనంగ ఉదయసింఘ్ దేవ్, బావ కళికేష్ నారాయణ్ సింఘ్‌దేవ్, అత్త విజయ లక్ష్మీదేవి, మేఘనా రాణా లపై 2022 సెప్టెంబర్ 30న రాజ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్తింటి వారు తనను ఇంటి నుంచి బయటకు నెట్టేయాలని, ఒడిశాను సందర్శించకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మెట్టినింటి వారి సిబ్బంది కూడా దుర్భాషలాడుతూ గోప్యతకు భంగం కలిగించడంతో పాటు తన గదివైపు కెమెరా ఏర్పాటు చేసి ప్రతి కదలికపై నిఘా ఏర్పాటు చేశారని ఆరోపించారు. అయితే తన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె ఇటీవల ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) సునీల్ బన్సాల్‌ను కలిశారు. ఈ కేసును ప్రస్తుతం డెహ్రాడూన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఏస్పీ)కి అప్పగించారు. వీపీ సింగ్ మనుమరాలు.. అర్కేష్ సింఘ్‌దేవ్ గతంలో కాంట్రాక్ట్ కిల్లర్‌తో తనను చంపడానికి ప్రయత్నించారని అద్రిజా డెహ్రాడూన్ లోని స్థానిక మీడియాకు వివరించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని పోలీసుల వద్దకు వెళ్లి, రక్షణ కోరారు. మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్(వీపీ సింగ్) మనవరాలైన అద్రిజా ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో ఉత్తరాఖండ్‌లో ఉంటున్నారు. అర్కేష్, అద్రిజాల 2017 నవంబర్‌లో జరిగింది. -
రాష్ట్రపతి హెలీకాప్టర్‌తో సెల్ఫీ
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము 3 రోజుల రాష్ట్ర పర్యటన గందరగోళంగా మారింది. ఆమె చివరి రోజు పర్యటనలో పలు సమస్యాత్మక పరిస్థితులు తలెత్తాయి. దీంతో రాష్ట్రపతి పర్యటనలో భద్రత లోపించిందనే ఆరోపణలు బలపడుతున్నాయి. మయూర్భంజ్ జిల్లా బరిపద మహారాజా శ్రీరామచంద్ర భంజ్‌దేవ్ విశ్వ విద్యాలయంలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగిస్తుండగా.. 9నిమిషాల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ వివాదం చల్లారక ముందే మరో వివాదం తెరకెక్కింది. సోషల్ మీడియా ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము శుక్రవారం మయూర్భంజ్ జిల్లా సిమిలిపాల్ టైగర్ రిజర్వ్(ఎస్టీఆర్)ను సందర్శించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ విధుల్లో ఉన్న ఫార్మసిస్ట్ జస్వంత్ బెహరా అత్యంత భద్రత, కీలకమైన భారతదేశ ప్రథమ మహిళ ప్రయాణించనున్న హెలీకాప్టర్(ఛాపర్)తో సెల్ఫీలు దిగారు. జషిపూర్ సమీపం చెలిగోధులి హెలీప్యాడ్‌లో దిగిన తర్వాత రాష్ట్రపతి రోడ్డు మార్గంలో సిమిలిపాల్ జాతీయ పార్కును సందర్శించారు. ఆమె సందర్శన దృష్ట్యా ఈనెల 4, 5 తేదీల్లో సాధారణ సందర్శకుల పర్యటన నివారించారు. ఈ సందర్భంగా ప్రత్యేక విధులకు నియమితులైన సిబ్బంది రాష్ట్రపతి హెలీకాప్టర్‌తో సెల్ఫీ తీసుకోవడం సమస్యగా తయారైంది. ఈ వ్యవహారం రాష్ట్రపతి భద్రతపై ప్రశ్నలు తలెత్తడంతో జస్వంత్ బెహరా పోస్ట్‌ను తొలగించినట్లు సమాచారం. సిబ్బందిపై వేటు.. మరోవైపు యూనివర్సిటీలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన సమయంలో ముర్మును ఎందుకు సురక్షిత ప్రదేశానికి తరలించలేదని భద్రతా నిపుణులు ఇంతకుముందు ప్రశ్నించగా.. ఇది రాష్ట్రపతి కార్యక్రమాన్ని విధ్వంసం చేసే ప్రయత్నమని బీజేపీ కార్యాలయం ఆరోపించింది. రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఈ చిక్కు సమస్య చోటు చేసుకుంది. విద్యుత్ సరఫరా అంతరాయంతో దీపాలు ఆరిన వేదిక వద్ద ఉన్న మైక్ సిస్టమ్ ప్రభావితం కాకపోవడంతో ఆమె ప్రసంగం నిరవధికంగా కొనసాగించారు. ఉదయం 11.56 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు ఈ పరిస్థితి కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యూనివర్సిటీ అధికారులు ఎలక్ట్రీషియన్ జయంత్ త్రిపాఠిని విధుల నుంచి తొలగించారు. పర్యటన ఏర్పాట్ల లోపాలపై విచారణకు రిజిస్ట్రార్, పీజీ కౌన్సిల్ చైర్మన్, డెవలప్మెంట్ అధికారితో కూడిన ముగ్గురు సభ్యుల బృందం నియమించారు. ఈ బృందం విచారణ ఆధారంగా బాధ్యులను ఖరారు చేసి తగిన చర్యలు చేపడతారు. -
రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి విద్యుత్ అంతరాయం
భువనేశ్వర్: మయూర్భంజ్ జిల్లా బరిపద మహారాజా శ్రీరామచంద్ర భంజాదేవ్ (ఎంఎస్సీబీ) విశ్వవిద్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యక్రమంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భద్రతా వ్యవస్థ అంధకారంలోకి వెళ్లి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్సిటీ ప్రాంగణంలో రాష్ట్రపతి తన ప్రసంగాన్ని చీకటిలో కొనసాగించాల్సి వచ్చింది. ఉదయం 11.56 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు ఆకస్మాత్తుగా తొమ్మిది నిమిషాలు పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భద్రత గార్డులు, సహాయక సిబ్బంది ఒకరికొకరు కానరాని పరిస్థితులు తాండవించాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే పోడియంపై మసకబారిన మిణుగురు కాంతితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం నిరవధికంగా కొనసాగించారు. అనంతరం ఈ పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వ విద్యాలయం అందం చీకటిమయం అని సుతిమెత్తగా వ్యాఖ్యానించారు. ఘటనపై విచారణ ఘటనపై యూనివర్సిటీ వీసీ సంతోష్ త్రిపాఠి విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి ముందే జనరేటర్‌ను మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు. సకాలంలో ఎందుకు పని చేయలేదో అర్ధం కావడం లేదన్నారు. ఈ విషయంపై విచారణ చేపడతామని తెలియజేశారు. ఇడ్కో ఈ భవనాన్ని నిర్మించింది. జనరేటర్‌కు మరమ్మతులు కూడా చేసింది. ప్రత్యేక జనరేటర్ ఉన్నప్పటికీ అది పనిచేయలేదన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రాథమిక చర్యగా ఈ సంస్థ ఎలక్ట్రికల్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. టాటా పవర్‌కు చెందిన హరీష్ కుమార్ పండా మాట్లాడుతూ.. కార్యక్రమానికి ముందు విద్యుత్ కనెక్షన్లను తనిఖీ చేశామన్నారు. అన్నీ సక్రమంగా పనిచేస్తుండేవని పేర్కొన్నారు. అలాగే బ్యాకప్‌గా అక్కడ ఒక జనరేటర్ సెట్ అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. టాటా పవర్ నార్తర్న్ ఒడిషా డిస్ట్రిక్ట్ లిమిటెడ్ (టీపీఎన్‌ఓడీఎల్) సీఈవో భాస్కర్ సర్కార్ మాట్లాడుతూ డీజీ సెట్లు నడుస్తున్నాయని, ఏసీలు, మైక్రోఫోన్ పని చేస్తున్నాయని, అయితే భవనం అంతర్గత వైరింగ్ లోపం కారణంగా లైట్లు ఆరిపోయాయని నివేదించారు. విచారణకు ఆదేశం ఇదిలా ఉండగా రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా జరిగిన విద్యుత్ వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. యూనివర్సిటీ కూడా సమాంతర విచారణ ప్రారంభించింది. పీజీ కౌన్సిల్ చైర్మన్ పి.కె.శతపతి, రిజిస్ట్రార్ సహదేవ్ సమాధియా, డవలప్మెంట్ ఆఫీసర్ బసంత్ మొహంతాతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం లోపాన్ని విచారణ చేపట్టనుంది. విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని సెంట్రల్ రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్డీసీ) సురేష్ దలాసి తెలిపారు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం వెనుక కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరుపుతామని బరిపద అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) రుద్ర నారాయణ్ మహంతి తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలిపిన అనంతరం రెవెన్యూ డివిజనల్ కమిషనర్ (ఆర్డీసీ) అత్యవసర సమావేశం నిర్వహించారు. -
చకచకా తుంబ పనులు
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని యాత్రకు రథాల తయారీ పనులు ఊపందుకున్నాయి. అక్షయ తృతీయ నుంచి ఈ పనులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మూడో రోజు మంగళవారం నాటికి ఇరుసు ప్రాథమిక స్థాయి తుంబ పనులు తొలిదశ పూర్తయ్యింది. శ్రీమందిరం సింహద్వారం ఆవరణ బొడొదండొ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద ఈ పనులు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి వడ్రంగి సేవకులు పనుల్లో నిమగ్నం అవుతున్నారు. మంగళవారం సమగ్రంగా 40 మంది వడ్రంగి సేవకులు పాల్గొన్నారు. వీరిలో 17మంది మహరణ వర్గం, 12మంది భొయి వర్గం, 4 మంది కొరొతి (రంపపు కోత) వర్గం, ఆరు కమ్మరి కార్మికులు ఉన్నారు. సాయంత్రం చీకటి పడేంత వరకు శ్రమించి 3 రథాల కోసం మొత్తం మీద 9 తుంబల తయారు చేశారు. రథ చక్రం ఇరుసు యొక్క వృత్తాకార మధ్య భాగం తుంబగా వ్యవహరిస్తారు. 3 రథాల ప్రత్యేక విశ్వకర్మ ప్రముఖ వడ్రంగి సేవకుల పర్యవేక్షణలో వడ్రంగి పనులు చురుకుగా సాగుతున్నాయి. యాత్ర కోసం తయారు అవుతున్న తాళ ధ్వజం, దేవ దళనం, నంది ఘోష్ 3 రథాల కోసం సమగ్రంగా 42 తుంబలను తయారు చేస్తారు. వీటిలో బలభద్ర స్వామి రథం తాళ ధ్వజానికి 14, దేవీ సుభద్ర రథం దేవ దళానికి 12 మరియు శ్రీ జగన్నాథుని నంది ఘోష్ రథానికి అత్యధికంగా 16 తుంబల్ని అమర్చుతారు. బలభద్రుడు, శ్రీ జగన్నాథుని రథాల తుంబల కొలమానం 2 అడుగుల 8 అంగుళాలు కాగా దేవీ సుభద్ర రథం తుంబ పరిమాణం 3 అడుగులు ఉంటుంది. -
కేఐఐటీ డీయూలో వై20 కన్సల్టేషన్స్
భువనేశ్వర్: జీ20 సదస్సులో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ(కేఐఐటీ డీయూ)లో ‘వై20 కన్సల్టేషన్స్’ శుక్రవారం ప్రారంభమైంది. ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని 21వ శతాబ్దంలో మన దేశాన్ని అగ్రగామిగా తీర్చదిద్దడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పడంలో యువత పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. వై20 కన్సల్టేషన్స్‌కు కేఐఐటీ వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుత సమంత అధ్యక్షత వహించారు. -
Hockey World Cup 2023: 48 ఏళ్ల కల నెరవేరేనా!
ఎప్పుడో 1975లో... భారత హాకీ జట్టు అజిత్‌పాల్ సింగ్ నాయకత్వంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా నాటి మేటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్‌లు జరిగినా మన టీమ్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించే అంశం. వరుసగా రెండో సారి మనమే ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత జట్టు రాత మారుతుందా... కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి కాంస్యం సాధించిన మన టీమ్ అదే జోరును చూపిస్తుందా అనేది ఆసక్తికరం. భువనేశ్వర్: భారత గడ్డపై మరో విశ్వ సంబరానికి సమయం ఆసన్నమైంది. 15వ హాకీ వరల్డ్ కప్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఒడిషాలోని రెండు వేదికలు భువనేశ్వర్, రూర్కెలాలలో 17 రోజుల పాటు మొత్తం 44 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. తొలి రోజే బరిలోకి దిగనున్న భారత్... స్పెయిన్‌ను ఎదుర్కోనుంది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉండగా... కొత్తగా ఈ టోర్నీ కోసం మరో పెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించారు. 24 మ్యాచ్‌లు భువనేశ్వర్‌లో, 20 మ్యాచ్‌లు రూర్కెలాలో జరుగుతాయి. మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతుండగా వాటిని నాలుగు పూల్‌లుగా విభజించారు. ముందుగా తమ గ్రూప్‌లో ఇతర మూడు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘క్రాస్ ఓవర్స్’, క్వార్టర్స్, సెమీస్ ఉంటాయి. జనవరి 29న ఫైనల్ నిర్వహిస్తారు. నేటి మ్యాచ్‌లు అర్జెంటీనా X దక్షిణాఫ్రికా (మ.గం. 1.00 నుంచి) ఆస్ట్రేలియా X ఫ్రాన్స్ (మం.గం. 3.00 నుంచి) ఇంగ్లండ్ X వేల్స్ (సా.గం. 5.00 నుంచి) భారత్ X స్పెయిన్ (సా.గం. 7.00 నుంచి) పూల్ల వివరాలు ‘ఎ’ – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ‘బి’ – బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా ‘సి’ – చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ ‘డి’ – భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్ * ప్రపంచకప్‌ను అత్యధికంగా పాకిస్తాన్ (4 సార్లు) గెలవగా...నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చెరో 3 టైటిల్స్ సాధించాయి. జర్మనీ రెండు సార్లు విజేతగా నిలవగా...భారత్, బెల్జియం ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి. -
నాలుగు నగరాల్లో రిటైల్ డిజిటల్ రూపీ
న్యూఢిల్లీ: రిటైల్ డిజిటల్ రూపాయిని ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ గురువారం నాలుగు నగరాల్లో తొలి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ ఈ నగరాల్లో ఉన్నాయి. పరిమిత సంఖ్యలో యూజర్లతో ఆర్బీఐ ఈ ప్రాజెక్టును పరీక్షిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఇందులో పాలుపంచుకుంటున్నాయి. రెండో విడతలో దీన్ని హైదరాబాద్ సహా తొమ్మిది నగరాలకు విస్తరించనుండగా, మరో నాలుగు బ్యాంకులు కూడా పాల్గోనున్నాయి. ఆర్బీఐ ఇప్పటికే టోకు లావాదేవీల కోసం నవంబర్ 1న డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. భౌతిక రూపంలో నగదు నిర్వహణ వ్యయాలను తగ్గించేందుకు, అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ఇది ఉపయోగపడగలదని విశ్లేషకులు తెలిపారు. బ్యాంకులు అందించే మొబైల్ యాప్ వాలెట్ ద్వారా కస్టమర్లు ఈ–రూపీతో లావాదేవీలు నిర్వహించవచ్చని వివరించారు. కస్టమర్ల అభ్యర్ధన మేరకు వారి వాలెట్లలోకి బ్యాంకులు ఈ–రూపీని క్రెడిట్ చేస్తాయని, వ్యక్తులు .. వ్యాపార సంస్థలకు డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపేందుకు దీన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలకు భిన్నంగా బ్యాంకుల అవసరాలను బట్టి ఆర్బీఐ అధికారికంగా ఈ కరెన్సీని జారీ చేస్తుంది.