
భువనేశ్వర్ : అరుదైన రకానికి చెందిన పామును ఓ యువకుడి వద్ద నుంచి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిని అడవిలో విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భువనేశ్వర్‌కు చెందిన ఓ యువకుడు అరుదుగా కనిపించే ఫ్లైయింగ్ స్నేక్‌ను పట్టుకున్నాడు. దానిని ప్రజల ముందు ప్రదర్శిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మంగళవారం అతడి నుంచి పామును స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సదరు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ చట్టం ప్రకారం వన్యప్రాణులను కలిగి ఉండటం, వాటితో వ్యాపారం చేయడం నేరమని, ఇందుకుగానూ జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా సాధారణంగా ఫ్లైయింగ్ స్నేక్ ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా జీవిస్తాయి. ఇవి విషపూరితమైనవి అయినప్పటికీ దాని వల్ల మనిషి ప్రాణానికి ఎటువంటి ప్రమాదము ఉండదు. బల్లులు, కప్పలు, చిన్న చిన్న పక్షులను తిని బతుకుతాయి.
Comments
Please login to add a commentAdd a comment