Rare snake
-
కుక్క మొహం పోలికతో ఉండే విష సర్పం.. ఈ స్నేక్ ఎంత డేంజరో తెలుసా?
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): అరుదైన విషసర్పం కడలి ఒడికి చేరింది. విశాఖ నగరంలోని కాన్వెంట్ జంక్షన్ సమీపాన పారిశ్రామిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి డాగ్ ఫేస్ సీ స్నేక్‌ను స్నేక్ క్యాచర్ రొక్కం కిరణ్ పట్టుకున్నారు. కుక్క మొహం పోలికతో ఉండే ఈ పాము అతి ప్రమాదకరమైందని, దీని విషానికి విరుగుడు అందించే ఔషధం కూడా దొరకదని కిరణ్ తెలిపారు. తన 20 ఏళ్ల సర్వీస్‌లో దాదాపు 25 వేల పాముల్ని పట్టుకున్నానని, ఇటువంటి పామును మాత్రం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఈ సర్పాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చదవండి: భార్య ఉండగానే మరో మహిళతో లవ్ ఎఫైర్.. చివరికి బిగ్ ట్విస్ట్ -
ఏడు తలల పాముపొర చుట్టూ వివాదం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కనకపుర తాలూకా మరిగౌడనదొడ్డి గ్రామంలోని ఒక పొలంలో లభించిన ఏడు తలల పాముపొర వివాదాస్పదంగా మారింది. పాముపొర గురించి రోజుకో విధమైన భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొరను పరిశీలించిన సరీసృపాల నిపుణులు ఇదంతా మానవ నిర్మితమని, ఎవరో కావాలని ఇలా గిమ్మిక్ చేస్తున్నారని తేల్చి చెబుతున్నారు. గ్రామంలోని మరిగౌడ అనే వ్యక్తికి చెందిన పొలంలో సుమారు నెల రోజుల క్రితం ఈ ఏడు తలల పాముపొర లభించింది. పురాణాల్లో కూడా అక్కడక్కడా ఏడు తలల పాముల గురించి ప్రస్తావన ఉండడంతో జనం త్వరగా ఆకర్షితులై పూజలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే అక్కడ నాగప్రతిష్ఠ కూడా చేసారు. త్వరలో దేవాలయం నిర్మించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారం బీబీఎంపీకి చెందిన వన్యప్రాణుల సంరక్షకులు మోహన్, జయరాజ్, ప్రసన్న మీడియాతో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి పాముపొరను పరీక్షించారు. అనంతరం మాట్లాడిన వారు ఇది ఏడు తలలపాము పొరకాదన్నారు. ఎవరో కావాలని కొన్ని పాముల పొరలను సేకరించి ఇలా ఏడు తలల పాముగా చిత్రీకరించారన్నారు. నిజానికి ఏడు తలలపాము అవాస్తవమని, ఒకవేళ అవి పుట్టినా బతకవన్నారు. అయితే పాముపొర లభించిన భూమి యజమానిగా చెప్పుకుంటున్న మరికెంపేగౌడ మాత్రం ఈ భూమి తనదేనని, ఏడు తలల పాము తిరగడం తన కళ్లతో చూసానని వాదిస్తున్నాడు. ఏదిఏమైనా ఏడుతలల పాముపొర వివాదం ఎక్కడకు వెళ్లి ముగుస్తుందో చూడాలి. -
అరుదైన ‘ఫ్లైయింగ్ స్నేక్’ స్వాధీనం.. యువకుడిపై కేసు
భువనేశ్వర్ : అరుదైన రకానికి చెందిన పామును ఓ యువకుడి వద్ద నుంచి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిని అడవిలో విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భువనేశ్వర్‌కు చెందిన ఓ యువకుడు అరుదుగా కనిపించే ఫ్లైయింగ్ స్నేక్‌ను పట్టుకున్నాడు. దానిని ప్రజల ముందు ప్రదర్శిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు మంగళవారం అతడి నుంచి పామును స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సదరు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ చట్టం ప్రకారం వన్యప్రాణులను కలిగి ఉండటం, వాటితో వ్యాపారం చేయడం నేరమని, ఇందుకుగానూ జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా సాధారణంగా ఫ్లైయింగ్ స్నేక్ ఆగ్నేయ ఆసియాలో ఎక్కువగా జీవిస్తాయి. ఇవి విషపూరితమైనవి అయినప్పటికీ దాని వల్ల మనిషి ప్రాణానికి ఎటువంటి ప్రమాదము ఉండదు. బల్లులు, కప్పలు, చిన్న చిన్న పక్షులను తిని బతుకుతాయి. -
రూ. 9 కోట్ల విలువైన పాము స్మగ్లింగ్
కోల్‌కతా : అరుదైన రకానికి చెందిన పామును స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో కనిపించే తక్షక్ జాతికి చెందిన ఆ పాము విలువ సుమారు 9 కోట్ల రూపాయలని వెల్లడించారు. వివరాలు...కోల్‌కతాకు చెందిన ఇషా షేక్ అనే వ్యక్తికి అరుదైన జంతుజాలాల స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో తక్షక్ పామును వారికి అమ్మేందుకు 9 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్ ప్రకారం జార్ఖండ్‌కు పామును తరలించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు బ్యాగును పరిశీలించిగా పాము కనిపించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని కలియాచాక్ అడవుల్లో కనిపించే ఈ పాములు అత్యంత విషపూరితమైనవి. చూడటానికి బల్లిలా ఉండే తక్షక్ పాముల నుంచి సేకరించిన విషాన్ని పలు రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో ఇవి భారీ ధర పలుకుతాయి. -
కర్నూలు జిల్లాలో అరుదైన పాము గుర్తింపు
శ్రీశైలం ప్రాజెక్ట్: కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం సున్నిపెంట పరిధిలో రామాలయం సమీపంలో అరుదైన పామును బయోల్యాబ్ సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న బయోల్యాబ్ రేంజ్ అధికారి ఎ.ప్రేమ అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నారు. ఈ పామును మొదటిసారిగా.. నాగార్జునసాగర్, శ్రీశైలం అభయారణ్యంలో గుర్తించామని, దీని శాస్త్రీయ నామం లైకోడాన్స్లావికోల్లీస్ అని తెలిపారు. దీనిని ఎల్లోకలర్డ్ ఊల్ఫ్ స్నేక్‌గా పేర్కొంటారని, వీటిల్లో 5 రకాల జాతులుంటాయని, ఇవి విషపూరితం కాదని చెప్పారు. -
అరుదైన పాము లభ్యం
జయపురం: జయపురం ప్రాంతానికి పాముల స్వర్గమని పేరు. ప్రజ లకు ఇక్కడ అనేక రకాల పాములు కనిపిస్తాయి. పాముల జాతిలో అరుదైన పహడి సుందరి(పర్వత సుందరి)గా స్థానికులకు పరిచయమైన పహడి సుందరి జయపురంలో శుక్రవారం లభ్యమైంది. వన్యప్రా ణి సురక్షా సమితి జయపురం ప్రతినిధి కృష్ణ కైలాశ్ షడంగి జయపురం డివిజన్ పరిధిలో గల జయపురం ఫారెస్ట్ రేంజ్ పాత్రోపుట్ ఫారెస్ట్ సెక్షన్ జబకనడి గ్రామంలో దీనిని పట్టుకున్నారు. ఇది అపురూపమైన పాము అని ఆయన తెలిపారు. అరుదైన ఈ పామును సమీప అడవి లో భద్రంగా విడిచిపెట్టామని ఆయన తెలిపారు. ఎటువంటి పామునైనా, వన్యప్రాణినైనా చంపవద్దని వాటిని పరిరక్షించుకోవడం మన బాధ్యత అని అందువల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందుచేత వన్యప్రాణులను రక్షించేందుకు ప్రతిఒక్కరూ ప్రయత్నించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
సర్పం... స్పెషల్
సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లాలో ఓ అరుదైన పామును గుర్తించారు. వీపనగండ్ల మండలంలోని సంగినేనిపల్లి తండాలో ఓ ఇంట్లో పాము కనిపించింది. చూసేందుకు విచిత్రంగా ఉండడంతో ఆ గ్రామానికి చెందిన మహేష్, చంద్రశేఖర్‌లు పామును పట్టుకొని వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు, సర్ప రక్షకుడు డాక్టర్ బి.సదాశివయ్యకు ఇచ్చారు. పామును క్షుణ్ణంగా పరిశీలించారు. ఇది అరుదుగా కనిపించేదిగా భావించి, జర్మనీకి చెందిన శాస్త్రవేత్త గెర్నాట్తో ఫోన్లో మాట్లాడి, ఆ పాము లైకోధాన్ ఫ్యావికొల్లిస్గా గుర్తించారు. దీని మెడపైన బంగారు వర్ణంలో పసుపు పట్టీ ఉంది. మిగతాభాగం ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. సుమారు 40 సెంటీమీటర్ల వరకు మాత్రమే పెరుగుతుంది. విషరహితమైన ఈ పాము పగటి వేళలో మాత్రమే తిరుగుతుంది. ఎలాంటి గోడలైన సులువుగా ఎక్కుతుందని సదాశివయ్య తెలిపారు. ఈ సర్పాన్ని మొదటగా పశ్చిమ కనుమల్లోని ఆనైకోట్టి కొండల్లో గుర్తించారని, తరువాత 2014లో శేషాచల కొండల్లో, కర్ణాటకలోని టుంకూర్, హోస్పేట్ ప్రాంతాలలో కనబడిందని పేర్కొన్నారు. ఇది అరుదుగా కనిపించడం వల్ల శాస్త్రవేత్తలు పెద్దగా దీనిపై దృష్టి సారించడం లేదని తెలిపారు. ఈ పామును సోమవారం నల్లమల అటవీ ప్రాంతంలో వదిలివేశామని ఆయన పేర్కొన్నారు.