
ఒడిశాలో బ్రెయిన్ డెడ్‌తో మరణించిన ఎనిమిదేళ్ల బాలుడి అవయవాలను అతని తల్లిదండ్రులు దానం చేశారు. బాలుడి మృతదేహాన్ని ఒడిశా ప్రభుత్వం సోమవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. భువనేశ్వర్‌కుచెందిన శుభజిత్ సాహు రెండో తరగతి చదువుతున్నారు. ఇటీవల పరీక్షకు హాజరవుతుండగా మూర్ఛతో కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్చగా.. కోమాలోకి వెళ్లిన్నట్లు వైద్యులు వెల్లడించారు.
క్రమంగా అతడి మెదడు పనిచేయడం మానేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బాలుని అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రి వైద్యులకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. బాలుడిమూత్ర పిండాలు, ఇతర అవయవాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించి భద్రపరిచి పార్థివ దేహాన్ని వారికి అప్పగించారు.
అవయవ దానం చేసిన వారికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయించింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జంట నగరాల పోలీస్ కమిషనర్ సంజీవ్ పండా, ఇతర అధికారుల సమక్షంలో సత్యనగర్ రుద్రభూమిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.