Organ Donor
-
Brain Dead: బాలుడి అవయవాలు దానం.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఒడిశాలో బ్రెయిన్ డెడ్‌తో మరణించిన ఎనిమిదేళ్ల బాలుడి అవయవాలను అతని తల్లిదండ్రులు దానం చేశారు. బాలుడి మృతదేహాన్ని ఒడిశా ప్రభుత్వం సోమవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. భువనేశ్వర్‌కుచెందిన శుభజిత్ సాహు రెండో తరగతి చదువుతున్నారు. ఇటీవల పరీక్షకు హాజరవుతుండగా మూర్ఛతో కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్చగా.. కోమాలోకి వెళ్లిన్నట్లు వైద్యులు వెల్లడించారు. క్రమంగా అతడి మెదడు పనిచేయడం మానేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బాలుని అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రి వైద్యులకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. బాలుడిమూత్ర పిండాలు, ఇతర అవయవాలను శస్త్రచికిత్స ద్వారా తొలగించి భద్రపరిచి పార్థివ దేహాన్ని వారికి అప్పగించారు. అవయవ దానం చేసిన వారికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయించింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జంట నగరాల పోలీస్ కమిషనర్ సంజీవ్ పండా, ఇతర అధికారుల సమక్షంలో సత్యనగర్ రుద్రభూమిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
అవయవదాతలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదాతల అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుందని ప్రకటించారు. అవయవదానంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందని స్టాలిన్ తెలిపారు. తాజా ప్రకటన అవయవదానానికి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థ త్యాగాల వల్లే తమిళనాడు ఈ స్థానంలో ఉందని స్టాలిన్ కొనియాడారు. అవయవదాతలకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కుండపోత వర్షం.. నీటమునిగిన నాగ్‌పూర్.. రంగంలోకి కేంద్ర బలగాలు -
అవయవదానం చేసి నలుగురికి ప్రాణం పోయండి
సాక్షి, హైదరాబాద్: తమ ప్రాణం కోల్పోతూ పలువురికి ప్రాణం పోసే అవయవదాతలు కలకాలం స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిపోతారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జీవన్‌దాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు శనివారం రవీంద్రభారతిలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ వ్యక్తులు బ్రెయిన్ డెడ్ అయిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా త్వరగా నలుగురికి ప్రాణం పోసే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందినా మూత్రపిండాలు, కాలేయం, గుండె వంటి అవయవాలను కృత్రిమంగా తయారు చేయలేని పరిస్థితిలో దాతలు ముందుకు రావాలని కోరారు. ఇటీవల సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమణి, స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం తమ పార్థివ దేహాలను మెడికల్ కాలేజీలకు దానం చేసి స్ఫూర్తిగా నిలిచారన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సను ప్రభుత్వ దవాఖానాల్లో చేస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లో 400 అవయవమార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయన్నారు. ఇందుకు ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు అందజేస్తున్నామని కిడ్నీ మార్పిడి చేసుకున్న వారికి ప్రతి నెలా ఉచితంగా రూ.20 వేల విలువైన మందులు అందిస్తున్నామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటిదాకా 3,800 మంది అవయవదానంతో పునర్జన్మ పొందడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, జీవన్‌దాన్ ఇన్చార్జ్ డాక్టర్ స్వర్ణలత, డీఎంఈ రమేశ్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
బలహీన వర్గాలకు ఆరోగ్య ‘సిరి’
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం తెలంగాణలో దిగ్విజయంగా అమలవుతోంది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలేనని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వెల్లడించింది. ఈ మేరకు తాజా నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ వివరాల ప్రకారం ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల్లో 91 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఉన్నట్లు నివేదించింది. మొత్తం లబ్ధిదారుల్లో బీసీలు 54.28 శాతం ఉండటం గమనార్హం. ఎస్సీలు 14.66 శాతం, ఎస్టీలు 7.05 శాతం, మైనారిటీలు 14.71 శాతం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్నారు. మొత్తం 3.09 లక్షల మందికి వివిధ రకాల శస్త్రచికిత్సలు, ఇతర చికిత్సలు జరగ్గా, అందులో బీసీలు 1.67 లక్షల మంది ఉన్నారు. – సాక్షి, హైదరాబాద్ 77.19 లక్షల కార్డులు.. తెలంగాణలో 77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. వారికి ఉచితంగా వైద్యం అందించేలా 330 నెట్వర్క్ ఆసుపత్రులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆరోగ్యశ్రీ ద్వారా రోజూ సగటున 800 మంది చికిత్సల కోసం ఆరోగ్యశ్రీని ఆశ్రయిస్తున్నారు. 2017–18లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం, శస్త్రచికిత్సల కోసం ప్రభుత్వం రూ.775 కోట్లు కేటాయించింది. సాధారణ శస్త్రచికిత్సలే కాకుండా అవయవదానాలను కూడా ఆరోగ్యశ్రీ చేర్చింది. ఆరోగ్యశ్రీ కింద రూ.2 లక్షల వరకు శస్త్రచికిత్సకు అనుమతి ఉండగా, అవయవదానాలకు అధికంగా ఖర్చు చేస్తోంది. 16 రకాల అవయవదానాలకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేసినందుకు ప్రభుత్వం రూ.1.45 కోట్లు ఖర్చు చేసింది. కిడ్నీ వ్యాధుల తెలంగాణ.. ఆరోగ్యశ్రీ కింద 2017–18 లెక్కల ప్రకారం 3.09 లక్షల మందికి శస్త్ర చికిత్సలు, వైద్యం చేయగా అందులో 58,768 మంది (18.88%) మంది కిడ్నీ వ్యాధికి చికిత్స పొందిన వారేనని తేలింది. ఆ తర్వాత 52,426 మంది (16.95%) కేన్సర్ సంబంధిత చికిత్స పొందారు. మూడోస్థానంలో వివిధ రకాల పాలీ ట్రామా కేసులకు 39,723 మంది (12.84%) మంది చికిత్స పొందారు. అయితే పాలీ ట్రామా కేసులకు చేసిన శస్త్రచికిత్సలకే అత్యధిక డబ్బు చెల్లించింది. ప్రభుత్వం మొత్తం రూ.775 కోట్లు ఖర్చు చేస్తే, అందులో అత్యధికంగా రూ. 122.62 కోట్లు (15.87%) పాలీ ట్రామా వైద్యానికి ఖర్చు చేసింది. ఆ తర్వాత గుండె సంబంధిత శస్త్రచికిత్సల కోసం రూ.122.32 కోట్లు (14.54%) ఖర్చు చేసింది. మొత్తం ఖర్చు చేసిన నిధుల్లో శస్త్రచికిత్సల కోసం రూ.489.33 కోట్లు (63%), ఇతరత్రా వైద్యం కోసం రూ.286.13 కోట్లు (37%) ఖర్చు చేసింది. వరంగల్ నుంచే ఎక్కువ.. ఆరోగ్యశ్రీ కింద 2017–18లో చేసిన మొత్తం శస్త్రచికిత్సలు, వైద్యంలో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ఉండటం గమనార్హం. ఆ జిల్లాలో 43,438 మందికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందింది. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లాలో 43,095 మందికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 38,095 మందికి వైద్యం అందించారు. అతి తక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16,782 మందికి వైద్యం చేశారు. అందుకు ప్రభుత్వం చేసిన ఖర్చులో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నెట్వర్క్ ఆసుపత్రులకు అత్యధికంగా రూ.109.87 కోట్లు, తర్వాత ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు రూ. 97.49 కోట్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రూ. 97.97 కోట్లు ఖర్చు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు అత్యంత తక్కువగా రూ. 43.82 కోట్లు ఖర్చు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు అధికం.. 2017–18లో మొత్తం 3.09 లక్షల చికిత్సలు చేయగా, అందులో 2.2 లక్షల చికిత్సలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 89,522 చికిత్సలు జరిగాయి. ప్రైవేటు ఆసుపత్రులకు రూ.553.50 కోట్లు అంటే మొత్తం నిధుల్లో 71.22 శాతం చెల్లించింది. ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.218.77 కోట్లు చెల్లించింది. శస్త్రచికిత్సలు చేయించుకున్నవారిలో అధికంగా 57.3 శాతం పురుషులే ఉన్నారు. 46 నుంచి 55 ఏళ్ల వయసున్నవారు అధికంగా 21 శాతం మంది, 36 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారు 20 శాతం మంది శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. 55 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్నవారు 16 శాతం మంది ఉన్నారు. అత్యంత తక్కువగా 15 నుంచి 25 ఏళ్ల వయసున్న వారు 8 శాతం చికిత్సలు పొందారని ఆరోగ్యశ్రీ నివేదిక తెలిపింది. -
3 ఏళ్ల చిన్నారిని రక్షించిన 14 నెలల పసికందు
ముంబై: నగరంలో మానవత్వం పరిమళించింది. బ్రెయిన్ డెడ్ అయిన ఓ 14 నెలల బాలుడి తల్లితండ్రులు అవయదానానికి ముందుకు రావడంతో మరో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. అవయవదానంతో చిన్నారి ప్రాణాలను రక్షించిన ఆ బాలుడు చిరంజీవిగా మిగిలిపోయాడు. ఈ అరుదైన ఘటన ముంబైలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. సూరత్‌కు చెందిన ఆ పసికందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లితండ్రుల ఆ చిన్నారిని న్యూ సూరత్ సివిల్ ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఓ స్థానిక ఎన్జీవో కౌన్సెలింగ్‌తో ఆ పసికందు తల్లితండ్రులు అవయదానానికి అంగీకరించారు. ఆ చిన్నారి అవయవాలను సేకరించిన వైద్యులు కిడ్నీలను అహ్మదాబాద్ కిడ్నీ రిసేర్చ్ సెంటర్‌కు పంపించగా గుండెను ఓ మూడన్నరేళ్ల బాలికకు మార్పిడి చేశారు. నవీ ముంబైకి చెందిన ఈ బాలిక గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. దీంతో చిన్నారి గుండెను కమర్షియల్ ఫ్లైట్‌లో తరలించి విజయవంతంగా మార్పిడి చేశారు. దీంతో ఆచిన్నారి బాలిక ప్రాణాలు నిలబెట్టడమేగాక పశ్చిమ భారత దేశ యంగెస్ట్ డోనార్‌గా గుర్తింపు పొందాడు. -
ఈ చిన్నారి చనిపోతూ ఏం చేసిందంటే..
'మానవ చరిత్ర వర్థిల్లిందల్లా సాటి మనిషిని ఆదుకోవడంలోనే.. అది మరణంలోనైనా సరే' అనే సేయింగ్ను చదువుకోనప్పటికీ దానిని అక్షరాల పాటించి చిరస్మరణీయురాలిగా మిగిలిపోయింది మూడేళ్ల చిన్నారి అంజన. శనివారం (నిన్న) సాయంత్రం బ్రెయిన్ డెడ్ అయిన అంజన.. తన కిడ్నీలు, కాలేయం, కళ్లను ప్రాణాపాయంలో ఉన్న బాలుడికి దానం చేసింది. కేరళలో అవయవదానం చేసిన అతిపిన్న వయస్కురాలిగా కీర్తిగడించింది. తిరువనంతపురంలోని కరకులంలో నివసించే అజిత్ దంపతుల ఒక్కగానొక్క కూతురు అంజన. గత గురువారం ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కూప్పకూలిపోయిన అంజనను హాస్పిటల్ కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అంజన కండిషన్ ను 'సీరియస్ బ్రెయిన్ డ్యామేజ్' గా గుర్తించిన వైద్యులు.. కొద్ది రోజుల్లో చనిపోవడం ఖాయమని తేల్చారు. ఆ తరువాత తల్లిదండ్రులను ఒప్పించి అవయవదానానికి రంగం సిద్ధం చేశారు. ఇక్కడ మనం ఒక విశేషాన్ని చెప్పుకోవాలి.. వైద్యశాస్త్రం బాగా అభివృద్థి చెందుతున్న ప్రస్తుత దశలో అవయవాల మార్పిడి ఆపరేషన్లు తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో ప్రైవేటు ఆసుపత్రుల దందాను సాధ్యమైనంతమేరకు నివారించడానికి 'కేరళ నెట్ వర్క ఆఫ్ ఆర్గాన్ షేరింగ్ (కేఎన్ఓఎస్) పేరుతో కేరళ ప్రభుత్వమే ఓ ప్రత్యేక సంస్థను నెలకొల్పింది. దీని ద్వారా దాతలు, గ్రహీతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మనిటర్ చేస్తుంటారు. అలా శనివారం రాత్రి అంజన అవయవాలను సేకరించిన కేఎన్ఓఎస్.. అదే రోజు రాత్రి ఓ ఐదేళ్ల బాలుడికి వాటిని అమర్చింది. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ఆదివారం మద్యాహ్నం తిరువనంతపురంలో అంజన అంత్యక్రియలు 'ఘనంగా' జరిగాయి. అవును మరి, చిరంజీవులను ఆమాత్రం గౌరవించుకోకుంటే ఎలా! -
అసిన్ అవయవదానం
అవయవదానం చేయడం మరణపుటంచుల్లో ఉన్న వారికి పునర్జీవం పోయడమే. ఇంతకంటే గొప్పదనం మరొకటి ఉండదు. అలాంటి దానానికి తాను సైతం అంటున్నారు ప్రముఖ నటి అసిన్. అవసరం అయినవారికి ఉపయోగపడేలా తన అవయవాలను దానం చేస్తానని అసిన్ వెల్లడించారు. తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా అభిషేక్‌బచ్చన్ సరసన ఆల్ ఈజ్ వెల్ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో మంచి చిత్రాల్లో నటించాలనే ఆసక్తి ఉందంటున్న అసిన్ ప్రస్తుతం పలు కథలను వింటున్నారు. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సాయం చేస్తున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ పలువురు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇటీవల ఈ బ్యూటీ ముంబయిలోని ఒక సామాజిక సేవా సంస్థ నిర్వహించిన రక్తదానం కార్యక్రమంలో అతిథిగా పాల్గొని వారిలో ఒకరిగా రక్తదానం చేశారు. అంతేకాదు తన కళ్ల నుంచి అన్ని అవయవాలు దానం చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన పత్రంలో అసిన్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. అది ఇప్పుడు నెరవేరిందని పేర్కొన్నారు. అవసరం అయిన వారికి ఉపయోగపడాలనే తన అవయవదానం చేసినట్టు వివరించారు. తన ఈ నిర్ణయం మరికొందరికి స్ఫూర్తి దాయకం అవుతుందని నమ్ముతున్నట్లు అసిన్ పేర్కొన్నారు.