దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం తెలంగాణలో దిగ్విజయంగా అమలవుతోంది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలేనని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వెల్లడించింది. ఈ మేరకు తాజా నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ వివరాల ప్రకారం ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల్లో 91 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఉన్నట్లు నివేదించింది. మొత్తం లబ్ధిదారుల్లో బీసీలు 54.28 శాతం ఉండటం గమనార్హం. ఎస్సీలు 14.66 శాతం, ఎస్టీలు 7.05 శాతం, మైనారిటీలు 14.71 శాతం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్నారు. మొత్తం 3.09 లక్షల మందికి వివిధ రకాల శస్త్రచికిత్సలు, ఇతర చికిత్సలు జరగ్గా, అందులో బీసీలు 1.67 లక్షల మంది ఉన్నారు. – సాక్షి, హైదరాబాద్
77.19 లక్షల కార్డులు..
తెలంగాణలో 77.19 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. వారికి ఉచితంగా వైద్యం అందించేలా 330 నెట్‌వర్క్ ఆసుపత్రులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆరోగ్యశ్రీ ద్వారా రోజూ సగటున 800 మంది చికిత్సల కోసం ఆరోగ్యశ్రీని ఆశ్రయిస్తున్నారు. 2017–18లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం, శస్త్రచికిత్సల కోసం ప్రభుత్వం రూ.775 కోట్లు కేటాయించింది. సాధారణ శస్త్రచికిత్సలే కాకుండా అవయవదానాలను కూడా ఆరోగ్యశ్రీ చేర్చింది. ఆరోగ్యశ్రీ కింద రూ.2 లక్షల వరకు శస్త్రచికిత్సకు అనుమతి ఉండగా, అవయవదానాలకు అధికంగా ఖర్చు చేస్తోంది. 16 రకాల అవయవదానాలకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేసినందుకు ప్రభుత్వం రూ.1.45 కోట్లు ఖర్చు చేసింది.
కిడ్నీ వ్యాధుల తెలంగాణ..
ఆరోగ్యశ్రీ కింద 2017–18 లెక్కల ప్రకారం 3.09 లక్షల మందికి శస్త్ర చికిత్సలు, వైద్యం చేయగా అందులో 58,768 మంది (18.88%) మంది కిడ్నీ వ్యాధికి చికిత్స పొందిన వారేనని తేలింది. ఆ తర్వాత 52,426 మంది (16.95%) కేన్సర్ సంబంధిత చికిత్స పొందారు. మూడోస్థానంలో వివిధ రకాల పాలీ ట్రామా కేసులకు 39,723 మంది (12.84%) మంది చికిత్స పొందారు. అయితే పాలీ ట్రామా కేసులకు చేసిన శస్త్రచికిత్సలకే అత్యధిక డబ్బు చెల్లించింది. ప్రభుత్వం మొత్తం రూ.775 కోట్లు ఖర్చు చేస్తే, అందులో అత్యధికంగా రూ. 122.62 కోట్లు (15.87%) పాలీ ట్రామా వైద్యానికి ఖర్చు చేసింది. ఆ తర్వాత గుండె సంబంధిత శస్త్రచికిత్సల కోసం రూ.122.32 కోట్లు (14.54%) ఖర్చు చేసింది. మొత్తం ఖర్చు చేసిన నిధుల్లో శస్త్రచికిత్సల కోసం రూ.489.33 కోట్లు (63%), ఇతరత్రా వైద్యం కోసం రూ.286.13 కోట్లు (37%) ఖర్చు చేసింది.
వరంగల్ నుంచే ఎక్కువ..
ఆరోగ్యశ్రీ కింద 2017–18లో చేసిన మొత్తం శస్త్రచికిత్సలు, వైద్యంలో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ఉండటం గమనార్హం. ఆ జిల్లాలో 43,438 మందికి ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందింది. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లాలో 43,095 మందికి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 38,095 మందికి వైద్యం అందించారు. అతి తక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 16,782 మందికి వైద్యం చేశారు. అందుకు ప్రభుత్వం చేసిన ఖర్చులో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నెట్‌వర్క్ ఆసుపత్రులకు అత్యధికంగా రూ.109.87 కోట్లు, తర్వాత ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు రూ. 97.49 కోట్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రూ. 97.97 కోట్లు ఖర్చు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు అత్యంత తక్కువగా రూ. 43.82 కోట్లు ఖర్చు చేశారు.
ప్రైవేటు ఆసుపత్రులకు అధికం..
2017–18లో మొత్తం 3.09 లక్షల చికిత్సలు చేయగా, అందులో 2.2 లక్షల చికిత్సలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 89,522 చికిత్సలు జరిగాయి. ప్రైవేటు ఆసుపత్రులకు రూ.553.50 కోట్లు అంటే మొత్తం నిధుల్లో 71.22 శాతం చెల్లించింది. ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.218.77 కోట్లు చెల్లించింది. శస్త్రచికిత్సలు చేయించుకున్నవారిలో అధికంగా 57.3 శాతం పురుషులే ఉన్నారు. 46 నుంచి 55 ఏళ్ల వయసున్నవారు అధికంగా 21 శాతం మంది, 36 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారు 20 శాతం మంది శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. 55 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్నవారు 16 శాతం మంది ఉన్నారు. అత్యంత తక్కువగా 15 నుంచి 25 ఏళ్ల వయసున్న వారు 8 శాతం చికిత్సలు పొందారని ఆరోగ్యశ్రీ నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment