సాక్షి, హైదరాబాద్: తమ ప్రాణం కోల్పోతూ పలువురికి ప్రాణం పోసే అవయవదాతలు కలకాలం స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచిపోతారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జీవన్‌దాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులకు శనివారం రవీంద్రభారతిలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ వ్యక్తులు బ్రెయిన్ డెడ్ అయిన సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా త్వరగా నలుగురికి ప్రాణం పోసే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వైద్యరంగం ఎంత అభివృద్ధి చెందినా మూత్రపిండాలు, కాలేయం, గుండె వంటి అవయవాలను కృత్రిమంగా తయారు చేయలేని పరిస్థితిలో దాతలు ముందుకు రావాలని కోరారు. ఇటీవల సీపీఐ నేత నారాయణ సతీమణి వసుమణి, స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం తమ పార్థివ దేహాలను మెడికల్ కాలేజీలకు దానం చేసి స్ఫూర్తిగా నిలిచారన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా అవయవ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సను ప్రభుత్వ దవాఖానాల్లో చేస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లో 400 అవయవమార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయన్నారు.
ఇందుకు ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షలు అందజేస్తున్నామని కిడ్నీ మార్పిడి చేసుకున్న వారికి ప్రతి నెలా ఉచితంగా రూ.20 వేల విలువైన మందులు అందిస్తున్నామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇప్పటిదాకా 3,800 మంది అవయవదానంతో పునర్జన్మ పొందడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, జీవన్‌దాన్ ఇన్‌చార్జ్ డాక్టర్ స్వర్ణలత, డీఎంఈ రమేశ్‌రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment