ఎమ్మెల్యే పాత్ర ఎంత? | I do not fear arrest: MLA K Surya Rao | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పాత్ర ఎంత?

Published Fri, Aug 26 2016 7:20 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

ఎమ్మెల్యే పాత్ర ఎంత? - Sakshi

ఎమ్మెల్యే పాత్ర ఎంత?

సోషల్ మీడియాలో ఫొటోల హల్‌చల్
  మేనేజర్ కుటుంబ సభ్యులపై ఒత్తిళ్లు..

 
 భువనేశ్వర్: ఉత్కళ రాష్ట్ర నిర్మాణంలో ప్రముఖ పాత్రధారిగా కీర్తినార్జించిన దివంగత మహారాజా కృష్ణచంద్ర గజపతి పరపతి నడి రోడ్డు మీద చర్చనీయాంశంగా మారింది. రాజ ప్రాసాదంలో గోపీనాథ్ గజపతి దయనీయ పరిస్థితిపట్ల పలు ప్రశ్నలు, సందేహాలు, చర్చోపచర్చలు వాడీవేడిగా సాగుతున్నాయి. గోపీనాథ్ గజపతి ఆరోగ్య సంరక్షణకు చెన్నై తరలించిన తరుణంలో ఆయన సంస్థానంలో పని చేసిన సిబ్బంది వర్గాలు అనుమానాస్పద మరణాలకు గురయ్యారు. ఈ మరణాల్ని ధృవీకరించడం రాష్ట్ర క్రైం శాఖకు పెను సవాలుగా నిలిచింది. ఆత్మహత్యా? హత్యా? ఈ అంశాన్ని  ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ధృవీకరించాల్సి ఉంది. ఘటన స్థలంలో లభించినట్లు చెబుతున్న లేఖలో పేర్కొన్నట్లు చెబుతున్న కొంత మంది ప్రముఖుల పేర్లు చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే కె. సూర్యారావు ప్రముఖంగా వినిపిస్తోంది.
 
రాష్ట్రంలో అక్కడక్కడ ఆనవాలుగా మిగిలిన రాజ కుటుంబాలు, సంస్థానాలపట్ల ప్రజాప్రతినిధుల వైఖరిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.  గోపీనాథ గజపతి, రాజవంశీకులతో ఉన్న సంబంధాల కన్నా సంస్థాన సిబ్బంది అనుమానాస్పద మృతి వెనుక ఎమ్మెల్యే అదృశ్య హస్తం ఉందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఇవి ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న సిట్ ఇంత వరకు పర్లాకిమిడి నియోజకవర్గం ఎమ్మెల్యే కె. సూర్యారావు గురించి ప్రస్తావించలేదు.  స్థానిక ప్రజా ప్రతినిధిగా ఉంటు ఎమ్మెల్యే రాజ పరివారం బంధువర్గంతో తరచూ సంప్రదింపులు జరిపారని స్థానికులు చెబుతున్నారు.
 
చెన్నైలో ఉంటున్న పరలా రాజ వంశీకులతో ఆయన తరచు సంప్రదింపులు జరపడంతో రాకపోకలు చేసిన విషయాన్ని అంగీకరించిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ మేరకు పలు ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గోపీనాథ గజపతి రాజ నగరి బందీ అయ్యారనిఎమ్మెల్యే సూర్యా రావు ఆరోపించారు.   గజపతి మహా రాజా పరపతి పరిరక్షణ ప్రజా ప్రతినిధిగా తన కర్తవ్యంగా భావిస్తున్నట్లు ప్రకటిస్తున్న హావ భావాలపట్ల స్థానికుల్లో పూర్తి విశ్వాసం వ్యక్తం కావడం లేదు. సంస్థాన్ మేనేజర్, కుటుంబ సభ్యుల మృతికి  ఎమ్మెల్యే వర్గం ఒత్తిడి కారణమని మృతుల కుటుంబీకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 పెదవి కదపని రాజకీయ వర్గాలు
 చారిత్రాత్మక కృష్ణచంద్ర గజపతి సంస్థానంలో చెలరేగిన వివాదాల్లో స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు వార్తలతో పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రజా ప్రతినిధిగా రాజ వంశీకులతో రాకపోకలు స్థాయి సంబంధాలు ఉన్నట్లు ఆయన పరోక్షంగా అంగీకరించారు. ఇంతలో గోపీనాథ గజపతి రాజ నగరి బందీగా దుర్బర జీవితం గడపడంపట్ల ఆయన తీవ్ర మనస్తాపాన్ని ప్రకటించారు. ఈ మనస్తాప పరిస్థితులు సంస్థానం సిబ్బంది మనుగడని వేలెత్తి చూపింది. చివరకు అనుమానస్పద మరణాలకు దారి తీసింది. ఇంత జరుగుతున్నా గజపతి జిల్లా నుంచి రాజకీయ ప్రతినిధులు, వర్గాలు పెదవి కదపకుండా చోద్యం చూస్తున్నాయి.
 
 ఈ సంఘటనపట్ల స్థానికులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. రాజ వంశీకుల రాక గురు వారం నుంచి ఆరంభమైంది. వీరి రాకతో ఈ ఉదంతం మరెన్నో మలుపులు తిరిగే అవకాశం ఉంది. గోపీనాథ్ గజపతి ఆరోగ్యవంతంగా నిలిస్తే కథ రక్తి కడుతుందని సర్వత్రా ఆశాభావం వ్యక్తం అవుతుంది. సంస్థానం న్యాయ సలహాదారుని పాత్ర కూడా క్రమంగా ప్రాధాన్యత కూడగట్టుకుంటుంది. సంస్థానం ఆస్తుల లావాదేవీలతో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఈ మేరకు లోగుట్టు న్యాయ సలహాదారుని దగ్గర ఉండడం తథ్యమనే భావన బలపడుతుంది. చెన్నై నుంచి ఆస్తుల కోసం న్యాయ స్థానాల్లో దీర్ఘకాలంగా పోరాడుతున్న వర్గాలు పర్లాకిమిడి గెడ్డపై కాలు పెడితే సంస్థానం అంతరంగిక వ్యవహారాలకు సంబంధించి బలమైన ఆధారాలు ప్రజా రాజ్యంలో వెలుగు చూస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement