ఒడిసా: విద్యార్థినికి అందాల్సిన వేతనం సరైన సమయానికి అందలేదన్న ఒకే ఒక్క కారణం నిండు జీవితాన్నిబలితీసుకుంది. ప్రభుత్వం అందజేసే స్టయిపండ్(వేతనం)లో జాప్యం జరిగిందనే కారణంతో నర్సింగ్ లో శిక్షణ పొందుతున్న ఓ గిరిజన బాలిక బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. గజపతి జిల్లాలోని ఆర్ ఉదయగిరి కేంద్రం నుంచి సునీతా రైతా(21) అనే బాలికకు అందాల్సిన వేతనం పంపకపోవడంతో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు తాడు బిగుంచుకుని ఆత్మహత్య చేసుకుంది. భువనేశ్వర్ లోని ఒక ప్రైవేటు కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న ఆ యువతి ఆకస్మిక మృతి పట్ల తల్లి కన్నీరుమున్నీరవుతోంది.
దారిద్ర రేఖకు దిగువనున్న ఆ కుటుంబం ఆర్ధిక భారంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కాలేజీ ఫీజుకు డబ్బులు ప్రభుత్వం నుంచి అందకపోవడంతో రోజు వారీ కూలీ అయిన ఆ యువతి తండ్రి ఆమెను మందలించాడు. దీంతో ఈ బ్రతుకు అనవరసరం అనుకున్న ఆ యువతి తనువు చాలించింది. గిరిజన బాలికలకు సంవత్సరం మొత్తానికి అందించే 54,000 రూ.ల హామీ కాస్తా తమ దరికి చేరకపోవడంతోనే కన్న కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి సుదామ్ తెలిపాడు.