జిల్లా మార్చాలంటూ యువకుడి ఆత్మహత్య!
- ట్యాంక్‌బండ్‌పై ఘటన
- నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో చేర్చాలని డిమాండ్
హైదరాబాద్, నాగిరెడ్డిపేట: కామారెడ్డి జిల్లాలో చేర్చిన నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న త్యాగరాజ విగ్రహం సమీపంలో అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద గ్రామానికి చెందిన ఉడువాటి రాజు అలియాస్ డప్పు రాజు (29) కుటుంబంతో కలసి కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఆయనకు భార్య సంధ్య, ఇద్దరు కుమారులు అరవింద్, ఆదర్శ్ ప్రేమ్ ఉన్నారు.
రాజు తండ్రి ఏసయ్య స్వగ్రామంలోనే సఫారుు కార్మికుడిగా పనిచేస్తుండగా.. రాజు హైదరాబాద్‌లోనే కూలి పనులు చేస్తూ భార్య, పిల్లలను పొషిస్తున్నాడు. రాజుకు స్వస్థలంపై ప్రేమ ఎక్కువ. జిల్లాల పునర్విభజనలో భాగంగా నాగిరెడ్డిపేటను మెదక్‌లో కలుపుతారని ఆశించాడు. ముసాయిదా నోటిఫికేషన్‌లో నాగిరెడ్డిపేటను కామారెడ్డి జిల్లాలో కలపడంతో నిరాశకు గురయ్యాడు. నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలంటూ జరిగిన ఉద్యమానికి ప్రోత్సాహం అందించాడు. ఆ ఉద్యమం, నిరసన ప్రదర్శనల గురించి ఎప్పటికప్పుడు గ్రామస్తులకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఇటీవలే మాల్తుమ్మెద గ్రామానికి వెళ్లి వచ్చాడు కూడా. అయితే నాగిరెడ్డిపేటను మెదక్‌లో కలపకపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందాడు. తన ఆత్మహత్యతోనైనా ప్రభుత్వంలో చలనం వస్తుందని భావించాడు.
శనివారం ఓ పెట్రోల్ పంపులో పెట్రోల్ కొనుక్కున్న రాజు.. ట్యాంక్‌బండ్‌పై ఉన్న త్యాగరాజ విగ్రహం వద్దకు చేరుకున్నాడు. నాగిరెడ్డిపేట మండలాన్ని మెదక్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది చూసిన కొందరు వెంటనే సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని రాజును గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఒంటిపై తీవ్రంగా కాలిన గాయాలైన రాజు.. చికిత్స పొందుతూ సాయంత్రం 6.30 సమయంలో కన్నుమూశాడు. రాజు మృతితో ఆయన తండ్రి, భార్య, పిల్లలు కన్నీటిలో మునిగిపోయారు. గాంధీనగర్ పోలీసులు 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రాజు ఆత్మహత్య నేపథ్యంలో.. నాగిరెడ్డిపేట మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను మోహరించారు.