మాజీ మంత్రి నవ కిషోర్‌ దాస్‌ హత్యలో కీలక పరిణామం | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి నవ కిషోర్‌ దాస్‌ హత్యలో కీలక పరిణామం

Published Sat, May 27 2023 9:30 AM | Last Updated on Sat, May 27 2023 9:30 AM

- - Sakshi

భువనేశ్వర్‌: మాజీ మంత్రి నవ కిషోర్‌ దాస్‌ హత్యలో కీలక పరిణామం శుక్రవారం చోటుచేసుకుంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఒడిశా క్రైమ్‌ బ్రాంచ్‌ 540 పేజీలకు పైగా చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ విషాద ఘటనలో ప్రధాన నిందితుడు గోపాల్‌ కృష్ణ దాస్‌ (53) వ్యతిరేకంగా ఆయుధాల చట్టం ప్రకారం 307, 302, 27 (1) సెక్షన్లు కింద అభియోగాలు నమోదు చేశారు. పాత వైరం కారణంగా నిందితుడు దారుణ హత్యకు పాల్పడినట్లు విచారణలో ధ్రువీకరించినట్లు చార్జ్‌షీటులో వెల్లడించారు.

జనవరి 29న హత్య
ఈ ఏడాది జనవరి 29న మంత్రి అధికారిక కార్యక్రమం పర్యటనలో నడి రోడ్డమీద జన సందోహం మధ్య నిందితుడు తుపాకీ గురిపెట్టి పేల్చడంతో మంత్రి అక్కడిక్కడే కుప్పకూలిపోయిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం, శాసీ్త్రయ బృందం పరిశీలన నివేదికల ఆధారంగా నిందిత ఏఎస్‌ఐ గోపాల కృష్ణ దాస్‌ని విధుల నుంచి బహిష్కరించారు. మంత్రితో బ్రజ్‌రాజ్‌నగర్‌ ఠాణా ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ (ఐఐసీ) పి.కె.స్వంయి మరో సిబ్బంది జీవన్‌ కుమార్‌ నాయక్‌ని హత్య చేసేందుకు నిందితుడు విఫలయత్నం చేసినట్లు ఝార్సుగుడ ఎస్‌డీజేఎం కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు క్రైమ్‌ బ్రాంచ్‌ మీడియాకు తెలియజేసింది.

 ముందస్తు ప్రణాళికతోనే...
నిందితుడు ఏఎస్‌ఐ గోపాల్‌కృష్ణ దాస్‌ తెలివిగా ముందస్తు ప్రణాళికతో ఈ నేరానికి పాల్పడ్డాడని క్రైం బ్రాంచ్‌ తెలిపింది. అతని మానసిక పరిస్థితి స్థిరంగా, సాధారణమైనదిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎటువంటి మానసిక అనారోగ్య లక్షణాలు దర్యాప్తులో బయటపడనట్లు వివరించింది. సంచలనాత్మక హత్య సంఘటనకు సంబంధించిన అన్ని రకాల సాక్ష్యాలను పరిశీలించి విశ్లేషించింది. ఈ నేపథ్యంలో మౌఖిక, దస్తావేజులు, మెడికో–లీగల్‌, సైబర్‌ ఫోరెన్సిక్‌ మరియు బాలిస్టిక్‌ నివేదికలను క్రైం శాఖ లోతుగా సమీక్షించింది. ఈ సమీక్షలో నిందితుడు గోపాల్‌ కృష్ణ దాస్‌ దివంగత మంత్రి నవ కిషోర్‌ దాస్‌ మరియు అతని అనుచరులతో తనకు ప్రాణాపాయం ఉన్నట్లు భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మంత్రి అనుచర వర్గాలు తరచు ఆయనకు ప్రాణాపాయ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో మంత్రిపై వ్యక్తిగత ద్వేషం బలపడి మానసిక వేదనతో మంత్రిని నిలువునా హత్య చేసి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టమైంది. అభద్రతా భావంతోనే మంత్రి హత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. దీనికోసం పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకుని బెడిసి కొట్టని వ్యూహంతో తుపాకీ గురి పెట్టి ఘటనా స్థలంలో మంత్రిని కుప్పకూల్చినట్లు క్రైం శాఖ తెలిపింది. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినప్పటికీ, కొన్ని నివేదికలు, వివరణలను పొందడం కోసం దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

 మానసిక రోగి: కుటుంబ సభ్యులు
నిందితుడి కుటుంబ సభ్యులు గోపాల్‌ కృష్ణదాస్‌ చాలాకాలంగా మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కొంతకాలంగా బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని అంటున్నారు. అయితే అనుబంధ చికిత్స కొనసాగుతుందని దర్యాప్తు వర్గాలు విచారణలో పేర్కొన్నాయి. మానసిక ఇబ్బందుల విషయం ధ్రువీకరించేందుకు వైద్య విద్య మరియు శిక్షణ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డు అనుబంధ పరీక్షలను నిర్వహించి, నిందితుడిలో మానసిక అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు లేవని స్పష్టం చేసింది. స్థానికులు, సహోద్యోగుల వాంగ్మూలం వైద్య బోర్డు అభిప్రాయానికి చేరువగా ఉన్నట్లు క్రైమ్‌ శాఖ తెలిపింది. నిందితుడు సాదాసీదాగా కలిసిమెలిసి తిరుగాడే వ్యక్తిగా తోటి వ్యక్తుల వాంగ్మూలం దర్యాప్తు బృందం నమోదు చేసింది. ఇలా పరిసరాల పరిశీలన, అనుబంధ విశ్లేషణలో నిందితుని మానసిక పరిస్థితి చాలా సాధారణంగా ఉందని, ఎటువంటి అసాధారణత లేదని నిర్ధారించారు. విచారణకు నిందితుడు సంతృప్తికరంగా సహకరించారని, అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారని క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు తెలిపారు.

 అధికారిక రివాల్వరే హత్యాస్త్రం
విధి నిర్వహణలో ఉండగా పోలీసు ఏఎస్‌ఐ గోపాల్‌ కృష్ణ దాస్‌ హత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంగా తన దగ్గర ఉన్న అధికారిక రివాల్వర్‌తో సిటింగు ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నవ కిషోర్‌ దాస్‌ను జన సందోహం మధ్య కాల్చి నడిరోడ్డు మీద కుప్పకూల్చేశాడు. ఈ హత్య వెనుక కుట్ర ఉందని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు నిలువెత్తున ఆరోపించాయి. విచారణ చేపట్టి చార్జిషీట్‌ దాఖలు చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ విచారణలో కుట్ర కోణం జాడ లేనట్లు వెల్లడించింది.

10 బృందాలతో దర్యాప్తు
సిటింగ్‌ మంత్రి హత్య జరిగిన రోజు నుంచే క్రైమ్‌ బ్రాంచ్‌, బ్రజరాజ్‌నగర్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోతైన దర్యాప్తు కోసం క్రైమ్‌ బ్రాంచ్‌ 10 బృందాలను ఏర్పాటు చేసింది. హత్య వ్యూహం పూర్వాపరాలను ఆరా తీసేందుకు రాష్ట్రంలో ఝార్సుగుడ, భువనేశ్వర్‌, బరంపురం మరియు పలు ఇతర రాష్ట్రేతర ప్రాంతాలు సందర్శించి దర్యాప్తు బృందాలు పూర్వాపరాలు ఆరా తీశాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు వర్గాలు 89 మంది సాక్షులను ప్రశ్నించారు. తుపాకీలు, లైవ్‌ కాట్రిడ్జ్‌లు, ఖాళీ కాట్రిడ్జ్‌లు ఇతరేతర పలు రుజువుపూరిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ జరిగింది
ఝార్సుగూడ జిల్లాలో మంత్రి కార్యక్రమం పురస్కరించుకుని నిందిత ఏఎస్‌ఐ గోపాల్‌ కృష్ణదాస్‌ని ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ డ్యూటీ కోసం నియమించారు. ఈ అవకాశాన్ని వ్యూహాత్మకంగా మలచుకుని తన దగ్గర ఉన్న 9 ఎంఎం సర్వీస్‌ పిస్టల్‌ని ఉపయోగించి అతి సమీపం నుంచి మంత్రిపై కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో కూరుకుపోయిన మంత్రిని హెలికాప్టర్‌లో హుటాహుటిన భువనేశ్వర్‌కు తరలించారు. అయితే అంతర్గత రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ మంత్రి తుదిశ్వాస విడిచాడు. నిందితుడు 2013లో ఝార్సుగుడ జిల్లాలో పోలీసు ఉద్యోగం పొందాడు. తన ఉద్యోగ జీవితంలో నిందిత గోపాల కృష్ణ దాస్‌ శ్రేష్టమైన పనితీరుకు తొమ్మిది రివార్డులు, 18 ప్రశంసా పత్రాలు పొందడం విశేషం. అతని కుటుంబం బరంపురం శివారులోని జలేశ్వరఖండిలో ఉంటుంది. విచారణలో భాగంగా నిందితుడికి మానసిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రేతర (బెంగుళూరు) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌కు తీసుకెళ్లాలన్న అభ్యర్థనను స్థానిక కోర్టు తిరస్కరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement