సాక్షి, న్యూఢిల్లీ : భార్యను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) సోమనాథ్ ఫరీదాకు భువనేశ్వర్ స్ధానిక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 24 మంది సాక్షులను విచారించి, సైంటిఫిక్ బృందం అందించిన ఆధారాలను పరిశీలించిన మీదట న్యాయస్ధానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2013లో ఓ కుటుంబ వివాదం ఘర్షణకు దారితీయడంతో రిటైర్డ్ సైనికాధికారి ఫరీదా (78) తన భార్య ఉషశ్రీ సమాల్ (61)ను స్టీల్ టార్చ్‌తో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని 300 ముక్కలుగా కోసి దానికి కెమికల్‌ను మిక్స్ చేసి స్టీల్, గ్లాస్ టిఫిన్ బాక్సుల్లో భద్రపరిచాడు. కాగా తన తల్లితో తాను మాట్లాడలేకపోతున్నానని ఈ దంపతుల కుమార్తె భువనేశ్వర్‌లో ఉండే తన మామగారికి చెప్పడంతో విషయం వెలుగుచూసింది. ఆమె మామను సైతం అధికారి తన ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సైనికాధికారి ఇంట్లోనే పలు చోట్ల ఆమె శరీర భాగాలను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితుడు జర్పద జైలులో ఉన్నాడు. తనకు శిక్ష తగ్గించాలని ఫరీదా చేసిన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment