ఆర్మీ అధికారి కిడ్నాప్.. హత్య
► జమ్మూకశ్మీర్‌లో మిలిటెంట్ల ఘాతుకం
► పిరికిపంద చర్య: జైట్లీ
శ్రీనగర్: సెలవులో ఉన్న ఓ యువ ఆర్మీ అధికారిని అపహరించిన మిలిటెంట్లు.. ఆపై అత్యంత దారుణంగా హతమార్చారు. షోపియాన్ జిల్లాలో ఓ వివాహ వేడుకకు హాజరైన రాజ్‌పుటానా రైఫిల్స్ అధికారిని కిడ్నాప్ చేసిన మిలిటెంట్లు.. అతనిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. కుల్గామ్ జిల్లా సుర్సోనా గ్రామానికి చెందిన లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్(22).. బాతాపురాలో బంధువుల వివాహానికి హాజరయ్యాడు. మంగళవారం రాత్రి పది గంటలకు ముగ్గురు మిలిటెంట్లు పెళ్లి జరుగుతున్న ఇంట్లోకి చొరబడి ఉమర్‌ను అపహరించారు.
మిలిటెంట్ల హెచ్చరికలతో ఉమర్ కుటుంబ సభ్యులు కిడ్నాప్ గురించి పోలీసులకుగానీ, ఆర్మీకి గానీ సమాచారం ఇవ్వలేదు. అయితే బుధవారం ఉదయం ఉమర్ నివాసానికి సమీపంలో హర్మాన గ్రామంలో బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఉమర్ మృతదేహాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అతని మృతదేహంపై ఉన్న గాయాలను చూస్తే మిలిటెంట్లను ఉమర్ తీవ్ర స్థాయిలో ప్రతిఘటించినట్టు తెలుస్తోందని చెప్పారు.
అత్యంత సమీపం నుంచి అతనిపై కాల్పులకు తెగబడ్డారని, తల, పొట్ట, ఛాతీ భాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని వివరించారు. సైనిక లాంఛనాలతో ఉమర్ అంత్యక్రియలను పూర్తి చేశారు. సెలవు పెట్టి పెళ్లికి వచ్చిన ఉమర్ ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హెచ్చరించి విడిచిపెడతారని భావించే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, కానీ ఇంత ఘోరం జరుగుతుందని భావించలేదని చెప్పారు.
ఆయన రోల్ మోడల్: జైట్లీ
ఫయాజ్ హత్యను రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా ఖండించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ యువ అధికారి ఒక రోల్ మోడల్ అని కొనియాడారు. గత డిసెంబర్‌లో ఉమర్ ఆర్మీలో చేరాడని, బంధువుల పెళ్లి కోసం మొదటిసారిగా సెలవుపెట్టి వెళ్లాడని ఉన్నతాధికారులు చెప్పారు. హత్యను సీఎం మెహ బూబా, రాహుల్ గాంధీ ఖండించారు.