అఫ్ఘాన్‌లో భారతీయ రచయిత్రి హత్య
కాబూల్: ప్రముఖ భారతీయ రచయిత్రి సుస్మితా బెనర్జీ(43) అఫ్ఘానిస్థాన్‌లో హత్యకు గురయ్యారు. గురువారం అఫ్ఘాన్‌లోని పక్తికా ప్రావిన్స్ ముఖ్యపట్టణం ఖరానాలో గల సుస్మిత ఇంటి బయట తాలిబన్ మిలిటెంట్లు ఆమెను కాల్చిచంపారు. సుస్మిత ఇంట్లోకి చొరబడిన తాలిబన్ ఉగ్రవాదులు ఆమె భర్త, ఇతర కుటుంబసభ్యులను బంధించారని, ఆమెను బయటికి తీసుకెళ్లి కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. అనంతరం సుస్మిత మృతదేహాన్ని సమీపంలోని మతపాఠశాల వద్ద పడేశారని తెలిపారు. ప్రావిన్స్‌లో ఆరోగ్య కార్యకర్తగా సేవలందిస్తున్న సుస్మిత స్థానిక మహిళల జీవితాలను కెమెరాతో చిత్రీకరించారని ‘బీబీసీ’ ఓ కథనంలో పేర్కొంది. అయితే ఈ హత్యకు పాల్పడింది తామేనని ఇంతవరకూ ఏ ఉగ్రవాద ముఠా ప్రకటించలేదు.
అప్పుడు తప్పించుకున్నా: అఫ్ఘాన్ వ్యాపారవేత్త జాన్‌బాజ్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంతరం సుస్మిత 1989లో అఫ్ఘానిస్థాన్‌కు వెళ్లారు. మతం మార్చుకోవాలంటూ వేధించిన తాలిబన్లు సుస్మితను ఓ ఇంట్లో బంధించారు. మట్టిగోడలతో ఉన్న ఆ ఇంటి నుంచి ఆమె ఒక రోజు రాత్రి గోడకు కన్నం వేసి బయటపడ్డారు. అయితే కాబూల్ సమీపంలో మళ్లీ పట్టుబడ్డారు. ఆమెకు మరణశిక్ష వేయాల్సిందేనంటూ ఎక్కువ మంది వాదించారు. సుస్మిత చివరికి ఆ మరునాటి ఉదయం ఎలాగోలా భారతీయ ఎంబసీకి, ఆ తర్వాత కోల్‌కతాకు చేరుకోగలిగారు. కోల్‌కతాలో కొన్నాళ్లు భర్తతో కలిసి ఉన్న తర్వాత ఆమె తిరిగి మళ్లీ అఫ్ఘానిస్థాన్‌కు వెళ్లారు. అఫ్ఘాన్‌లో తన జీవితాన్ని, 1993లో తాలిబన్ల చెర నుంచి తప్పించుకున్న వైనాన్ని నాటకీయంగా వివరిస్తూ సుస్మిత ‘ఏ కాబూలీవాలాస్ బెంగాలీ వైఫ్’ పుస్తకంలో సవివరంగా చిత్రించారు. భారత్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలి చిన ఈ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని ఆధారంగానే 2003లో హిందీలో ‘ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్’ అనే చిత్రం కూడా రూపొందింది.