
మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి సమితి, ఎంవీ–19 గ్రామంలో బాలుడు అంకిత్ మండాల్(5) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన వికాస్ రోయి అనే వ్యక్తి బాలుడిని చంపినట్లు పోలీసుల విచారణలో తేలగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా కనిపించకపోయేసరికి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల బాలుడి ఆచూకీ కోసం వెతికారు. ఈ క్రమంలో వికాస్ రోయి ఇంటి ముందు అంకిత్ చెవుల ముక్కలు కనిపించాయి. దీంతో అతడి ఇంట్లోకి వెళ్లి చూడగా, బాలుడి మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యులు ఇది చూసి కన్నీరుమున్నీరయ్యారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించగా అసలు విషయం బయటపడింది. బాలుడి తండ్రి హరదోన్ మండాల్ అతడి బంధువుల అమ్మాయితో తన తమ్ముడి వివాహం జరిపించాడని, అయితే ఆ అమ్మాయి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని వికాస్ తెలిపాడు.
ఇది తట్టుకోలేని తన తమ్ముడు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి ప్రతీకారంగానే హరదోన్ మండల్ కొడుకుని తాను హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి బాలుడి మృతదేహాన్ని తరలించినట్లు ఐఐసీ అధికారి రామ్‌ప్రసాద్ నాగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment