నేటి కాలంలో ప్రతీ పనికి టెక్నాలజీ సాయాన్ని కోరుకుంటున్నారు. మనుషులు చేయాల్సిన పనులను రోబోలతో చేయిస్తున్నారు. ఈ క్రమంలో రెస్టారెంట్లలోనూ రోబోల సేవల వినియోగం నానాటికీ పెరుగుతోంది. అయితే ఇది అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ నెమ్మదిగా ఇండియాకు విస్తరిస్తోంది. తాజాగా ఒడిశాలో మొదటి రోబోటిక్ రెస్టారెంట్ భువనేశ్వర్‌లో బుధవారం ప్రారంభమైంది. కాగా ఉత్తర భారతదేశంలోనే మొదటి రోబోటిక్ హోటల్ కావటం విశేషం. భువనేశ్వర్‌లోని చంద్రశేఖర్‌పూర్ ప్రాంతంలో ప్రారంభమైన ‘రోబో చెఫ్’ రెస్టారెంట్‌లో మనుషులతోపాటు రెండు రోబోలు తిరుగాడుతూ ఉంటాయి.
చంపా, చమేలి అనే రోబోలు కస్టమర్లకు ఆహారాన్ని సర్వ్ చేసి, అనంతరం ‘మీరు సంతోషంగా ఉన్నారా’ అని వారి అభిప్రాయాల్ని అడిగి తెలుసుకుంటాయి. భారత్‌లోనూ ఇలాంటి రెస్టారెంట్లు ఉన్నప్పటికీ ఈ రోబో చెఫ్ రెస్టారెంట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పనిచేసే రోబోలకు ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇవ్వాల్సిన పనిలేదు. వాటంతటవే కదులుతాయి. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లను నేరుగా సర్వ్ చేస్తాయి. పైగా ఈ రెండు రోబోలు మేడ్ ఇన్ ఇండియా స్ఫూర్తితో భారత్‌లోనే తయారవటం విశేషం.రెస్టారెంట్ యజమాని జీత్ బాసా అమెరికా వెళ్లినప్పుడు అక్కడి రెస్టారెంట్లలో విరివిగా రోబోల వినియోగాన్నిచూశాడు. పైగా ఆయన సివిల్ ఇంజనీర్ కావటంతో ఆలోచనకు అతని అనుభవం తోడైంది. దీంతో రూ.5.5 లక్షల ఖర్చుతో రోబోలను తయారు చేశాడు.
జీత్ బాసా మాట్లాడుతూ ఈ రోబోలు స్లామ్ (సిమల్టేనియస్ లోకలైజేషన్ అండ్ మ్యాపింగ్) టెక్నాలజీతో పనిచేస్తాయన్నారు. వీటిలో 17 రకాల సెన్సార్లు ఉంటాయని, వాటి సహాయంతో ప్రకృతిని, వేడిని, పొగ, మనుషులను గుర్తుపడతాయన్నారు. అంతేకాక మనుషులను పలకరిస్తూ, వారికి స్వాగతం కూడా తెలుపుతాయని పేర్కొన్నారు. ఇక వాటికి ఆర్డర్లను స్వీకరించే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి కస్టమర్లకు సర్వ్ చేయడం వరకే పరిమితం చేశాడు. వీటిని ఒక్కసారి రీచార్జ్ చేస్తే ఎనిమిది గంటలపాటు నిరంతరాయంగా పని చేస్తాయి. 20 కిలోల బరువును కూడా సునాయాసంగా ఎత్తగలుగుతాయి. వీటిని చార్జ్ చేయటానికి కూడా తేలికే. కేవలం అరగంటలో ఫుల్ చార్జ్ అవుతాయి.