Robotic Technology
-
మేడ్ ఇన్ ఇండియా రోబోట్.. మోకాలి మార్పిడి ఇక మరింత సులభం
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ప్రతి రంగంలోనూ కొత్త ఉత్పత్తులు లేదా అప్డేటెడ్ ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ గ్లోబల్ మెడికల్ డివైజ్ కంపెనీ 'మెరిల్' అడ్వాన్స్డ్ సర్జికల్ రోబోటిక్ టెక్నాలజీ 'మిస్సో' (MISSO)ను లాంచ్ చేసింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ రోబోటిక్ సిస్టం (రోబోట్) పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. దీని ద్వారా మోకాలి మార్పిడికి (Knee Replacement) సంబంధించిన సర్జరీలు మరింత విజయవంతంగా నిర్వహించబడతాయి.ఇప్పటి వరకు భారతదేశంలోని చాలా హాస్పిటల్స్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎక్కువ డబ్బును వెచ్చించి.. విదేశీ రోబోటిక్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి. అయితే మిస్సో తమ కొత్త రోబోట్ 66 శాతం తక్కువ ధరకు అందించడానికి సిద్ధమైంది. ఇది ఇతర రోబోటిక్ టెక్నాలజీలకు ఏ మాత్రం తీసిపోకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోబోటిక్ టెక్నాలజీలు కొంత పెద్ద ఆసుపత్రులకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. కానీ MISSO అనేది చిన్న ఆసుపత్రులకు, టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ఆసుపత్రులకు అందుబాటులోకి తీసుకురాగల మొట్టమొదటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోట్.భారతదేశంలో 40 ఏళ్లు పైబడిన 10 మందిలో ముగ్గురు కీళ్ల అరుగుదలతో బాధపడుతున్నారు. దీనికి 'టోటల్ క్నీ రీప్లేస్మెంట్' (TKR) విధానం ద్వారా.. దెబ్బతిన్న లేదా అరిగిపోయిన మోకాలి కీలును మెటల్, అల్ట్రా-హై మాలిక్యులర్ వెయిట్ పాలిథిలిన్‌తో చేసిన కృత్రిమ కీలుతో భర్తీ చేస్తారు. దీనికి సర్జరీ అవసరం. సర్జరీ తరువాత ఎక్కువ నొప్పిని భరించాల్సి ఉంటుందని చాలా మంది భయపడతారు. కానీ సాధారణ సర్జరీతో పోలిస్తే.. రోబోటిక్ సర్జరీ కొంత ఉత్తమమని, దీని ద్వారా సర్జరీ జరిగితే నొప్పి కూడా కొంత తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.కీళ్ల అరుగుదల అనేది భారతదేశంలో 22 నుంచి 39 శాతం జనాభాలో ఉన్నట్లు సమాచారం. మనదేశంలో ఏడాదికి 5.5 లక్షల మంది మోకాలి మార్పిడికి గురవుతున్నారు. ఐదు సంవత్సరాల క్రితంతో పోలిస్తే.. ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న సర్జరీలలో మోకాలి మార్పిడికి సంబంధించిన సర్జరీలు 7 నుంచి 8 రెట్లు ఎక్కువని తెలుస్తోంది.లేటెస్ట్ మిస్సో రోబోట్ లాంచ్ కార్యక్రమంలో మెరిల్లో మార్కెటింగ్ హెడ్, ఇండియా & గ్లోబల్ 'మనీష్ దేశ్‌ముఖ్', సన్‌షైన్ బోన్ చైర్మన్, చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్‌లో జాయింట్ ఇన్స్టిట్యూట్ & మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ 'డాక్టర్ ఏ.వీ గురవ రెడ్డి' పాల్గొన్నారు. ఈ కొత్త రోబోట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. -
రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ
రాయదుర్గం: దేశంలో రోబోటిక్ టెక్నాలజీ గేమ్ చేంజర్ అవుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ (టీఆర్ఐసీ)ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రోబోటిక్స్ రంగంలో అగ్రగామిగా నిలుస్తామని, రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి వచ్చే జూలైలో ‘గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్’ను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. మంగళవారం హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో ‘తెలంగాణ రోబోటిక్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మాట్లా డారు. ఇది ఫ్రేమ్‌వర్క్ కింద అన్ని కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి నోడల్ బాడీగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో స్థిరమైన రోబోటిక్స్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధిలో రాష్ట్రాన్ని కేంద్రంగా చేయడం వంటి లక్ష్యాలతో ‘స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్’ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక ఆటోమేషన్, కన్సూ్యమర్ రంగాల్లో మరింత అభివృద్ధిని సాధించడానికి ఈ ఫ్రేమ్‌వర్క్ దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని స్టార్టప్‌లకు అవసరమైన ఇంక్యుబేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆథరైజేషన్ సపోర్ట్, మార్కెట్ ఇన్సైట్లు, ఇన్వెస్టర్ కనెక్షన్లు తదితరాల కోసం ప్రపంచస్థాయి రోబోటిక్స్ యాక్సిలరేటర్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. రోబోటిక్ టెక్నాలజీ వినియోగంలో చైనా, జపాన్, అమెరికా తర్వాత పదో దేశంగా భారత్ గుర్తింపు పొందుతోందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి, వివిధరంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్, ఆర్ట్ పార్కు ఐఐఎస్సీ, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఏజీహబ్, ఆలిండియా రోబోటిక్స్ అసోసియేషన్ వంటి సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవిలంకా, పలుసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జంతువుల మాదిరిగానే.. మనుషులకు తోక!
ఆధునిక మానవుల పూర్వజీవులు లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో తోకలు కోల్పోవడం జరిగింది. మనుషులకు తోకలు ఉంటే, వయసు మళ్లినా జంతువుల మాదిరిగానే నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటారు కదా అని ఆలోచించారు జపానీస్ పరిశోధకులు. ఆ ఆలోచనతోనే కీయో యూనివర్సిటీ పరిశోధకులు ఒక మీటరు పొడవు ఉండే రోబోటిక్ తోకను రూపొందించారు. వెనుకవైపు వేలాడేలా దీన్ని తొడుక్కుంటే, ఇది అచ్చం జంతువుల తోకల మాదిరిగానే పనిచేస్తుంది. ఈ తోక గడియారంలోని పెండ్యూలంలా కదులుతూ, నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా చేస్తుందని కీయో వర్సిటీ పరిశోధకుడు జునిచి నబెషిమా తెలిపారు. -
మిలటరీలో మరమనిషి
మనిషిని దేవుడు సృష్టిస్తే, ఆయనకు పోటీగా మరమనిషిని మనిషి సృష్టించుకున్నాడు. అంతటితో ఆగక వాటిని మృత్యురూపాలుగా మారుస్తున్నాడు. వీటి వాడకంతో సంప్రదాయ యుద్ధ రూపురేఖలు మార్చేశాడు. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో సృష్టికర్తనే మింగే భస్మాసుర రోబోలు అవతరించడానికి అట్టేకాలం పట్టదంటున్నారు నిపుణులు. మానవ జీవనం మరింత సౌకర్యవంతంగా చేయాలన్న సంకల్పంతో మరమనుషుల రూపకల్పన జరిగింది. కాలక్రమేణా వీటిని మారణహోమం సృష్టించే మిషన్లుగా వాడడం ఆరంభమైంది. సైనిక రంగంలో రోబోల వాడకం నైతికం కాదన్న వాదనలున్నా, వీటి వాడకం మాత్రం పెరిగిపోతూనే ఉంది. యుద్ధరంగంలోకి రోబోటిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ప్రపంచ యుద్ధ నమూనాలను మార్చివేస్తోంది. ప్రస్తుతం మిలటరీలో ఉన్న రోబోలు అటు పోరాటంతో పాటు ఇటు రెస్క్యూ (కాపాడడం) ఆపరేషన్లలో, పేలుడు పదార్థాలను కనిపెట్టి నిర్వీర్యం చేయడంలో, గూఢాచర్యంలో, రవాణాలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. వీటి రాక సాంప్రదాయక యుద్ధ విధానాలను ఒక్కపెట్టున మార్చేసింది. ఆధునిక రోబో సాంకేతికత అందుబాటులో ఉన్న మిలటరీ అత్యంత బలంగా మారుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వాలు నైతికతను పక్కనపెట్టి మరీ, తమ తమ మిలటరీకి మరమనిషి సాయం అందించేందుకు కోట్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 మిలటరీ రోబోల వివరాలు ఇలా ఉన్నాయి. మార్స్ (ఎంఏఏఆర్‌ఎస్) ► మాడ్యులార్ అడ్వాన్స్డ్ ఆర్మ్డ్ రోబోటిక్ సిస్టమ్‌కు సంక్షిప్త నామమే మార్స్. ► ఇది మానవ రహిత రోబో. మిలటరీ ఆవసరాల కోసమే తయారు చేశారు. ► దీంట్లో శాటిలైట్ ట్రాకింగ్ వ్యవస్థను, కెమెరాలను, ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను అమర్చారు. ► గ్రెనేడ్ లాంచర్ లాంటి భయంకర జనహనన ఆయుధాలను దీనికి అనుసంధానిస్తారు. ► ఈ ఆయుధాలను రిమోట్‌తో నిర్వహించి విధ్వంసం సృష్టిస్తారు. ► ధర సుమారు 3 లక్షల డాలర్లు. వేగం గంటకు 11 కిలోమీటర్లు. సఫిర్ (ఎస్ఏఎఫ్ఎఫ్ఐఆర్) ► చూడ్డానికి మనిషిలాగా రెండు కాళ్లతో ఉంటుంది. ► డామేజ్ కంట్రోల్లో మనిషి చేయలేని పనులు చేసేందుకు దీన్ని రూపొందించారు. ► ఇది కూడా మానవ రహిత రోబోనే. ► దూరంలో ఉన్న శత్రు నౌకలను పసిగట్టగలదు. నావికాదళంలో వాడుతున్నారు. ► ధర సుమారు 1.5– 2.25 లక్షల డాలర్లు. గ్లాడియేటర్ ► గ్లాడియేటర్ టాక్టికల్ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్‌ను సంక్షిప్తంగా గ్లాడియేటర్ అంటారు. ► గూఢచర్యం, నిఘా, నిర్దేశిత లక్ష్యాలను గుర్తించడం, అడ్డంకుల ఛేదనలో ఉపయోగిస్తారు. ► దీంతో పాటు అణు, రసాయన ఆయుధాల ప్రయోగాన్ని గుర్తించగలదు. ► అవసరమైతే నేరుగా కాల్పులు జరపగలదు. ► ధర దాదాపు 4 లక్షల డాలర్లు. బిగ్‌డాగ్ ► పేరుకు తగ్గట్లు పెద్ద కుక్క సైజులో ఉంటుంది. ► బోస్టన్ డైనమిక్స్ దీన్ని రూపొందించింది. 100 పౌండ్ల బరువును మోయగలదు. ► ఎలాంటి ఉపరితలాలపైనైనా సులభంగా ప్రయాణం చేస్తుంది. ► దీన్ని మిలటరీ లాజిస్టిక్స్‌లో వాడుతున్నారు. ► సులభమైన కదలికల కోసం పలు రకాల సెన్సార్లు ఇందులో ఉంటాయి. ► ధర దాదాపు 74 వేల డాలర్లు. డోగో ► ఎనిమిది మైక్రో వీడియో కెమెరాలున్న ఈ రోబో 360 డిగ్రీల కోణంలో చూస్తుంది. ► ఇందులో ఉన్న తుపాకీ గురితప్పకుండా పేల్చేందుకు మరో రెండు బోరోసైట్ కెమెరాలుంటాయి. ► రేంజర్ రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తారు. జనరల్ రోబోటిక్స్ తయారు చేస్తోంది. ► ఈ రోబోను భారతీయ ఎన్ఎస్జీ వాడుతోంది. ► ధర సుమారు లక్ష డాలర్లు. పెట్‌మాన్ ► ప్రొటెక్షన్ ఎన్సెంబుల్ టెస్ట్ మానిక్విన్ సంక్షిప్త నామమే పెట్‌మాన్. ► ఇది చూడ్డానికి మనిషిలాగా ఉండే హ్యూమనాయిడ్ రోబో. ► మానవ సైనికుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి రూపొందించారు. ► ఇది మనిషిలాగా నడవడం, పాకడం, పరిగెత్తడంతో పాటు చెమట కూడా కారుస్తుంది. ► భవిష్యత్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌లో వాడబోతున్నారు. ► దీని రూపకల్పనకు దాదాపు 2.6 కోట్ల డాలర్లు ఖర్చైందని బోస్టన్ డైనమిక్స్ తెలిపింది. అట్లాస్ ► ఎమర్జెన్సీ సేవల కోసం రూపొందించారు. ► ప్రమాదకరమైన వాల్వులను మూసివేయడం, తెరుచుకోని బలమైన తలుపులను తెరవడం, మనిషి వెళ్లలేని వాతావరణ పరిస్థితుల్లోకి వెళ్లి రావడం చేయగలదు. ► చూడటానికి మరుగుజ్జులాగా కనిపిస్తుంది. ► గాల్లోకి దూకడం, వేగంగా పరిగెత్తడం చేయగలదు. ► ధర సుమారు 75 వేల డాలర్లు. గార్డ్‌బోట్ ► రక్షణ మిషన్లలో పాలుపంచుకుంటూనే పరిస్థితులను వీడియో తీసి లైవ్ స్ట్రీమింగ్ చేయగలగడం దీని ప్రత్యేకత. ► గుండ్రంగా బంతిలాగా ఉండే ఈ రోబో ఉభయచర రోబో. ► నేలపై, నీళ్లలో ప్రయాణించగలదు. ► బురద, మంచును లెక్క చేయకుండా దొర్లుకుంటూ పోగలదు. ► నిఘా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. ► ధర సుమారు లక్ష డాలర్లు. పీడీ100 బ్లాక్ హార్నెట్ ► ఫ్లిర్ సిస్టమ్స్ తయారీ. ఎక్కువగా గూఢచర్యంలో ఉపయోగపడతుంది. ► వాడుకలో ఉన్న అతిచిన్న డ్రోన్ రోబో. కీటకం సైజులో కనిపిస్తుంది. ► భారత్ సహా పలు దేశాల మిలటరీలు చాలా రోజులుగా వాడుతున్నాయి. ► దీన్ని అపరేట్ చేసే విధానాన్ని కేవలం 20 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. ► అరగంట చార్జింగ్‌తో అరగంట పాటు గాల్లో తిరగగలదు. ► గరిష్ఠ వేగం గంటకు 21 కిలోమీటర్లు. ధర దాదాపు 1.95లక్షల డాలర్లు. ఎల్ఎస్3 ► లెగ్గడ్ స్క్వాడ్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. ► నాలుగు కాళ్లుండే ఈ రోబో సైనికులకు సామాన్లు మోసే గుర్రంలాగా ఉపయోగపడుతుంది. ► ఎలాంటి ఆర్డర్లు లేకుండానే నాయకుడిని ఫాలో కావడం దీని ప్రత్యేకత. ► చిన్న పాటి వాయిస్ కమాండ్స్‌ను ఆర్థం చేసుకుంటుంది. ► 400 పౌండ్ల బరువును మోయగలదు. ► బిగ్‌డాగ్ రోబోతో పోటీ పడుతుంది. ► ధర దాదాపు లక్ష డాలర్లు. ఎంతవరకు కరెక్ట్? మిలటరీలో రోబోలను ప్రవేశపెట్టడం వల్ల ఉపయోగాలున్నాయనేవారికి సమానంగా వీటి వాడకాన్ని వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. సైనిక రోబోలతో మానవ సైనికుల ప్రాణాలను రక్షించవచ్చు. మనిషిలాగా వీటికి అలసట రాదు. కనురెప్ప వాల్చకుండా కాపలా కాస్తాయి. వానకు, ఎండకు బెదరవు. మానవ సంబంధ బలహీనతలకు లొంగవు. ముఖ్యంగా యుద్ధమంటే ఏ దశలో కూడా భయం చెందవు. వీటి గురి తప్పదు. వీటితో సమయం ఆదా అవుతుంది. మనిషి చేయలేని పనులను కూడా చేయగలవు. అందుకే వీటిని వాడడం మంచిదేనంటారు సమర్ధకులు. అయితే ఈ వాదనను మానవ హక్కుల కార్యకర్తలు, ఎన్జీఓలు వ్యతిరేకిస్తుంటాయి. కిల్లర్ రోబోల వాడకం నైతిక విలువలకు దూరమని వీరి వాదన. ఎదుటి పక్షం సైనికులు కూడా మనుషులేనని ఇవి గుర్తించవు. వారిని దయాదాక్షిణ్యం లేకుండా ఈ రోబోలు క్రూరంగా మట్టుబెడతాయి. వీటి ఖరీదు చాలా అధికం. అందువల్ల ధనిక దేశాలు మాత్రమే భరించగలవు. ఇది ఆయా దేశాలకు మిగిలిన బలహీన దేశాలపై పైచేయినిస్తుంది. యుద్ధం మధ్యలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఒక్కమారుగా పరిస్థితి తలకిందులవుతుంది. అన్నిటికి మించి మితిమీరిన సాంకేతికతతో ఈ రోబోలు స్వతంత్రంగా మారితే జరిగే పరిణామాలు భయానకంగా ఉంటాయని కిల్లర్ రోబోల వ్యతిరేకులు హెచ్చరిస్తున్నారు. ఎవరివాదన ఎలాఉన్నా ప్రస్తుతానికి ప్రభుత్వాలు మాత్రం వీటి వాడకాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
ఇక మీ పని అయిపోయినట్లే.. మేము వచ్చేస్తున్నాం!
ప్రపంచం చాలా వేగంగా దూసుకెళ్తుంది.. ఎంతగా అంటే ప్రస్తుత పరిస్దితుల్లో మనుషులు చేసే పనులను కూడా రోబోలతో చేయిస్తున్నాము. మనుషులకు వీలుకానీ పనులను కూడా రోబోల సహాయంతో సునాయాసంగా చేసేస్తున్నాము. నేటికాలంలో రోబోలు లేని రంగం లేదు, అయినా మనిషి ఆశ తీరడం లేదు. ఇంకా తాను చేయలేని పనులెన్నింటినో రోబో చేత చేయిస్తున్నాడు. అందుకని, వాటికి కృత్రిమ మేధను జోడించాడు. పక్షులూ జంతువుల కదలికలు నేర్పాడు. ఎక్కడికక్కడ మనిషి అవసరానికి తగిన ఆకారాన్నిచ్చాడు. ఈ క్రమంలోనే బోస్టన్ డైనమిక్స్ గ్రూప్ నుండి వచ్చిన ఒక క్వాడ్రప్డ్ రోబో కుక్క చూడాటానికి నిజమైన కుక్కలాగే కనిపిస్తుంది. ఈ క్వాడ్రప్డ్ రోబోట్ కుక్కలను సైనికులకు సహాయం చేయడానికి పరీక్షిస్తున్నారు. యుఎస్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ నిర్మించిన ఒక ప్రసిద్ధ క్వాడ్రప్డ్ కుక్కను శత్రువులు సవాలు చేసే భూభాగాన్ని రక్షించడానికి ఫ్రెంచ్ మిలిటరీ ఇటీవల పరీక్షించింది. వీటిలో కెమెరాలు, రిమోట్ కంట్రోల్ ఉంటాయి. ఇప్పుడు ఘోస్ట్ రోబోటిక్స్ అనే యుఎస్ సంస్థ క్వాడ్రుపెడల్ మానవరహిత గ్రౌండ్ వెహికల్స్(క్యుజివిలు) అనే క్వాడ్రప్డ్ రోబోట్లను తయారు చేస్తుంది. అసోసియేషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ 2021 వార్షిక సదస్సులో ఈ యంత్రాన్ని మొదటిసారి ప్రదర్శించారు. (చదవండి: జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి) Latest lethality 6.5 #creedmoor sniper payload from @SWORDINT. Check out the latest partner payloads @AUSAorg Wash DC. Keeping US and allied #sof #warfighter equipped with the latest innovations. @USSOCOM #defense #defence #NationalSecurity #drone #robotics pic.twitter.com/Dvk6OvL3Bu — Ghost Robotics (@Ghost_Robotics) October 11, 2021 అయితే, రోబోట్లను సైనికులకు సహాయం చేసేందుకు తయారు చేస్తున్నారు. ఈ క్వాడ్రప్డ్ రోబోట్లు చిత్తడి ప్రాంతాలలో వారికి సహాయం చేస్తాయి. QUGV రోబోట్లు చిన్న స్వోర్డ్ ఇంటర్నేషనల్ కస్టమ్ గన్ కలిగి ఉంటాయి. ఇది 30ఎక్స్ ఆప్టికల్ జూమ్ కలిగి ఉంది. రోబోట్ కుక్కలను విజన్ 60 యుజివిలు లేదా "స్వయంప్రతిపత్త మానవరహిత గ్రౌండ్ వెహికల్స్" అని పిలుస్తారు. వీటిని ఘోస్ట్ రోబోటిక్స్ ఆఫ్ ఫిలడెల్ఫియా తయారు చేసింది. చీకటిలో లక్ష్యంగా చేరుకోవడానికి థర్మల్ కెమెరా కలిగి ఉంది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డాటా అనలిటిక్స్ ఆధారంగా ఇది పనిచేస్తాయి. క్షిపణులు లేదా ఇతర మార్గాలల్లో శత్రు దేశాలు మాతృభూమిపై చేసే దాడులను పసిగట్టి, సమాచారాన్ని చేరవేస్తాయి. భవిష్యత్ యుద్ధభూమిలో, శత్రువుతో సమర్థవంతంగా పోరాడటానికి ఎంతో ఉపయోగపడతాయి. (చదవండి: క్రికెట్ ప్రియులకు ఇక పండగే.. మల్టీప్లెక్స్‌ల్లో టీ-20 ప్రపంచకప్ లైవ్ మ్యాచ్‌లు) -
Smartphone Zombies: ‘మూడో కన్ను’... ప్రమాదాన్ని ముందే చెప్పేస్తుంది!
సియోల్ : భవిష్యత్తు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్ రంగాలదేనని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఫ్యూచర్లో ఎన్నో అద్భుతాలు చేయగల సత్తా రోబోటిక్స్, ఏఐకి ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ రెండింటి కలయికలో ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి.. ఆ పరంపరలో వచ్చిన మరొక ఆవిష్కరణ థర్డ్ ఐ. మన కంటే ఎక్కువగా మన కదలికలను గమనిస్తూ .. ప్రమాదాలు వచ్చినప్పుడు హెచ్చరించి కాపాడే కృతిమ కన్ను.. సాంకేతిక త్రినేత్రం. ఇంతకీ దీని అవసరం ఎందుకు వచ్చింది... ఇది ఎలా పుట్టుకు వచ్చింది....?! స్మార్ట్ ఫోన్ జాంబీస్!. కొంతమంది పాదాచారులు, లేదంటే వాహనదారులు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు లోకాన్ని మరిచిపోతుంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోరు.అలాంటి వారి కోసం టెక్ నిపుణులు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన పేంగ్ మిన్ వూక్' రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఇంపీరియల్ కాలేజీలో ఇన్నోవేషన్ డిజైన్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. స్మార్ట్ వినియోగదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి వారి ప్రాణాల్ని రక్షించేందుకు రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి మనిషి చూసేందుకు మూడో కన్నును తయారు చేశాడు. "ఫోనో సేపియన్స్ అని పిలిచే థర్డ్ ఐను నుదిటిపై పెట్టుకునేలా డిజైన్ చేశాడు. ఈ 'థర్డ్ ఐ' రోడ్డు ప్రయాణాల్లో, లేదంటే నడిచే సమయంలో ఫోన్ బ్రౌజ్ చేసే సమయంలో అలెర్ట్ చేస్తోంది. పరిసరాల్ని గమనించడం లేదని అనిపిస్తే సిగ్నల్ ఇస్తోంది. ఒకటి నుండి రెండు మీటర్ల లోపు రోబోయే ప్రమాదాల్ని హెచ్చరిస్తూ బీప్ సౌండ్ చేస్తోంది. ప్రస్తుతం పేంగ్ మిన్ వూక్ తయారు చేసిన ఈ థర్డ్ ఐ సియోల్ నగరంలో చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఈ ఫోనో సేపియన్స్ కు కెమెరా మాడ్యూల్తో లింక్డ్ మొబైల్ ఫోన్ యాప్ ను డెవలప్ చేయాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ కు తెలిపాడు. "అతను నుదిటిపై కన్ను ఉన్న గ్రహాంతరవాసిలా కనిపిస్తున్నాడు అని సియోల్ నివాసి లీ ఓక్-జో చెప్పారు. "ఈ రోజుల్లో చాలా మంది యువకులు తమ మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి వారికి ఇది మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. "ఇది చాలా బాగుంది . అంతేకాదు ఆసక్తికరంగా కూడా ఉంది" అని 23 ఏళ్ల షిన్ జే-ఇక్ అన్నాడు. వీధుల్లో వెళ్లే సమయంలో పరిసరాల్ని మరిచిపోతాం. ఈ థర్డ్ ఐ తో చుట్టుపక్కల పరిసరాలతో సంబంధం లేదు. ఇప్పుడు దీని అవసరం నాకు లేదు. కాని పెంగ్ విక్రయిస్తే ఖచ్చితంగా కొనుక్కుంటానని చెప్పాడు. చదవండి : సింపుల్ ట్రిక్, వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చూడొచ్చు -
మరో ఎనిమిదేళ్లలో రోబోటిక్ గుండె..
లండన్ : హృద్రోగాలకు అత్యాధునిక పద్ధతుల్లో చికిత్సలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో 2028 నాటికి గుండె మార్పిడి స్ధానంలో రోబోటిక్ హార్ట్‌ను అమర్చే ప్రక్రియ ఊపందుకోనుంది. ఈ దిశగా నెదర్లాండ్స్, కేంబ్రిడ్జి, లండన్‌లకు చెందిన వైద్య నిపుణులు సాఫ్ట్ రోబోట్ హార్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మూడేళ్లలోగా జంతువుల్లో తొలి నమూనాగా దీన్ని ఇంప్లాంట్ చేసే లక్ష్యంతో వారు పరిశోధనలు ముమ్మరం చేశారు. గుండె జబ్బుల చికిత్సను కొత్తపుంతలు తొక్కించే ఆవిష్కరణలకు ఇచ్చే 30 మిలియన్ యూరోలు చెల్లించే ప్రైజ్‌కు ఎంపికైన నాలుగు ప్రాజెక్టుల్లో రోబోటిక్ హార్ట్ ఒకటిగా ఎన్నికైంది. రోటోటిక్ హార్ట్‌తో పాటు గుండె జబ్బుకు వ్యాక్సిన్ రూపకల్పన, గుండె లోపాలను సరిచేసే జన్యు చికిత్స, గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, స్ర్టోక్స్ను ముందే పసిగట్టే వేరబుల్ టెక్నాలజీలు ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపికయ్యాయి. ఈ బహుమతిని స్పాన్సర్ చేస్తున్న బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు40 దేశాల నుంచి 75 దరఖాస్తులు అందాయి. ఇక పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న రోబోటిక్ గుండె శరీరమంతటికీ రక్తాన్ని పంప్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. మానవులకు ఈ గుండెను అమర్చే ప్రక్రియ మరో ఎనిమిదేళ్లలో అంటే 2028 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశోధకులు శ్రమిస్తున్నారు. చదవండి : 9.7 కి.మీ.. 12 నిమిషాలు -
ఇది భలే బంతి ‘బల్లీ’
-
ఇది భలే బంతి ‘బల్లీ’
లాస్ ఏంజెలిస్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న వినియోగదారుల ప్రదర్శనలో శ్యామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బంతి రూపంలో ఉన్న ఓ చిన్న రోబోను మంగళవారం ఆవిష్కరించింది. బల్లీగా నామకరణం చేసిన ఈరోబో వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది దానికున్న చిన్న చక్రాల ద్వారా ఇల్లంతా తిరుగుతూ అందులో అమర్చిన కెమెరా ఇంటికి కాపలా కాస్తుంది. ఇంటికి వచ్చే , పోయే వారి గురించి యజమానిని హెచ్చరిస్తుంది. పెద్ద వాళ్లు ఇంట్లో నడిచేందుకు తోడ్పడుతుంది. అది మన ముందంటే ముందు, మన వెనకంటే వెనక నడుస్తూ కదలికలను రికార్డు చేస్తుంది. రమ్మంటే వస్తుంది. దూరంగా పొమ్మంటే పోతుంది. సెల్‌ఫోన్ ద్వారానే కాకుండా వాయిస్ కాల్‌తో కూడా ఈ బంతి లాంటి రోబో స్పందిస్తుంది. హలో అంటే హలో చెబుతుంది. పెద్ద వాళ్ల చేతుల్లో రిమోట్ కంట్రోల్లా కూడా పనిచేయడం ఇందులో ఉన్న ఇంకో విశేషం. ఈ రోబో టీవీ, టేప్ రికార్డర్, రేడియో లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ ఆన్ చేయమంటే ఆన్ చేస్తుందీ, ఆఫ్ చేస్తుంది. మనం ఇంట్లో లేనప్పుడు ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలకు కంపెనీ ఇవ్వడం ఇందులోని మరో విశేషం. శ్యామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సీఈవో హెచ్ఎస్ కిమ్ దీన్ని ప్రదర్శించి చూపారు. -
ఆ రెస్టారెంట్లో...చంపా, చమేలి
-
ఆ రెస్టారెంట్లో...చంపా, చమేలి
నేటి కాలంలో ప్రతీ పనికి టెక్నాలజీ సాయాన్ని కోరుకుంటున్నారు. మనుషులు చేయాల్సిన పనులను రోబోలతో చేయిస్తున్నారు. ఈ క్రమంలో రెస్టారెంట్లలోనూ రోబో సేవల వినియోగం నానాటికీ పెరుగుతోంది. అయితే ఇది అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ నెమ్మదిగా ఇండియాకు విస్తరిస్తోంది. తాజాగా మొదటి రోబోటిక్ రెస్టారెంట్ ఒడిశాలోని భువనేశ్వర్‌లో బుధవారం ప్రారంభమైంది. కాగా ఉత్తర భారతదేశంలోనే మొదటి రోబోటిక్ హోటల్ కావటం విశేషం. భువనేశ్వర్‌లోని చంద్రశేఖర్‌పూర్ ప్రాంతంలో ప్రారంభమైన ‘రోబో చెఫ్’ రెస్టారెంట్లో మనుషులతోపాటు రెండు రోబోలు తిరుగాడుతూ ఉంటాయి. చంపా, చమేలి అనే రోబోలు కస్టమర్లకు ఆహారాన్ని సర్వ్ చేసి, అనంతరం ‘మీరు సంతోషంగా ఉన్నారా’ అని వారి అభిప్రాయాల్ని అడిగి తెలుసుకుంటాయి. భారత్‌లోనూ ఇలాంటి రెస్టారెంట్లు ఉన్నప్పటికీ ఈ రోబో చెఫ్ రెస్టారెంట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పనిచేసే రోబోలకు ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇవ్వాల్సిన పనిలేదు. వాటంతటవే కదులుతాయి. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లను నేరుగా సర్వ్ చేస్తాయి. పైగా ఈ రెండు రోబోలు మేడ్ ఇన్ ఇండియా స్ఫూర్తితో భారత్‌లోనే తయారవటం విశేషం.రెస్టారెంట్ యజమాని జీత్ బాసా అమెరికా వెళ్లినప్పుడు అక్కడి రెస్టారెంట్లలో విరివిగా రోబోల వినియోగాన్నిచూశాడు. పైగా ఆయన సివిల్ ఇంజనీర్ కావటంతో ఆలోచనకు అతని అనుభవం తోడైంది. దీంతో రూ.5.5 లక్షల ఖర్చుతో రోబోలను తయారు చేశాడు. జీత్ బాసా మాట్లాడుతూ ఈ రోబోలు స్లామ్ (సిమల్టేనియస్ లోకలైజేషన్ అండ్ మ్యాపింగ్) టెక్నాలజీతో పనిచేస్తాయన్నారు. వీటిలో 17 రకాల సెన్సార్లు ఉంటాయని, వాటి సహాయంతో ప్రకృతిని, వేడిని, పొగ, మనుషులను గుర్తుపడతాయన్నారు. అంతేకాక మనుషులను పలకరిస్తూ, వారికి స్వాగతం కూడా తెలుపుతాయని పేర్కొన్నారు. ఇక వాటికి ఆర్డర్లను స్వీకరించే సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి కస్టమర్లకు సర్వ్ చేయడం వరకే పరిమితం చేశాడు. వీటిని ఒక్కసారి రీచార్జ్ చేస్తే ఎనిమిది గంటలపాటు నిరంతరాయంగా పని చేస్తాయి. 20 కిలోల బరువును కూడా సునాయాసంగా ఎత్తగలుగుతాయి. వీటిని చార్జ్ చేయటానికి కూడా తేలికే. కేవలం అరగంటలో ఫుల్ చార్జ్ అవుతాయి. -
‘సీనియర్స్’ కోసం..
రోబో నడిపిస్తుంది.. ఒకప్పుడు వృద్ధులకు ఊతకర్రలే సాయంగా ఉండేవి. ఇప్పుడు వృద్ధుల కోసం ఆధునిక టెక్నాలజీతో ఒక రోబోటిక్ కర్ర అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన భారతీయుడు సునీల్ అగర్వాల్ నేతృత్వం లోని ఓ బృందం ఈ రోబో కర్ర తయారు చేసింది. ఈ రోబోటిక్ కేన్ ద్వారా వృద్ధులు సునాయాసంగా నడక సాగించే వీలు కలుగుతుంది. ఈ కేన్‌ను పట్టుకుని నడిస్తే.. వారు ఎలా అడుగులు వేస్తున్నారు..ఒక్కో అడుగు వేసేందుకు ఎంత సమయం తీసుకుంటున్నారు.. వంటి విషయాలను దీనిలోని సెన్సర్లు అంచనా వేస్తాయి. తర్వాత దానంతట అదే ఆ కర్ర కదులుతుంది.మొబైల్ రోబోకు ఇది అనుసంధానంగా పనిచేస్తుందని అగర్వాల్ పేర్కొన్నారు. దీన్ని పట్టుకుని నడిస్తే పక్కన ఓ వ్యక్తి ఉండి వారిని నడిపించినట్లే ఉంటుందని చెప్పారు. ఈ యాప్ చెప్పేస్తుంది.. ఒంటరిగా ఉండే వృద్ధులను అనుక్షణం గమనిస్తుండాలి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. దీని కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన విద్యార్థులు ఛ్చిట్ఛ4u అనే మొబైల్ యాప్ రూపొందించారు. వృద్ధులకు ఇది సంరక్షకురాలిగా పనిచేస్తుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఇంట్లో ఉన్న వృద్ధులు, వారి పిల్లల ఫోన్లలో దీన్ని ఇన్స్టాల్ చేస్తే చాలు చాలా పనులు చేసేస్తుంది. దీని ద్వారా చాటింగ్, కాల్స్ చేయొచ్చు. క్యాబ్‌లు బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ మందులు వేసుకోవాలో ఒకసారి ఫీడ్ చేస్తే చాలు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంది. వారు ఎప్పుడైనా కిందపడితే వెంటనే దానికి అనుసంధానం చేసిన వారి నంబర్‌కు ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది. వృద్ధులు ఉన్న లొకేషన్ షేర్ చేస్తుంది. ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో ఇది పనిచేసేలా డిజైన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వారు 5.8 కోట్లు. అంటే ప్రతి సెకనుకు ఇద్దరు వ్యక్తులకు 60 ఏళ్లు నిండుతున్నాయి. చైనా తర్వాత అత్యధిక మంది వృద్ధులు ఉన్న దేశం మనదే. 2050 నాటికి ప్రపంచంలో 15 ఏళ్ల పిల్లలకన్నా వృద్ధులే అధికంగా ఉంటారట. మన దేశంలో 2026 నాటికి వృద్ధుల జనాభా 17.3 కోట్లకు పెరగనుంది. భారత్‌లో కేరళలో వయోధికులు 12.6 శాతం మంది ఉన్నారు. గోవాలో 11.2 శాతం, తమిళనాడులో 10.4 శాతం, పంజాబ్‌లో 10.3 శాతం, హిమాచల్ ప్రదేశ్‌లో 10.2 శాతం ఉన్నారు. అతి తక్కువ మంది వృద్ధులున్న రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్ తొలిస్థానంలో ఉంది. ఇక్కడ 4.6 శాతం మంది ఉన్నారు. మేఘాలయలో 4.7 శాతం. నాగాలాండ్‌లో 5.2 శాతం. మిజోరంలో 6.3 శాతం.. సిక్కింలో 6.7 శాతం మంది వృద్ధులు ఉన్నారు. (నేడు సీనియర్ సిటిజన్ డే) -
నాట్స్ ఆధ్వర్యంలో రోబోటిక్ వర్క్ షాప్
ఫ్లోరిడా : అమెరికాలో తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా టెంపాలో ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్ధుల్లో సృజనాత్మకత పెంచడంతో పాటు వారిలో రోబోటిక్ సైన్స్ పై మరింత అవగాహన పెంచేందుకు రోబోటిక్ వర్క్ షాప్ నిర్వహించింది. ఇన్ క్రెడిబజ్ సంస్థ ద్వారా నిర్వహించిన ఈ రోబోటిక్ అవగాహన సదస్సుకు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. 8 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న విద్యార్ధులు ఈ అవగాహన సదస్సుకు వచ్చి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. అసలు రోబోటిక్ టెక్నాలజీ అంటే ఏమిటి..? రోబోలు ఎలా డిజైన్ చేస్తారు..? అవి ఎలా రన్ అవుతాయి..? వీటి గురించి ఎలా రీసెర్చ్ చేయాలి..? టీమ్ వర్క్ తో రోబోటిక్ ఇంజనీరింగ్ లో ఎలా అద్భుతాలు సాధించవచ్చు అనే అంశాలపై ఈ సదస్సులో ఇంక్రెడి బజ్ ప్రతినిధులు త్రిష, సమర్త్, శివ్, నిత్యా, అనిష్, శాట్ తో పాటు కోచ్ లు మనోజ్ కాశీభట్ల, సాయి శాఖమూరిలు విద్యార్ధులకు అవగాహన కల్పించారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో పండితులైన ఆచార్యులు డా హర్వే విద్యార్ధులకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. విద్యార్ధులతో పాటు వచ్చిన తల్లిదండ్రులు కూడా రోబో టెక్నాలజీ కొత్త సంగతులు తెలుసుకున్నారు. తమ పిల్లలను రోబో టెక్నాలజీ వైపు ప్రోత్సాహించడానికి ఈ అవగాహన సదస్సు ఎంతగానో ఉపయోగపడిందని విద్యార్ధుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మంచి సదస్సు నిర్వహించినందుకు టెంపా నాట్స్ చాప్టర్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
మురుగు శుద్ధికి ఇక రోబోటిక్ టెక్నాలజీ
సాక్షి,సిటీబ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్‌మిషన్‌లో భాగంగా ప్రకటించిన బహిరంగ మలవిసర్జన రహితం(ఓడీఎఫ్)తోపాటు రాష్ట్రంలోని మున్సిపాల్టీలను మెరుగైన పారిశుద్ధ్యంతో ఓడీఎఫ్ ప్లస్ నగరాలుగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మురుగునీటి పైప్లైన్లు, మ్యాన్‌హోళ్లను శుద్ధిచేసే అధునాతన రోబోటిక్ సాంకేతికత పనితీరును ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీవరేజి కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే రోబోటిక్ సాంకేతికను అమలు చేస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం జలమండలి చేపట్టే నూతన ప్రాజెక్టు వ్యయంలో 0.25 శాతం సెస్ వసూలు చేసి కార్మికుల సంక్షేమం, నూతన సాంకేతిక ఆవిష్కరణల అమలు కోసం వినియోగిస్తామని ప్రకటించారు. ఇప్పటికే కార్మికులు నేరుగా మురుగునీటి పైప్లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగకుండా జలమండలి 73 మినీ జెట్టింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు మరో 70 యంత్రాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మొత్తం 143 జెట్టింగ్ యంత్రాలకు తోడుగా అవసరమయితే మరిన్ని యంత్రాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఇటీవల ఉప్పల్‌లో ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. సదరు కంపెనీపై చర్యలు తీసుకోవడంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక సీఐపీపీ సాంకేతికతో రోడ్డును తవ్వకుండానే ఎన్టీఆర్ మార్గ్‌లో శిథిలమైన పైపులైనుకు పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో మురుగు,మంచినీటి పైపులైన్ల జాడ తెలిపేందుకు జలమండలి అధికారులు జీఐఎస్ మ్యాపులు సిద్ధంచేయాలని ఆదేశించారు. నగరంలో వికేంద్రీకృత మురుగుశుద్ధికేంద్రాలు.. గ్రేటర్లో ఎస్టీపీల వ్యవస్థను వికేంద్రీకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం మూసీ నదిపై ఉన్న ఎస్టీపీలతో పాటు నాలాలపై ఎక్కడికక్కడ మినీ ఎస్టీపీలు నిర్మించనున్నట్లు తెలిపారు. ముందుగా 3.2 కిమీ పొడవు ఉన్న కూకట్పల్లి నాలాపై ప్రయోగాత్మకంగా మినీ ఎస్టీపీలు నిర్మించనున్నామన్నారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను సంపూర్ణ ప్రక్షాళన చేసేందుకు డ్రైనేజీ నీరు చెరువుల్లో చేరకుండా చూస్తామన్నారు. నగరంలో 100 ఫ్లాట్ల కంటే అధికంగా ఉన్న అపార్ట్మెంట్లలో తప్పనిసరిగా మినీ ఎస్టీపీలు నిర్మించుకోవాలని సూచించారు. జలమండలి ఎండీ దానకిషోర్‌కు అభినందనలు.. జలమండలి ఎండీగా దానకిషోర్ బాధ్యతలు చేపట్టిన తరువాత విప్లవాత్మక సంస్కరణలు, ఆవిష్కరణలు తీసుకువచ్చారని అభినందించారు. గ్రాండ్ పేరెంట్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ వినూత్న కార్యక్రమంతో జలంజీవం, ఇంకుడుగుంతలపై చిన్నపిల్లలకు అవగాహన కల్పించడం విశేషమన్నారు.నూతన సాంకేతికత వినియోగంలో జలమండలి అం దరికంటే ముందుందని ప్రశంసించారు. ము న్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్, జలమండలి ఈడీ సత్యనారాయణ,డైరెక్టర్లు అజ్మీ రాకృష్ణ,విజయ్‌కుమార్‌రెడ్డి,రవి,శ్రీధర్‌బాబు,సత్యసూర్యనారాయణ,సఫాయి కర్మచారి ఆందోళన్ అధ్యక్షుడు బెజవాడ విల్సన్ తదితరులున్నారు. నూతన రోబోటిక్ టెక్నాలజీ వివరాలు రోబోటిక్ 360 డిగ్రీస్ కెమెరా : బెంగుళూరుకు చెందిన సానిటర్ సంస్థ రూపొందించిన ఈ కెమెరాను మ్యాన్‌హోల్ ద్వారా సెవరెజీ పైప్లైనులోకి ప్రవేశపెడితే.. మురుగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న వస్తువులను గుర్తిస్తుంది. ఆపరేటర్ చేతిలోని రిమోట్ ద్వారా కెమెరాను పైపులో 360 డిగ్రీస్ తిప్పి అందులో అడ్డుగా ఉన్న వాటిని గుర్తించవచ్చు. కెమెరాకు దాదాపు 30 మీటర్ల పొడవున్న కేబుల్ ఉంటుంది. ఇది డ్రైనేజీ లైనులో 30మీటర్ల వరకు వెళుతుంది. కెమెరా పైపులో వెళుతుంటే పైన ఉన్న మానిటర్లో మనకు కెమెరా చిత్రికరించే వీడియోలను చూడవచ్చు. సెవర్ క్రాక్ రోబో సానిటర్ సంస్థ రూపొందించింన మినీ రోబోనే సెవర్ క్రాక్. దాదాపు 12 కిలోల బరువుండే ఈ రోబో సెవరెజీ పైపులైను అడ్డుగా ఉన్న వస్తువులను తొలగిస్తుంది. ముందుగా ఈ యంత్రాలను జెట్టింగ్ యంత్రాలకు అనుసంధానం చేస్తారు. గుండ్రంగా ఉన్న ఈ యంత్రానికి మూడు వైపులా ఆరు వరుసల్లో చిన్న చక్రాలు ఉంటాయి. వీటి సాయంతో యంత్రం సులువుగా ముందుకు సాగుతుంది. ఒకవేళ వాహనం బోల్తా పడినప్పటికీ మరో వైపు ఉన్న చక్రాల ద్వారా ముందుకు కదులుతుంది. అలాగే వీటికే ముందు భాగంలో బలమైన బ్లేడులు ఉండడంతో అడ్డుగా ఉన్న వస్తువును ముక్కలుగా కట్‌చేస్తుంది. రాళ్లు ,మట్టి, ప్లాస్టిక్ తదితర ఘన వ్యర్థాలు,ధృడమైన పదార్థాలను సైతం సులువుగా కట్‌చేస్తుంది. దీంతో మురుగు ప్రవాహాం సాఫీగా> సాగుతుంది. ఎప్పుడైనా మురుగు ప్రవాహానికి ఏ దైనా అడ్డుగా ఉంటే వెంటనే వీటిని రంగంలోకి దింపి ప్రవాహాన్ని సాఫీగా వెళ్లేలా చూడవచ్చు. గ్యాస్ డిటెక్టర్ తాగునీరు,మురుగునీటి పైపులైన్లలో ఉత్పన్నమయ్యే విష వాయువులను గుర్తించడానికి ఈ గ్యాస్ డిటెక్టర్లను వినియోగించవచ్చు.దీనికి ఉ న్న అబ్జర్వర్‌ను మ్యాన్‌హోళ్ల గుండా పైపులైన్ లోనికి పంపితే విషవాయువుల ఉనికిని గుర్తిస్తుంది. ఇక దీనికున్న డిటెక్టర్ ద్వారా పైప్‌లైన్‌లో వెలువడే మిథేన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ తదితర విష వాయువులను గుర్తిస్తుంది. దీంతో పారిశుద్ద్య పనులు చేపట్టే కార్మికుల జీవితాలకు భద్రత చేకూరుతుంది. -
ముగిసిన ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ – 2017
- హాజరైన 1200 మందికిపైగా శాస్త్రవేత్తలు, విద్యా, వ్యాపారవేత్తలు - మానవరహిత వాహనాల తయారీ, రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధే ధ్యేయం - 2018 ఇండియన్ కాంగ్రెస్ నాటికి మంచి ఫలితాలు సాధిస్తామన్న ఐటీసీ చైర్మన్ - ‘సాక్షి’కి ప్రత్యేక అభినందనలతోపాటు సర్టిఫికెట్ బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐదేళ్ల కిందట జర్మనీలో మొదలైన పారిశ్రామిక విప్లవం (4.0) అభివృద్ధి చెందిన దేశాల్లో వేగంగా ఫలితాలు ఇస్తోంది. ఈ క్రమంలో ఇండియా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో పురోగతిని సాధించాలని, ఆ దిశగా శాస్త్రవేత్తలు, పారిశ్రామిక, విద్యావేత్తలు దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలని ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ చైర్మన్ ఎల్.వి.మురళీకృష్ణారెడ్డి అన్నారు. బెంగళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు జరిగిన సదస్సు శుక్రవారం ముగిసింది. కార్యక్రమానికి ఐటీసీ నేషనల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఆర్ఎం వాసగన్ అధ్యక్షత వహించారు. ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సీజే జగదీశా నివేదిక సమర్పించారు. సదస్సుకు 1200 మందికిపైగా స్వదేశీ, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. పారిశ్రామిక, టెక్నాలజీ, వ్యవసాయ రంగాలపై 121 ప్రజంటేషన్లు ఇచ్చారు. పారిశ్రామిక రంగం లో 4, వ్యవసాయ రంగంలో 9 తీర్మానాలు చేశారు. 2025 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యం 2018 కాంగ్రెస్ నాటికి ఈ తీర్మానాల ఫలితాలు సాధించేలా అంతా చొరవ చూపాలని మురళీ కృష్ణారెడ్డి కోరారు. 2025 నాటికి భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధిని సాధించేలా చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. పారిశ్రామిక, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు అంకిత భావంతో పనిచేసి సరికొత్త టెక్నాలజీని అందించాలన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో శ్రామికుల కొరత తీవ్రంగా ఉందని, భవిష్యత్‌లో ఇది మరింత ప్రమాదకర స్థాయికి చేరుతుందన్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే రోబోటిక్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నారు. దీనివల్ల సమస్య పరిష్కారంతోపాటు కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ప్రస్తుతం భారత్ తయారీ రంగంలో వేగంగా అభివృద్ధి సాధిస్తోందని, 2050 నాటికి ప్రపంచానికే భారత్ తయారీ కేంద్రంగా మారాలన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ పట్నాయక్ ప్రజంటేషన్ అందరినీ ఆకట్టుకుంది. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి బెల్ కంపెనీ డైరెక్టర్ డాక్టర్ రవిశంకరన్ మాట్లాడుతూ భారత్‌లో పారిశ్రామిక విప్లవం వెనుకంజలో ఉండటానికి కారణం ఇక్కడి కంపెనీలు సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోకపోవడమేనన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపైనే భారత్ అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. శాస్త్రవేత్తలు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రపంచాన్ని శాసిస్తోన్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ద్వారా కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మెనాశ్ కంపెనీ ఇంజనీరింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డీన్ యాసిన్ బ్రిజ్మోన్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్‌లో వేగవంతమైన మార్పులు వస్తున్నాయని కొత్త టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పత్తులు దేశానికి అందించడంలో శాస్త్రవేత్తలు చొరవ చూపాలన్నారు. దేశంలోని మార్కెట్ రంగాన్ని మొత్తం ఒకే వేదికపైకి తెచ్చి పంట సాగు నుంచి మార్కెటింగ్ దాకా ధరలు, మార్కెటింగ్ పరిస్థితి రైతులకు తెలిసేలా కొత్త యాప్‌లను రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డివిజన్ బోర్డు చైర్మన్ అలగసుందరమ్ అన్నారు. రైతుల ఆదాయాన్ని 2025 నాటికి రెట్టింపు చేయాలని నాబార్డ్ చైర్ ప్రొఫెసర్ అయ్యప్పన్ ఆకాంక్షించారు. కొత్త టెక్నాలజీపై టెక్నికల్ పేపర్లను కోడ్ చేసిన ప్రద్యోద్ అరమణి (బెంగళూరు), కేవీ జయప్రసాద్ (కొచ్చి), నాయక్ కృష్ణస్వామి (కర్ణాటక)లకు ప్రత్యేక అవార్డులు ఇచ్చారు. ఇస్రో, డీఆర్డీవో ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం విస్తృత కవరేజీపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ‘సాక్షి’కి ప్రత్యేకంగా అభినందనలు తెలపడంతోపాటు సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. -
సామాన్లు మోస్తుంది
ఫ్యూచర్ టెక్ యుద్ధావసరాల్లో నిఘా కోసం ఉపయోగపడుతున్న డ్రోన్స్‌ను మానవాళికి సౌకర్యాలుగా, సదుపాయాలుగా ఉపయోగించుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్’ లేదా ‘డ్రోన్స్’అనే ఈ రోబోటిక్ టెక్నాలజీ సామాజిక జీవనానికి అనుసంధానం కాబోతోంది.ఇటీవల బ్రెజిల్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌క్‌ప్ పోటీల్లో కెమెరాలను అటాచ్ చేసిన డ్రోన్స్ మైదానాల్లో విహరించాయి. ఇవి ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. డ్రోన్స్ ప్రస్థానం ఇంతటితో ఆగిపోవడం లేదు. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌డాట్‌కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఏడాది కిందట డ్రోన్స్ ద్వారా వస్తువులను డెలివరీ చేస్తామని ప్రకటించారు. ఆన్లైన్లో అర్డర్ చేసే వస్తువులను ఈ ఏరియల్ సర్వీస్ ద్వారా డెలివరీ చేస్తామని వివరించారు. టెక్ జెయింట్స్ గూగుల్, ఫేస్బుక్ కూడా డ్రోన్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలు విస్తృతపరిచే ఆలోచనలో ఉన్నాయి. ఇంట్లో ఒక మూలనున్న రౌటర్ కొంత పరిధిలో ఉన్న డివైజ్‌లకు వైఫై మాధ్యమంగా ఇంటర్నెట్ను అందించినట్టుగా... ఆకాశంలో కొంతపైన విహరించే డ్రోన్ల నుంచి ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థల ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచంలో చాలా ప్రాంతాలకు అధునాతనతరం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. ఈ సమస్యకు డ్రోన్స్ మంచి పరిష్కారం కాగలవు. ఫేస్బుక్ డ్రోన్స్ మొదటగా భారత్‌లోనే అందుబాటులోకి వచ్చేలా భారత్, ఫేస్‌బుక్‌ల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. జపాన్‌లో పంటలకు క్రిమిసంహారక మందులను స్ప్రే చేయడానికి యమహా మోటార్ కార్పొరేషన్ హెలికాప్టర్ స్టైల్ డ్రోన్స్‌ను తయారు చేసింది. ఆర్కియాలజీ రంగంలో కూడా వీటి ప్రాధాన్యతను గుర్తించారు. మనిషి ప్రవేశించలేని చోటికి డ్రోన్స్‌ను పంపి పరిశోధనలను పూర్తి చేసుకొనే అవకాశం ఉంటుంది. గాల్లో విహరిస్తూ వచ్చే డ్రోన్స్ వల్ల ట్రాఫిక్, ప్రయాణ ప్రయాసలు తగ్గిపోతాయి. ఇంటర్నెట్ సేవలను విస్తృతం చేయడం వల్ల మారుమూల ప్రాంతాలకు కూడా సదుపాయం కలుగుతుంది. ఇలా భవిష్యత్తులో డ్రోన్స్ తమ సేవలతో చాలా ప్రాధాన్యతను సంతరించుకొనేలా ఉన్నాయి. -
సాంకేతిక పరిజ్ఞానంతో నష్టం రాకుండా చూడాలి
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్ : రోబోటిక్ టెక్నాలజీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవాళికి నష్టం వాటిల్లకుండా చూడాలని మహిళా యూనివర్సిటీ వీసీ రత్నకుమారి అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో బుధవారం ‘కృత్రిమ పరిజ్ఞానం - రోబోటిక్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును వీసీ రత్నకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడం వల్ల అనేక నూతన ఆవిష్కరణలు వచ్చాయన్నారు. ఫలితంగా మనిషి చేయాల్సిన పనులు యంత్రాలు చేస్తున్నాయన్నారు. కంప్యూటర్ రంగంలో, వైద్యరంగంలో రోబోటిక్ టెక్నాలజీ వచ్చిందన్నారు. దీనివల్ల పలు శస్త్ర చికిత్సలు రోబోటిక్ టెక్నాలజీలో నిర్వహంచుకో గల్గుతున్నామన్నారు. అయితే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవాళికి నష్టం రాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కృత్రిమ పద్ధతుల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఇంజినీరింగ్ కళాశాల డెరైక్టర్ సి.ఈశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. వేలూరులోని విట్ యూనివర్సిటీకి చెందిన వెంకట కృష్ణ కీలకోపన్యాసం చేశారు. సదస్సు కో-ఆర్డినేటర్ టి.సుధ, వివిధ కళాశాలల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులు హాజరయ్యారు.