సాంకేతిక పరిజ్ఞానంతో నష్టం రాకుండా చూడాలి
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్ : రోబోటిక్ టెక్నాలజీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవాళికి నష్టం వాటిల్లకుండా చూడాలని మహిళా యూనివర్సిటీ వీసీ రత్నకుమారి అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో బుధవారం ‘కృత్రిమ పరిజ్ఞానం - రోబోటిక్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది.
ఈ సదస్సును వీసీ రత్నకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడం వల్ల అనేక నూతన ఆవిష్కరణలు వచ్చాయన్నారు. ఫలితంగా మనిషి చేయాల్సిన పనులు యంత్రాలు చేస్తున్నాయన్నారు. కంప్యూటర్ రంగంలో, వైద్యరంగంలో రోబోటిక్ టెక్నాలజీ వచ్చిందన్నారు. దీనివల్ల పలు శస్త్ర చికిత్సలు రోబోటిక్ టెక్నాలజీలో నిర్వహంచుకో గల్గుతున్నామన్నారు. అయితే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల మానవాళికి నష్టం రాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇటీవల కృత్రిమ పద్ధతుల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఇంజినీరింగ్ కళాశాల డెరైక్టర్ సి.ఈశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. వేలూరులోని విట్ యూనివర్సిటీకి చెందిన వెంకట కృష్ణ కీలకోపన్యాసం చేశారు. సదస్సు కో-ఆర్డినేటర్ టి.సుధ, వివిధ కళాశాలల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులు హాజరయ్యారు.