![Utilise Rs 20000 crore allocated for R and D DEA Secretary to India Inc](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/r%26amp%3Bd.jpg.webp?itok=A3kZ2RFw)
పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ)పై దేశీ కార్పొరేట్లు మరింత దృష్టి సారించాలని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తాజాగా పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయించిన రూ. 20,000 కోట్లు నాణ్యమైన ప్రతిపాదనకు వినియోగించుకోవాలని సూచించారు.
ప్రయివేట్ రంగ ఆధారిత ఆర్‌అండ్‌డీకి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ. 20,000 కోట్లు కేటాయించిన విషయాన్ని బడ్జెట్ తదుపరి సీఐఐ సభ్యులతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టి సందర్భంగా ప్రస్తావించారు. ఏడాది చివరికల్లా మొత్తం నిధులను వినియోగించుకునేలా అత్యుత్తమ ప్రతిపాదనలతో తరలిరావలసిందిగా ఆహ్వానించారు.
పర్యావరణహిత ఇంధనాలవైపు ప్రయాణంలో ప్రయివేట్ రంగం చేయూత నివ్వాలని కోరారు. ఇదేవిధంగా అణు విద్యుత్ విషయంలో ప్రభుత్వం పరిశ్రమతో కలసి పనిచేయనున్నట్లు తెలియజేశారు.
2025-26 బడ్జెట్‌ను ప్రకటిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేట్ రంగ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక కార్పస్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు రూ.20,000 కోట్లు కేటాయించారు. గత జూలై బడ్జెట్‌లోనూ ఆమె రూ. లక్ష కోట్ల పరిశోధనాభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment