Research and Analysis Wing
-
పన్నూ హత్యకు కుట్ర కేసులో ‘రా’ మాజీ అధికారిపై అమెరికా కోర్టులో అభియోగాలు
వాషింగ్టన్: ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్ పన్నూను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) మాజీ అధికారి వికాస్ యాదవ్‌పై అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. పన్నూను అంతం చేయడానికి జరిగిన కుట్రలో వికాస్ యాదవ్ పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం న్యూయార్క్ కోర్టులో అభియోగ పత్రాలు సమరి్పంచారు. ఆయనను సీసీ–1(సహ కుట్రదారుడిగా) నిర్ధారించారు. పన్నూను హత్య చేయడానికి కిరాయి మనుషులను నియమించడం, మనీ లాండరింగ్‌కు పాల్పడడం అనే అభియోగాలు మోపారు. ప్రస్తుతం వికాస్ యాదవ్ ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. 39 ఏళ్ల వికాస్ యాదవ్ గతంలో భారతదేశ విదేశీ ఇంటెలిజెన్స్ సేవలు, ‘రా’ వ్యవహారాలను పర్యవేక్షించే కేబినెట్ సెక్రటేరియట్లో పనిచేశారు. పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తాను అమెరికా పోలీసులు గత ఏడాది చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్టు చేశారు. నిఖిల్ గుప్తా ప్రస్తుతం అమెరికాలో జైలులో ఉన్నాడు. అమెరికా గడ్డపై పన్నూను హత్య చేయడానికి భారత ఏజెంట్లు కుట్ర పన్నారని, ఈ కుట్రను తాము భగ్నం చేశామని అమెరికా దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే, అమెరికా అధికారుల ఆరోపణలను భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. పత్వంత్‌సింగ్ పన్నూ ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలో జని్మంచాడు. కెనడాకు వలస వెళ్లాడు. అక్కడి నుంచే భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతడికి కెనడాతోపా టు అమెరికా పౌరసత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజ్జర్ హత్య కేసులో కెనడాలోనూవాషింగ్టన్: మరోవైపు కెనడాలో జరిగిన ఖలిస్తాన్ ఉగ్రవాది హరిదీప్ సింగ్ నిజ్జర్ అలియాస్ నిజ్జర్ హత్యతోనూ వికాస్ యాదవ్ పేరును ముడిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కెనడాలో 2023 జూన్ 18న నిజ్జర్ హత్య తర్వాత మృతదేహం తాలూకు రియల్–టైమ్ వీడియోను వికాస్ యాదవ్.. నిఖిల్ గుప్తాకు షేర్ చేశాడని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇదే సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం కెనడాతో పంచుకొనే వీలుంది. దీన్నిబట్టి నిజ్జర్ హత్య కేసులో వికాస్ యాదవ్‌పై కెనడా ప్రభుత్వం కూడా అభియోగాలు నమోదు చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
పొంతన లేని వింత కథ!
కొన్నిసార్లిది తలకిందుల పిచ్చి మాలోకంగా అయిపోగలదు. ‘మ్యాడ్’ మేగజీన్లోని ఒక కార్టూన్ నిజరూపం లోనికి రూపాంతరం చెందినట్లే ఈ ప్రపంచం ఉంటుంది. ప్రస్తుతం పక్కింట్లో అదే జరిగిందని అనిపిస్తోంది. అయితే ఏ విధంగానూ అది అందరికీ జరిగినట్లు కాదు. కచ్చితంగా జరిగిందైతే అక్కడి ప్రభుత్వానికి, భయానకమైన ‘ఐఎస్ఐ’కి. నేను చెప్ప వలసి ఉన్నది అతి వింతైన కథ కనుక చాలామందికి అది కనీసం కల్పనగా కూడా నమ్మదగనిది. అయినప్పటికీ, నన్ను నమ్మండి... అది నిజంగా జరిగింది.పాకిస్తాన్‌లోని యూట్యూబర్లు, అక్కడి ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వంటి వార్తా పత్రికలు, ఆ దేశపు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఆఖరికి స్వయానా ఆ శాఖ మంత్రి కూడా నన్ను పాకిస్తాన్ వ్యతిరేకిననీ, మోదీ ప్రభుత్వానికి సన్నిహితుడిననీ, ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్)తో చేతులు కలిపాననీ ప్రకటించటం జరిగింది. ఇప్పుడిది, చివరిసారి నేను చేసిన ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే లేచి బయటికి వెళ్లిపోయిన ప్రస్తుత ప్రధాన మంత్రికీ, దశాబ్దాలుగా నన్ను పాకిస్తాన్ పక్షపాతిగా నిందిస్తూ వస్తున్న విమర్శకులకూ నిస్సందేహంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే సరిహద్దు వెంబడి గస్తీ సైనికులు, వారి పౌర ప్రభుత్వాలు, నిఘా అధికారులకు ఇది... అవునా! నిజమా... అనిపించేలా ఉంటుంది.ఇదెలా జరిగిందో వివరించటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. కొన్ని వారాల క్రితం పాక్ అధికారులు తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (ఇమ్రాన్ ఖాన్ పార్టీ) సమాచార కార్యదర్శి, అధికార ప్రతినిధి అయిన రవూఫ్ హసన్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై దేశద్రోహ నేరం మోపాలన్న కృతనిశ్చయంతో నిర్బంధించి అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈమెయిల్స్‌ను, వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలించారు. అక్కడ వారికి రవూఫ్ నాతో పంచుకున్న – 2022 నవంబర్ వెనకటి – మెసేజ్‌లు కొన్ని కనిపించాయి. ఆహా! ఇకనేం, భారతదేశంలోని వ్యక్తులతో అతడు మాట్లాడుతున్నాడన్న నిర్ధారణకు వారు వచ్చేశారు. అది అత డిని దేశ వ్యతిరేకిని చేసేసింది. ఇంకా దారుణం, ఇమ్రాన్‌తో పాక్ ఎలా వ్యవహరిస్తోందో రవూఫ్ తన మెసేజ్‌లలో వ్యాఖ్యానిం^è టం, పాకి స్తాన్ రాజకీయాలపై చర్చించటం, చివరికి ఆర్మీ చీఫ్ గురించి కూడా మాట్లాడటం! ఇవన్నీ కూడా నిస్సందేహంగా పాక్ దృష్టిలో దేశ వ్యతి రేకమైనవే.ఇప్పుడిది రూఢీ అవ్వాలంటే పాక్‌ని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తిగా నన్ను చిత్రీకరించాలి. ఆ దేశంలోని ఎంతోమంది నియంతలు, ప్రధానులు నాకు తెలుసనీ, వారిని నేను ఇంటర్వ్యూ చేశాననీ, తరచు నేను ఆ దేశాన్ని సందర్శిస్తుంటాననీ; ఇస్లామాబాద్‌లో, లాహోర్‌లో, కరాచీలో నా సన్నిహిత మిత్రుల జాబితా పెద్ద చాంతాడంత ఉంటుందనీ గుర్తించటం వంటివేవీ పాక్ చిత్రీకరణ ఉద్దేశాన్ని నెరవేర్చేవి కావు. బేనజీర్ భుట్టో నాకు ఆప్త నేస్తం అనీ, నవాజ్ షరీఫ్ ఆఖరుగా 2014లో ఇండియా వచ్చినప్పుడు నన్ను కలుసుకోవాలని కోరారనీ, షెహబాజ్ షరీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన, నేను కలిసి పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో కూర్చొని స్నేహపూర్వకంగా లేదా, పిచ్చాపాటీగా కబుర్లు చెప్పుకున్నామనీ అంగీకరించటం కూడా పాక్ అనుమానాలను బలపరిచేందుకు ఉపయోగపడదు. అలా అంగీ కరించటం అన్నది రవూఫ్‌కు వ్యతిరేకంగా నిర్మిస్తున్న కేసును కుప్ప కూల్చి ఉండేది.కాబట్టి తన అధికారిక ప్రకటనలో పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ: ‘‘భారతదేశ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు రవూఫ్ హసన్ జాగ్రత్త లేకుండా పంపిన మెసేజ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయి. నిజా నికి ఈ మెసేజ్‌లు కరణ్ థాపర్‌కు మద్దతుగా ఉన్న ‘రా’ అధికారులకు అమూల్యమైన సంపద వంటి సమాచారం అని రక్షణశాఖ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మెసేజ్‌లను బట్టి పాక్ వ్యతిరేక ప్రచారాన్ని రాజేసేందుకు పి.టి.ఐ. (పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్) ప్రతినిధి దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఒక భారతీ యుడికి చేరవేస్తున్నట్లు బహిర్గతం అయిందని వారు తెలిపారు’’ అని పేర్కొంది. పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అతావుల్లా తరార్, ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’తో మాట్లాడుతూ... ‘‘పాక్ వ్యతి రేక భావాలకు పేరుమోసిన ఒక భారతీయ జర్నలిస్టుతో హసన్‌కు ఉన్న సంబంధాలు స్వదేశం పట్ల పి.టి.ఐ. అవిధేయతను మరింతగా తేటతెల్లం చేస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.పర్యవసానంగా, రవూఫ్ నాతో నెరిపిన సంక్షిప్తమైన, చాలా అరుదైన, ఏమాత్రం హానికరం కానివైన మెసేజ్‌లు – నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశానన్న వాస్తవం కూడా – మార్మికమైన రీతిలో పాకిస్తాన్ సార్వభౌమాధికారతకు, సమగ్రతకు, భవిష్య త్తుకు ముప్పుగా పరి వర్తనం చెందాయి. నిస్సందేహంగా ఇది ఆయనపై విచారణ జరిపించేందుకు ఉపయోపడుతుంది. వారి దృష్టిలో అదే న్యాయం. మా మధ్య సాగిన ఉద్దేశపూర్వకం కాని వాట్సాప్ మెసేజ్‌లు, ఇంటర్వ్యూ లాంటి మాటామంతీ, ఇంకా చెప్పాలంటే ఓ రెండు సంభాషణలు... వీటన్నిటినీ దాటి అసలు నిజం ఏమిటంటే రవూఫ్ నాకు తెలియదు. అతడికీ నేను తెలియదు. మేము ఒకరికొకరం అపరిచితులం. కాబట్టి ఇదెప్పటికీ మారదు.వాస్తవానికి, వారు రవూఫ్ బాస్ అయిన ఇమ్రాన్ ఖాన్ నాతో మంతనాలు జరిపారని ఆరోపించినట్లయితే వారి కేసుకు మరింత బలం చేకూరి ఉండేది. ఇమ్రాన్‌ను నేను అనేకసార్లు ఇంటర్వ్యూ చేశాను. బని గలా (ఇస్లామాబాద్) లేదా ఢిల్లీలో మాత్రమే కాదు... ఒక సందర్భంలో నేను లండన్ వెళ్లి మరీ, అక్కడి రిచ్మండ్లో ఇమ్రాన్ మాజీ అత్తమామలు ఉండే భవనం లోపలి తోటల్లో ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. పాకిస్తాన్ చార్జిషీట్లో అది నేరంగా కనిపించటం లేదా? అంతకుమించిన నేరం, తనెప్పటికైనా ప్రధాని అయితే ఆర్మీ చీఫ్ తనకు లోబడి పని చేయవలసి ఉంటుందని కూడా ఇమ్రాన్ అనటం. నవ్వుతూ ఏమీ ఆయన ఆ మాట అనలేదు. పాకిస్తాన్‌లోని నా ప్రియ స్నేహితుడు ఒకరు ఈ అస్థిమితం నుంచి నన్ను శాంతింపజేయటానికి ఇలా అన్నారు: ‘‘అలీస్ ఇన్ ది వండర్ల్యాండ్’తో నీకు పరిచయం ఉంది. ఇప్పుడిక, మాలిస్ (దుష్ట బుద్ధి) ఇన్ ది ఫౌజీలాండ్ (సైనికదేశం)కు స్వాగతం.’’– కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కొలీజియం తీర్మానం తీవ్ర ఆందోళనకరం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా)కు చెందిన రహస్య పత్రాల్లో కొన్ని భాగాలను బహిర్గతం చేయాలని కొలీజియం తీర్మానించడం తీవ్ర ఆందోళనకర అంశమని అన్నారు. నిఘా విభాగాల సిబ్బంది దేశ హితం కోసం రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తుంటారని, వారి రిపోర్టులను బయటపెడితే భవిష్యత్తులో కార్యాచరణపై ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని చెప్పారు. తద్వారా కొన్ని చిక్కులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మద్రాసు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఐబీ, ‘రా’ ఇచ్చిన నివేదికల్లోని కొన్ని భాగాలను ప్రజా సమూహంలోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే తీర్మానించింది. దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తొలిసారిగా మంగళవారం మాట్లాడారు. కొలీజియం వ్యవహారంపై సరైన సమయంలో పూర్తిస్థాయిలో స్పందిస్తానని, ఇది తగిన సమయం కాదని అన్నారు. -
జ్ఞాపకాలు విప్పి చెప్పిన కథనాలు
ఉన్నత స్థానంలో పనిచేసిన వ్యక్తి తన జ్ఞాపకాలను రాస్తే అవి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెబుతాయి. అందునా ఆయన ఒక గూఢచార సంస్థకు అధిపతి అయితే? అప్పుడు మామూలుగా మనం ఎప్పటికీ తెలుసుకోలేని వ్యక్తులు, వారి కథనాలు మన ముందుకు వస్తుంటాయి. ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’(రా)కు అధిపతిగా పనిచేసిన ఎ.ఎస్.దులత్ తనను తాను ఒక దయ్యంగా అభివర్ణించుకుంటారు. నీడలా ఉండి చేయాల్సిన పని అది కాబట్టి. అందుకే ఆయన తన పుస్తకానికి ‘ఎ లైఫ్ ఇన్ ద షాడోస్’ అనే పేరుపెట్టారు. ఇందులో ప్రిన్స్ చార్లెస్‌కు ఇందిరా గాంధీ ఇచ్చిన ఆతిథ్యం నుంచి, తన భద్రతాధికారి పట్ల మార్గరేట్ థాచర్ చూపిన ఔదార్యం దాకా ఎన్నో విషయాలున్నాయి. ఇంకా ఢిల్లీలో సిక్కులను చంపుతున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకుడు అర్జున్ సింగ్ ప్రతిస్పందన విశేషమైన ప్రాధాన్యత కలిగినది. రెండు అంశాలు జ్ఞాపకాలను తప్పనిసరిగా చదివేలా చేస్తాయి– సుప్రసిద్ధ వ్యక్తులను గురించిన వృత్తాంతాలు, వారి గురించిన పదునైన వ్యాఖ్యలు. రచయిత ఎప్పుడైతే ఒక ‘దయ్యమో’– ఒక జీవితకాలం పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నతస్థానంలో ఉండి ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’కు అధిపతిగా పనిచేసిన తర్వాత ఆయన తనను తాను అలాగే అభివర్ణించుకున్నారు– మామూలుగా అయితే మనం ఎప్పటికీ తెలుసుకోలేని వ్యక్తులు, వారి కథనాలు మన ముందుకు వస్తుంటాయి. ఇదే ఎ.ఎస్. దులత్(అమర్జీత్ సింగ్ దులత్) రాసిన ‘ఎ లైఫ్ ఇన్ ద షాడోస్’ పుస్తకాన్ని అంత సరదాగా మలిచింది. 1980లలో ఢిల్లీ సందర్శించే ప్రముఖులకు దులత్ భద్రతా అనుసంధాన అధికారిగా ఉండేవారు. అలాంటి ప్రముఖులలో ఒకరు ప్రిన్స్ చార్లెస్. ఈ బ్రిటన్ యువరాజును ఇందిరాగాంధీ భోజనానికి ఆహ్వానించారు. అయితే అదంత బాగా సాగలేదు. ‘‘ఎవరో చితక బాదినట్టిగా భారత ప్రధాని నివాసం నుంచి చార్లెస్ బయటపడ్డారు!’’ అని దులత్ రాశారు. ‘‘యువర్ హైనెస్(మహాశయా), భోజనం ఎలా అయ్యింది?’’ అని అడిగాను. ‘‘నన్ను అడగొద్దు,’’ అంటూ ఊపిరి పీల్చుకుంటున్న రీతిలో చార్లెస్ కారు ఎక్కారు. ‘‘ఆ మహిళ నిన్ను గడ్డ కట్టించేయగలదు. నీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాయకులను నేను కలిశాను, కానీ ఈ మహిళ ఒక్క మాట కూడా మాట్లాడదు!’’ మార్గరేట్ థాచర్ (బ్రిటన్ మాజీ ప్రధాని) భిన్నమైన ముద్ర వదిలేసి వెళ్లారు. ఈ ఉక్కు మహిళ తన సిబ్బందని ఎంతో జాగ్రత్తగా చూసుకునే బాస్‌గా ఉండేవారు. థాచర్ భద్రతాధికారి గోర్డాన్ కేథార్న్ ఒక రాత్రి ఆమె గది బయట చలిలో గడుపుతానని చెప్పినప్పుడు థాచర్ ఎలా స్పందించారో దులత్ రాశారు. ‘‘గోర్డాన్, రాత్రి ఇక్కడే గడపటం గురించి నీవు సీరియస్‌గానే అంటున్నావా?’’ అని ఆమె అడిగారు. ‘‘అవును మేడమ్, అఫ్కోర్స్, నిజంగానే’’ అన్నాడు గోర్డాన్. అప్పుడు ప్రధాని ఇలా అన్నారు: ‘‘అయితే ఒక నిమిషం ఉండు. బయట చలిగా ఉంది. డెనిస్ స్వెటర్లలో ఒకటి నీకు తెచ్చిస్తాను.’’(డెనిస్– డెనిస్ థాచర్. ఆమె భర్త.) ఆ ప్రయాణంలో థాచర్ కారు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. అద్దాల్లోంచి బయటికి చూస్తూ ఆమె కేథార్న్ కారు వెంట జాగింగ్ చేయడాన్ని గమనించారు. ముందు సీట్లో డ్రైవర్ పక్కనే కూర్చున్న దులత్ను మనం అతడికి లిఫ్ట్ ఇద్దామా అని అడిగారు. దులత్ అంగీకరించి, కేథార్న్ లోపలికి వచ్చేలా తన డోరు తెరిచారు. ‘‘నో, నో, నువ్వు అసౌకర్యానికి గురి కావొద్దు,’’ అని వెంటనే థాచర్ అన్నారు. ‘‘అతడు మాతో వెనక కూర్చుంటాడు’’. దులత్ ఏమంటారంటే – ‘‘ఇలాంటి దృశ్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక భద్రతాధికారికి అసౌకర్యం కలిగించడం కంటే కూడా, బ్రిటన్ దేశపు ప్రధాని వెనక సీట్లో ముగ్గురితో సర్దుకుని కూర్చోవడానికి సిద్ధపడ్డారు.’’ దులత్ ఉపాఖ్యానాల్లో ఎక్కువగా జ్ఞానీ జైల్ సింగ్ గురించి ఉన్నాయి. దులత్ రాశారు: ‘‘1982 నుంచి 1987 మధ్య ఆయన చేసిన ప్రతి విదేశీయానంలోనూ నేను వెంట ఉన్నాను.’’ అయితే రాష్ట్రపతి వారి సమక్షంలో లేనప్పుడు నిజమైన సరదా జరిగినట్టుంది. ‘‘ఎప్పుడు మేం కొత్త దేశంలో అడుగు పెట్టినాసరే, ఒకవేళ రాష్ట్రపతితో ప్రయాణిస్తున్న కార్యదర్శి రమేశ్ భండారీ అయితే, ఆయన నాతో అనేవారు, ‘పార్టీ నా రూములో’’’. హోనోలూలూ(అమెరికా నగరం) నుంచి తిరిగివస్తూ, కాసేపటి కోసం హాంకాంగ్‌లో ఆగినప్పుడు ‘‘మేము ఎంత అలసిపోయామంటే, ఒక చక్కటి మసాజ్ స్వర్గ తుల్యంగా ఉంటుందనిపించింది... సమీపంలో ఎక్కడైనా మసాజ్ సెంటర్ ఉందా అని హోటల్ ఫ్రంట్ డెస్క్‌లో ఉన్నవారిని అడిగాను... తీరా నేను పరుగెత్తుకెళ్లి కనుక్కున్నదల్లా అప్పటికే అక్కడికి మంత్రి పదవి కోసం వేచి చూస్తున్న, సరదా మనిషి అయిన ఎన్.కె.పి.సాల్వే నాకంటే ముందు చేరుకున్నారని!’’ ముఖ్యమైన వ్యక్తుల గురించి దులత్‌కు తెలియవచ్చిన విషయాలు చాలా విశేష ప్రాధాన్యత కలిగినవి. 1984లో సిక్కులను హత్య చేస్తున్న కాలంలో కాంగ్రెస్ నేత(అప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి) అర్జున్ సింగ్‌ను దులత్ కలిశారు. ‘‘ఒక ముఖ్యమంత్రిగా భోపాల్‌లోని సిక్కులను మీరు కలిసి వారి భయాలను నివృత్తి చేయాలని నేను సూచించాను... కానీ ఆయన కరాఖండీగా నిరా కరించారు. ఆయన ఎలాంటి అంతఃగర్భితమైన సందేశాన్ని వ్యక్తపరి చారంటే, రాజ్యం– భారత ప్రభుత్వం– తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ తరుణంలో సిక్కులు ఇంకేమిటో కాదు, అభద్రతను ఫీల్ కావాలి.’’ తన మాజీ సహచరుల్లో ఒకరైన, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు c(అజీత్ డోభాల్) గురించి కూడా దులత్ రాశారు. వారిద్దరూ నార్త్ బ్లాక్‌లోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలోని పార్కింగ్ ప్లేసులో మొట్టమొదటిసారి కలిశారు. అప్పట్లో దోవల్ యువకుడు, దులత్ కంటే మూడేళ్లు జూనియర్. ‘‘ఆ రోజుల్లోనే అతడిని చూసినప్పుడల్లా తన కెరియర్లో ఎంతో అత్యున్నత స్థానా నికి వెళుతున్న మనిషి ఇక్కడున్నాడు అనిపించేది. దోవల్ ప్రతి ఒక్కరికీ స్నేహితుడు, అదేసమయంలో ఎవరి స్నేహితుడూ కాదు. ప్రతిరోజూ అలా వ్యవహరించడం అనేది మనలో చాలామందికి ఎంతో కష్టమైన మార్గం.’’ ఏమైనా దోవల్ మారారని దులత్ నమ్ముతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన బీజేపీ సీనియర్ నేత ఎల్.కే.ఆడ్వాణీ వీరా రాధకుడు, అలాగే పాకిస్తానీయులతో చర్చలకు సిద్ధంగా ఉండేవారు. ఇప్పుడు మాత్రం ‘‘వారితో చర్చలకు, సర్దుబాటకు ససేమిరా అంటు న్నారు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా కఠిన వైఖరి మీద, నిర్దాక్షిణ్యత మీద, లక్ష్యాలను చేరుకోవడం మీద ఉంది. పాత రోజుల్లో నాకు తెలిసిన దోవల్ ఎన్నడూ నరేంద్ర మోదీపై దృష్టి పెట్టేవారు కాదు. ఆయన దృష్టి అంతా తనకు అభిమాన నేత అయిన ఆడ్వాణీ పైనే ఉండేది.’’ ‘‘అజిత్ గురించి చాలావరకు ప్రశంసించిదగిన కథనాలు నా వద్ద ఎన్నో ఉన్నాయి,’’ అని దులత్ కొనసాగిస్తారు. నేననుకోవడం అవి ఆయన వాటిని సీక్వెల్ కోసం పదిలపరుచుకుంటున్నట్టున్నారు. వాటి గురించి దోవల్ ఏమనుకుంటారోగానీ, వాటిని చదవడానికి నేను మాత్రం వేచి ఉండలేను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నాగ్ సరసన మెహరీన్
నాగార్జునకు జోడీగా మెహరీన్ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్ మూవీ ‘ది ఘోస్ట్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపిస్తారు నాగార్జున. ఈ చిత్రంలో హీరోయిన్గా ఫస్ట్ కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. కానీ వ్యక్తిగత కారణాలతో కాజల్ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో అమలా పాల్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఫైనల్‌గా మెహరీన్ ఈ చిత్రంలో హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు సమాచారం. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాగా మెహరీన్ ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’, కన్నడంలో శివరాజ్‌కుమార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
యుద్ధ విద్యల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న నాగ్
పోరాట సన్నివేశాల్లో హీరో నాగార్జున శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు తన యాక్షన్ స్టైల్‌కు మరింత పదును పెడుతున్నారు నాగార్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన హీరోగా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాజీ రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపించనున్నారు నాగార్జున. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ కోసం క్రావ్ మాగా, సమురై స్వార్డ్ వంటి ఇజ్రాయెల్ యుద్ధ విద్యల్లో నాగార్జున స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే మొదలు కావాల్సిన ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్ సెకండ వేవ్ కారణంగా వాయిదా పడింది. దీంతో వీలైనంత తొందరగా చిత్రీకరణ మొదలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు అండ్ కో. వచ్చే నెల మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. అలాగే ఇందులో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు. -
ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్
ఓ సీక్రెట్ మిషన్ యాక్షన్ మిషన్ కోసం మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్, గయాక్షన్ మిషన్ ఫైరింగ్‌లో శిక్షణ పొందుతున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ పాత్రలో కనిపిస్తారు నాగ్. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇందులో ‘రా’ ఏజెంట్‌గానే కనిపించనున్నారు. ఈ పాత్ర లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్‌గా ఉండాలని ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారు కాజల్. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు కాజల్. -
అయోధ్యలో ఉగ్ర కుట్రలకు పాక్ పన్నాగం!
న్యూఢిల్లీ: అయోధ్యలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేసే ప్రణాళికలు రచిస్తున్నట్టు భారత నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 15న పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చిన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. భారత్‌లో ఉగ్రదాడులు చేసి అంతర్గతంగా కల్లోలం సృష్టించాలని ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని పరిశోధన మరియు విశ్లేషణ విభాగం (రా) అధికారులు వెల్లడించారు. మూడు నుంచి ఐదు టెర్రరిస్టు గ్రూపులు మన దేశంలోకి చొరబడేందుకు చూస్తున్నాయని, పాక్ ఐఎస్ఐ వారికి సాయం చేస్తోందని తెలిపారు. 20 నుంచి 25 మంది నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట, 5 నుంచి 6 మంది ఇండో నేపాల్ సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబడేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయోధ్యతోపాటు కశ్మీర్‌లోనూ దాడులు చేసేందుకు పాకిస్తాన్‌లోని జలాల్‌బాద్‌లో ఐఎస్ఐ వారికి శిక్షణ ఇచ్చిందని తెలిపారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా అధికారులు సరిహద్దుల వెంబడి గస్తీని పెంచారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయం దగ్గరపడుతున్న వేళ ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆగస్టు 5 న ప్రధాని మోదీ భవ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు అదే రోజు ఏడాది పూర్తవుతుండటం విశేషం. -
మరోసారి వార్తల్లోకి గ్యాంగ్‌స్టర్ రవి పూజారి
న్యూఢిల్లీ : గత 20 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న మాఫియా గ్యాంగ్ స్టర్ రవి పూజారిని త్వరలోనే భారత్‌కు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా భారత ప్రభుత్వం అతన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని సమాచారం అందింది. ఈ మేరకు రా అధికారుల సహాయంతో కర్నాటక పోలీసులు రవి పూజారీని తీసుకువచ్చేందుకు సెనెగల్ దేశానికి వెళ్లారు. ఇదే విషయమై కర్నాటక పోలీసులు మాట్లాడుతూ.. ఒక్క బెంగళూరులోనే రవి పుజారిపై 39 కేసులు ఉన్నాయి. వాటిలో 2007లో షబ్నమ్ డెవలపర్స్ యజమానులు శైలాజా, రవిల హత్య కేసు తో పాటు మంగళూరులో 36, ఉడిపిలో 11, మైసూరు, హుబ్బల్లి-ధార్వాడ్, కోలార్, శివమొగ్గలో ఒక్కో కేసు ఉన్నట్లు తెలిపారు.(చదవండి : మాఫియా డాన్ రవి పుజారీ అరెస్ట్) 20 ఏళ్ల క్రితం ఇండియా నుంచి పారిపోయిన రవి పూజారి ఆఫ్రికాలోని సెనెగల్ దేశానికి వెళ్లి ఆంటోని ఫెర్నాండెజ్‌గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత పాస్‌పోర్ట్ సంపాదించి తన కుటుంబాన్ని కూడా సెనెగల్‌కు రప్పించి పలుచోట్ల రెస్టారెంట్లు నడుపుతూ జీవనం సాగించాడు. అయితే గతేడాది జనవరి 2019లో బార్బర్ షాపుకు వెళ్లిన రవి పూజారిపై అనుమానించిన సెనెగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చిన రవి పూజారి అక్కడి నుంచి వేరే చోటికి పారిపోయాడు. కాగా అప్పటినుంచి కనిపించకుండా పోయిన రవి పూజారి భారతదేశానికి అప్పగించేందుకు సెనెగల్ సుప్రీంకోర్టు ఒప్పుకోవడంతో పోలీసులు అతని కోసం సెనెగల్ వెళ్లారు.(కోట్లు ఇవ్వాలంటూ మంత్రికి డాన్ బెదిరింపు కాల్!) కాగా గతంలో ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీంలతో కలసి పనిచేసిన పుజారీ.. తర్వాత సొంత గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని హత్యలు,బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. రవి పూజారి తనను బెదిరించాడని సినీ నిర్మాత మహేష్ భట్ అప్పట్లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం పెను సంచలనంగా మారింది.ఆ తర్వాత భట్ ను చంపడానికి కుట్ర పన్నిన రవి పూజారి ముఠాలోని కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఐబీ చీఫ్‌గా అర్వింద్.. ‘రా’ చీఫ్‌గా గోయల్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ సమావేశమైన కేబినెట్ నియామకాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో నిఘా సమాచారాన్ని సేకరించే ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) నూతన అధిపతిగా ఐపీఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను నియమించింది. అలాగే విదేశా ల నుంచి నిఘా సమాచారాన్ని సేకరించే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సామనత్ కుమార్ గోయల్‌ను నియమించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అర్వింద్ కుమార్, గోయల్‌లు రాబోయే రెండేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఐబీ ప్రస్తుత చీఫ్ రాజీవ్ జైన్ పదవీకాలం జూన్ 30తో, ‘రా’ చీఫ్ అని ల్ కె.ధస్మనా పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. వీరిద్దరి పదవీకాలం 2018, డిసెంబర్లోనే ముగిసినప్పటికీ సర్వీసును 6 నెలలు పొడిగించారు. కశ్మీర్ నిపుణుడు అర్వింద్.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో రెండో అత్యంత సీనియర్ అధికారి అయిన అర్వింద్ కుమార్(59) 1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అస్సాం–మేఘాలయ కేడర్ అధికారి. 1991, ఆగస్టులో ఐబీలో చేరిన కుమార్, ప్రస్తుతం స్పెషల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలోని భారత ఎంబసీలో ఆయన పనిచేశారు. జమ్మూకశ్మీర్‌లో వ్యవహారాలు, మావోయిస్టుల విషయంలో నిపుణుడిగా పేరు గడించారు. ఆయన అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ‘ప్రెసిడెంట్ పోలీస్ మెడల్’ను బహూకరించింది. ‘బాలాకోట్’ సూత్రధారి గోయల్.. 1984 బ్యాచ్, పంజాబ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సామనత్ కుమార్ గోయల్ ప్రస్తుతం ‘రా’లో ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ బాలాకోట్‌లోని జైషే ఉగ్రస్థావరంపై చేసిన వైమానిక దాడుల వ్యూహ రచనలో గోయల్ కీలకంగా వ్యవహరించారు. అలాగే 2016, సెప్టెంబర్ 29న చేపట్టిన సర్జికల్ దాడుల పథకరచనలో ముఖ్యభూమిక పోషించారు. నిఘా విషయంలో విశేషానుభవం ఉన్న గోయల్ తన కెరీర్లో ఎక్కువగా పంజాబ్‌లోనే పనిచేశారు. 1990ల్లో పంజాబ్‌లో తీవ్రవాదాన్ని నియంత్రించడంతో గోయల్ కీలకంగా వ్యవహరించారు. 2001లో ఆయన ‘రా’లో చేరారు. ఆయన అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం పోలీస్ మెడల్(గ్యాలెంట్రీ), పోలీస్ మెడల్(మెరిటోరియస్)లను ప్రకటించింది. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాల ముడుపుల వ్యవహారం కేసులో సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పిం చిన అఫిడవిట్లో గోయల్ పేరు కనిపించింది. -
కేంద్రంలో కీలక నియామకాలు
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నీతి ఆయోగ్ సీఈవోగా ఆయన 2016 ఏప్రిల్ 1న నియమితులైన విషయం తెలిసిందే. కాంత్ పదవీ కాలంలో జూన్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పెంపుతో 2021 జూన్ 30 వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)లకు కేంద్ర ప్రభుత్వం కొత్త అధిపతులను నియమించింది. అస్సాం-మేఘాలయ కేడర్ 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. ఆయన కశ్మీరు సంబంధిత అంశాల్లో నిపుణుడు. రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) చీఫ్‌గా కశ్మీర్‌కు చెందిన సామంత్ గోయల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో భారత బలగాలు చేపట్టిన మెరుపు దాడులు, బాలకోట్ వైమానిక దాడులకు గోయల్ వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కొత్తగా నియమితులైన వీరిద్దరూ కూడా 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు కావడం విశేషం. ఇక త్వరలో పదవీ విరమణ చేయబోతున్న భారత సైన్యం అధిపతి జనరల్ బిపిన్ రావత్ స్థానంలో ఎవరిని నియమిస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. -
అందుకే పాక్‌కు చైనా మద్దతు : ‘రా’ మాజీ చీఫ్
సాక్షి, హైదరాబాద్ : పాకిస్తాన్‌తో తమకు ఉన్న క్రిడ్ ప్రోకో ఒప్పందం వల్లే జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చైనా నిరాకరిస్తోందని ‘రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా)’ మాజీ చీఫ్ విక్రమ్‌సూద్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జాతీయ భద్రతకు బాహ్య నిఘా’అనే అంశంపై సెమినార్‌కుఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... పుల్వామా ఉగ్రదాడి ఆదిల్ ఒక్కడి వల్లే సాధ్యం కాలేదని, అతడి వెనుక పెద్ద టీమ్ ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేకే పాకిస్తాన్ ఇలా పరోక్షంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాక్‌కు.. అంతర్జాతీయ సమాజంలో చైనా ఒక్కటే వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. చైనాలోని జింగ్‌జాంగ్ ప్రావిన్స్‌లో.. పాక్ ఉగ్రవాదులను మోహరించిందని అందుకే చైనా ఆ దేశానికి మద్దతు పలుకుతోందని ఆరోపించారు. ‘ఇదొక క్రిడ్‌ప్రోకో ఒప్పందం. చైనాలో ఉన్న టెర్రరిస్టులు ఆ దేశానికి ఎటువంటి హాని చేయరని పాకిస్తాన్ మాట ఇచ్చింది. కాబట్టి చైనా పాక్‌కు అండగా నిలుస్తోంది’ అని సూద్ వ్యాఖ్యానించారు. ఇక పుల్వామా ఉగ్రదాడిపై భారత్ ఎలా స్పందించబోతోందని భావిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఇదేం బాక్సింగ్ మ్యాచ్ కాదు. పంచ్‌కు బదులు పంచ్ విసరడానికి. ప్రధాని మోదీ చెప్పినట్లుగా అందుకు సరైన సమయం రావాలి’ అని సూద్ పేర్కొన్నారు. కాగా గురువారం నాటి పుల్వామా ఉగ్రదాడిని చైనా ఖండించినప్పటికీ.. ఈ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత వినతిని తోసిపుచ్చింది. జైషే చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని భారత్ దీర్ఘకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. -
పాక్ డీఎన్ఏలో శాంతి అనేది లేదు
హైదరాబాద్: పాకిస్తాన్ డీఎన్ఏలో శాంతి అనే పదం లేదని కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ ‘రా’ మాజీ అధిపతి విక్రమ్‌సూద్ వ్యాఖ్యానించారు. ఆ దేశంతో శాంతి వచనాలు జరపడం వల్ల ప్రయోజనం లేదని తేల్చిచెప్పారు. కశ్మీర్, పాకిస్తాన్ అంశాలపై భారత్ ఒక జాతీయ విధానం రూపొందించుకోవాలని సూచించారు. ఆదివారం సోమాజిగూడలోని ఆస్కీలో సోషల్‌కాజ్ ఆధ్వర్యంలో ‘జాతీయ భద్రతకు బాహ్య నిఘా’అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్రమ్‌సూద్ మాట్లాడుతూ.. పాకిస్తాన్లో ఎన్ని ప్రభుత్వాలు మారినా భారత్‌తో ప్రచ్ఛన్న యుద్ధం సాగించాలని అక్కడి పాలకులు, రాజకీయ పక్షాలు అన్ని ఒకే విధానంతో ఉన్నారని, కానీ భారత్‌లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సంప్రదాయ యుద్ధంలో గెలవలేమనే, ఇలా పరోక్ష యుద్ధానికి కాలుదువ్వుతోందని ఆరోపించారు. దీన్ని ఎదుర్కొనేందుకు భారత నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఒకే అభిప్రాయానికి రావాలని.. పాక్ పట్ల దృఢ వైఖరి అవలంభించాలని సూచించారు. ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య మాట్లాడుతూ.. మన నిఘా వ్యవస్థలు అనేక పరిమితుల మధ్య పనిచేస్తున్నాయని, వాటికి అవసరమైన వనరులు కూడా సరిగా అందుబాటులో లేవని, కేవలం నివేదికలు సమర్పించడానికే పరిమితం అవుతున్నాయని ఆరోపించారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తరహా వ్యవస్థలను తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం విదేశీ నిఘాపై విక్రమ్‌సూద్ రచించిన ‘ది అన్ఎండింగ్ గేమ్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ కె.రామచంద్రారావు, సోషల్‌కాజ్ అధ్యక్షురాలు డాక్టర్ సోమరాజు సుశీల తదితరులు పాల్గొన్నారు. -
భారత్ కుట్ర.. చైనా సాయం తీసుకుంటాం : శ్రీలంక
కొలంబో : తమ దేశాధ్యక్షుడి హత్యకు కుట్ర జరుగుతోందంటూ సమాచారం అందిన నేపథ్యంలో చైనాకు చెందిన ఫోన్ తయారీ సంస్థ హవాయి సహాయం తీసుకుంటామని శ్రీలంక పోలీసులు తెలిపారు. ఇందుకోసం కోర్టు నుంచి అనుమతి కూడా పొందినట్లు పేర్కొన్నారు. తనను చంపేందుకు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్( రా) కుట్ర పన్నుతోందని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్షుడి హత్యకు కుట్ర జరుగుతున్న విషయం వాస్తమేనని, ఈ విషయమై తాను ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్‌తో కూడా ఫోన్లో చర్చించానని పోలీసు ఇన్ఫార్మర్ నమాల్ కుమార పేర్కొన్నాడు. మైత్రిపాలతో పాటు, శ్రీలంక రక్షణ శాఖ మాజీ కార్యదర్శి గోటబాయ రాజపక్స కూడా హిట్ లిస్టులో ఉన్నారని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈ కుట్ర వివరాలను బయటపెట్టేందుకు కుమార ఫోన్ డేటా కీలకంగా మారింది. అయితే ఈ డేటా మొత్తం డెలిట్ అయిన నేపథ్యంలో హవాయి సహాయం అనివార్యమైందని పోలీసులు తెలిపారు. కాగా ఈ కుట్రలో భాగం ఉందంటూ గత నెల 23న కేరళకు చెందిన థామస్ అనే వ్యక్తిని శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను చంపేస్తామంటూ సీఐడీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనని వెంటనే వారి కస్టడీ నుంచి విముక్తి చేయాలని థామస్ కోర్టుకి విన్నవించాడు. కానీ జడ్జి అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు.. ఇది దేశ అధ్యక్షుడి భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి అంత తేలికగా ఎవరినీ విడిచిపెట్టేది లేదని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఇక శ్రీలంక నాయకులు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలపై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2015లో జరిగిన శ్రీలంక ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు కూడా ‘రా’ పై ఆరోపణలు చేశారు. దేశ పాలన మార్పులో ‘ రా’ పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. -
‘రా’ నన్ను చంపాలని చూస్తోంది
కొలంబో: భారత్‌పై శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్( రా)కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తమ క్యాబినెట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే ‘రా’ పన్నిన కుట్ర గురించి ప్రధాని మోదీకి తెలియదని కూడా ఆయన అన్నారు. ‘రా’తనను హతమార్చేందుకు ప్లాన్ వేసినట్లు మైత్రిపాల్ చెప్పడంతో .. క్యాబినెట్ మంత్రులు షాకైనట్లు తెలుస్తోంది. అయితే అధ్యక్షుడు మైత్రిపాల చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటి వరకు ఎటువంటి ఆధికార ద్రువీకరణ లేదు. వాస్తవానికి మైత్రిపాల్ మరికొన్ని రోజుల్లో భారత్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా శ్రీలంక నాయకులు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలపై ఆరోపణలు చేయడం కొత్తేమి కాదు. 2015లో జరిగిన శ్రీలంక ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు కూడా ‘రా’ పై ఆరోపణలు చేశారు. దేశ పాలన మార్పులో ‘ రా’ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. -
కోవర్ట్ ఆపరేషన్...! ఆత్మాహుతి దాడి నిరోధానికి..
హాలివుడ్ సినిమా యాక్షన్ సీన్లు తలదన్నేలా పద్దెనిమిది నెలల పాటు అత్యంత రహస్యంగా ఊహకందని రీతిలో సాగిన భద్రతాదళాల ఆపరేషన్ విజయవంతమైంది. దేశ రాజధానిపై ఉగ్రమూక పంజా విసరకుండా ఈ సాహసోపేతమైన ఆపరేషన్ దోహదపడింది. దీని కారణంగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఐసీస్ (ఇస్లామిక్ స్టేట్) దాడులకు సిద్ధమైన ఉగ్రవాదుల ప్రణాళికలు కూడా బట్టబయలయ్యాయి. భారత భద్రతా సంస్థల కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో భాగంగా ఐసీస్‌లోకి మన ఏజెంట్‌ను ప్రవేశపెట్టారు. ఈ వ్యక్తి ద్వారా ఐఎస్ ఉగ్రవాదికి ఢిల్లీలో ఆశ్రయం కల్పించడంతో పాటు దాడులకు అవసరమైన పేలుడుపదార్థాలు (ట్రిగ్గర్స్ లేకుండా) కూడా సరఫరా చేశారు. ఆఫ్గనిస్తాన్, దుబాయ్, ఢిల్లీల్లో సుదీర్ఘకాలం పాటు ఈ సూక్ష్మ పర్యవేక్షణ సాగింది. ఛెస్ ఆటలో మాదిరిగా భద్రతా దళాల అధికారులు ఓ వైపు పకడ్బందీ నిఘా కొనసాగిస్తూనే, అనువైన సమయం కోసం ఓపికగా ఎదురుచూశారు. ఇందులో ఉత్కంఠను రేకెత్తించే అంశాలెన్నో ఉన్నాయి... పాకిస్తాన్లో ఉగ్రశిక్షణ పొందిన 12 మంది ఐఎస్ తీవ్రవాదుల బందం భారత్, తదితర ప్రాంతాల్లో బాంబుదాడులకు తెగపడనున్నట్టు నిఘావర్గాలకు (రిసెర్చీ అనాలిసిస్ వింగ్–రా) సమాచారం అందింది. దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు 50 వేల డాలర్ల మొత్తాన్ని ఐసీస్ కార్యకలాపాల కోసం అఫ్గనిస్తాన్‌కు పంపించడాన్ని అమెరికన్ నిఘా వర్గాల సహకారంతో అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక టెలిఫోన్‌కాల్స్ టాప్ చేశాక అఫ్గనిస్తాన్ సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి న్యూఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వస్తున్నట్టు వెల్లడైంది. ఇంజనీరింగ్ విద్యార్ధిగా భారత్‌కు వచ్చిన తీవ్రవాదితో స్నేహసంబంధాలు పెంపొందించుకునేందుకు ఓ ఐఎస్ ఏజెంట్ అవతారంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఓ వ్యక్తిని పంపింది. ఈ వ్యక్తి ద్వారానే తీవ్రవాదికి లజ్‌పత్‌నగర్‌లో బసతోపాటు, పేలుడుపదార్థాలు సమకూర్చేలా చేశారు. ఢిల్లీలో ఐఎస్ ఉగ్రవాదిపై నెలరోజుల పాటు నిరంతర నిఘా కోసం 80 మంది సిబ్బంది పనిచేశారు. ఆత్మాహుతి దాడుల కోసం ఢిల్లీ విమానాశ్రయం, అన్సల్ ప్లాజా మాల్, వసంత్‌కుంజ్ మాల్, సౌత్ ఎక్స్టెన్షన్ మార్కెట్లలో ఐఎస్ ఉగ్రవాది రెక్కీ కూడా నిర్వహించాడు. వీటన్నింటిని కనిపెట్టిన భద్రతా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి అఫ్గనిస్తాన్‌లోని అమెరికా దళాలకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాది ద్వారా 11 మంది సహచరుల కదలికలు కనుక్కోవడంతో పాటు, అతడిచ్చిన సమాచారంతో అనేక ఐఎస్ స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేయగలిగాయి. ఇటీవల అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా దళాలు పై చేయి సాధించేందుకు అవసరమైన సమాచారం ఇతడి వద్దే సేకరించారు. ప్రస్తుతం మరింత సమాచారం కోసం అతడిని విచారిస్తున్నారు. 2017 మే 22న యూకేలోని మాంఛేస్టర్ (23 మంది ప్రాణాలు కోల్పోయారు) లో జరిగిన బాంబుదాడి ఇతడి 11 మంది సహచరుల్లోని ఒకడి పనేనని తేలింది. అక్కడ దాడికి పాల్పడిన వ్యక్తి ఏవైతే పేలుడు పదార్థాలు వినియోగించాడో అలాంటి వాటినే ఢిల్లీకి వచ్చిన ఉగ్రవాది కూడా డిమాండ్ చేయడాన్ని బట్టి ఇక్కడ కూడా అలాంటి ఆత్మాహుతిదాడికి తెగబడాలని భావించాడనేది స్పష్టమవుతోంది. గత సెప్టెంబర్‌లోనే ఈ అరెస్ట్ చోటుచేసుకున్నా ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పుడు బయటపెట్టారు. -
ఐబీ, రా కొత్త చీఫ్‌ల నియామకం
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పలు కీలక పదవులకు అధిపతులను నియమించింది. రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్(రా) చీఫ్‌గా అనిల్ దస్మానా, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) చీఫ్‌గా రాజీవ్ జైన్‌ను ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రా చీఫ్‌గా నియమించిన అనిల్ దస్మానా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారి. ఐబీ చీఫ్‌గా నియమించిన రాజీవ్ జైన్ జార్ఖండ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. వీరిద్దరు ఇప్పటికే పలు కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
'నన్ను ఒక పశువులా హింసించారు'
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకొని ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి. ముఖ్యంగా గురుదాస్ పూర్ జిల్లాలోని దాద్వాన్ గ్రామం సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ పేదలు ఎక్కువ. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు ఎన్నో. నిత్యం పేదరికంలో బతికే వారికి అనూహ్యంగా ఒక పని దొరికి అది కూడా దేశానికి సేవ చేసే పని అయితే. అధికారిక గుఢాచారులు చేసే పని తామే చేయాల్సి వస్తే ఎవరు మాత్రం కాదంటారు. ఇలా గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన ఎంతోమంది పేదవారు.. తమపైనే ఆధారపడి బతికే కుటుంబాలను విడిచిపెట్టి రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) కోసం పనిచేసేందుకు కదిలారు. వీరు చేయాల్సిన పని ఏంటంటే పాకిస్థాన్ వెళ్లి అక్కడ కొన్ని ఫొటోలు తీసుకొని రావడం. బ్రిడ్జీలు, రహదారులు, ముఖ్యమైన ప్రదేశాల వీడియోలు పట్టుకురావడం. ఒక్కొక్కరు మూడు రోజులపాటు వెళ్లి రావాల్సి ఉంటుంది. ఇందుకుగానీ, రా వింగ్ వారికి చెల్లించే మొత్తం రూ.3000 వేలు. అయితే, ఇలా వారిని వాడుకుంటున్న రా అధికారులు వారు కష్టాల్లో పడినప్పుడు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు తీసుకుంటే.. దానియెల్ మసియా అనే ఓ వ్యక్తి ఉన్నాడు. అతడు సైకిల్ రిక్షా తొక్కుతూ రోజుకు 150 సంపాధించేవాడు. ఇతడు రా కోసం స్పై ఏజెంట్ గా పనిచేశాడు. కనీసం పన్నెండుసార్లు పాక్ ను సందర్శించి అక్కడి నుంచి ఎంతో విలువైన సమాచారం ఇచ్చాడు. కానీ, అతడిని పాక్ అధికారులు అరెస్టు చేసినప్పుడు మాత్రం రా అధికారుల నుంచి అతడికి గానీ, అతడి కుటుంబానికి గానీ ఎలాంటి సాయం అందలేదు. నాలుగేళ్ల తర్వాత విడుదలై వచ్చాడు. ఈ నాలుగేళ్లపాటు అతడి కుటుంబం పిల్లలు అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య గడిపింది. అతడికి కనీస సహాయం కూడా ఇప్పటికీ అందడం లేదు. కానీ, అతడిని పాక్ అధికారులు ఎంత వేధించినా వారికి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఇక డేవిడ్(50)అనే మరో వ్యక్తి.. ఇతడు కూడా ఇదే పనిపై వెళ్లి పోలీసులకు చిక్కాడు. వారి చేతుల్లో నరకం అనుభవించి విడుదలయ్యాడు. కనీసం అతడికి అయిన గాయాలకు, మెడికల్ ఖర్చులకు ఎవరి నుంచి రూపాయి సాయం అందలేదు. ఇక సునీల్ అనే మరో వ్యక్తి కూడా ఈ విషయంపై సమాధానం చెబుతూ తనకు గుఢాచారిగా ఉండటం అంటే ఇష్టమని అందుకే వెళ్లి తాను కూడా రాకు అనుబంధంగా పనిచేశానని, తనను జంతువును హింసించినట్లే హింసించారని.. ప్రస్తుతం పక్షవాత సమస్య కూడా వచ్చిందని.. కనీసం పెన్షన్ లాంటి సౌకర్యం కూడా అందకపోవడం తమ దౌర్భాగ్యం అని వాపోయాడు. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. రాకు సహాయంగా పనిచేసే ఎంతోమందిది ఇప్పుడు ఇదే బాధ. -
రా ఏజెంట్‌గా!
మొదటి సినిమా ‘ముకుంద’లో పక్కింటి అబ్బాయిలా ఉండే పాత్రలో కనిపించి, అందరికీ దగ్గరయ్యారు వరుణ్ తేజ్. రెండో చిత్రం ‘కంచె’లో సైనికుడిగా కనిపించి, భేష్ అనిపించుకున్నారు. ఇక, మూడో చిత్రం ‘లోఫర్’లో మంచి మాస్ కుర్రాడిలా రెచ్చిపోయారు. ఇలా సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రలతో ముందుకెళుతున్న వరుణ్ తేజ్ తన నాలుగో చిత్రంలో గూఢచారిగా కనిపించనున్నారు. ‘కంచె’లో వరుణ్ని రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన సైనికుడిలా మలిచిన క్రిష్ ఇప్పుడు ‘రాయబారి’లో భారత నిఘా వ్యవస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్)విభాగానికి చెందిన ఏజెంట్‌గా వరుణ్‌ను చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘కంచె’ తర్వాత మళ్లీ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉందని వరుణ్ అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథాచర్చలు జరుగుతున్నాయి. మార్చిలో చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. -
కుటుంబ కలహాలే కారణం
న్యూఢిల్లీ: గూఢచార సంస్థ రీసర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) అధికారి అనన్య చక్రవర్తి ఇటీవల భార్యాపిల్లలను హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. దక్షిణఢిల్లీలోని తన స్వగృహంలోనే ఆయన శనివారం ఈ దారుణానికి పాల్పడ్డారు. భార్య జయశ్రీ (42), సంతానం దిశ (12), అర్ణబ్ (17)ను చంపి తాను ఉరి వేసుకున్నారు. భార్యాపిల్లల మృతదేహాలపై తీవ్రగాయాలు కనిపించాయి. వారిని తీవ్రంగా హింసించి చంపినట్టు తేలింది. దీంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. పొరుగువాళ్లు, నౌకర్లు, అపార్టుమెంట్ వాచ్‌మన్‌ను ప్రశ్నిం చారు. భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నప్పుడల్లా పిల్లలిద్దరూ తల్లికి మద్దతు ఇచ్చేవారని వెల్లడయింది. అయితే శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఎవరూ భోజనం చేయకపోవడంతో సగం ఉడికిన ఆహారం వంటగదిలో కనిపించింది. చక్రవర్తి కుటుంబం స్థానికంగా అందరితోనూ స్నేహపూర్వకంగా మెలిగేది. సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నా.. గొడవల గురించి ఎప్పుడూ ప్రస్తావించేవాళ్లు కాదని పొరుగువాళ్లు చెబుతున్నారు. వీళ్లంతా ఏ సమయంలో మృతి చెందారనే విషయం ఎయిమ్స్ పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. రక్తంతో తడిన సుత్తి, పెద్ద కత్తిని ఘటనాస్థలంలో కనిపించిందని, వీటితోనే చక్రవర్తి హత్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. అపరిచితులు లోపలికి బలవంతంగా ప్రవేశించినట్టు నిరూపించే ఆధారాలు కూడా లభించకపోవడంతో చక్రవర్తే ఈ హత్యలు చేసినట్టు దర్యాప్తు అధికారులు నిర్ధారణకు వచ్చారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఈ అధికారికి ఢిల్లీలో దగ్గరి బంధువులు ఎవరూ లేరు. ఇద్దరు అక్కలు ఉన్నా వాళ్లు ఇతర నగరాల్లో నివసిస్తున్నారు. రాలో ఇన్స్పెక్టర్స్థాయి అధికారి అయిన చక్రవర్తి కేబినెట్ సెక్రటేరియెట్‌లో పనిచేసేవాడు. ఘటనాస్థలంలో లభిం చిన ఆధారాలన్నింటినీ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)కి పంపించామని, దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ అధికారి ఆత్మహత్య నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.