పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ అధికార ప్రతినిధి రవూఫ్ హసన్
కొన్నిసార్లిది తలకిందుల పిచ్చి మాలోకంగా అయిపోగలదు. ‘మ్యాడ్’ మేగజీన్‌లోని ఒక కార్టూన్ నిజరూపం లోనికి రూపాంతరం చెందినట్లే ఈ ప్రపంచం ఉంటుంది. ప్రస్తుతం పక్కింట్లో అదే జరిగిందని అనిపిస్తోంది. అయితే ఏ విధంగానూ అది అందరికీ జరిగినట్లు కాదు. కచ్చితంగా జరిగిందైతే అక్కడి ప్రభుత్వానికి, భయానకమైన ‘ఐఎస్‌ఐ’కి. నేను చెప్ప వలసి ఉన్నది అతి వింతైన కథ కనుక చాలామందికి అది కనీసం కల్పనగా కూడా నమ్మదగనిది. అయినప్పటికీ, నన్ను నమ్మండి... అది నిజంగా జరిగింది.
పాకిస్తాన్‌లోని యూట్యూబర్‌లు, అక్కడి ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ వంటి వార్తా పత్రికలు, ఆ దేశపు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఆఖరికి స్వయానా ఆ శాఖ మంత్రి కూడా నన్ను పాకిస్తాన్ వ్యతిరేకిననీ, మోదీ ప్రభుత్వానికి సన్నిహితుడిననీ, ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్)తో చేతులు కలిపాననీ ప్రకటించటం జరిగింది. ఇప్పుడిది, చివరిసారి నేను చేసిన ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే లేచి బయటికి వెళ్లిపోయిన ప్రస్తుత ప్రధాన మంత్రికీ, దశాబ్దాలుగా నన్ను పాకిస్తాన్ పక్షపాతిగా నిందిస్తూ వస్తున్న విమర్శకులకూ నిస్సందేహంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే సరిహద్దు వెంబడి గస్తీ సైనికులు, వారి పౌర ప్రభుత్వాలు, నిఘా అధికారులకు ఇది... అవునా! నిజమా... అనిపించేలా ఉంటుంది.
ఇదెలా జరిగిందో వివరించటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. కొన్ని వారాల క్రితం పాక్ అధికారులు తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (ఇమ్రాన్ ఖాన్ పార్టీ) సమాచార కార్యదర్శి, అధికార ప్రతినిధి అయిన రవూఫ్ హసన్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై దేశద్రోహ నేరం మోపాలన్న కృతనిశ్చయంతో నిర్బంధించి అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈమెయిల్స్‌ను, వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలించారు. అక్కడ వారికి రవూఫ్ నాతో పంచుకున్న – 2022 నవంబర్ వెనకటి – మెసేజ్‌లు కొన్ని కనిపించాయి. ఆహా! ఇకనేం, భారతదేశంలోని వ్యక్తులతో అతడు మాట్లాడుతున్నాడన్న నిర్ధారణకు వారు వచ్చేశారు. అది అత డిని దేశ వ్యతిరేకిని చేసేసింది. ఇంకా దారుణం, ఇమ్రాన్‌తో పాక్ ఎలా వ్యవహరిస్తోందో రవూఫ్ తన మెసేజ్‌లలో వ్యాఖ్యానిం^è టం, పాకి స్తాన్ రాజకీయాలపై చర్చించటం, చివరికి ఆర్మీ చీఫ్ గురించి కూడా మాట్లాడటం! ఇవన్నీ కూడా నిస్సందేహంగా పాక్ దృష్టిలో దేశ వ్యతి రేకమైనవే.
ఇప్పుడిది రూఢీ అవ్వాలంటే పాక్‌ని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తిగా నన్ను చిత్రీకరించాలి. ఆ దేశంలోని ఎంతోమంది నియంతలు, ప్రధానులు నాకు తెలుసనీ, వారిని నేను ఇంటర్వ్యూ చేశాననీ, తరచు నేను ఆ దేశాన్ని సందర్శిస్తుంటాననీ; ఇస్లామాబాద్‌లో, లాహోర్‌లో, కరాచీలో నా సన్నిహిత మిత్రుల జాబితా పెద్ద చాంతాడంత ఉంటుందనీ గుర్తించటం వంటివేవీ పాక్ చిత్రీకరణ ఉద్దేశాన్ని నెరవేర్చేవి కావు. బేనజీర్ భుట్టో నాకు ఆప్త నేస్తం అనీ, నవాజ్ షరీఫ్ ఆఖరుగా 2014లో ఇండియా వచ్చినప్పుడు నన్ను కలుసుకోవాలని కోరారనీ, షెహబాజ్ షరీఫ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన, నేను కలిసి పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంలో కూర్చొని స్నేహపూర్వకంగా లేదా, పిచ్చాపాటీగా కబుర్లు చెప్పుకున్నామనీ అంగీకరించటం కూడా పాక్ అనుమానాలను బలపరిచేందుకు ఉపయోగపడదు. అలా అంగీ కరించటం అన్నది రవూఫ్‌కు వ్యతిరేకంగా నిర్మిస్తున్న కేసును కుప్ప కూల్చి ఉండేది.
కాబట్టి తన అధికారిక ప్రకటనలో పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ: ‘‘భారతదేశ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు రవూఫ్ హసన్ జాగ్రత్త లేకుండా పంపిన మెసేజ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయి. నిజా నికి ఈ మెసేజ్‌లు కరణ్ థాపర్‌కు మద్దతుగా ఉన్న ‘రా’ అధికారులకు అమూల్యమైన సంపద వంటి సమాచారం అని రక్షణశాఖ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మెసేజ్‌లను బట్టి పాక్ వ్యతిరేక ప్రచారాన్ని రాజేసేందుకు పి.టి.ఐ. (పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్) ప్రతినిధి దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఒక భారతీ యుడికి చేరవేస్తున్నట్లు బహిర్గతం అయిందని వారు తెలిపారు’’ అని పేర్కొంది. పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అతావుల్లా తరార్, ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’తో మాట్లాడుతూ... ‘‘పాక్ వ్యతి రేక భావాలకు పేరుమోసిన ఒక భారతీయ జర్నలిస్టుతో హసన్‌కు ఉన్న సంబంధాలు స్వదేశం పట్ల పి.టి.ఐ. అవిధేయతను మరింతగా తేటతెల్లం చేస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
పర్యవసానంగా, రవూఫ్ నాతో నెరిపిన సంక్షిప్తమైన, చాలా అరుదైన, ఏమాత్రం హానికరం కానివైన మెసేజ్‌లు – నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశానన్న వాస్తవం కూడా – మార్మికమైన రీతిలో పాకిస్తాన్ సార్వభౌమాధికారతకు, సమగ్రతకు, భవిష్య త్తుకు ముప్పుగా పరి వర్తనం చెందాయి. నిస్సందేహంగా ఇది ఆయనపై విచారణ జరిపించేందుకు ఉపయోపడుతుంది. వారి దృష్టిలో అదే న్యాయం. మా మధ్య సాగిన ఉద్దేశపూర్వకం కాని వాట్సాప్ మెసేజ్‌లు, ఇంటర్వ్యూ లాంటి మాటామంతీ, ఇంకా చెప్పాలంటే ఓ రెండు సంభాషణలు... వీటన్నిటినీ దాటి అసలు నిజం ఏమిటంటే రవూఫ్ నాకు తెలియదు. అతడికీ నేను తెలియదు. మేము ఒకరికొకరం అపరిచితులం. కాబట్టి ఇదెప్పటికీ మారదు.
వాస్తవానికి, వారు రవూఫ్ బాస్ అయిన ఇమ్రాన్ ఖాన్ నాతో మంతనాలు జరిపారని ఆరోపించినట్లయితే వారి కేసుకు మరింత బలం చేకూరి ఉండేది. ఇమ్రాన్‌ను నేను అనేకసార్లు ఇంటర్వ్యూ చేశాను. బని గలా (ఇస్లామాబాద్) లేదా ఢిల్లీలో మాత్రమే కాదు... ఒక సందర్భంలో నేను లండన్ వెళ్లి మరీ, అక్కడి రిచ్‌మండ్‌లో ఇమ్రాన్ మాజీ అత్తమామలు ఉండే భవనం లోపలి తోటల్లో ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. పాకిస్తాన్ చార్జిషీట్‌లో అది నేరంగా కనిపించటం లేదా? అంతకుమించిన నేరం, తనెప్పటికైనా ప్రధాని అయితే ఆర్మీ చీఫ్ తనకు లోబడి పని చేయవలసి ఉంటుందని కూడా ఇమ్రాన్ అనటం. నవ్వుతూ ఏమీ ఆయన ఆ మాట అనలేదు.
పాకిస్తాన్‌లోని నా ప్రియ స్నేహితుడు ఒకరు ఈ అస్థిమితం నుంచి నన్ను శాంతింపజేయటానికి ఇలా అన్నారు: ‘‘అలీస్ ఇన్ ది వండర్‌ల్యాండ్’తో నీకు పరిచయం ఉంది. ఇప్పుడిక, మాలిస్ (దుష్ట బుద్ధి) ఇన్ ది ఫౌజీలాండ్ (సైనికదేశం)కు స్వాగతం.’’
– కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment