
బెలూచిస్తాన్ , ఖైబర్ పక్తున్‌ఖ్వాల మీద పాకిస్తాన్ ప్రభుత్వం పట్టు కోల్పోయిందని ఫిబ్రవరి 18న అక్కడి మత, రాజకీయ నాయకుడు మౌలానా ఫజలుర్ రెహ్మాన్ ధ్వజ మెత్తారు. సాక్షాత్తు నేషనల్ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితికి ప్రభుత్వం,సైన్యంతో పాటు ఐఎస్‌ఐ కూడా కారణమేనని ఆయన అన్నారు. ఈ మాటలు వినిపించినరెండో రోజునే, ఫిబ్రవరి 20న బెలూచిస్తాన్ మరొకసారి భగ్గుమంది. కామిల్ షరీఫ్, ఇషాన్ సర్వార్ బలోచ్ అనే ఇద్దరు తర్బత్ న్యాయ కళాశాల విద్యార్థుల నిర్బంధాన్ని నిరసిస్తూ ఈ ప్రదర్శనలు జరిగాయి. ఆ రెండు రాష్ట్రాలలోనూ ఆందోళనలు కొత్త కాదు. కానీ జాతీయ అసెంబ్లీలో ఒక ప్రముఖ సభ్యుడు ఈ స్థాయిలో హెచ్చరించడం కొత్త అంశమే.
‘పాకిస్తాన్ ఒక విఫల రాజ్యం’
ఇటీవలి కాలంలో బెలూచిస్తాన్ ఉద్యమం గొంతు పెరిగింది. కొద్దికాలం క్రితమే ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఎదుట బెలూచ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా దాని నాయకుడు రజాక్ బలోచ్ చెప్పిన మాటలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. పాకిస్తాన్ ఒక విఫల రాజ్యమనీ, అది బెలూచిస్తాన్‌సింధ్, ఆక్రమిత కశ్మీర్‌ల సంపదను అడ్డంగా దోపిడీ చేస్తూ బతుకీడుస్తున్నదనీ ఆరోపించారు. దీనికి చైనా తోడై పాక్ సైన్యానికి శిక్షణ ఇచ్చి, తన కనుసన్నలలో ఉంచుకున్నదని పెద్ద ఆరోపణే చేశారు. పాక్, చైనాలను బెలూచిస్తాన్ నుంచి తరిమేయడమే తమ లక్ష్యమని అన్నారు. స్వాతంత్య్రం కోసం పాకిస్తాన్ మీద పోరాడుతున్న బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ‘పకడ్బందీ’ దాడులు ఉధృతం చేసింది. 75 ఏళ్లుగా సాగుతున్న ప్రత్యేక దేశ పోరాటం మలుపు తిరిగిందని భావించే స్థాయిలో ఈ దాడులు ఉన్నాయి. బీఎల్‌ఏను పాకిస్తాన్ తో పాటు అమెరికా కూడా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రాంతంతో పాటు ఇరాన్, అఫ్గాన్‌లలోని కొన్ని ప్రాంతాలు కలిపి బెలూచిస్తాన్‌అనే స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలని బీఎల్‌ఏ కోరుతున్నది.
ఇవాళ్టి బెలూచిస్తాన్ అంటే దేశ విభజనకు ముందు ఉన్న కలాత్ సంస్థానమే. దీనికి కూడా పాకిస్తా¯Œ లో లేదా భారత్‌లో కలవడానికి, లేదంటే స్వతంత్రంగా మనుగడ సాగించే వెసు లుబాటు ఇచ్చారు. కానీ జిన్నా ఎత్తు లతో ఇది అంతిమంగా పాక్‌లో విలీనం కావలసివచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పడమంటే, భారత్, పాక్ రెండూ కూడా వలస పాలన ఇచ్చిన సమస్యలను నేటికీ ఎదుర్కొంటు న్నాయి. కశ్మీర్ సమస్యను పాక్ అనుకూలంగా మలుచుకోవాలను కుంటున్నది. కానీ బెలూచిస్తాన్ వ్యవహారాలకు భారత్ దూరంగా ఉంది.
1947 నుంచే వేర్పాటు బీజం
నిజానికి 1947 నుంచే బెలూచిస్తాన్‌లో వేర్పాటువాదానికి బీజం పడింది. దీని రాజధాని క్వెట్టా. కోటీ యాభయ్ లక్షల జనాభా ఉన్న బెలూచిస్తాన్ ప్రకృతి సంపదల దృష్ట్యా కీలకమైనది. 1947 నుంచి పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్ గిరిజన తెగ ఐదు తిరుగుబాట్లు చేసింది. వీటిలో చివరిది 2000 సంవత్సరంలో మొదలయింది. తమ ప్రాంత వనరులలో స్థానికులకు సింహభాగం ఉండాలన్న డిమాండ్‌తో ఈ తిరుగుబాటు తలెత్తింది. కశ్మీర్ వేర్పాటువాద పోరాటానికి మద్దతు ఇస్తామని బాహాటంగానే ప్రకటించే పాక్ పాలకులు బెలూచీలను దారుణంగా అణచివేస్తున్నారు.
బెలూచీల అశాంతి తీవ్రరూపం దాల్చేటట్టు చేసినది పాక్–చైనా ఆర్థిక నడవా. 62 బిలియన్ డాలర్లతో దీనిని నిర్మిస్తున్నట్టు దశాబ్దం క్రితం చైనాప్రకటించింది. బెలూచిస్తాన్‌కు బంగారు బాతు వంటి గ్వదర్ డీప్ సీ పోర్టు నిర్మాణం చైనా చేతిలో పెట్టడం కూడా వారి తిరుగుబాటును తీవ్రం చేసింది. హత్యలే కాకుండా కొన్ని పోలీస్ స్టేషన్‌లను కూడా బెలూచ్ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయి. జాతీయ రహదారులను దిగ్బంధనం చేశాయి. రైల్వే లైన్లను పేల్చి వేశాయి. ‘బీఎల్‌ఏకు దాడులు చేసే సామర్థ్యం బాగా పెరిగిందని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. సున్నిత ప్రదేశాలతో పాటు, గహనమైన లక్ష్యాల మీద కూడా దాడి చేసే శక్తి అది సముపార్జించుకున్నది. వీటితో బీఎల్‌ఏకు విదేశీ సాయం ఉన్నదన్న అనుమానం పాకిస్తాన్ లో మరింత పెరిగింది’ అని పాకిస్తాన్ రాజకీయ, సైనిక వ్యవహారాల వ్యాఖ్యాత ఆయేషా సిద్దిఖీ వ్యాఖ్యానించారు. సాధారణంగా బెలూచిస్తాన్ ఉగ్ర వాదుల దాడులను పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ‘శత్రువుల’ పనిగా అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే భారత వైమానిక దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ ఉదంతం తరువాత, అంటే 2016 నుంచి బెలూచిస్తాన్ హింసలో భారత్ హస్తం ఉన్నదని కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటికీ జాదవ్ పాకిస్తాన్ నిర్బంధంలోనే ఉన్నారు. ఇందుకే బెలూచిస్తాన్ లో హింసకు సంబంధించి భారత్ మీద పాక్ చేసే ఆరోపణలకు చైనా మీడియా విపరీతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.
పశ్చిమ ప్రాంతంలోనే ‘తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ సంస్థ కూడా పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నది. చిరకాలంగా బెలూచిస్తాన్ ప్రజల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత వైఖరినే అవలంబిస్తున్నది. అక్కడి పౌరులను అపహరించి మళ్లీ వారి జాడ లేకుండా చేయడం స్థానిక ప్రభుత్వ నిఘా సంస్థలు చేస్తున్న పనేనని 2023 నాటి ఒక నివే దిక పేర్కొన్నది. కనిపించకుండా పోయినవారి కోసం, రాజ్యాంగేతర హత్యలకు వ్యతిరేకంగా గళం ఎత్తుతున్న ‘వాయిస్ ఆఫ్ బెలూచ్ మిసింగ్ పర్సన్స్’, ‘బెలూచ్ యాక్ జెహెతి కమిటీ’ సభ్యులను కూడా భద్రతా బలగాలు తీవ్రంగా హింసిస్తు న్నాయి. బెలూచిస్తాన్‌లో ఎన్నికలు ప్రహసనంగానే జరుగు తాయి. పౌర ప్రభుత్వాలు, వ్యవస్థలు, సైన్యం ఆ ఎన్నికలను తమకు అనుకూలంగా జరుపుకొంటూ ఉంటాయి. లేదంటే బెలూచిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించే స్థానిక జాతీయ పార్టీ లను గెలిపిస్తూ ఉంటారు. బెలూచిస్తాన్‌లో ఉండే బెలూచీలు, పష్తూన్ ప్రజల మధ్య సదా విభేదాలు రాజేయడానికి సైన్యం తన వంతు పాత్రను పోషిస్తూ ఉంటుంది.
బుగ్తీని చంపిన తప్పిదం
బెలూచిస్తాన్ లిబరేషన్‌ఆర్మీ మొన్నటి ఆగస్ట్‌లో చేసిన దాడులకు మరొక ప్రాధాన్యం ఉంది. అది బుగ్తీ తెగ ప్రము ఖుడు అక్బర్ ఖాన్ బుగ్తీ 18వ వర్ధంతి. పర్వేజ్ ముషార్రఫ్ ఆదేశాల మేరకు ప్రయోగించిన క్షిపణి దాడిలో రహస్య స్థావరంలోనే బుగ్తీ మరణించాడు. నిజానికి ఆయన మొదట పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వంలో మంత్రి. బెలూచిస్తాన్ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా కూడా పని చేశాడు. తరువాత బెలూచీల సాయుధ తిరుగుబాటులో భాగస్వామి అయ్యాడు. జుల్ఫీకర్ అలీ భుట్టో ఉరితీత ఎంత తప్పిదమో, బుగ్తీని హతమార్చడం కూడా అంతే తప్పిదమని విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. బుగ్తీని చంపడం బెలూచిస్తాన్‌ఉద్యమానికి అమ రత్వాన్ని ఆపాదించింది. 1970లో బెలూచిస్తాన్‌లిబరేషన్ ఆర్మీ ఆవిర్భవించినప్పటికీ, దూకుడు పెంచినది మాత్రం ఆయన మరణం తరువాతే.ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ ఉద్యమకారులు భారత్ వైపు ఆశగా చూడటం ఒక పరిణామం. వారి ప్రదర్శనలలో భారత్ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించడం సాధారణమైంది. పాక్ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ తుంటరి పిల్లాడికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత, హక్కు భారత్‌కు ఉన్నాయని లండన్ కేంద్రంగా పనిచేసే బెలూచిస్తాన్ విముక్తి పోరాట సంస్థ కార్యకర్త ఒకరు అభిప్రాయపడటం విశేషం.
డా.గోపరాజు నారాయణరావు సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment