కీలెంచి వాతపెడతారు! | A Similar Story Written By Ulli Balarangaiah On The Subject Of Bangladesh's Political Movement | Sakshi
Sakshi News home page

కీలెంచి వాతపెడతారు!

Published Wed, Sep 4 2024 11:57 AM | Last Updated on Wed, Sep 4 2024 11:57 AM

A Similar Story Written By Ulli Balarangaiah On The Subject Of Bangladesh's Political Movement

బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చే వ్యవహారాన్ని అమెరికా అనుకూల ప్రతిపక్షం సాకుగా చూపి ఆ దేశాన్ని అంతర్యుద్ధానికి సన్నద్ధం చేసిందనేది అక్షర సత్యం. మతం ఆధారంగా ఈ దేశం నుంచి విడిపోయి తూర్పు పాకిస్తాన్‌గా పిలవబడిన బంగ్లాదేశ్‌లో మొదటి నుండి ఉర్దూ మాట్లాడే పాకిస్తాన్‌ అనుకూల వాదులకూ, బెంగాలీ మాట్లాడే ముస్లింలకూ అనేక విషయాల్లోౖ సెద్ధాంతిక వైరుద్ధ్యం ఉంది.  బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎక్కువమంది అవామీ లీగ్‌ పార్టీకి విధేయులు.

ఆ పార్టీ నాయకుడైన షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ను బంగ్లాదేశ్‌ జాతిపితగా అక్కడి మెజారిటీ ప్రజలు చూస్తారు. అయినప్పటికీ పాకిస్తాన్‌ అనుకూల వాదులు సైన్యాన్ని అడ్డుపెట్టు కొని 1975లో ముజిబుర్‌ రెహమాన్‌తో సహా 22 మందిని మట్టు పెట్టారు. ఆయన ఏర్పాటుచేసిన అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలకు మైనారిటీలుగా హిందువులు ఎదుర్కొనే సమస్యలపై  కొంత అవ గాహన ఉంది. అందుకే వారు అక్కడి హిందుత్వ సంస్థలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ కారణంతోనే హసీనా ప్రభుత్వ వ్యతిరేకులు హిందువులపై విచక్షణారహితంగా దాడులకు తెగ బడ్డారు. ఇక భారతదేశాన్ని పరిపాలించే ప్రభు త్వం హిందుత్వ ప్రభుత్వం అని నమ్మినవారు... షేక్‌ హసీనాకు ఆశ్రయం కల్పించడాన్ని సహించలేక బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణ హోమం జరిపారు. ఇది అక్షర సత్యం.

షేక్‌ హసీనా రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ కార్యకర్తలూ, ఇస్లామిక్‌ తీవ్రవాద గ్రూపు సభ్యులూ కలిసి బంగ్లాదేశ్‌లో జరిపిన మారణ హోమం, హసీనా ఇంట్లో చొరబడి చేసిన నిర్వాకం భారతదేశంలోని కొంతమందికి అమితానందాన్ని కలిగించింది. ఆ ఆనందంతోనే ‘భారత్‌లో కూడా బంగ్లాదేశ్‌ పరిస్థితులు రాబోతున్నాయనీ, మోదీ కూడా ఏదో ఒక రోజు దేశం విడిచి పారి పోతాడనీ, మోదీ ఇంట్లోకి ఏదో ఒక రోజు ప్రజలు దూరే పరిస్థితి వస్తుందనీ’ వారు వ్యాఖ్యలు చేస్తు న్నారు. ఈ మాటలు దేశ హితైషు లకు పట్టరాని కోపాన్ని తెప్పించాయి.

ఇక భారతీయుల, బంగ్లాదేశీయుల ఆలోచనలు ఒకే కోణంలో ఉంటాయా అనే విషయాన్ని పరిశీలిద్దాం! మతం ఆధారంగా దేశాన్ని కోరు కుని, తమ సొంత మతస్థుల చేతిలో అరాచకానికి గురై, మన సైనిక సహకారంతో ఒక స్వతంత్ర భూభాగాన్ని ఏర్పాటు చేసుకుని, దేశానికి ఏది అవసరమో, ఏది అనవసరమో తెలియని ఒక గుంపు స్వభావం కలిగిన వారు బంగ్లా దేశీ యులు. ఇక భారతీయులు ఎంతో పరిణతి కలిగిన సుసంపన్న సాంస్కృతిక వారసత్వం కలవారు. వీరిని రెచ్చగొట్టి, తమ పైశాచికత్వాన్ని పండించుకోవాలని చూసే నాయకులకు ఇక్కడ మద్దతు లభించదు.

1967లో కాంగ్రెస్‌ పార్టీ నిట్ట నిలువునా చీలినప్పుడు, రాజభరణాల రద్దు సమయంలో, 1971 బంగ్లాదేశ్‌ సంక్షోభ సమ యంలో మన సైన్యాన్ని పాకిస్తాన్‌ పైకి పంపి నప్పుడు, 1975 ఎమర్జెన్సీ సమయంలో ఈ దేశం అనేక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంది. కానీ ప్రజలు సంయమనంతో వ్యవహరించి, ప్రజా స్వామ్య పంథాను అనుసరించి, హుందాగా వ్యవహరించారు. బంగ్లాదేశీయుల్లా భారతీ యులు హింసను ఆశ్రయించి ఉంటే– దేశంలో ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్‌ పార్టీ నాయ కులకూ, ఆ పార్టీ అనుయాయులకూ షేక్‌ హసీ నాకు పట్టిన గతే పట్టేది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై ప్రజలు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. 


– ఉల్లి బాలరంగయ్య, వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement