విశ్లేషణ
షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పటి నుండీ... హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. విస్తృత సరిహద్దు రీత్యా, అక్కడి పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపుతున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి. ఇటీవల శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ లాంటి పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో భారత్ పాఠాలు నేర్చుకోవాలి. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో తోడ్పాటు అందించాలి. హసీనాకు ఏకపక్ష మద్దతివ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన విధానాలను దిద్దుకోవాల్సిన అవసరం ఉందనీ అర్థం చేసుకోవాలి.
షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఒక ప్రజా తిరుగుబాటుతో కూల్చివేసినప్పటి నుండీ, హింస, అశాంతితో బంగ్లాదేశ్ అతలాకుతలమవుతోంది. అక్కడి మైనా రిటీ హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సంఘటనల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం ‘మైనారిటీలతో సహా బంగ్లాదేశ్ పౌరులందరి భద్రతకు, రక్షణకు ప్రాథమిక బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే’ అని స్పష్టం చేసింది.
బంగ్లాదేశ్ పరిణామాలను రెండు రకాలుగా చూడవచ్చు. మొదటిది, హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ ఉక్కు పాదాన్ని తొలగించిన తర్వాత... ఇస్లామిస్టులు, పాకిస్తాన్ కి చెందిన ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్ ్స (ఐఎస్‌ఐ) పట్టు సాధించారు. ఈ క్రమంలో హిందూ మైనారిటీలు హింసకు గురవుతున్న సందర్భంగా ఆ దేశం పాక్షిక అరాచక స్థితికి చేరుకుంటోంది. రెండవ పరిణామం ఏమంటే, గత దశాబ్ద కాలంగా నిజమైన ప్రజాస్వామ్యం లేని బంగ్లా దేశ్, తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో అడుగులేయడానికి ప్రయ త్నిస్తూ ఒక తాత్కాలిక దశ గుండా పయనిస్తోంది.
సరిహద్దుల చుట్టూ?
బంగ్లాదేశ్ బహుశా దక్షిణాసియాలో భారతదేశానికి అత్యంత పర్యవసానాలతో కూడిన పొరుగు దేశం. దాని సరిహద్దులను దాదాపు భారత్ పరివేష్టించి ఉంది. 4,367–కిలోమీటర్ల సరిహద్దులో, కేవలం 271 కిలోమీటర్లు మాత్రమే మయన్మార్‌తో ఉండగా, మిగిలిన 4,096 కిలోమీటర్లు భారతదేశంతో ఉంది. త్రిపుర, మిజోరాం, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో ఆ దేశం సరిహద్దులను కలిగి ఉంది. అందుకే ఈశాన్య ప్రాంతపు ఆర్థిక అభివృద్ధి, భద్రతకు ఇది కీలకం.
బంగ్లాదేశ్ సరిహద్దు స్వభావాన్ని బట్టి చూస్తే, దానిని పూర్తిగా మూసివేయడం చాలా కష్టం. ఫలితంగా, ఆ దేశంలోని వివిధ ప్రభు త్వాల పాలనా విధానాలు మన దేశ భద్రతపై కీలక ప్రభావం చూపు తున్నాయి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో భారత్ పాత్ర ఉన్నప్పటికీ, ఇరు దేశాల సంబంధాలు హెచ్చు తగ్గులను చూస్తూ వచ్చాయి.
నియంతలైన జియావుర్ రెహ్మాన్, హెచ్‌ఎమ్ ఎర్షాద్ తమ నియంత్రణను కొనసాగించే ప్రయత్నంలో దేశంలో ఇస్లా మీకరణను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ఈ ఎగుడు దిగుళ్లు తప్ప లేదు. పాకిస్తాన్ లాగే, జమాత్–ఎ–ఇస్లామీ కూడా బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ, ఈ ప్రక్రియలో అది గణనీయమైన పాత్ర పోషిస్తూనే పెరిగింది.
భారత వ్యతిరేక గ్రూపులు
అయితే, బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది కేవలం భారతదేశానికి సంబంధించినది మాత్రమే కాదు... చైనా, మయన్మార్, ఆగ్నేయాసి యాతో సహా విస్తృత ప్రాంతంపై దీని ప్రభావం ఉంటోంది. దాని అతి పెద్ద ముస్లిం జనాభాలో పెరిగిపోతున్న సమూల మార్పువాదం (రాడి కలైజేషన్) విస్తృత ప్రపంచ పరిణామాలను కలిగి ఉంటుంది. జమాత్–ఎ–ఇస్లామీతో పాటు, హర్కత్–ఉల్–జిహాద్–అల్–ఇస్లామీ, జమాత్–ఉల్–ముజాహిదీన్ బంగ్లాదేశ్, అలాగే అల్–ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌ల వంటి ఇతర రాడికల్ గ్రూపులు కూడా ఆ దేశంలో ఉన్నాయి. మదర్సా నాయకుల నెట్‌వర్క్ అయిన హెఫాజత్–ఎ–ఇస్లాం కూడా దేశంలో షరియా పాలనను కోరుకుంటూ, అక్కడ లౌకిక రాజకీయ స్థాపనను వ్యతిరేకిస్తోంది.
బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ)తో జమాత్–ఎ–ఇస్లామీ పొత్తు పెద్ద సమస్యగా మారింది. తత్ఫలితంగా, 1991–96లోనూ 2001–06లోనూ ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్న పదవీకాలం అనేది... దాదాపుగా ఐఎస్‌ఐ, ఈశాన్య ప్రాంతంలో భారతదేశానికి వ్యతిరేకంగా క్రియాశీలంగా ఉన్న తిరుగుబాటు గ్రూపుల వర్గానికి విశృంఖల స్వేచ్ఛను ఇచ్చింది.
2009లో హసీనా ప్రభుత్వ స్థాపనతో భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధం స్థిరపడింది. మరీ ముఖ్యంగా, ఇది ఐఎస్‌ఐ లేదా వివిధ ఈశాన్య తిరుగుబాటు గ్రూపులు, బంగ్లాదేశ్ భూభాగాన్ని భారత వ్యతిరేక శక్తులకు ఉపయోగించడాన్ని తనిఖీ చేయడంలో సహాయపడింది. రెండు దేశాలను కలిపే భూ మార్గాలను తిరిగి తెరవడానికీ, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్ గుండా ప్రాంతీయ ట్రాఫిక్ కదలికను ప్రోత్సహించేందుకు మోటార్ వాహ నాల ఒప్పందంపై సంతకం చేయడానికీ ఈ పరిణామం దారి తీసింది.
మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం పక్కనే బంగాళాఖాతం శిఖర ప్రాంతంలో ఉన్న బంగ్లాదేశ్ స్థానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు, భారతదేశాన్ని నియంత్రించడం అనే తన పెద్ద విధానంలో భాగంగా చైనా తొలి నుంచి బంగ్లాదేశ్‌పై గణనీయమైన ఆసక్తిని పెంచుకుంది. ఇక్కడ చైనా ముఖ్యమైన పెట్టుబడులను కలిగి ఉంది.
ఇక్కడి నుండి ఒక పైప్‌లైన్ మలక్కా జలసంధిని దాటవేస్తూ చైనాలోని యునాన్‌కు క్యుక్‌పియు నౌకాశ్రయం నుండి చమురును తీసుకు వెళుతుంది. బంగ్లాదేశ్‌లో వంతెనలు, రోడ్లు, పవర్ ప్లాంట్‌లను నిర్మించడంలో చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా దేశానికి అతిపెద్ద సైనిక సరఫరాదారుగా కూడా అవతరించింది.
భారత్ చేయాల్సింది!
పైన ఉదహరించిన అనేక కారణాల వల్ల, బంగ్లాదేశ్‌లోని వ్యవహా రాలను భారత్ చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. పరిస్థితి చాలా అస్థిరంగా ఉంది. అక్కడ పరిస్థితులు అదుపు తప్పవచ్చు కూడా. ఫలితంగా భారతదేశానికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. అక్కడి ప్రజా ఉద్యమంపై భారత వ్యతిరేక కథనాన్ని రుద్దేందుకు ఐఎస్‌ఐ ఓవర్‌టైమ్ పని చేసే అవకాశం ఉండటంతో పరిస్థితి మరింత జఠిలమైంది.
ఇటీవల పొరుగు దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను విజయ వంతంగా నిర్వహించడం నుండి భారతదేశం పాఠాలు నేర్చుకోవాలి. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా, భారత్ గణనీయంగా మంచిపేరు సాధించింది. దీనివల్ల అనూర కుమార దిస్సనాయకే ప్రభుత్వంలో ప్రయోజనాలను పొందు తున్నాం. అదేవిధంగా, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజూతో ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా, ఆయన ప్రచారం చేసిన ‘భారత్ వైదొలిగిపో’ వ్యూహాన్ని మట్టుబెట్టింది.
నేపాల్‌లోనూ ఇలాంటి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. చైనాలో అధికార పర్యటనలో ఉన్న భారత వ్యతిరేక ప్రధాని కేపీ శర్మ ఓలీ, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద బీజింగ్‌తో తమ దేశం ఎలాంటి కొత్త రుణ ఒప్పందంపై సంతకం చేయదని ముందే స్పష్టం చేశారు. నిజానికి, నేపాలీలు తమ దేశంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పరిధిని తగ్గించే కొత్త ఒప్పందంపై చైనాతో సంతకం చేయాలనుకుంటున్నారు.
బంగ్లాదేశ్‌తో కూడా భారతదేశం వ్యూహాత్మక సహన విధానాన్ని అనుసరించాలి. బంగ్లాదేశ్ పరివర్తనలో ఉన్న దేశం. అక్కడ ప్రజా స్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియకు న్యూఢిల్లీ మద్దతు ఇవ్వాలి.
హిందువులపై దాడులను అతిగా చూసే ధోరణి నెలకొంది. ప్రారంభంలో కాస్త పెరిగిన తర్వాత, అటువంటి దాడులు ఇప్పుడు తగ్గాయి. మనం హసీనాకు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం వల్ల మన ఉద్దేశ్యాలపై అనుమానం ఏర్పడిందనీ, మన బంగ్లాదేశ్ విధానానికి దిద్దుబాటును అందించాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి.
మనోజ్ జోషి
వ్యాసకర్త ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’లో డిస్టింగ్విష్డ్ ఫెలో
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment