సరైన దిశలో ఒక ప్రయత్నం | Sakshi Editorial On Hindus Issue In Bangladesh | Sakshi
Sakshi News home page

సరైన దిశలో ఒక ప్రయత్నం

Published Thu, Dec 12 2024 12:16 AM | Last Updated on Thu, Dec 12 2024 12:16 AM

Sakshi Editorial On Hindus Issue In Bangladesh

ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. బంగ్లాదేశ్‌లోని పరిస్థితి పట్ల తన మనోభావాలను భారత్‌ స్పష్టంగా పంచుకోగలిగింది. బంగ్లాదేశ్‌లోని మధ్యంతర సర్కారుకు ప్రధాన సలహాదారైన మహమ్మద్‌ యూనస్, బంగ్లా విదేశాంగ కార్యదర్శి మహమ్మద్‌ జషీముద్దీన్‌ తదితరులతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఢాకాలో సమావేశమవడం ఆహ్వానించదగ్గ పరిణామం. 

ఆగస్టులో షేక్‌ హసీనా ప్రభుత్వం పడిపోయాక రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత్‌ నుంచి తొలిసారిగా ఓ ఉన్నతాధికారి బంగ్లా వెళ్ళడం, దౌత్య భేటీ జరపడం విశేషమే. ఇటు హసీనాకు భారత్‌ ఆశ్రయం కల్పించడం, అటు బంగ్లాలో అల్పసంఖ్యాక హిందువులపై దాడులతో ద్వైపాక్షిక సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

ఈ పరిస్థితుల్లో తాజా భేటీలో ఇరుపక్షాలూ నిర్మొహమాటంగా పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం సరైన దిశలో పడిన అడుగు. హసీనా హయాంతో పోలిస్తే, భారత్‌ పట్ల పెద్ద సానుకూలత లేని సర్కారు బంగ్లాలో ప్రస్తుతం నెలకొన్నందున తాజా దౌత్యయత్నాలు కీలకం. చారిత్రకంగా మిత్రత్వం, పరస్పర ప్రయోజనాలున్న పొరుగు దేశాలు అపోహలు, అనుమానాలు దూరం చేసుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపకరిస్తాయో చూడాలి.  

బయట ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో జరిగిన ఈ చర్చలు మైనారిటీలపైన, హిందూ ఆలయాలపైన దాడులు, రాజద్రోహ నేరంపై హిందూ సాధువు చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్టు సహా అనేక వివాదాస్పద అంశాలపై దృష్టి సారించాయి. రెండు కోట్ల పైగా హిందువులున్న ముస్లిమ్‌ మెజారిటీ దేశంలో మైనారిటీల భద్రతపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తే, ఆ ఘటనలు రాజకీయమైన వంటూ బంగ్లా వాదించింది. 

ప్రజల భావోద్వేగాలు, రాజకీయ ప్రయోజనాలు కలగలిసినప్పుడు పరస్పర భిన్న వాదనల మధ్య రాజీ కుదర్చడం కష్టమే. కానీ, విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీతో చిరు ప్రయత్నమైనా సాగడం విశేషం. బంగ్లాదేశ్‌ సైతం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, జరుగుతున్నదే మిటో గ్రహించి, అసలంటూ సమస్య ఉన్నదని గుర్తించడానికి ఈ భేటీ ప్రేరేపిస్తే మంచిదే.  

1971 నాటి బంగ్లాదేశ్‌ విముక్తి పోరులో భారత్‌ పాత్ర మరపురానిది. అదే సమయంలో స్వాతంత్య్రం ముందు నుంచి చారిత్రకంగా ఉన్న అనుబంధం రీత్యా సాహిత్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ పరంగా ఆధునిక భారతావని రూపుదిద్దుకోవడంలో బంగాళ ప్రాంతపు భాగ స్వామ్యం అవిస్మరణీయమే. 

బ్రిటీషు కాలం నుంచి భౌగోళిక రాజకీయాలు, సామాజిక సాంస్కృతిక కారణాలతో ముడిపడిన భారత – బంగ్లా బంధం ఇటీవలి ఉద్రిక్తతల నడుమ నలిగిపోతోంది. ఇరుదేశాల మధ్య 4,096 కి.మీల ఉమ్మడి సరిహద్దుంది. ప్రపంచంలోనే సుదీర్ఘమైన అయిదో సరిహద్దు ఇది. పైగా, చాలా ప్రాంతంలో పూర్తిస్థాయిలో సరిహద్దుల గుర్తింపు జరగనేలేదు. 

సరిహద్దులో నెలకొన్న పశ్చిమ బెంగాల్‌లోని ఒక్క పెట్రాపోల్‌ వద్దనే రెండు దేశాల మధ్య భూమార్గ వాణిజ్యంలో 30 శాతం జరుగుతుంది. ఏటా సుమారు 23 లక్షల మంది సరిహద్దులు దాటి, భారత్‌కు వైద్య చికిత్సకు వస్తుంటారు. కాబట్టి, ఇటీవలి ఉద్రిక్తతల్ని దాటి వాణిజ్యం, ఇంధనం, సహకారం, సామర్థ్యాల పెంపు దలను బంగ్లా చూడగలగాలి. ఇరుదేశాలూ చేతులు కలిపి అడుగులు వేస్తేనే అభివృద్ధి సాధ్యం.  

ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లి లాంటి నిత్యావసర వస్తువుల విషయంలో ఢిల్లీ పైనే ఢాకా ఆధారపడి ఉంది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం దేశీయ ఉత్పత్తిని పెంచుకొని, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇక, బంగ్లా రోగులకు శస్త్రచికిత్స చేసేది లేదంటూ కొన్ని భారతీయ ఆస్పత్రులు అమానవీయంగా, మూర్ఖంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. 

ఈ చర్యల వల్ల బంగ్లా దేశీయులు ఇప్పుడు మలేసియాను ఆశ్రయిస్తున్నట్టు వార్త. ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో భారత ప్రయోజనాలకే దెబ్బ. అసలు మిగతా ప్రపంచంతో భారత వాణిజ్యంతో పోలిస్తే, సరుకుల్లో భారత – బంగ్లాల ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందింది. అనేక అంశాలు ముడిపడి ఉన్నందున తెగేదాకా లాగడం ఇరుపక్షాలకూ మంచిది కాదు. 

కొత్త వాస్తవాలను గుర్తించక ఒకవేళ మనం ఇదే వైఖరితో ముందుకు సాగితే చివరకు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు, మయన్మార్‌ వరుసలోనే బంగ్లాదేశ్‌ సైతం ఢిల్లీకి దూరమవుతుంది. పొరుగున మిత్రులెవరూ లేని దుఃస్థితి భారత్‌కు దాపురిస్తుంది. 

యూనస్‌ సారథ్యంలోని ప్రస్తుత బంగ్లా సర్కార్‌ పాక్‌కు చేరువవుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య వీసాల ఎత్తివేత, రక్షణ ఒప్పందాలు, కరాచీ నుంచి పాకిస్తానీ సరుకుల రవాణా నౌకను చిట్టగాంగ్‌ వద్ద లంగరేసుకునేందుకు అనుమతించడం లాంటివి చూస్తే అదే అనిపిస్తోంది. 

దాదాపు 47 ఏళ్ళ తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా సముద్ర నౌకాయాన సంబంధాల పునరుద్ధరణకు ఇది ఒక సూచన. వ్యూహాత్మకంగా సుస్థిర దక్షిణాసియాకు కట్టుబడ్డ భారత్‌ జాగ్రత్తగా అడుగులు వేయాలి. బంగ్లా అంతర్గత రాజకీయాల్లోకి అతిగా జొరబడి, ప్రస్తుత హయాం నమ్మకాన్ని పోగొట్టు కోరాదు. 

ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగ కార్యదర్శి ఢాకా పర్యటన ఇరుగుపొరుగు బాంధవ్యం, భాగస్వామ్యాల ప్రాధాన్యాన్ని గుర్తించినట్టే అనిపిస్తోంది. బంగ్లా సైతం ముందుగా తన అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. ఆ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే, మైనారిటీలు సురక్షితంగా ఉంటే, పాత బంధం మళ్ళీ మెరుగవుతుంది. 

వెరసి, భారత్‌ – బంగ్లాలు ప్రస్తుతం నాలుగురోడ్ల కూడలిలో నిలిచాయి. మనసు విప్పి మాట్లాడుకొని, పరస్పర ప్రయోజనాల్ని కాపాడుకుంటే మేలు. అలాకాక సహకార మార్గం బదులు సంఘర్షణ పథాన్ని ఎంచుకుంటే ఇరువురికీ చిక్కే!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement