బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ మన దేశానికి తలెత్తుతున్న దౌత్య సమస్య లకు తాజాగా మరొకటి వచ్చిచేరింది. గత ఆగస్టు నుంచీ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని సోమవారం బంగ్లా విదేశాంగ శాఖ దౌత్య సందేశం పంపింది. హసీనా అవినీతి పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థుల నాయకత్వంలో జనాగ్రహం వెల్లువెత్తి ఆమె ఆ దేశం నుంచి నిష్క్రమించారు.
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మైనారిటీలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులూ, దౌర్జన్యాలూ, నిర్బంధాలూ తప్పడం లేదు. ఆఖరికి న్యాయమూర్తుల్ని సైతం వెంటాడుతున్నారు. భయోత్పాతంలో ముంచెత్తుతున్నారు.
చాలామంది అజ్ఞాతంలోకి పోయారు. దీన్నంతటినీ ఆపాలనీ, మైనారిటీలకు రక్షణ కల్పించాలనీ మన దేశం ఇప్పటికే బంగ్లా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ కక్షపూరిత చర్యలు ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. పైగా భారత మీడియా ఉన్నవీ లేనివీ కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నదని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాదు... దానికి సమాంతరంగా అంతా బాగానే ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తోంది.
‘న్యూయార్క్ టైమ్స్’లో వచ్చిన కథనమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థి బృందాలు దేశాభివృద్ధికి, అవినీతి అంతానికి ప్రణాళికలు వేస్తున్నట్టు ఆ కథనం సారాంశం. మైనారిటీలు సురక్షితంగా ఉన్నట్టు ఆ వర్గాలతోనే చెప్పించారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్ పాలన తీరుతెన్నులు గమనిస్తే పరిస్థి తులు ఆయన నియంత్రణలో ఉన్నట్టు కనబడదు.
మైనారిటీల సంగతలావుంచి అసలు ముస్లిం మహిళలకే ఇబ్బందులు తప్పడం లేదు. మత ఛాందసవాదులు రంగంలోకి దిగి బురఖా ధరించని బాలికలనూ, మహిళలనూ నడిరోడ్లపై పంచాయతీలు పెట్టి హింసిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. హసీనా ఏలుబడిలో అవినీతి పెరిగిందనటంలో సందేహం లేదు. పదవి కాపాడుకొనేందుకు ఎన్నికల ప్రక్రియను ఏమార్చారన్న ఆరోపణల్లో కూడా నిజం వుంది. కానీ దానికి విరుగుడు ఈ అరాచకమా?!
ప్రభుత్వాలను కూలదోసిన సందర్భాల్లో పాలకులు పరారీ కావటం, వేరేచోట ఆశ్రయం పొందటం అసాధారణమేమీ కాదు. హసీనా ఢిల్లీకి ఆదరా బాదరాగా వచ్చినా ఇక్కడినుంచి లండన్ వెళ్లాలని ప్రయత్నించారు. కానీ బ్రిటన్ ఆమె వినతిని తోసిపుచ్చింది. బంగ్లాలో హఠాత్తుగా బయ ల్దేరిన ఉద్యమానికి అమెరికా ఆశీస్సులున్నాయని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో బ్రిటన్ ఆమె వినతిని తిరస్కరించటంలో వింతేమీ లేదు.
కానీ ఆమెను అప్పగించాలని కోరిన వెంటనే మన ప్రభుత్వం అందుకు అంగీకరించటం సాధ్యమేనా? చట్టబద్ధ పాలన ఆనవాళ్లు లేవు సరికదా... ఎడాపెడా కక్షపూరిత విధానాలు అమలవుతున్నప్పుడు కోరిన వెంటనే ఒక మాజీ అధినేతను అప్ప గిస్తారని బంగ్లా ఎలా అనుకుంది? ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు వీలుగా రెండు దేశాలూ 2013లో నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
తగిన సాక్ష్యాధారాలు అందజేశాకే నేరస్తుల్ని అప్పగించాలని ఉన్న నిబంధనను కాస్తా వారెంటు జారీ అయితే చాలు అప్పగించవచ్చని సవరిస్తూ 2016లో ఆ ఒప్పందాన్ని సరళం చేశారు. కానీ తనపై పెట్టిన కేసులు న్యాయసమ్మతమైనవి కాదని, అందువల్ల అప్పగింత వినతిని తిరస్కరించాలని హసీనా మన ప్రభుత్వాన్ని కోరుకోవచ్చు. రాజ కీయ కారణాలతో అప్పగించాలని కోరితే తిరస్కరించొచ్చని ఒప్పందంలోని నిబంధనలే చెబుతున్నాయి.
సంక్లిష్టమైన ఈ ప్రక్రియంతా పూర్తికావటానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హసీనా విషయంలో అక్కడి న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా వ్యవహరిస్తుందన్న విశ్వాసం తమకు లేదని మన ప్రభుత్వం చెప్పే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మన దేశం అందుకు సంసిద్ధత చూపినా హసీనా మన కోర్టుల్ని ఆశ్రయించి ఉపశమనం పొందుతారు.
బ్రిటన్‌తో మనకు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ రుణాలు తీసుకుని బ్యాంకులను వేలాది కోట్ల రూపాయల మేర మోసగించి పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా వంటివారిని రప్పించటం అసాధ్యమవుతున్నది. మన దేశంలో ఉగ్రవాద ఘటనలకు పాల్పడి పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టి అప్పగించటానికి కొన్ని యూరప్ దేశాలు నిరాకరిస్తున్నాయి. మన న్యాయవ్యవస్థ, జైళ్లు ప్రామాణికంగా లేవన్న కారణాలు చూపుతున్నాయి.
అసలు తన ప్రస్థానం ఏ విధంగా కొనసాగించదల్చుకున్నదో బంగ్లాదేశ్ నిర్ధారించుకోవాలి. ఆ దేశ ఆవిర్భావానికి మూలకారణమైన ‘బెంగాలీ భావన’కు తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోంది. బంగ్లా విముక్తిని తాము గుర్తించబోమని చెప్పే ఘనులు తయారవుతున్నారు. అడుగడుగునా మత ఛాందసుల ప్రాబల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
మన దేశంతో సంబంధాల పునరుద్ధరణకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకొనేందుకు బంగ్లా ఇంతవరకూ సిద్ధపడలేదు. పైగా పాకిస్తాన్‌తో అంటకాగేందుకు ఉత్సాహపడుతోంది. 53 యేళ్ల క్రితం ఒక దేశంగా ఆవిర్భవించటానికి ముందు పాక్ సైనిక పాలకులు తమను ఎంత దారుణంగా అణచేశారో ఈ తరం మరిచిపోయి ఉండొచ్చు.
30 లక్షలమందికి పైగా ప్రజల బలిదానాలతో ఏర్పడిన దేశం కళ్లముందు కుప్పకూలుతుంటే నిశ్చేష్టులై ఉండిపోవటం విషాదకరం. అత్యంత విషమ పరిస్థితుల్లో కూడా ఎంతో అప్రమత్తతతో, వివేకంతో వ్యవహరించిన శ్రీలంక పౌరులను ఆదర్శంగా తీసుకుంటేనే దేశానికి మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని బంగ్లా ప్రజలు తెలుసుకోవాలి.
హసీనా అప్పగింత సాధ్యమేనా?
Published Wed, Dec 25 2024 12:10 AM | Last Updated on Wed, Dec 25 2024 12:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment