నదీజలాల విషయంలో ఆచితూచి అడుగేయకపోతే ఆ నీళ్లల్లోనే నిప్పులు పుట్టుకొస్తాయి. అంతర్గతంగా ప్రాంతాల మధ్యనే తరచు చిచ్చు రేపే నదీజలాలు... పొరుగునున్న దేశంతో పంచుకోవాల్సి వచ్చినప్పుడు సమస్యగా మారటంలో వింతేమీ లేదు. ఈమధ్యే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో రెండు దేశాలమధ్యా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరటంతోపాటు తీస్తా నదీజలాల పంపకంపై చర్చలు జరపాలనీ, ఫరక్కా జలాలపై తాజా ఒప్పందం కుదుర్చుకోవాలనీ ఇరు దేశాధినేతలూ నిర్ణయించారు. సరిగ్గా ఇదే ఇప్పుడు వివాదాన్ని రగిల్చింది.
నదీజలాల విషయంలో ఉభయులకూ అంగీకారయోగ్యమైన పరిష్కారం కోసం కృషిచేయాలని భారత్, బంగ్లాదేశ్‌లు నిర్ణయించుకున్నాయని మంగళవారం ఢాకాలో హసీనా ప్రకటించిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చురుగ్గా స్పందించారు. ఈ అంశంలో తమను ఎందుకు సంప్రదించలేదంటూ కేంద్రంపై భగ్గుమన్నారు. ఇది సరికాదని అభ్యంతరం చెబుతూ ఆమె మోదీకి లేఖ రాశారు. మమత ఇలా స్పందించటం ఇది మొదటిసారేమీ కాదు.
ప్రజానీకానికి గుక్కెడు నీళ్లందించాలన్నా, పచ్చటి పైర్లతో పొలాలు కళకళలాడాలన్నా బంగ్లాదేశ్‌కు ఈ నదీజలాలపై భారత్‌తో ఒప్పందం కుదరటం, ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావటం ఎంతో అవసరం. 2011లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తీస్తాపై ఒప్పందం దాదాపు ఖరారైంది. కానీ ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ అధినేత మమత అలకబూనటంతో అది ఆఖరు నిమిషంలో ఆగిపోయింది. రాజకీయంగా యూపీఏకు ఉన్న పరిమితులేమిటో, మమత స్వభావమేమిటో తెలిసిన హసీనా దానిపై పట్టుబట్టకుండా ఉండిపోయారు.
ఈ నేపథ్యం తెలిసినందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ 2015లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు తన ప్రతినిధి బృందంలో ఆమెను కూడా చేర్చారు. ఒప్పందం కుదరకపోవటం వల్ల తమ దేశానికి ఎదురవుతున్న సమస్యలను హసీనా ఆమెకు వివరించగా, రాష్ట్రంలో తనకెదురయ్యే ప్రతిబంధకాలను మమత తెలిపారని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో తీస్తా ప్రాజెక్టు గురించి బంగ్లాదేశ్ ప్రస్తావించకపోలేదు. కానీ బెంగాల్ అభ్యంతరాలు ఎప్పటిలాగే ఉండటం ఈ సమస్యకు శాపంగా మారింది.
నిజానికి చారిత్రకంగా, సాంస్కృతికంగా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ఎంతో సన్నిహితమైనవి. దేశంలో జాతీయవాదం అంతకంతకు విస్తరించటానికి ఈ ప్రాంతమే కారణమని భావించిన బ్రిటిష్ వలసపాలకులు 1905లో బెంగాల్ విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు నిరసనలు పెల్లుబికాయి. చివరకు 1911లో దాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ప్రయత్నం హిందూ ముస్లింల మధ్య పొరపొచ్చాలను పెంచింది. స్వాతంత్య్రానంతరం దేశ విభజన జరిగినప్పుడు అది పాకిస్తాన్‌లో భాగంగా మారింది.
పాకిస్తాన్ చెరలో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించటానికి 1971లో మన దేశం అందించిన తోడ్పాటును బంగ్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. కానీ బంగ్లాదేశ్ తన సమస్యలను వాయిదా వేస్తూ పోలేదు. తమ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బంగ్లా చిరకాల ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో మమతా బెనర్జీ ఆలోచించాలి. అవసరమైతే ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధపడాలి. గంగానదిపై బెంగాల్‌లో నిర్మించిన ఫరక్కా బరాజ్ నుంచి బంగ్లాకు నదీజలాలు అందించటంపై 1996లో 30 ఏళ్లకు ఒప్పందం కుదిరింది.అది మరో రెండేళ్లలో పూర్తికావాల్సి వుంది.
కనుక దానిపై కొత్తగా ఒప్పందం అవసరం. 1996లో తమకిచ్చిన హామీలను నెరవేర్చని కేంద్రం ఇప్పుడు మరోసారి తీస్తా, గంగా జలాలపై బంగ్లాతో చర్చించిందని మమత ఆరోపణ. అయితే అప్పుడూ ఇప్పుడూ కూడా బెంగాల్‌తో చర్చిస్తూనే ఉన్నామన్నది కేంద్రం జవాబు. 1996లో ఆ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న నీటిపారుదల శాఖ ప్రతినిధితో మాట్లాడారనీ, నిరుడు జూలై 24న కూడా ఫరక్కా జలాల అంశంపై ఏర్పడిన కమిటీలో బెంగాల్ నీటిపారుదల రంగం నిపుణుడు పాల్గొన్నారనీ కేంద్రం చెబుతోంది.
మొన్న 14న ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించిందని వివరించింది. అయితే ఇదంతా కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా చేసిందే తప్ప విధానపరమైన చర్చలు కాదని మమత సర్కారు జవాబు. తమ అధికారులు కేవలం కేంద్రం అడిగిన సాంకేతిక వివరాలు మాత్రమే అందించారని తెలిపింది.
దక్షిణాసియాపైనా, మరీ ముఖ్యంగా ఈ ప్రాంత దేశాలతో భారత్‌కున్న సంబంధాలపైనా చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలాంటి సమయంలో పట్టుదలకు పోయి నదీజలాలపై వివాదం రాజేయటం మంచిది కాదు. తీస్తా ప్రాజెక్టుపై అటు చైనా, ఇటు భారత్ ప్రతిపాదనలిచ్చాయనీ, ఎవరి ప్రతిపాదన బాగుందో చూసి నిర్ణయిస్తామనీ మంగళవారం హసీనా తెలిపారు. ఇది ఒక రకంగా భారత్ ముందుకు రాకపోతే చైనావైపు చూస్తామని చెప్పటమే. ఎగుమతుల ద్వారా బంగ్లా సమకూర్చుకుంటున్న ఆదాయంలో 80 శాతం వాటావున్న దుస్తుల తయారీ ముడిసరుకంతా చైనాయే సరఫరా చేస్తోంది.
పైగా బంగ్లా వాణిజ్యంలో చైనా అతి పెద్ద భాగస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బెంగాల్ వ్యవహరించాలి. విదేశాంగ విధాన నిర్ణయాలపై రాష్ట్రాల ప్రమేయం ఉండటం మంచిదికాదు. అదే సమయంలో బెంగాల్ ప్రయోజనాలు కాపాడటం కేంద్రం బాధ్యత. గత హామీలు నెరవేర్చలేకపోతే కారణాలేమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దాలి. చిరకాల సమస్య అయిన తీస్తా వివాదంపై బెంగాల్‌ను ఒప్పించి బంగ్లా ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో కేంద్రం ఆలోచించాలి.
ఎన్నాళ్లీ తీస్తా వివాదం!
Published Thu, Jun 27 2024 1:41 AM | Last Updated on Thu, Jun 27 2024 1:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment