
మాటల గురించి చెప్పడమంటే, మాటలు కాదుగాని, మాటల గురించి కాస్త మాట్లాడుకుందాం. మాటలు రకరకాలు. ఇతరుల మనసులను గాయపరచే ఈటెల్లాంటి మాటలు; గాయపడ్డ మనసులకు ఊరటనిచ్చే ఊరడింపు మాటలు; ఎదుటివారిని మునగ చెట్టెక్కించే మెరమెచ్చు మాటలు; జనాలను ఇట్టే బోల్తా కొట్టించే బురిడీ మాటలు; సొంత డప్పు మోగించుకోవడంలో కోటలు దాటే మాటలు; కపటబుద్ధులాడే కల్లబొల్లి మాటలు; బుద్ధిహీనుల పొల్లు మాటలు; ఈర్శ్యాళువుల ద్వేషపు మాటలు; ఉబుసుపోవడానికి చెప్పుకొనే ఊకదంపుడు మాటలు– మాటల గురించి చెప్పుకోవాలంటే, ఇలా ఎన్ని మాటలైనా ఉంటాయి.
మాటలాడే తీరును బట్టి మనిషిని అంచనా వేయవచ్చు. ఎంతటి స్ఫురద్రూపులైనా కావచ్చు; మరెంతటి నానాలంకారభూషితులైనా కావచ్చు; భాషణ నైపుణ్యం కొరవడితే మాత్రం ఎన్ని ఆభరణాలను దిగేసుకున్నా, ఎన్ని అలంకారాలు చేసుకున్నా, ఎవరూ పట్టించుకోరు. ‘కేయూరాణి న భూషయంతి పురుషం హారాః న చంద్రోజ్జ్వలాః/ న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః/ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే/ క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం’ అన్నాడు భర్తృహరి.
ఇదే శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవి ‘భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్/ భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్/ భూషలు గావు పురుషుని భూషితు జేయు పవిత్రవాణి వా/గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్’ అని తెలుగులోకి అనువదించాడు.
మనకు ‘వేషభాషలు’ అనే పదబంధం ఉంది. వేషం ఒక్కటే చాలదు, అందుకు తగిన భాష కూడా ఉన్నప్పుడే రాణిస్తుంది. దర్పానికి చిహ్నమైన భుజకీర్తులు, మెడలో ధగధగలాడే సువర్ణహారాలు, కేశపాశాలకు సొగసైన అలంకారాలు, శరీరాన్ని ఘుమఘుమలాడించే పన్నీటి స్నానాలు, ఒంటికి పూసుకునే మైపూతలు – ఇవేవీ మనిషికి అలంకారాలు కాలేవు. సంస్కారభరితమైన, సందర్భోచితమైన మృదువాక్కులే మనిషికి అసలైన ఆభరణాలు.
భర్తృహరి సారాంశం ఇదే! అసమాన పదసంపద, అనర్గళ వక్తృత్వ ప్రాభవం, అన్నింటికీ మించి బహిరంగ వేదికలపై వాక్కుకు తగిన అభినయ చాతుర్యం వంటి ప్రతిభా పాటవాలెన్ని ఉన్నా, కించిత్ సందర్భశుద్ధి కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే వాగ్భూషణం మిలమిలలాడుతుంది. సమయ సందర్భాలను పట్టించుకోకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడితే సభలలో రసాభాస తప్పదు. పద్మభూషణ పద్మవిభూష«ణాది సగౌరవ భూషణాలు ఎన్ని ఉన్నా, సందర్భశుద్ధి లేని వాచాలత ప్రదర్శించినట్లయితే, సదరు మనుషుల వాగ్భూషణం వెలవెలబోతుంది.
అనవసర ప్రసంగాలు, అసందర్భ ప్రలాపాలు, పరుష పదప్రయోగాలు వాగ్భూషణానికి కిలుములా పట్టి, దానిని వెలవెలబోయేలా చేస్తాయి. వాగ్భూషణం వన్నె తరగకుండా ఉండాలంటే, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మౌనం పాటించాలో తెలుసుకోగల ఇంగితం కలిగి ఉండాలి. సూక్ష్మంగా ఈ లక్షణాన్ని వాగ్వివేకం అనవచ్చు. వాగ్వివేకం కలిగినవాళ్లు లోకంలో ఉత్తములుగా, ఉన్నతులుగా సముచిత గౌరవం పొందుతారు.
‘మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే సురక్షితం’ అన్నాడు గ్రీకు తత్త్వవేత్త ఎపిక్టీటస్. మనోభావాల శకంలో ఆయన సలహా పాటించదగినదే! ‘మౌనేన కలహం నాస్తి’ అని మన పూర్వ సుభాషితం కూడా చెబుతోంది. అయినా, మాట్లాడక తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలుసుకోవడమే వాగ్వివేకం.
ఇదే సంగతిని ‘అనర్గళ వాగ్ధార కన్నా మాట్లాడటంలో విచక్షణ ముఖ్యం’ అని ఇంగ్లిష్ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ ఏనాడో చెప్పాడు. ‘సకాలంలో పాటించే మౌనం వాగ్ధాటి కంటే గొప్పది’ అని ఇంగ్లిష్ కవి మార్టిన్ టప్పర్ అన్నాడు. విచక్షణ లోపించిన మాటలు మాట్లాడేవారు ఎంతటి ఘనసంపన్నులైనా సమాజం నుంచి గౌరవ మర్యాదలను సంపాదించుకోలేరు.
వాగ్ధాటికి, వాచాలతకు ఉన్న విభజనరేఖను తెలుసుకుంటే చాలు– మాటలాడే కళలో రాణించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంత చిన్న సంగతి తెలుసుకోలేకపోవడం వల్లనే ప్రజాజీవితంలో ఉన్న నానా రంగాల ప్రముఖులు అనవసర ప్రసంగాలతో, అసందర్భ ప్రలాపాలతో అభాసుపాలవుతున్న సందర్భాలు ఇటీవలి కాలంలో తరచుగా తారసిల్లుతున్నాయి.
ఇదొక పరిస్థితి అయితే, వాగ్దూషణా దురితచరితుల సంఖ్య కూడా సమాజంలో పెచ్చరిల్లుతోంది. ముఖ్యంగా రాజకీయ, వినోదరంగాల్లో వాక్కాలుష్యం దుర్భరంగా మారి, సామాన్యులకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. వాక్కాలుష్య ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇటీవల వస్తున్న సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ఓటీటీ ప్రదర్శనలు చూస్తే, ఇట్టే అర్థమైపోతుంది.
‘ఆది నుంచి ఆకాశం మూగది/ అనాదిగా తల్లి ధరణి మూగది/ నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు/ నడమంత్రపు మనుషులకే మాటలు/ ఇన్ని మాటలు’ అన్నారు వేటూరి. నడమంత్రపు సిరివర్గం, మిథ్యామేధావి వర్గంలోని మనుషుల వల్లనే సమాజంలో వాక్కాలుష్యం ప్రబలుతోంది. పర్యావరణంలోని నానా రకాల కాలుష్యాల నివారణ కోసం ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు తమ వంతు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. అయితే, వాక్కాలుష్య నివారణ చర్యలు తీసుకునే నాథులే కరవయ్యారు. వాక్కాలుష్య నివారణతోనే వాగ్భూషణానికి పునర్వైభవం సాధ్యం.
Comments
Please login to add a commentAdd a comment