humans
-
ప్రాణులు నేర్పే పాఠాలు
ప్రపంచమంతా పచ్చగా ఉందని, తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్లని అనుకుంటే పొరపాటే! రంగు రంగుల లోకంలోనే రకరకాల రాకాసి జంతు ప్రవృత్తులు ఉంటాయి. జంతుతతి నుంచి మనిషి వేరుపడి సహస్రాబ్దాలు గడచిపోయాయి. అయినా, మనుషుల్లోని జంతుప్రవృత్తి పూర్తిగా తొలగిపోలేదు. కొన్ని సందర్భాల్లో జంతువుల కంటే క్రూరంగా, దారుణంగా ప్రవర్తించే మనుషుల ఉదంతాలు వార్తలకెక్కుతుండటం మనకు తెలియనిదేమీ కాదు. ఆకుపచ్చని పచ్చికబయళ్లలో సుతిమెత్తని పచ్చిక మాత్రమే కాదు, విషపూరితమైన పసరిక పాములు కూడా ఉంటాయి. దట్టమైన అడవుల్లో పచ్చని చెట్లూ చేమలు, రంగు రంగుల పువ్వులూ పిట్టలూ పిచుకలూ, జంతువులూ మాత్రమే కాదు, ఏమరుపాటుగా దొరికితే మనుషులను పలారం చేసే క్రూరమృగాలు ఉంటాయి. కసిగా కాటు వేసే కాలసర్పాలు ఉంటాయి. కీకారణ్యాల్లో పొంచి ఉండే ప్రమాదాలన్నీ జనారణ్యంలోనూ ఉంటాయి. జనారణ్యంలో అడుగడుగునా తారసపడే చాలా మంది మనుషుల్లో జంతులక్షణాలు కనిపిస్తాయి. మనుషుల్లోని మేకపోతు గాంభీర్యాలు, గోడమీది పిల్లి వాలకాలు, గుంటనక్క తెలివితేటలు అపరిచితమైనవేమీ కాదు. మనుషుల్లోని జంతులక్షణాలను గుర్తించడం వల్లనే విష్ణుశర్మ ‘పంచతంత్రం’ రాశాడు. జంతు పాత్రల ద్వారా మనుషుల స్వభావాలను తేటతెల్లం చేస్తూ కథలు చెప్పాడు. ‘పంచతంత్రం’ కథలు చిన్నపిల్లలకు కూడా తేలికగా అర్థమవుతాయి. ఆ తర్వాత చాలాకాలానికి జార్జ్ ఆర్వెల్ ‘యానిమల్ ఫామ్’ రాశాడు. ఇది కూడా దాదాపు ‘పంచతంత్రం’లాంటి ప్రయోగమే! ‘పంచతంత్రం’ నాటికి, ‘యానిమల్ ఫామ్’ నాటికి సమాజం చాలా మారింది. ‘యానిమల్ ఫామ్’లో దోపిడీ సమాజంలో నలిగిపోతున్న మనుషుల పరిస్థితిని, శ్రమదోపిడీలో నలిగిపోయేవారి స్వేచ్ఛాభిలాషను, వారి స్వేచ్ఛకు తూట్లు పొడిచే శక్తుల కుతంత్రాలను జంతుపాత్రల ద్వారా ఆర్వెల్ చెప్పాడు. జంతువులను పాత్రలుగా చేసుకుని కథలు చెప్పడం ‘పంచతంత్రం’తోనే మొదలు కాలేదు.‘పంచతంత్రం’ దాదాపుగా క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటిది. అంతకు దాదాపు వెయ్యేళ్ల ముందే– క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దికి చెందిన గ్రీకు బానిస ఈసప్ ఇలాంటి కథలనే ఎన్నో చెప్పాడు. ప్రాచీన రోమన్ సాహిత్యంలోని ‘ఫెడ్రస్ కథలు’, గ్రీకు సాహిత్యంలోని బాబ్రియస్ కథలు ఇలాంటివే!ఫ్రెంచ్ సాహిత్యంలోని ‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ కూడా ఇలాంటివే!‘లా ఫోంటేన్ ఫేబుల్స్’ రచయిత జీన్ డి లా ఫోంటేన్ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల్లో ప్రచారంలో ఉన్న జంతువుల పాత్రలు ప్రధానంగా ఉన్న కథలను సేకరించి, పదిహేడో శతాబ్దిలో ఈ కథల పుస్తకాలను పన్నెండు భాగాలుగా వెలువరించాడు. జంతువులను ప్రధాన పాత్రలుగా చేసుకున్న ఈసప్ కథలు, పంచతంత్ర కథలు అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదం పొందాయి. ఇవి ఈనాటికీ తాజాగానే ఉన్నాయి. ఇప్పటి సమాజంలో సంచ రిస్తున్న మనుషుల స్వభావాలు పంచతంత్ర కథల్లోనూ, ఈసప్ కథల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. మనుషుల స్వభావాలను జంతువులకు ఆపాదించి చెప్పడం సమస్త భాషల సాహిత్యంలోనూ ఒక పురాతన కళాత్మక పద్ధతి. ఓపిక ఉన్న రచయితలు కథలు చెప్పారు. అనుభవం ఉన్నవాళ్లు సామెతలను సృష్టించారు. మన పురాణాల్లోనూ జంతువులు, పక్షులు పాత్రలుగా ఉన్న పిట్ట కథలు కనిపిస్తాయి. బైబిల్లోనూ జంతువుల గురించిన సామెతలు ఉన్నాయి. ‘సోమరీ! చీమల యొద్దకు వెళ్లుము. వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును’– ఇది బైబిల్ సామెతల గ్రంథంలోనిది. చీమను చూసి కష్టపడటం నేర్చుకోవాలని సోమరులకు చేసే హెచ్చరిక ఇది.ప్రాచీన సాహిత్యంలో జంతుపాత్రలు ఉన్న కథలు, జంతువులపై ప్రాచుర్యంలో ఉన్న సామెతలు మానవ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. ప్రవర్తన లోపాలను ఎత్తిచూపి, సుతిమెత్తని హెచ్చరికలు చేస్తాయి. వీటిని పూర్తిగా ఆకళింపు చేసుకుంటే చాలు, మనుషులు మనుషుల్లా తయారవడం కష్టమేమీ కాదు. వీటిని పిట్ట కథల్లా కొట్టిపారేసే అతితెలివిపరులు జంతువుల కంటే హీనంగా మిగులుతారు. కానికాలం దాపురించినప్పుడు దిక్కుతోచని గడ్డు పరిస్థితుల్లో చిక్కుకుని, నానా అవస్థలు పడతారు.మహాభారతంలోని ‘కాకి హంస’ల కథ ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక రాజ్యంలో ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. ప్రతిరోజూ ఒక కాకి అతడి పెరటి గోడ మీద వాలేది. వర్తకుడి పిల్లలు దానికి తమ ఎంగిళ్లు పెట్టేవారు. ఎంగిళ్లు తిన్న కాకి వారికి బాగా మాలిమి అయింది. ఎంగిళ్లు తిని తెగబలిసిన కాకి ఒకనాడు ఏకంగా హంసలతో పందేనికి తెగబడి, భంగపడింది.ఈ కథను కురుక్షేత్రంలో శల్యుడు కర్ణుడికి చెప్పాడు. కర్ణుడికి కథలోని నీతి తలకెక్కలేదు. ఫలితం ఏమైందో మనకు తెలిసిందే! కొందరు ఇప్పటికీ ఎంగిళ్లు తిని బలిసిన కాకుల్లాగే ఎగిరెగిరి పడుతుంటారు. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లు రాజకీయ రంగంలోను, సాహితీ సాంస్కృతిక రంగాల్లోను, వివిధ రకాల వృత్తి ఉద్యోగాల్లోనూ ఉంటారు. ఎవరో పెట్టే ఎంగిలి మెతుకులు తిని బలిసి, విర్రవీగినంత కాలం కాకికి తన బలహీనత ఏమిటో ఎరుక పడనట్లే, ఇలాంటి స్వభావం ఉన్నవారికి ఎప్పటికీ ఈ కథల్లోని మర్మం అవగతం కాదు. మానవ సమాజంలో బతుకుతున్నా, వారు ఎప్పటికీ సంపూర్ణ మానవులు కాలేరు. -
ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి
వయసు పెరిగే కొద్ది వృద్దాప్య ఛాయలు వస్తాయని అందరికి తెలుసు. అయితే ఏ ఏజ్‌లో వృధాప్యం వేగవంతం అవుతుందనేది తెలియదు. మనం కూడా గమనించం. చూస్తుండగానే మనకే తెలియని విధంగా వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. మన శరీరంలో ఈ మార్పు ఏ నిర్ధిష్ట ఏజ్ నుంచి మొదలవుతుందనేది తెలియదు. ఆ విషయాన్నే తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేగాదు అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటంటే..స్టాన్ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనం ఇన్నాళ్లు వృధాప్యం అనేది కాలానుగుణంగా వచ్చేది అనే సంప్రదాయ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది. మానవ శరీర పరమాణు కూర్పు పరంగా వృద్ధాప్యం అనేది రెండు నిర్ధిష్ట వయసులలో వేగవంతమవుతుందని నిర్ధారించారు పరిశోధకులు. ఆ సమయంలోనే శరీరం విపరీతమైన మార్పులకు లోనవుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. సరిగ్గా చెప్పాలంటే భూకంపం మాదిరిగా శరీరం ఒక్కసారిగా సడెన్ మార్పులకు లోనయ్యి వేలాదిగా అణువులు, సూక్ష్మజీవులు పెరగడం, పడిపోవడం జరుగుతుంది. సరిగ్గా అప్పుడే ఆరోగ్యం వేగంగా క్షీణించడం జరుగుతుంది. అదే వృద్ధాప్యం వేగవంతమవుతుందనడానికి సంకేతమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చెప్పాలంటే సరిగ్గా 44, 60 ఏళ్ల వయసులలో శరీరం వేగవంతమైన మార్పులకు లోనవ్వుతుందని వెల్లడించారు. అందుకోసం తాము 25 నుంచి 75 ఏళ్ల వయసు వారిపై పరిశోధనలు చేయగా వారిలో ఉండే విభిన్న అణువులు, సూక్ష్మజీవులు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, శిలింధ్రాలను నిశితంగా గమనించారు. వాటి వృద్ధి కాలక్రమేణ మారదని, నిర్ధిష్ట వయసు 40, 60 ఏజ్‌లలో వేగవంతమైన మార్పులకు లేదా ఆకస్మిక మార్పులకు లోనవ్వడాన్ని అధ్యయనంలో గుర్తించారు.ఈ పెద్ద మార్పులే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. అంతేగాదు తమ అధ్యయనంలో ఈ రెండు నిర్ధిష్ల వయసుల్లోనే శరీరం గణనీయమైన మార్పులకు లోనవ్వుతుందని నిర్థారించారు. ముఖ్యంగా రోగనిరోధక పనితీరు బలహీనమవ్వడం 60వ దశకం నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ పరిశోధన పుట్టుక, మరణంలానే వృద్ధాప్యం అనేది సర్వసాదారణమే అని చెబుతున్నప్పటికీ..ఏఏ ఏజ్‌లో ఈ వృధ్ధాప్యం ప్రారంభమవుతుందనేది తెలియజేసిందన్నారు. పైగా ఈ పరిశోధన భవిష్యత్తులో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన ఇస్తుందని నమ్మకంగా చెప్పారు. (చదవండి: బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!) -
మానవుల వల్లే వైరస్ల విజృంభణ!
వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషులతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని అంచనా. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ అధికం అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవటం, గట్టి ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం ఇందుకు పరిష్కారం.దేశంలో మళ్లీ ఇప్పుడు వైరస్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒక పక్క ప్యారిస్‌లో భారీ మహోత్సవాల మధ్య ఒలింపిక్స్ జరుగుతుండగా... ఇంకోపక్క దేశంలో నిఫా, చాందీపుర వైరస్లు కూడా ఒలింపిక్స్ మాదిరిగానే వార్తల్లోకి ఎక్కుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ కారణంగా ఇప్పటికీ మరణాలు కొనసాగుతున్నట్లు మనల్ని హెచ్చరి స్తుండటం గమనార్హం. వీటన్నింటినీ పక్కనపెట్టినా, సాధారణ జలుబు రూపంలో బోలెడన్ని వైరస్ రకాలు తెరిపి లేకుండా మనిషిని జబ్బున పడేస్తూనే ఉన్నాయి. అనేక వైరస్ వ్యాధులు జంతువుల నుంచి మనుషులకు సోకు తున్నవే. అదేదో జంతువులు మనపై కక్షకట్టి చేస్తున్న పనేమీ కాదు. మానవులు ఆక్రమించుకున్న తమ ఆవాసాలను మళ్లీ సంపాదించు కునే పనిలో ఉన్నాయనీ కాదు. అడవిలో బతికే జంతుజాలాన్ని మనం మన ఆవాసాల్లోకి చేర్చుకున్నాం కాబట్టి! అలాగే మన మధ్యలో ఉన్న జంతువులు అటవీ ప్రాంతాల్లోకి చేరేందుకు తగిన ‘మార్గం’ వేశాము కాబట్టి! అటవీ ప్రాంతాల విచ్చలవిడి విధ్వంసం, పాడి పశువులను పెద్ద ఎత్తున పెంచుతూండటం, రకరకాల పెంపుడు జంతువుల ఎగు మతి, దిగుమతులు, దేశాల మధ్య మనిషి విపరీతంగా తిరిగేస్తూండటం వంటివన్నీ వైరస్లు కూడా మనుషుల్లోకి జొరబడేందుకు అవ కాశాలు పెంచుతున్నాయి. పెరుగుతున్న వేడి... తరుగుతున్న నీరువాతావరణ సంక్షోభం కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకే ప్రక్రియ వేగవంతమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతూండటం, మంచినీటి లభ్యత తగ్గిపోతూండటం, తమ సహజ ఆవాస ప్రాంతాల నుండి బయటకు మనుషు లతోపాటు జంతువులూ కదులుతూండటం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. వైరస్లు స్వేచ్ఛగా ఒక జంతువు నుంచి ఇంకో దాంట్లోకి చేరేందుకు ఈ పరిస్థితులు వీలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సురక్షితంగా ఉండేందుకు లేదా తీవ్రస్థాయి అనారోగ్యం కలిగించేందుకు వీలు కల్పించే కొత్త కొత్త జంతు అతిథులు వైరస్‌లకు లభిస్తున్నాయి. సైన్ ్స రచయిత ఎడ్ యంగ్ ఇటీవల ‘ది అట్లాంటిక్’లో రాస్తూ... మనిషి ‘ప్యాండెమిసీన్’ యుగాన్ని సృష్టించుకున్నాడని ప్రస్తుత పరిస్థితిని అభివర్ణించారు. భూమిపై మనిషికి ముందు ఉన్న యుగాన్ని హాలోసీన్ అని, మనిషి పుట్టుక తరువాతి యుగాన్ని ఆంత్రో పసీన్ అని పిలిస్తే... ప్రస్తుత మహమ్మారుల యుగాన్ని ప్యాండెమిసీన్ (పాండమిక్ = మహమ్మారి) అని పిలిచాడన్నమాట. జార్జ్‌టౌన్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ ఛేంజ్ జీవశాస్త్రవేత్త కాలిన్ కార్ల్సన్ ఈ మధ్యే ఈ ప్యాండెమిసీన్ కు సంబంధించి భవిష్యత్తు దర్శనం చేయించారు. వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఎలాంటి వైరస్లు మనుషులకు సోకే అవకాశముందో అంచనా కట్టారు. ‘నేచర్’లో ప్రచురితమైన ఈ అంచనా ప్రకారం... మనిషిని ముట్టడించేందుకు అవకాశమున్న వైరస్ల సంఖ్య ఏకంగా పదివేల రకాలు! ప్రస్తుతం వీటిల్లో అత్యధికం జంతువుల్లో మాత్రమే తిరు గుతూ ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన హద్దులు చెరిగిపోతూండటంతో అవి ఇతర జంతువులకు అంటే మనుషులకు కూడా సోకే ప్రమాదం పెరిగింది. వాతావరణ సంక్షోభం కాస్తా జంతువులు, మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లేలా చేస్తూండటం గోరుచుట్టుపై రోకటిపోటు అన్న చందం అయిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితులు వైరస్‌లకు జాతర లాంటిది అంటే అతిశయోక్తి కాదు. అసలు పరిచయమే లేని బోలెడన్ని వైరస్లు ఒక దగ్గర చేరితే ఎన్ని కొత్త స్నేహాలు, బంధుత్వాలు కలుస్తాయో ఊహించుకోవచ్చు.వినాశకర మార్పులువేర్వేరు వాతావరణ, భూ వినియోగ మార్పు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కార్ల్సన్ వేసిన అంచనాల ప్రకారం 2070 నాటికి కనీసం 3,139 క్షీరద జాతులు (పాలిచ్చి పెంచే జంతువులు) సహజ ఆవాసాలకు దూరంగా వలస వెళతాయి. ఈ మార్పు కూడా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఎతై ్తన, జీవవైవిధ్య భరిత, జనసాంద్రత అధికంగా ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల జీవజాతుల మధ్య వైరస్ల సంచారం నాలుగు వేల రెట్లు ఎక్కువ అవుతుందని వీరు లెక్క కట్టారు. ఒకప్పుడు పశ్చిమ ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన ఎబోలా వైరస్ ఇప్పుడు ఖండమంతా విస్తరించింది. అలాగే దక్షిణాసియా లోనూ మునుపు నిర్ధారించిన ప్రాంతాలను దాటుకుని వైరస్లు మను షులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ మార్పు తీవ్రతను ఎంత కనిష్ఠంగా లెక్క కట్టినా కనీసం మూడు లక్షల వైరస్లు మొట్టమొదటిసారి కొత్త జంతు అతిథిలోకి చేరతాయని కార్ల్సన్ బృందం అంచనా వేస్తోంది. వీటిల్లో 15,000 వరకూ క్షీరదాలు ఉంటాయి. వాస్తవానికి ఈ మార్పిడి ఇప్పటికే మొదలైందని కార్ల్సన్ హెచ్చరిస్తున్నారు. 2100 నాటికి భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగవచ్చునని వాతావరణ శాస్త్రవేత్తలు ప్యారిస్ ఒప్పందంలో చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉష్ణోగ్రతలు ఆ స్థాయికి చేరక ముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక చేరితే ఇంకెలా ఉంటుందో ఊహించడం కష్టమే. కనిపించేది కొంతే... పొంచివున్నది ఎంతో!కార్ల్సన్ బృందం చేపట్టిన ఈ అధ్యయనం పేరు ‘ఐస్‌బర్గ్ స్టడీ’. అంటే పైకి కనిపించే భాగం మాత్రమే. కనిపించనిది ఇంకా చాలానే ఉందన్నమాట. ప్రస్తుతం ఎక్కువ అవుతున్న జూనోటిక్ వ్యాధులు రాగల ప్రమాదాలతో పోలిస్తే చిన్న భాగం మాత్రమేనని అర్థమవుతుంది. క్షీరదాల్లో గబ్బిలాలు జూనోటిక్ వైరస్ల విజృంభణలో ముందు వరసలో ఉన్నాయి. సార్స్ కోవ్–2 కూడా వూహాన్ ప్రాంతంలోని గుహల్లో ఉన్న గబ్బిలాల నుంచి మనుషులకు సోకిందే. ఎక్కువ దూరాలు ప్రయాణించగల సామర్థ్యం వల్ల ఈ గబ్బిలాలు వాతావరణ మార్పులకు వేగంగా స్పందిస్తాయి. వందల కిలోమీటర్ల దూరాన్ని దాటేస్తాయి. తమతోపాటు వైరస్‌లను కూడా మోసుకొస్తాయి.పండ్లను ఆహారంగా తీసుకుంటాయి కాబట్టి ఈ వైరస్ జాడలు పండ్ల నుంచి మనకూ సోకుతాయన్నమాట. నిఫా వైరస్ ప్రస్థానం కూడా దాదాపుగా ఇలాంటిదే. ఆగ్నేయాసియా ప్రాంతంలో గబ్బిలాల జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. ఫలితంగా ఈ ప్రాంతం నుంచి సరికొత్త వ్యాధులు పుట్టుకొచ్చే, వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువే. అయితే జలచరాలు, పక్షుల ద్వారా కూడా వైరస్లు మనిషికి సోక వచ్చు. ఇన్ ఫ్లుయెంజా వైరస్ రకాలకు పక్షులు ఆతిథ్యమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వాతావరణ మార్పులు అనేవి వ్యవస్థ మొత్తాన్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పుల సమస్యను మనం మరింత తీవ్రతతో పరిష్కరించాల్సిన అవసరాన్ని ఈ ఐస్‌బర్గ్ స్టడీ స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన వన్ హెల్త్ (మనుషులతోపాటు పరిసరాల్లోని జంతువులపై కూడా పర్యవేక్షణ) మైక్రోబియల్ నిఘా వ్యవస్థ, వేర్వేరు ప్రాంతాలు, జీవజాతుల సమాచారాన్ని క్రోడీకరించడం వంటివి ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. క్షీరదాలు, పక్షుల వలస మార్గాలను కృత్రిమ మేధ సాయంతో అంచనా కట్టి... బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కడెక్కడ ఎక్కువ అవుతాయో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను సరిగ్గా అంచనా కట్టే ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటూ తప్పనిసరి. అప్పుడే కొత్త వ్యాధుల ఆగమనం, వాటిని అడ్డుకోవడం, సమర్థంగా తిప్పికొట్టడం సాధ్య మవుతుంది. కె. శ్రీనాథ్ రెడ్డి వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ మాజీ అధ్యక్షులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ముసుగు మనుషులు
‘సుగుణం మేలిముసుగు, దుర్గుణం దొంగముసుగు’ అన్నాడు ఫ్రెంచ్ రచయిత, రాజనీతిజ్ఞుడు విక్టర్ హ్యూగో. ‘కరోనా’ కాలంలో మనుషులందరికీ ముసుగులు అనివార్యంగా మారాయి. మహమ్మారి కాలంలో మూతిని, ముక్కును కప్పి ఉంచే ముసుగులు లేకుంటే మాయదారి మహమ్మారి రోగం మరెందరిని మట్టుబెట్టేదో! ముసుగులు పలు రకాలు. అన్నింటినీ ఒకే గాటన కట్టేయలేం. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం కుదరదు కదా! అనివార్యంగా ధరించే ముసుగులు కొన్ని, మతాచారాల కారణంగా ధరించే ముసుగులు ఇంకొన్ని– ఇవి ప్రమాదకరమైన ముసుగులు కాదు. ఇలాంటి ముసుగుల చాటున ఉన్న మనుషులను గుర్తించడమూ అంత కష్టం కాదు.అయితే, వచ్చే చిక్కంతా దేవతా వస్త్రాల్లాంటి ముసుగులతో మన మధ్య తిరుగుతుండే మనుషులతోనే! కనిపించని ముసుగులు ధరించే మనుషుల బతుకుల్లో లెక్కలేనన్ని లొసుగులు ఉంటాయి. వాటిని దాచుకోవడానికే ముఖాలకు దేవతావస్త్రాల ముసుగులను ధరిస్తుంటారు. అలాంటివారు మన మధ్య ఉంటూ, మనతోనే సంచరిస్తుంటారు. మనం పనిచేసే కార్యాలయాల్లో, మనం నివసించే కాలనీల్లో ఉంటారు. ముసుగులకు చిరునవ్వులు అతికించుకుని మనల్ని పలకరిస్తుంటారు కూడా! వాళ్లను ముసుగులతో తప్ప ముఖాలతో గుర్తుపట్టలేని పరిస్థితికి చేరుకుం టాం. వాళ్ల అసలు ముఖాలను పోల్చుకునే సరికి కనిపించని ఊబిలో కూరుకుపోయి ఉంటాం.గాంభీర్యం చాలా గొప్పగా ఉంటుంది గాని, చాలా సందర్భాల్లో అది పిరికిపందలు ధరించే ముసుగు. అలాగే, పలు సందర్భాల్లో భూతదయా ప్రదర్శనలు క్రౌర్యానికి ముసుగు; బహిరంగ వితరణ విన్యాసాలు లుబ్ధబుద్ధులకు ముసుగు; నిరంతర నీతి ప్రవచనాలు అలవిమాలిన అవినీతి పనులకు ముసుగు; సర్వసంగ పరిత్యాగ వేషాలు సంపన్న వైభోగాలకు ముసుగు– ఇలా చెప్పుకుంటూ పోతే ముసుగుల జాబితా కొండవీటి చేంతాడు కంటే పొడవుగా తయారవుతుంది. ‘ఒక్క బంగారు ముసుగు అన్ని వైకల్యాలనూ కప్పిపుచ్చుతుంది’ అన్నాడు ఇంగ్లిష్ నాటక రచయిత థామస్ డెకర్. బంగారు ముసుగులు తొడుక్కోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకని తెలివిమంతులు దేవతా వస్త్రాల ముసుగులలో తమ తమ లొసుగులను కప్పిపుచ్చుకుంటూ, నిక్షేపంగా సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అయిపోతుంటారు. ఇలాంటి పెద్దమనుషుల అసలు ముఖాలేవో గుర్తించడం దుస్సాధ్యం. ముసుగుల మాటునున్న ముఖాలను గుర్తించేలోపే అమాయకులు కాటుకు గురైపోతారు. సాధారణంగా ముసుగులు నాటకాది ప్రదర్శనల వేషధారణలో భాగంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో ముసుగులూ వేషాలూ దైనందిన జీవితంలో నిత్యకృత్యాలుగా మారిపోయాయి.అతి వినయం ధూర్త లక్షణానికి ముసుగు. ‘వదనం పద్మదళాకారం వచశ్చందన శీతలం/ హృదయం కర్తరీ తుల్యం, అతి వినయం ధూర్త లక్షణం’ అని మనకో సుభాషిత శ్లోకం ఉంది. అలాగే, ‘జటిలో ముండీ లుంభిత కేశః/ కాషాయాంబర బహుకృత వేష/ పశ్యన్నిపిచ న పశ్యతి మూఢో/ ఉదర నిమిత్తం బహుకృత వేషం’ అన్నాడు ఆదిశంకరుడు. పైన ఉదహరించిన సుభాషిత శ్లోకాన్ని, ఆదిశంకరుడి శ్లోకాన్ని గమనిస్తే, ముసుగులూ వేషాలూ ఆనాటి నుంచే ఉన్నట్లు అర్థమవుతుంది. కాకుంటే, అప్పటివి సత్తెకాలపు ముసుగులు. అతి తెలివిని ప్రదర్శించబోయిన అమాయకపు వేషాలు. ప్రధానంగా వాటి ప్రయోజనం ఉదర నిమిత్తానికే పరిమితమై ఉండేది. కేవలం ఉదర నిమిత్తం వేసుకునే ముసుగులూ వేషాల వల్ల ఎంతో కొంత వినోదమే తప్ప సమాజానికి పెద్దగా చేటు ఏమీ ఉండదు. అయినా, ఆనాటి సమాజంలోని ప్రాజ్ఞులు ముసుగులనూ, వేషాలనూ నిరసించేవారు. అలాంటివారి నిరసనల వల్ల ముసుగులూ వేషాలూ శ్రుతి మించకుండా ఉండేవి. అప్పట్లో ముసుగులకూ వేషాలకూ పెద్దగా ప్రచారం ఉండేది కాదు. అంతగా జనాదరణ ఉండేది కాదు. సినిమాలు వచ్చాక చిత్రవిచిత్ర వేషాలకు ప్రచారమూ పెరిగింది. నాటకాలు, సినిమాలు మాత్రమే వినోద సాధనాలుగా ఉన్న కాలంలో నటీనటులు మాత్రమే పాత్రోచిత వేషాలు వేసేవారు. సమాజంలో పెద్దమనుషుల ముసుగులో ఉండే వేషధారులు అక్కడక్కడా మాత్రమే ఉండేవారు. ఇక స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక మనుషులంతా వేషధారులుగా మారిపోయిన పరిస్థితి దాపురించింది. కృత్రిమ మేధ తోడయ్యాక మనుషుల అసలు ముఖాలను పోల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి వాటిల్లింది. ఇప్పుడు నటీనటులే కాదు, వారికి పోటీగా దేశాధినేతలు కూడా యథాశక్తిగా దేవతావస్త్రాల ముసుగులను తొడుక్కుని, రకరకాల వేషాలతో నవరసాభినయ చాతుర్యంతో జనాలను విస్మయంలో ముంచెత్తుతున్నారు.‘స్మార్ట్’ వేషాల సంగతి ఒక ఎత్తయితే, ఇప్పుడు చైనాలో సిలికాన్ ముసుగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అలాంటిలాంటివి కావు, అల్ట్రా రియలిస్టిక్ ముసుగులు. ఒక నలభయ్యేళ్ల వ్యక్తి ఒక వృద్ధుడి ముఖాన్ని పోలిన సిలికాన్ ముసుగు వేసుకుని నేరాలకు పాల్పడిన సంగతి బయటపడటంతో కలకలం మొదలైంది. సిలికాన్ ముసుగుల చట్టబద్ధతపై కూడా చర్చ మొదలైంది. అయినా, ఎంత సిలికాన్ ముసుగులైతే మాత్రం అవేమైనా దేవతా వస్త్రాల ముసుగులా? అసలు ముఖాలను ఎంతకాలం దాచగలవు పాపం?! -
మిగిలేది... మానవత్వ పరిమళమే!
సమాజం భ్రష్టు పట్టిపోయింది. మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. నిజమే! కాని, మానవత్వం గల మనుషులు కొందరైనా ఉన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు. అయితే, సమాజంలో వీరి శాతాన్ని బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.న్యూజిలాండ్ లోని గ్రేమోత్ లోకల్ మార్కెట్లో ఒక దయార్ద్ర హృదయుడు తిరుగుతుంటాడు. రొయ్యల, చేపలూ లాగా అక్కడ ఫుడ్ మార్కెట్లో తాబేళ్ళను కూడా అమ్ముతారు. మనం చెప్పుకుంటున్న దయార్ద్ర హృదయుడు తాబేలు మాంసం కోసం రాడు. తాబేళ్ళను రక్షించడానికి వస్తుంటాడు. బేరమాడి మార్కెట్లో బతికి ఉన్న తాబేళ్ళన్నింటినీ కొంటాడు. వాటిని ట్రక్కులో వేసుకుని పోయి సముద్రంలోకి వదులుతాడు. అక్కడ తాబేళ్లు అంతరించి పోయే దశలో ఉన్నాయి. అందుకే ఈ పని! ఏదో విధంగా తమ పని గడిస్తే చాలుననుకుంటూ కాలుష్యాలు పెంచుతున్న మనుషుల మధ్య ఎంతో బాధ్యతతో ‘మనిషి’లా ప్రవర్తించే వారున్నారు. ‘ప్రపంచమేమీ గొడ్డుపోలేదు’ అని అన్నది అందుకే! పాపువా న్యూ గినియా – మార్కెట్ల దగ్గరా ఇలాంటి జీవ పరిరక్షకులు ఉన్నారు. ఇటీవల రాజస్థాన్ జైపూర్‌లో మానవత్వం మతాన్ని గెలిచింది. మధూలిక అనే ఒక 48 ఏళ్ల హిందూ మహిళ 13 మంది ముస్లింల ప్రాణాలు కాపాడింది. భర్త చనిపోయి, ఇద్దరు పిల్లలతో ఒక బట్టల కొట్టు నడుపుకుంటూ జీవిస్తోంది. ఆమె బట్టల కొట్టు ఉన్న ఆ వీధిలో ముస్లింలే ఎక్కువ మంది ఉన్నారు. ఒకరోజు హిందూ వర్గానికి చెందిన గుంపు – శోభాయాత్ర ఊరేగింపు తీస్తూ అల్లర్లు సృష్టించింది. అందులో భాగంగా అక్కడ ఉన్న 13 మంది ముస్లింలపై దాడిచేయడానికి వారి వెంట పడ్డారు. ఇదంతా గమనించిన మధూలిక ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చిన ముస్లింలను తన కొట్టులోకి పంపి వెంటనే షట్టర్ వేసేసింది. తర్వాత హిందూ దుండగుల్ని ధైర్యంగా ఎదుర్కొని, చాకచక్యంగా వారిని వెనక్కి పంపించింది. ‘మానవత్వం అన్నిటికన్నా గొప్పదని భావించి, ముస్లిం సోదరులకు ఆశ్రయమిచ్చాన’ని– ఆ తర్వాత ఆమె పత్రికల వారికి చెప్పింది. ఒక సామాన్య మహిళ ఆచరణాత్మకంగా, ఎంతో గొప్ప సందేశం ఇచ్చింది. హైదరాబాదు పాత బస్తీలో గాజుల అంజయ్య అందరికీ తెలిసినవాడు. అతని మిత్రులలో చాలా మంది ముస్లింలే. 2022, ఏప్రిల్ 17న తన కొడుకు పెళ్ళికి మిత్రులందరినీ ఆహ్వానించాడు. అవి రంజాన్ రోజులు గనుక ‘రోజా’ పాటించే తన ముస్లిం మిత్రులెవరూ ఇబ్బంది పడకూడదని వారి కోసం నమాజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. ఇఫ్తార్ విందూ ఏర్పాటు చేశాడు. వారంతా మరునాడు ఉపవాసం పాటించేందుకు ‘సహౌరీ’ ఏర్పాటు చేశాడు. స్వార్థప్రయోజనాల కోసం విద్వేషాలు నూరిపోసే వారి వలలో పడకూడదనీ, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుకోవడం అందరి బాధ్యత అనీ పాతబస్తీ అంజయ్య ఎప్పుడూ చెబుతుంటాడు. ఇలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది. ఒక ముల్లాగారు తమ మసీదులో హిందూ అమ్మాయి వివాహం జరిపించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.ముస్లింల, క్రైస్తవుల సఖ్యత గూర్చి కూడా ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. ఇది 2022 ఏప్రిల్ 21న మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ముస్లింలు చర్చిలో నమాజు చదివారు. ఇఫ్తార్ విందుకోసం అజ్మల్ ఖాన్ అనే వ్యక్తి అన్ని మతాల మత పెద్దల్ని ఆహ్వానించాడు. అయితే, అక్కడ చర్చి ఫాదర్ ఆ విందు అహ్వానాన్ని అంగీకరించడమే కాకుండా, ఆ ఇఫ్తార్ విందు తమ చర్చిలోనే నిర్వహించాలని సూచించాడు. ఆ రకంగా తొలిసారి ఇస్తార్ విందు చర్చిలో, ఫాదర్ పర్యవేక్షణలో జరిగింది. పరమత సహనం, సహకారం అంటే ఇదే కదా! అసలైన భారతదేశపు ‘ఆత్మ’ అక్కడ తొణికిసలాడింది. ఆత్మ అంటే... ఆత్మ – పరమాత్మలు కావు. అంతరంగంలోని ఒక సమర్పణ భావం! ఆలోచనల ఐక్యత!! గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం. మనిషి మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమించడం. ఇక్కడ చెప్పుకున్న సంఘటనలన్నింటికీ ఒక అంతస్సూత్రం ఉంది. ‘దేవుడు లేడు – మతం అనేది వ్యక్తిగతం – మన చివరి గమ్యం – మానవవాదం’ అనేది సాధించడానికి... ఇలా మెల్లమెల్లగా అడుగులు పడుతున్నాయేమో!క్రమంగా తరతమ భేదాలు మరిచి, మనుషులంతా ఒక్కటే అనే విషయం జీర్ణించుకునేందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయేమో? మనిషికి మనిషే ముఖ్యం – దేవుళ్ళు కాదు, అనే భావనలోకి సమాజం ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా ‘మన మార్గం సుదీర్ఘమైంది. రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు. మన పరిమితులు మనకు తెలుసు. ఇరవై ఒకటవ శతాబ్దపు స్త్రీ – పురుషుల్ని అంటే మనల్ని మనం కొత్తగా తయారు చేసుకోవడానికి రోజు వారీగా కృషి చేస్తూనే ఉండాలి’ అన్న చే గువేరా మాటలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నిజమే– బూజు పట్టిన భావజాలాన్ని వదిలి, కొంచెం కొంచెంగా పైపైకి ఎదుగుతూనే ఉండాలి. పైకి ఎదిగితేనే (ఎగిరితేనే) అద్భుతమైన మానవత్వ దృశ్యాలు కనబడతాయి. నువ్వు బతికి ఉన్నావంటే...నీ జీవితపు విజయోత్సవాన్ని పంచుకోస్వర్గమనేది ఎక్కడైనా ఉంటే...దాన్ని భూమి మీదికి దించుకో–అని ఎలుగెత్తి చెబుతూ ముందుకు సాగాల్సి ఉంది.డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత -
సకామ కర్మ – అకామ కర్మ
మనిషి ఏ పనీ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండటం అసాధ్యం. ఏమీ చేయటం లేదు అన్నప్పుడు ఆ మాట పలకటం కర్మయే కదా! అప్పుడు కూడా గాలి పీల్చటం, తిన్న దానిని అరిగించుకోవటం వంటి పనులు చేస్తూనే ఉంటాము కదా! ఇవి కూడా మనని పట్టి బంధించి మరొక జన్మకి కారణం అవుతాయా? అనే సందేహం కలగటం సహజం. దీనిని గురించి భగవద్గీతలో కృష్ణుడు వివరంగానే చె΄్పాడు. ‘అకర్మ’ అని. నిజానికి జీవించి ఉండటమే ఒక కర్మ. జీవ చైతన్యం జీవికి ధర్మం. దాని వ్యక్త స్వరూపం కదలిక. అప్పుడే పుట్టిన బిడ్డ కాళ్ళు చేతులు కదిలిస్తూ ఏడుస్తాడు. బిడ్డ ఏడవక ΄ోయినా, కదలికలు లేక΄ోయినా పెద్దలు ఏడవ వలసి ఉంటుంది. ఏదోవిధంగా ఏడిపించే ప్రయత్నం చేస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న ఈ కదలికలు, ధ్వనులు క్రమేణా వయస్సుని బట్టి సంకల్పాలతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే అభి్ర΄ాయానికి అనుగుణంగా కదలికలు ఉంటాయి. మొదట్లో నవ్వటం, ఏడవటం అకారణంగా ఉంటాయి. ఇది నిష్కామకర్మ. రాను రాను వయసుని బట్టి ఈ ఏడుపులు, నవ్వులు సకారణంగా మారుతాయి. తెలిసినవారిని చూసి నవ్వటం, కొత్తవారిని చూసి ఏడవటం, ఆకలి వేస్తే, చీమ కుడితే ఏడవటం సకారణమేగా. పైగా ఎవరైనా వచ్చి తన బాధ తీర్చాలనే కోరికతో చేసినదే కనుక సకామ కర్మ అవుతుంది. చేతులు కదలి నోటి దాకా వచ్చి వ్రేళ్ళు చీకటం మొదలవుతుంది. చేతిని నోటిదాకా తీసుకు రావటానికి ఎంత తాపత్రయ పడతారో పిల్లలు గమనించ వచ్చు. ఆ పైన ఆ కదలిక వస్తువులను చూపించటం, పట్టుకోవటంలో నేర్పు చూపించటంగా మార్పు చెందుతుంది. అదే విధంగా ఏడవటం ఊ కొట్టటంగా మారి, క్రమంగా మాటలుగా పరిణామం జరుగుతుంది. తన అభి్ర΄ాయాలు, కోరికలు వ్యక్తీకరించటానికి మాటలని ఉపయోగించటం జరుగుతుంది. ఇది ఎంతో సహజంగా, అప్రయత్నంగా జరిగే పరిణామం. మనోవాక్కాయకర్మలచే మొదలైన దివ్యకర్మ మానవకర్మగా మలచ బడింది. అకామకర్మ బంధించదు. సకామకర్మ బంధ హేతువు. అకామకర్మ సకామకర్మగా రూ΄ాంతరం చెందుతున్న క్రమంలో అది ఘనీభవించి తాను అందులో బంధించబడకుండా జాగరూకత వహించవలసి ఉంటుంది. ప్రతిదీ లాభనష్టాల లెక్కలతో బేరీజు వేయటానికి అలవాటు పడిన మనిషికి ఇది సాధ్యమా? అనిపించటం సహజం. కానీ ఆ విధంగా ఉండటమే సహజం. స్వార్థపూరితంగా ఉండటమే తెచ్చిపెట్టుకున్న లక్షణం. ఎందుకంటే పుట్టిన కొత్తలో ప్రతి మనిషి శిశువుగా ఏ పని చేసినా ప్రయోజనాన్ని ఆశించి చేయటం ఉండదు. చిన్నపిల్లలు ఒక్క క్షణం కూడా ఒక చోట స్థిరంగా కూర్చోరు. గిరా గిరా తిరుగుతూనే ఉంటారు. ఎందుకు అని అడిగితే ‘ఊరికే’ అంటారు. పెరిగి పెద్ద అయినాక కూడా ఏదో ఒక పని చేయకుండా ఉండలేము. దానికి ఒక సంకల్పం, లేదా కోరిక జత చేయటం జరుగుతుంది. ఈ కోరిక బంధిస్తుంది. ఎలాగూ ఏమి చేయకుండా ఉండలేము కనుక ఏదైనా మనస్సుతో, వాక్కుతో, చేతులతో ఫలితాన్ని ఆశించకుండా పదిమందికి ఉపయోగ పడే పని చేస్తూ ఉంటే అది నిష్కామకర్మ అవుతుంది. దేహం ఉన్నంత వరకు కర్మాచరణ మాన రాదు.గాలి పీల్చటం, గుండె కొట్టుకోవటం, ఊపిరితిత్తులు పని చేయటం మన ప్రయత్నం లేకుండా ఎట్లా జరుగుతున్నాయో నిత్యకృత్యాలు కూడా అదేవిధంగా యాంత్రికంగా, అప్రయత్నంగా కొనసాగిస్తూ, వాటిలో మానసికంగా లగ్నం కాకుండా ఉన్నప్పుడు సకామకర్మ అవదు. కనుక బంధించదు, మరొక జన్మకి కారణం కాదు. -
ధర్మం అంటే..? మంచిమాట
ప్రకృతి ఎలా ప్రవర్తించాలి, ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే ధర్మం. అది మార్పు చెందే ప్రసక్తే ఉండదు. మనిషికి ఆధ్యాత్మికోన్నతి అందించేదే ధర్మం. మానవ ధర్మాల్లో ముఖ్యమైనవి– నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, అలాగే మనిషిని దహింప జేసేవి– అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ. మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతరప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు. మానవునికి ధర్మాచరణ ముఖ్యం, తాను జీవిస్తున్న సమాజ భద్రతకు, తన జీవన క్రమశిక్షణకు మానవుడు విధిగా ఆచరించవలసిన కొన్ని విశేష ధర్మాలను భాగవతం చెప్పింది. సత్యనిష్ఠ, దయాగుణం, తపస్సు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, నిజాయితీ, నిష్కపటం, ఓర్పు, వినయం మొదలైనవి ప్రతి వ్యక్తి పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. ఇవి వ్యక్తిగతంగా తనకే గాక తాను జీవిస్తున్న సమాజానికి, సర్వమానవాళికి కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. మానవులకు, జంతువులకు, వస్తువులకు పరమాత్మ ధర్మాలను నిర్దేశించాడు. వినయం, సహనం, ఆచారం, పరాక్రమం మనిషికి సంస్కారం అందించే సాధనాలు. తనకు నచ్చని అంశాలను పరులమీద రుద్దకుండా చేయటం ధర్మం. తన దారిలో ఎవరి మాట వినకుండా ముందుకు నడవడం అధర్మం. అగ్ని వేడిని, నీరు చల్లదనాన్ని అందిస్తాయి. సింహం గర్జిస్తుంది. అటు ఇటూ పరుగెత్తుతూ చపలత్వాన్ని ప్రదర్శించడం లేడి లక్షణం. ఈ రకంగా ప్రతిదీ తన ధర్మాన్ని పాటింపజేయడం కేవలం పరమాత్మ సృజన. ఆయన సంకల్పం లేనిదే మానవ ధర్మం మృగ్యమే. ప్రతి పనిలో మనిషి అభివృద్ధిని ఆశిస్తాడు. అది సాధించాలంటే కఠోర సాధన అవసరం. సాధనే ధర్మం. అది మనిషిని పతనం కానివ్వకుండా కాపాడుతుంది. ధర్మాచరణ వ్యక్తి మనఃస్థితిని బట్టి ఆధారపడి వుంటుంది. తన వ్యక్తిగత ధర్మాన్ని విడిస్తే అది అభివృద్ధిని నిరోధిస్తుంది. అటువంటి వ్యక్తికి సుఖ సంతోషాలు, శాంతి లభించవు. ప్రతి వ్యక్తి ధర్మాన్ని రక్షించాలి. ప్రతి పనినీ ధర్మబద్ధంగా చేయాలి. ధర్మాచరణను కొనసాగించాలి. ‘ధర్మో రక్షతి రక్షితః’. ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడో, అట్టి వ్యక్తిని ధర్మమే కాపాడుతుంది. ధర్మానికి హాని చేసేవాడిని ధర్మమే హతమారుస్తుంది. కొలిమిద్వారా పుట్టిన వేడివల్ల ఇనుము వేడెక్కుతుంది. బంగారం శుద్ధి అవుతుంది. అట్లే ధర్మాచరణ వ్యక్తిని, మనసును శుద్ధిపరుస్తుంది. ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా చేసుకోవాలి గాని అధర్మం చేస్తూ ఇతరులను భయపెట్టకూడదు. ఎంత సంపాదించినా పైకి తీసుకొని పోయేటపుడు కేవలం పాపపుణ్యాలే కాని మణి మాణిక్యాలు కావు. మన తర్వాత ఉన్నవాళ్లు మనం సంపాదించింది తింటారో తినరో వారికే విధంగా విధి రాసి ఉందో తెలియదు. వారికి భగవంతుడే విధంగా తినేప్రాప్తిని రాసి పెట్టాడో వారు అలానే ఉంటారు. కనుక రాబోయే తరాలకు నువ్వు సంపాదించి ఇచ్చే తాపత్రయం పెంచుకోకూడదు. ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతనీ బాధ్యతనీ మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. అదే ధర్మో రక్షతి రక్షితః. ధర్మం వల్ల అన్నీ సాధ్యమౌతాయి: ధర్మాచరణ వలన అర్థప్రాప్తి, ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మ సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది. స్వధర్మానికి బాధ కలిగించేది–విధర్మం, ఇతరుల ప్రేరణచే ఇతరుల ధర్మాన్ని ఆచరించేది – పరధర్మం, భగవంతుడి పట్ల విశ్వాసరహితులైన వారు చేసేది, చెప్పేది – ఉపధర్మం. తన «దర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, చెప్పబడిన ధర్మానికి విపరీతార్థాలను తీసి వివరించడం అనే అయిదు ‘అధర్మాలు’ త్యజించవలసినవిగా వేదవ్యాసుడు పేర్కొన్నాడు. కరుణ, ఆదర్శ గృహస్థ జీవనం, నిత్యకర్మాచరణ శీలత లోక కల్యాణకార కాలు, భగవద్భక్తి మార్గ నిర్దేశాలు. వీటిని మరవడం మన ధర్మాన్ని మనం మరచిపోవడమేనన్నది సత్యం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
AI: త్వరలోనే ‘ఏఐ’తో ఆ ముప్పు!
కాలిఫోర్నియా: కీడెంచి మేలు ఎంచాలంటారు పెద్దలు. కానీ జనరేటివ్ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విషయంపై అందరూ చేస్తోంది దాంతో వచ్చే మేళ్ల గురించిన చర్చే. ఈ అత్యాధునిక టెక్నాలజీతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై ఎవరూ ఆలోచించడం లేదు. అయితే మెషిన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఎలిజర్ యడ్కోవ్‌స్కీ మాత్రం ఈ కోణంలో ఆలోచించి మానవాళికి ఏఐతో ఏ రేంజ్లో ముప్పు పొంచి ఉందో చెబుతున్నాడు. గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐకి సంబంధించి యడ్కోవ్‌స్కీ ఒక సంచలన విషయం వెల్లడించాడు. మరో రెండేళ్లు లేదంటే ఐదేళ్లు, మరీ అడిగితే ఓ పదేళ్లు మాత్రమే మానవాళికి మిగిలి ఉన్న గడువని చెప్పాడు. మిగిలిన గడువు అని యడ్కోస్కీ వాడిన పదానికి ఆయనను ఇంటర్వ్యూ చేసిన టామ్ లామంట్ అర్థం చెప్పే ప్రయత్నం చేశాడు. టర్మినేటర్, మ్యాట్రిక్స్ సినిమాల్లో చూపించినట్లు మెషీన్లతోనే అంతం అని లామంట్ వివరించాడు. భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోతాయని చాలా మంది ఏఐని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే యడ్కోవ్‌స్కీ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఏఐతో ఏకంగా మానవాళికే ముప్పు అని అతని స్టైల్లో హెచ్చరించాడు. గతంలోనూ డేటా సెంటర్ల విషయంలో బాంబింగ్ డేటా సెంటర్లనే పదాన్ని ఈయన వాడాడు. అయితే దీని విషయంలో కొద్దిగా పునరాలోచనలో పడ్డానని కూడా అతడే తర్వాత చెప్పడం గమనార్హం. ఇదీ చదవండి.. సొంత దేశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు -
మానవాళికి హమాస్ అపచారం
ఇజ్రాయెల్ గతాన్ని చూపి హమాస్ నేరాలను సమర్థించటం ఎంతమాత్రమూ సాధ్యం కాదు. రెండు తప్పులు ఒక ఒప్పుగా మారవు. దురాక్రమణతో దశాబ్దాలుగా లక్షలాదిమంది పాలస్తీనియన్లను చెరబట్టడం, ఇటీవలి సంవత్సరాల్లో శాంతి కోసం చిత్తశుద్ధితో జరిగిన ప్రయత్నాలను వమ్ము చేయటం విషయంలో ఇజ్రాయెల్‌ను కచ్చితంగా విమర్శించాల్సిందే. అయితే హమాస్ దుశ్చర్యలు శాంతిప్రక్రియ పునఃప్రారంభం కోసం చేసినవి కాదు. ఆ దారుణాలు దురాక్రమణను అంతం చేసేవి కూడా కాదు. దానికి విరుద్ధంగా హమాస్ ప్రారంభించిన యుద్ధం లక్షలాదిమంది పాలస్తీనా పౌరుల ఎడతెగని వ్యథకు కారణమైంది. అవీవ్ కుట్జ్ నా బాల్య స్నేహితుడికి చాలా సన్నిహిత మిత్రుడు. ఇజ్రాయెల్‌లో కఫార్ అజా ప్రాంతంలో భార్య లివ్నాత్, ముగ్గురు పిల్లలతో అవీవ్ చాలా కాలం నుంచి నివసిస్తున్నాడు. తమ కిబుట్జ్ (కిబుట్జ్ అంటే హిబ్రూ భాషలో పెద్ద వ్యవసాయ క్షేత్రం. స్వచ్ఛందంగా, పోటీరహితంగా పనిచేయడానికి ముందుకొచ్చే వ్యక్తుల సమూహం అక్కడ నివసిస్తుంది)పై హమాస్ జరిపే రాకెట్లు, మోర్టార్ల దాడులు చూస్తూనేవున్నా ఏదో ఒక నాటికి ప్రశాంతత ఏర్పడక పోతుందా అన్న ఆశతో కుట్జ్ కుటుంబం అక్కడే వుంటోంది. యుద్ధ క్షేత్రంలో కాస్తయినా శాంతిని వెదుక్కోవాలనే సంకల్పంతో యేటా పతంగుల పండుగ నిర్వహించటం కుట్జ్ కుటుంబానికి అలవాటు. ఆ ఉత్సవంలో రంగురంగుల గాలిపటాలు, అందులో కొన్నింటిపై శాంతి సందేశాలు– అన్నిటినీ గాజా సరిహద్దు ముళ్ల కంచెకు సమీపంలోనే ఎగరేస్తారు. ‘మేం ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాం తప్ప ఘర్షణను కాదని చెప్పటమే ఈ ఉత్సవ సారాంశం’ అని గతంలో జరిగిన పతంగుల పండుగలో పాల్గొన్న లివ్నాత్ సోదరి చెప్పారు. ఈసారి పతంగుల పండుగ అక్టోబర్ 7న జరపాలని నిర్ణయించారు. కానీ ఆ ఉత్సవ ప్రారంభానికి కొన్ని గంటల ముందు హమాస్ ఉగ్రవాదులు కఫార్ అజాపై విరుచుకు పడ్డారు. దాన్ని చెరబట్టారు. కుట్జ్ అయిదుగురు కుటుంబ సభ్యులనూ హత మార్చారు. ఇటువంటి ఉదంతాలు మనసును కలచివేస్తాయి. మనుషులు ఎందుకీ దారుణాలకు పాల్పడతారు? దీనిద్వారా హమాస్ సాధించదల్చుకున్నది ఏమిటి? ఒక ప్రాంతాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవటం సంప్రదాయ సంగ్రామం లక్ష్యంగా ఉంటుంది. హమాస్ ఉగ్రవాదం దీనికి భిన్నం. భయోత్పాతాన్ని వ్యాపింపజేయటం, లక్షలమంది ఇజ్రా యెలీ, పాలస్తీనా పౌరుల్లోనూ, ప్రపంచ ప్రజానీకంలోనూ విద్వేష బీజాలు నాటడం దాని మానసిక యుద్ధతంత్ర ఆంతర్యం. పీఎల్ఓ వంటి ఇతర పాలస్తీనా సంస్థలకు హమాస్ భిన్నమైనది. మొత్తం పాలస్తీనా పౌరులందరితో దాన్ని సమం చేయకూడదు. హమాస్ తన పుట్టుక నుంచీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ ఉనికిని, మనుగడ సాగించేందుకు దానికిగల హక్కును గుర్తించ నిరాకరిస్తోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇతర అరబ్బు దేశాల పౌరుల మధ్య శాంతి సాధనకు ఏర్పడే ప్రతి అవకాశాన్నీ తన శక్తికొద్దీ ధ్వంసం చేస్తోంది. ప్రస్తుత హింసా పరంపరకు నేపథ్యం ఇజ్రాయెల్‌కూ, గల్ఫ్ దేశాలకూ మధ్య కుదురుతున్న శాంతి ఒప్పందాలు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య సైతం శాంతి ఒప్పందం చిగురించబోతున్నది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్యా సాధారణ సంబంధాలు ఏర్పర్చడం మాత్రమే కాదు, ఇజ్రాయెల్ దురాక్రమణలో బతుకులు వెళ్లదీస్తున్న లక్షలాదిమంది పాలస్తీనా వాసులకు ఇబ్బందుల నుంచి ఉపశమనం లభించటానికి తోడ్పడుతుంది. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతి ప్రక్రియ పునఃప్రారంభం కావటానికి దోహదం చేస్తుంది. శాంతి స్థాపన అవకాశాల కన్నా హమాస్‌ను భయపెట్టగలిగేది మరేదీ వుండదు. అందుకే అది అక్టోబర్ దాడులకు తెగబడింది. కేవలం ఆ కారణంతోనే కుట్జ్ కుటుంబ సభ్యులనూ, మరో వేయిమందికి పైగా ఇజ్రాయెలీ పౌరులనూ అత్యంత పాశవికంగా హతమార్చింది. హమాస్ చర్య దాని సంపూర్ణ అర్థంలో అక్షరాలా మానవాళికి వ్యతిరేకంగా చేసిన నేరమే. మానవత్వంలో మనకుండే విశ్వాసాన్ని ధ్వంసం చేయటమే. ఇజ్రాయెల్ గతాన్ని చూపి హమాస్ నేరాలను సమర్థించటం ఎంత మాత్రమూ సాధ్యంకాదు. రెండు తప్పులు ఒక ఒప్పుగా మారవు. దురాక్రమణతో దశాబ్దాలుగా లక్షలాదిమంది పాలస్తీనియ న్లను చెర బట్టడం, ఇటీవలి సంవత్సరాల్లో శాంతికోసం చిత్తశుద్ధితో జరిగిన ప్రయత్నాలను వమ్ము చేయటం విషయంలో ఇజ్రాయెల్‌ను కచ్చితంగా విమర్శించాల్సిందే. అయితే కుట్జ్ కుటుంబ సభ్యుల హత్య, ఇతర దుశ్చర్యలు శాంతిప్రక్రియ పునఃప్రారంభం కోసం చేసినవి కాదు. ఆ దారుణాలు దురాక్రమణను అంతం చేసేవి కూడా కాదు. దానికి విరుద్ధంగా హమాస్ ప్రారంభించిన యుద్ధం లక్షలాది మంది పాలస్తీనా పౌరుల ఎడతెగని వ్యథకు కారణమైంది. హమాస్‌పై సాగిస్తున్న యుద్ధంలో తన ప్రాంతాన్నీ, పౌరులనూ పరిరక్షించుకోవటం మాత్రమే కాదు... తన మానవీయతను కాపాడు కోవటం కూడా ఇజ్రాయెల్ కర్తవ్యమే. తమ స్వస్థలంలో శాంతి సౌభాగ్యాలు అనుభవించే హక్కు పాలస్తీనా పౌరులకుంది. దాంతోపాటు ఘర్షణల మధ్య కూడా వారి మౌలిక మానవ హక్కులను అన్ని పక్షాలూ గుర్తించి తీరాలి. ఇది ఒక్క ఇజ్రాయెల్‌కు మాత్రమే కాదు... గాజా స్ట్రిప్‌తో సరిహద్దు వుండి, దాన్ని పాక్షికంగా మూసివేసిన ఈజిప్టుకు కూడా వర్తిస్తుంది. ఇక హమాస్ విషయానికొస్తే మాన వాళి మొత్తం ఆ సంస్థనూ, దాని మద్దతుదార్లనూ వెలివేయాలి. గాజా యుద్ధ ఉద్దేశాలేమిటో విస్పష్టంగా ఉండాలి. హమాస్‌ను నిరాయుధీకరించాలి. గాజా స్ట్రిప్‌ను నిస్సైనికీకరించాలి. అలాగైతేనే పాలస్తీనా పౌరులు గౌరవ మర్యాదలతో మనుగడ సాగి స్తారు. వారితోపాటు ఇజ్రాయెల్ పౌరులు కూడా నిర్భయంగా జీవనం కొనసాగిస్తారు. ఈ లక్ష్యాలు సాధించేంతవరకూ మన మానవీయతనుకాపా డుకోవటం ఎంతో కష్టంతో కూడుకున్న పని. తీరని వేదన అనుభవిస్తున్న పాలస్తీనియన్లకు సహానుభూతి ప్రకటించటం మానసికంగా అశక్తతలో, అచేతనలో కూరుకుపోయిన చాలామంది ఇజ్రాయెలీ పౌరులకు కష్టమే. మనసులు స్వీయ విషాదంతో నిండి పోయిన వర్తమానంలో కనీసం వేరేవారి వ్యథను గుర్తించటానికి కూడా అందులో చోటు మిగలదు. ఎన్ని కష్టాల్లోనైనా అలాంటి చోటును నిలుపుకోగలిగిన కుట్జ్ కుటుంబం, వారిలాంటి అనేకులు ఇవాళ మృత్యు ఒడికి చేరారు. లేదా తీవ్ర మనోవ్యాకులత లోనికి జారుకున్నారు. అటు పాలస్తీనా పౌరులదీ ఇదే పరిస్థితి. వారు సైతం చెప్పలేనంత వ్యథను అనుభవిస్తున్నారు. మా బాధలను గమనించే స్థితిలో లేరు. కానీ ఈ వేదనాభరిత స్థితికి దూరంగావున్న ఇతరులంతా వాస్తవాలను పాక్షిక దృష్టితో చూసే మందబుద్ధిని వదుల్చుకుని బాధాసర్పద్రష్టులందరికీ సహానుభూతి ప్రకటించటానికి కృషి చేయాలి. శాంతి స్థాపనకు చోటుండేలా సహాయపడటం వెలుపలి వారి కర్తవ్యం. ఆ బాధ్యతను మీకు అప్పగిస్తున్నాం. ఎందుకంటే ఆ విషయంలో మేం అశక్తులమయ్యాం. మా కోసం మీరు ఆ మంచి పని చేయండి. ఏదో ఒకరోజు ఈ కష్టాలన్నీ కడతేరినప్పుడు, ఈ గాయాలు మానినప్పుడు ఇజ్రాయెలీ పౌరులూ, పాలస్తీనా పౌరులూ ఆ చోటులో సురక్షితంగా మనుగడ సాగిస్తారు. యువల్ నోవా హరారి ఇజ్రాయెల్ పౌరుడు. చరిత్రకారుడు, తత్వవేత్త. ‘సేపియన్స్’, ‘హోమో డియుస్’, ‘అన్‌స్టాపబుల్ అజ్’ తదితర పుస్తకాల రచయిత. యువల్ నోవా హరారి (‘టైమ్’ సౌజన్యంతో) -
మొత్తం మానవాళికే సమస్య!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ‘కాప్ 28’ సదస్సు జరగనుంది. పూర్వ సగటు ఉష్ణోగ్రతల కంటే 2023లో 1.4 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. వాతావరణ మార్పుల సదస్సు కోసం ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములు సమావేశమవుతున్నప్పుడు, ఇంతకంటే కీలక సమస్య వేరేదీ లేదు. ఇప్పటికే, ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాలలో వరద బీభత్సం విదితమే. దేశమంతటా వర్షాలు సకాలంలో పడలేదు. వ్యవసాయ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నది. పంటల విస్తీర్ణం, దిగుబడి మీద వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ (యూఎన్ఎఫ్సీసీసీ) లోని అన్ని సభ్యత్వ పక్షాలు దుబాయ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు సమావేశం కానున్నాయి. 2015 పారిస్ ఒప్పందం ప్రకారం తొలి ‘గ్లోబల్ స్టాక్ టేక్’ (జీఎస్టీ) పూర్తి చేయడం ఈ సమావేశంలో మొదటి ప్రధాన అంశం. పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించే దిశగా సమష్టి పురోగతిని అంచనా వేయడం, ముఖ్యంగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు, అడాప్టేషన్ ప్రయత్నాల పురోగతి, నిధుల ప్రవాహం అంచనా వేయడం ఈ జీఎస్టీ లక్ష్యం. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మదింపు తదుపరి పర్యావరణ, వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసుకునే చర్యలకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించబడింది. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గేనా? 2023 సెప్టెంబర్‌లో విడుదలైన మొదటి జీఎస్టీ అధ్యయన ఫలితం, స్పష్టంగా ఉన్నది: ప్రపంచం మొత్తం అనుకున్న లక్ష్యం నుంచి దారి తప్పింది. ఈ నేపథ్యంలో దుబాయ్‌లో జరగనున్న ‘కాప్ 28’(కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్– భాగస్వామ్య పక్షాల 28వ సమావేశం)లో దీని దిద్దుబాటు మీద చర్చ జరుగుతుందని ఆశిస్తున్నారు. అనేక చర్యల మీద ఏకాభిప్రాయం లేదు. ఈ నివేదిక వల్ల కొన్ని చర్యల పైన విశాల ఒప్పందాలు జరుగుతాయని అంచనా. ప్రధానంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు చేయాలనే లక్ష్యం ఒకటి కాగా, శిలాజ ఇంధనాల వినియోగం దశల వారీగా తగ్గించే లక్ష్యం పైన చర్చలు వివాదాస్పదంగా ఉన్నాయి. దుబాయ్ సమావేశం అధ్యక్షుడు ఒక చమురు కంపెనీ అధిపతి అయిన నేపథ్యంలో చమురు ఉపయోగం తగ్గించడానికి చర్చలు జరుగుతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. రెండవ పెద్ద అంశం, ‘నష్టం మరియు హాని’. పేద దేశాలు, వెనుకబడిన దేశాల మీద వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ ఉండడంతో భూగోళ కాలుష్యానికి కారక దేశాలు నష్ట పరిహారం అందించాలని చర్చలు జరుగుతున్నాయి. గత కాప్ 27 సమావేశంలో ఆఫ్రికన్ దేశాలు పట్టుబట్టి నష్టం మరియు హాని పరిహార నిధి ఏర్పాటును తీర్మానం చేశాయి. అటువంటి నిధిని ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఆ సమావేశ పురోగతిగా వర్ణించారు. ఈ కీలక నిర్ణయం తీసుకున్నా, దాని ఏర్పాటు విషయం దశలలో తేలాల్సి ఉంది. ఇప్పటికే గత ఏడాది నుంచి ఈ విషయం మీద సమావేశాలు జరుగు తున్నాయి. పురోగతి ఆశాజనకంగానే ఉన్నది. కర్బన ఉద్గారాల వల్ల భౌగోళిక కాలుష్యం పెరిగి, సగటు ఉష్ణోగ్రత పెరిగి, వాతావరణ మార్పులు జరిగి నష్టపోతున్న దేశాలు, ప్రాంతాలు వాటిని ఎదుర్కొనే ప్రతి చర్యల మీద నిధులు సొంతంగా పెట్టుకునే సామర్థ్యం లేక ఈ ప్రపంచ నిధి గురించి ఆలోచించాయి. భారత దేశంలో ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో విపరీత వర్షాల వల్ల నదీ ప్రవాహం పెరిగి కొన్ని ఆనకట్టలు కొట్టుకుపోయి జరిగిన ఆస్తి నష్టం అంచనా లక్ష కోట్ల రూపాయలు. ఇటువంటి నష్ట భర్తీకి, పునర్నిర్మాణానికి సొమ్ములు ప్రపంచ నిధి నుంచి ఇవ్వాలని ఆశిస్తున్నారు. కానీ ఆ నిధికి డబ్బులు ఎవరు, ఎంత ఇవ్వాలి అనే విషయం నుంచి ఎవరికి, ఏ విధంగా,ఎంత ఇవ్వాలి అనే వరకు చర్చలు జరుగుతున్నాయి. అన్ని ప్రాథమిక దశలోనే ఉన్నాయి. నష్ట పరిహార నిధి పూర్తి స్థాయి ఏర్పాటుకు కనీసం 5 ఏళ్లు పడుతుందని అంచనా. వేగంగా నిర్ణయించాలని పేద దేశాల ఆకాంక్ష. ధనిక దేశాలకు ఈ నిధి ఏర్పాటు ఇష్టం లేదు. అది తమ ఆర్థిక రంగం మీద భారం అవుతుంది అని వారి భావన. ఆహార, ఆరోగ్యాలపై ప్రభావం 2023 అంతటా వివిధ రూపాల్లో (రెండవ గ్లాస్గో సంభాషణ, ప్రత్యేక వర్క్ షాప్‌లు, మంత్రుల సంప్రదింపులతో సహా) దీనిపై చర్చలు జరిగాయి. కాల పరిమితులతో కూడిన లక్ష్యసాధన, అర్హత ప్రమాణాలు, ఆర్థిక వనరులు వంటి విషయాలపైన ఆలోచనలను రూపొందించడానికి ఒక పరివర్తన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ పని చిన్నదేమీ కాదు. గ్రీన్ క్లైమేట్ ఫండ్ పూర్తిస్థాయిలో పనిచేయడానికి ఐదేళ్లు పట్టింది. పరివర్తన కమిటీ పని తీరును పరిశీలిస్తే, పరిష్కరించ వలసిన సాంకేతిక అంశాలు మాత్రమే కాకుండా, విభేదాలను పరిష్క రించడానికి రాజకీయ మార్గదర్శకత్వం అవసరమని తెలుస్తుంది. యూఎన్ఎఫ్సీసీసీ కన్వెన్షన్, క్యోటో ప్రోటోకాల్, ప్యారిస్ ఒప్పందం, ఎస్బీఐ, ఎస్బీఎస్టీఏలకు సంబంధించిన ఐదు భారీ అంశాలతో పాటు అనేక ఇతర సమస్యలను కాప్ 28 ప్రస్తావించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాప్ 28 సమావేశ అధ్యక్ష (యూఏఈ) పాత్ర కీలకం అని భావిస్తున్నారు. ప్రత్యేకంగా శిలాజ ఇంధనాల ఉత్పత్తిని ఎలా పరిష్కరిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. వాతావరణ మార్పులకు, ఆహారం, ఆరోగ్యానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అర్థం చేసుకుని, తగిన చర్యల మీద దృష్టి పెంచడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. స్థూలంగా, వాతావరణ మార్పుల సదస్సు అంటే కేవలం చెట్లు, అడవులు, కాలుష్యం గురించే కాదు. ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ అభివృద్ధి విధానాలు, ఆర్థిక విధానాలు, ఉత్పత్తి పద్ధతులు, జీవన శైలి మార్పులతో సహా సమస్త మానవాళి చర్యల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇందులో సామాజిక న్యాయం, సమానత్వం, సహకారం, గౌరవం, మానవ హక్కులు వంటి సూత్రాలు విధిగా ఉంటాయి. భారతదేశం పాత్ర భారతదేశం వహించే పాత్ర కూడా అనేక అంతర్జాతీయ సమావేశాల మాదిరిగానే కాప్ 28 సదస్సులో కూడా ముఖ్యమైన అంశంగా మారుతున్నది. నిర్ణయాలు తీసుకోవడానికి, ఏకాభిప్రాయ సాధనకు, అంతర్గతంగా ఎదురు అవుతున్న ప్రకృతిపరమైన నష్టాలకు భారత ప్రతినిధి వర్గం పని తీరును కూడా నిశితంగా గమనించాల్సి ఉన్నది. ఈ ప్రతినిధి వర్గంలో ఎవరు ఉంటారు, వారికి ప్రభుత్వం ఇచ్చిన సందేశం లేదా ఆదేశాలు ఏమిటి అని మీడియా ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా, ధనిక దేశాలు, పేద దేశాల మధ్య వారధిగా, అమెరికా దేశాల కూటమికీ, రష్యా, చైనా దేశాల కూటమికీ మధ్య కీలకంగా పరిణమించిన భారత్ ఈ సదస్సులో వ్యవహరించే తీరు మీద ఆసక్తి ఉన్నది. ‘అభివృద్ధి’ మార్గం వివాదస్పదం అవుతున్న సందర్భంలో, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, పేదరికం, అనారోగ్యం,ఆకలి వంటి అంశాలను పరిష్కరించే వివిధ మార్గాలు, చర్యలు కూడా అంతర్జాతీయ పరిణామాల ప్రభావానికి లోను అవుతున్నాయి. కాబట్టి అక్కడ జరిగేది వేరు, మనకు సంబంధం లేదు అనుకోవడానికి వీలు లేదు. మన రాజకీయ వ్యవస్థ, ప్రధానంగా రాజకీయ నాయకులు ఈ అంశాల మీద తమ పరిజ్ఞానం పెంచుకుంటేబాగుంటుంది. దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు -
మనుషులకు తోకలు ఎలా మాయమైపోయాయి?
కోతి నుంచి రూపాంతరం చెంది మనిషిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల ఏళ్ల మార్పు తర్వాత.. నేటి ఆధునిక మనిషిగా మార్పు చెందాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్యాప్‌లో చాలా మార్పులు జరిగాయి. అందులో ఒక ముఖ్యమైనది.. మనిషికి ఉన్న తోక మాయమైపోవడం! అవును.. తొలినాళ్లలో మనుషులకు తోకలు కూడా ఉండేవని.. పరిణామ క్రమంలో కొద్ది కొద్దిగా తోక మాయమైపోయింది. మరి ఆ తోక ఎప్పుడు మాయమైపోయిందో సరిగ్గా ఎవరికి తెలీదు.. ఈ విషయమే ఇప్పుడు తెలుసుకుందాం!. దాదాపుగా ప్రతీ జంతువుకూ, పక్షికీ తోక ఉంటుంది. వాటి శరీర నిర్మాణాన్ని బట్టి.. అవి పలు రకాలుగా ఉంటాయి. మనలో చాలా మందికి.. ఆ తోక గురించి తెలుసు తప్ప, అది ఎంతగా ఉపయోగ పడుతుందో తెలియదు. ఒక పక్షి ఆకాశంలో అలుపు లేకుండా ఎంతదూరమైనా ప్రయాణించడానికి కేవలం రెక్కలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. ఖచ్చితంగా తోక కూడా ఉండాల్సిందే. లేదంటే.. వేగమే కాదు సరిగా ఎగరలేవు కూడా. నీటిలోని చేప సంగతి చూస్తే.. వాయువేగంతో ప్రయాణించే మీనాలకు తోకే ప్రధాన ఆధారం. ఉన్నట్టుండి ఏ టర్న్ తీసుకోవాలన్నా కూడా తోకే కీలకం.ఇక నాలుగు కాళ్ల జంతువులన్నీ.. పరిగెత్తాలన్నా.. నడవాలన్నా.. వాటి గమనాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి తోక ఎంతో సాయం చేస్తోంది. ఇక కొన్ని తేళ్లు, పాము వంటి విషపూరిత జీవులకు ఆ తోకే రక్షణ ఆయుధంలా పనిచేస్తుంది. అలాంటి తోకలు తొలుత మానవులకు కూడా ఉండేది. కానీ కాలక్రమేణ అది అదృశ్యమైపోయింది. ఇది ఎలా జరిగింద? ఎందువల్ల అనేది శాస్త్రవేత్తల మదిని తొలిచే ప్రశ్న. అందుకోసం ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 25 మిలియన్ల ఏళ్లక్రితం మానవులకు తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీని గురించి అప్పట్లో చార్లెస్డార్విన్ ఇచ్చిన వివరణ పెద్ద విప్లవంగా మారింది. ఒక్కసారిగా అందరీ దృష్టి ఈ దిశగా అడుగులు వేసేలా చేసి, పరిశోధనలు చేసేందుకు నాంది పలికింది. కానీ తోక ఎలా కనుమరుగైందనేది చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు జియా అనే శాస్త్రవేత్త చేసిన పరిశోధన వివరణాత్మక సమాధానం ఇచ్చింది. మానవ పిండం తొలి దశలో తోకలా ఉండి ఆ తర్వాత అది నెమ్మదిగా చీల్చుకుంటూ వెన్నుపూస, కండారాలుగా ఏర్పడతాయని అన్నారు. ఆ క్రమంలో వచ్చే జన్యు మార్పులను గమనించారు. అలాగే తోకలు అభివృద్ధి చేసే జంతువుల జన్యవులో, తోకలేని మనిషి జన్యవులోనూ టీబీఎక్స్‌టీ అనే కామన్ జన్యు క్రమాన్ని గుర్తించారు. దీనిలో వచ్చే మార్పులు కారణంగానే తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీన్ని జన్యుమ్యుటేషన్గా పేర్కొన్నారు. ఈ టీబీఎక్స్టీని జన్యుమ్యుటేషన్ని ఎలుకల్లో ప్రవేశ పెట్టగా వాటికి పుట్టిన సంతానంలో చాలా వరకు ఎలుకలు తోకను అభివృద్ధి చేయలేకపోయాయి. కొన్నింటికి చిన్నగానే ఉండిపోయింది తోక. ఈ జన్యు ఉత్పరివర్తనాల మ్యుటేషన్‌ను దాని తరువాత తరానికి పంపుతూ ఉంటుంది ఆ క్రమంలోనే తోకలు పూర్తిగా అదృశ్యమవుతాయని సవివరంగా వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?) -
130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి !అందుకు ఆ గుహ..
ఆదిమానవులు ఉనికి ఉందని ఎప్పటి నుంచే చెబుతూనే ఉన్నారు చరిత్రకారులు. అందుకు చారిత్రక ఆధారాలు ఏమిటి అనేదాని గురించి పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్రాచీన యుగంలో క్రీస్తూ పూరం 1300 ఏళ్ల క్రితం అని అంచనాలు వేసి చెప్పేరే గానీ అందుకు కచ్చితమైన ఆధారాలు లేకపోయాయి. తవ్వకాల్లో వారి ఉనికి ఉందని చెప్పే పనిమూట్లు, వారికి సంబంధించిన మానవ ఎముకల ఆధారంగా చెప్పడం జరిగింది. దీని గురించి ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న శాస్రతవేత్తల కృషి ఇప్పటికీ ఫలించింది. మానువులు ఎప్పటి నుంచి ఉన్నారు. ఆ తర్వాత నిష్క్రమించి ఎటు వెళ్లారనే వాటి గురించి వెలుగులోకి వచ్చిన ఆధారాలను చూసి పరిశోధకులే కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే..గ్రీస్‌లోని థెస్సాలీలోని మధ్య గ్రీకు ప్రాంతంలో థియోపెట్రా అనే గుహ వద్ద పురావస్తు శాఖ ఎన్నో ఏళ్లుగా తవ్వకాల్లో జరిపింది. ఆ తవ్వకాల్లో ఆ గుహ మానవజాతి మూలాలను గూర్చి వెల్లడించింది. ఆ తవ్వకాల్లో అనేక మనుషుల ఎముకలు, వారు ఉపయోగించిన రాతి పనిముట్లు, జంతువుల ఎముకలు, పూరాత మానవ నిర్మిత నిర్మాణాలను కనుగొన్నారు. 13 వేల ఏళ్ల క్రితం నుంచే మానువులు ఉన్నారని రేడియో కార్బన్ ఆధారాలు చెబతున్నాయి. వారిలో నియాండర్తల్‌లు అనే మానవ జాతి ఉనికిలో ఉన్న నాటి మానవ జాతుల్లో ఒకటని చెప్పారు. వారు బలిష్టంగా కండలు తిరిగి ఉండేవారని, విచిత్రంమైన కనుబొమ్మలు, పొడుచుకుని వచ్చినట్లు ముక్కులు కలిగి ఉండేవారని తెలిపారు. ఈ నియాండర్తల్‌లు మానవులు జీవించే విధానం కంటే భిన్నంగా జీవితాన్ని గడిపేవారని అన్నారు. కొన్ని రకాల అడవి జంతువులను వేటాడేవారని, తమను తాము రక్షించుకునేందుకు కఠినమైన గుహ వాతావరణంలో జీవించేవారని అన్నారు. ఐరోపా అంతటా ఉన్న గుహల్లో ఉండేవారని పరిశోధనలో వెల్లడించారు. అంతేగాదు థియో పెట్రా గుహ మానవ నిర్మిత ప్రదేశంలో ఇదే ఒకటిగా పేర్కొన్నారు. ఇక్కడ నుంచి మానవులు సుమారు 50 వేల ఏళ్ల క్రితం నుంచి నిష్క్రమించారని తెలిపారు. 1987 నుంచి తప్పకాలు.. ఈ గుహ ఒక లోయ పైన సుమారు వంద మీటర్లు(330 అడుగులు) వరకు విస్తరించి ఉందని చెప్పారు. దీన్ని థియోపెట్రా రాక్ అని పిలేచే వారని, ఇక్కడ సున్నపురాయి కొండ ఈశాన్యవాలు చూడవచ్చని చెప్పారు. ఈ గుహకు సమీపంలో పినయోస్ నదికి చెందిన లెథాయోస్ నది ప్రవహిస్తుంది. ఇక పురావస్తు శాఖ అధికారులు 1987 నుంచి ఈ గుహ వద్ద తవ్వకాలు జరపడం ప్రారంభించారు. అలా 2007వరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో అనేక విశేషమైన ఆవిష్కరణలు జరిగాయి. పురావస్తు పరిశోధన మొదట ప్రారంభించినప్పుడూ థియోపెట్రా గుహా స్థానిక గొర్రెల కాపరులు తమ జంతువులును ఉంచడానికి తాత్కాలిక ఆశ్రయంగా ఉపయోగించేవారని భావించారు. కానీ ఈ గుహ తవ్వేకొద్ది ఆధ్యాంతం కొంగొత్త విషయాలను వెల్లడించింది. ఇందులో బయటపడ్డ అవక్షేపాలన్నీ ఆసక్తికలిగించే సరికొత్త విషయాలను తెలియజేశాయి. ( చదవండి: అర్జున బెరడు గురించి విన్నారా? సైన్సు ఏం చెబుతుందంటే..) -
9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి మాయమైందట!
దాదాపు 9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి ఉన్నపళాన తుడిచిపెట్టుకుపోయిందట. చివరి మంచు యుగం తుదినాళ్లలో చోటు చేసుకున్న విపరీతమైన వాతావరణ మార్పులే ఇందుకు కారణంగా నిలిచాయని అంతర్జాతీయ అధ్యయనం ఒకటే తాజాగా తేలి్చంది. అయితే నేటి ఆధునిక మానవుని పూరీ్వకులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి కూడా ఈ మహా ఉత్పాతం పరోక్షంగా కారణమైందని చెబుతోంది. చాన్నాళ్ల క్రితం. అంటే దాదాపు 9.3 లక్షల నుంచి 8.13 లక్షల ఏళ్ల క్రితం. పర్యావరణ పరంగా భూమ్మీద కనీ వినీ ఎరుగని ఉత్పాతం సంభవించింది. ఈ మహోత్పాతం వల్ల అప్పటి జనాభాలో ఏకంగా 98.9 శాతం తుడిచిపెట్టుకుపోయిందట. దాని బారినుంచి కేవలం 1,300 మంది మాత్రమే బతికి బట్టకట్టారట. మన పూరీ్వకులైన హోమోసెపియన్లు వీరినుంచే పుట్టుకొచ్చారట. చివరి మంచు యుగపు తుది నాళ్లలో ఈ పెను ఉత్పాతం జరిగింది. అధ్యయనం ఇలా... ► రోమ్‌లోని సపియెంజా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారెన్స్ నిపుణులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ► ఆ యుగంలో జరిగిన తీవ్ర వాతావరణ మార్పులు మానవ జాతి వినాశనానికి కారణంగా మారినట్టు వారు తేల్చారు. ► అధ్యయనం కోసం 50కు పైగా విభిన్న దేశాలకు చెందిన 3,154 మంది సంపూర్ణ జన్యుక్రమాలను లోతుగా విశ్లేíÙంచారు. ► ఇందుకోసం ఫిట్ కోల్ అనే సరికొత్త బయో ఇన్ఫర్మాటిక్స్ పద్ధతిని అనుసరించారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంత ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► జెనెటిక్ బాటిల్ నెక్‌గా పిలుస్తున్న ఈ మహోత్పాతానికి నాటి మంచు యుగ సంధి సందర్భంగా చోటు చేసుకున్న తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తేలింది. ► ఆ దెబ్బకు నేటి ఆఫ్రికా ఖండమంతా ఎండిపోయి మరు భూమిగా మారిందట. ► మానవులతో పాటు ఏనుగుల వంటి భారీ క్షీరదాలన్నీ దాదాపుగా అంతరించాయట. ► ఆ దెబ్బకు దాదాపు 3 లక్షల ఏళ్ల పాటు మానవ ఉనికి ఉందా లేదా అన్నంత తక్కువ స్థాయికి పడిపోయిందట. ► ఆ సమయం నాటి శిలాజాల్లో మానవ అవశేషాలు అసలే దొరక్కపోవడం కూడా దీన్ని ధ్రువీకరిస్తోంది. ► ఈ అధ్యయన వివరాలు జర్నల్ సైన్స్‌లో పబ్లిష్ అయ్యాయి. ‘నాటి మంచు యుగపు మహోత్పాతం మానవ వికాసంలో ఒక రకంగా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. తదనంతరం పుట్టుకొచ్చిన ఆదిమ మానవ సంతతే ఆఫ్రికా నుంచి యురేషియాకేసి విస్తరించింది. ఈ విస్తరణ ఆఫ్రికాలో హోమోసెపియన్లు, యూరప్‌లో నియాండర్తల్, ఆసియాలో దేనిసోవన్ల ఆవిర్భావానికి కారణమైంది‘ – ఫాబియో డీ విన్సెంజో – నేషనల్ డెస్క్, సాక్షి -
అంగారక గ్రహంపై "కాలనీ"..ఎంతమంది మనుషులు కావాలంటే..
అంగారక గ్రహంపై మానవుని ఆవాసానికి యోగ్యమైనదా? కాదా అనే దానిపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ నీటి జాడలు ఉన్నాయా లేదా ఒక వేళ ఉండాల్సి వచ్చినా అనువుగా ఉంటుందా లేదా అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనులు చేశారు. ఆ క్రమంలో శాస్త్రవేత్తలు తాజగా ఆ గ్రహంపై ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ వెల్లడించారు. జార్జ్ మాసన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మార్స్‌పై కాలనీని 22 మంది వ్యోమగాములతో నిర్మించొచ్చు అని పేర్కొన్నారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకునేలా ఎంతమంది వ్యక్తులు ఉండొచ్చొ కూడా చెప్పారు. తాము ఎన్నో యేళ్లుగా చేస్తున్న అధ్యయనాల్లో.. మానవ స్థావరాన్ని నిర్మించడం చాలా క్లిష్టమైన ఇంజనీరింగ్ సమస్య అని తేలిందన్నారు. వనరులు పరిమితంగా ఉన్నందునన ఈ గ్రహంపై ఆవాసం నిర్మించడం అనేది సవాలుతో కూడినది. అయితే అక్కడ ఎంతమంది వ్యోమోగాములు ఆవాసాలను నిర్మించగలరు, ఎంతమంది ఉండొచ్చు అనేదానిపై పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనాల్లో దాదాపు 22 మంది వ్యోమగాములతో కాలనీ నిర్మించొచ్చని, అలాగే సుమారు 100 నుంచి 500 మంది దాక ఉండొచ్చని గుర్తించారు. దీనివల్ల భవిష్యత్తులో వలసవాద సమస్య గానీ, మానవ వికృతి ప్రవర్తనకు సంబంధించిన సవాళ్లు గానీ ఎదరయ్యే అవకాశం ఉందని పరిశోధకులు గట్టిగా హెచ్చరించారు. అంగారక గ్రహంపై ఏ ప్రాంతంలో కాలనీలు నిర్మించాలనే దాని గురించి కూడా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రహంపై మానవ మనుగడను అంచనా వేసేందుకు ఏజెంట్-బేస్డ్ మోడలింగ్ అనే కంప్యూటర్ అనుకరణను ఉపయోగించారు. అక్కడ ఒత్తిడితో కూడిన వాతావరణాన్ని తట్టుకుని జీవించగలిగే మానవుల మనసతత్వాలను గూర్చి కూడా ఈ కంప్యూటర్ వెల్లడించింది. "న్యూరోటిక్" మనస్తత్వం కలవారు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉండగా, "పరిస్థితులను అంగీకరించదగిన" వ్యక్తిత్వ గల వ్యక్తులు అక్కడ ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని తమ పరిశోధనల్లో గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం..ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఉత్కంఠ! వీడియో వైరల్) -
Heavy Rains : చెత్తనంతా తిరిగిచ్చి.. లెక్క సరిచేసి"నది"..
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో కురిసిన వర్షాలకు ఆయా ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి వరద ఉధృతమైంది. దీంతో ఒక నదిలోని ప్లాస్టిక్ మొత్తం అక్కడున్న బ్రిడ్జి మీద పేరుకుపోవడంతో ఆ చెత్తనంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఐ.ఎఫ్.ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే బాగా వైరల్ అయ్యి లక్షల మందికి చేరింది. కొద్దిరోజులుగా వర్షాలతోనూ, వరదలతోనూ ఉత్తరాది మొత్తం అతలాకుతలమైంది. కొన్ని ప్రాంతాల్లో గతమెన్నడూ లేనంత భారీగా వర్షాలు పడగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉధృతంగా వరదలు కూడా వచ్చాయి. ఈ వరదల్లో మనుషులు నదుల్లో పారేసిన చెత్త మొత్తం తిరిగి భూమి మీదకు చేరింది. అలా ప్లాస్టిక్ చెత్త చేరిన ఒక బ్రిడ్జిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అక్కడి ఫారెస్టు అధికారి. దీనికి అందరినీ ఆలోచింపజేసే వ్యాఖ్యను జోడించి "ప్రకృతి -1, మనిషి-0.. మనం ఏదైతే ఇచ్చామో అది మొత్తం తిరిగి వచ్చేసింది.." అని రాశారు. నడవటానికి కూడా వీలు లేకుండా ఉన్న ఈ బ్రిడ్జి వీడియోకి నెటిజనుల నుంచి విశేష స్పందన తోపాటు వ్యంగ్యమైన కామెంట్లు కూడా వచ్చాయి. ప్రకృతి ఎప్పుడూ మనుషుల ఋణం ఉంచుకోదని, ఎప్పుడు లెక్క అప్పుడే సరిచేస్తుందని.. ఎప్పటికైనా మనిషిపై ప్రకృతిదే పైచేయని రాశారు. Nature - 1, Humans - 0. River has thrown all the trash back at us. Received as forward. pic.twitter.com/wHgIhuPTCL — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 11, 2023 ఇది కూడా చదవండి: మహిళని ఎత్తి అవతలకు విసిరేసిన బౌన్సర్లు.. -
సహృదయం.. సామరస్యం.. ద్వేష రాహిత్యం
ఏ దేశంలో అయినా, ఏ సమాజంలో అయినా, ఏ కాలంలో అయినా మానవుల్లో ఉండాల్సినవి ఏవి? సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం ఇవి ప్రపంచ మానవుల్లో ఉండాల్సినవి. మానవులు క్షేమంగా ఉండాలంటే ఉండి తీరాల్సినవి ఇవే. అదేంటో మానవ చరిత్ర మొదలు అయినప్పటి నుంచీ ఇవి ఉండాల్సినంతగా, ఉండాల్సినట్టుగా ఉండడం లేదు. అందువల్లే మానవులకు శాంతి, భద్రతలు కరువైపోయాయి. ఈ దుస్థితి ఇకనైనా మారాలి; ఇకపైనైనా మనిషి వల్ల మనిషికి కలుగుతున్న ముప్పుకు ముగింపు రావాలి; మనకు సుస్థితి సమకూడాలి. అథర్వ వేదపాఠం అయిన సాంమనస్య సూక్తం ఎప్పటి నుంచో ‘సహృదయం సాంమనస్యం అవిద్వేషం కృణోమి వః’ అనీ, ‘అన్యో అన్యమభి హర్యత వత్సం జాతమివాఘ్న్యా’ అనీ ఘోషిస్తూనే లేదా చాటిస్తూనే ఉంది. అంటే సహృదయులుగానూ, సామరస్యంతోనూ లేదా ఏకమనస్కులుగానూ, ద్వేషరహితులుగానూ మిమ్మల్ని రూపొందిస్తాను అనీ, అపుడే పుట్టిన దూడను తల్లి ఆవు ప్రేమించేట్టుగా పరస్పరం ప్రేమించుకోవాలి అనీ అర్థం. ఈ మాటల్ని మనం అర్థం చేసుకోనేలేదు. అందుకే మనలో అపాయం అతిగా వ్యాపిస్తూనే ఉంది. ఈ పరిస్థితిని మనం వెనువెంటనే పరిష్కరించుకోవాలి. ప్రపంచం, దేశం, సమాజం వీటికి తొలిదశ ఇల్లు. ఒక ఇంట్లోని వ్యక్తుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘అనువ్రతః పితుః పుత్రో మాత్రా భవతు సంమనాః‘ అనీ, ‘జాయా పత్యే మధుమతీమ్ వాచమ్ వదతు శాన్తివామ్‘ అనీ చెబుతోంది. అంటే ఒక కొడుకు తన తండ్రిని అనుసరించే వాడుగానూ, తన తల్లితో సామరస్యంతోనూ ఉండాలి, భార్య భర్తతో మధురమైనదై ప్రశాంతతను ఇచ్చే మాటల్ని చెప్పనీ అని అర్థం. ఒకరిని ఒకరు వెన్నంటి ఉండడం, ప్రశాంతత, హితవచనం ఇవి ఇంటి నుంచే మొదలు అవ్వాలి. ద్వేషరాహిత్యం అన్నది కూడా ఇంటి నుంచే రావాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘మా భ్రాతా భ్రాతరం దదిక్షన్మా స్వసారముత స్వసా’ అనీ, సమ్యఞ్చః సవ్రతా భూత్వా వాచం వదత భద్రయా’ అనీ చెబుతోంది. అంటే సోదరీ సోదరులు ద్వేషించుకోకూడదు, కలిసికట్టుగా పనిచెయ్యండి, అందరూ శుభం కలిగించే మాటల్ని పలకండి అని అర్థం. అభిప్రాయ భేదాలతో ఒక ఇంట్లోని సభ్యులు పరస్పరం ద్వేషించుకుంటూ విడిపోవడం కాదు ఉమ్మడిగా ఉండడానికి వాళ్ల మధ్య అవగాహన ఉండాలి అని తెలియజేస్తూ సాంమనస్య సూక్తం ‘యేన దేవా న వియన్తి నో చ విద్విషతే మిథః’ అనీ,‘తత్ కృణ్మో బ్రహ్మ వో గృహే సంజ్ఞానం పురుషేభ్యః’ అనీ చెబుతోంది. అంటే దేనివల్ల దేవతలు విడిపోరో, ద్వేషించుకోరో అవగాహన అన్న ఆ ఉన్నతమైన భావన ఇంట్లోని సభ్యుల్లో ఉండాలి అని అర్థం. సంజ్ఞానం లేదా అవగాహన మనకు ఉండి తీరాలి. చిన్నవాళ్లు పెద్దలను వెన్నంటి వెళుతున్నట్టుగా ఒకరికి ఒకరై ఏకమనస్కులుగా, సామూహిక ఆరాధన చేసేవాళ్లుగా, పరస్పరం ప్రీతితో మాట్లాడుకునేవాళ్లుగా కలిసి మెలిసి బతకండి అని సూచిస్తూ ‘జాయస్వన్తశ్చిత్తినో మా వి యౌష్ట సమారాధయన్తః సధురాశ్చరన్తః’ అని సాంమనస్య సూక్తం మనకు చెబుతోంది. అంతేకాదు ప్రేమ అనే తాడుతో అందరూ కట్టబడాలి అన్న సూచ్య అర్థం వచ్చేట్టుగా ‘సమానే యోక్త్రే సహ వో యునజ్మి’ అనీ, ‘దేవా ఇవామృతమ్ రక్షమాణాః సాయం ప్రాతః సౌమనసో వో అస్తు‘ అంటూ దేవతలు అమృతాన్ని రక్షిస్తున్నట్టుగా ఉదయ, సాయం కాలాల్లో సద్భావనల్ని రక్షించండి అనీ చెబుతోంది సాంమనస్య సూక్తం. సాంమనస్య సూక్తం చేసిన ఈ సూచనను అందుకుని సద్భావనల్ని రక్షించుకుంటూ మనల్ని మనం రక్షించుకోవాలి; ఆపై మనం రాణించాలి. ‘భారతీయ వైదిక సాహిత్యం సహృదయత, సామరస్యం, ద్వేషరాహిత్యం వీటితో మానవులు మెలగాలని ప్రగాఢంగా ప్రవచించింది. దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరణలోకి తెచ్చుకోవాలి. అది జరగకపోతే మన జీవితాలు అనర్థ దాయకమూ, అల్లకల్లోలమూ అయిపోతాయి‘. – రోచిష్మాన్ -
రాక్షస బల్లులతో మానవులకు స్వల్పకాలిక పరిచయం
లండన్: భూమిపై మనుషులతో సహా పలు రకాల క్షీరదాలు ఒకప్పుడు రాక్షస బల్లులతో(డైనోసార్లు) కలిసి జీవించినట్లు ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడయ్యింది. క్షీరదాల శిలాజాల పరీక్ష ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. దాదాపు 6.60 కోట్ల ఏళ్ల క్రితం బలమైన గ్రహ శకలం భూమిని ఢీకొట్టడంతో రాక్షస బల్లులు అంతమైనట్లు పరిశోధకులు ఇప్పటికే నిర్ధారించారు. అంతకంటే కొంత కాలం ముందే మనుషులతోపాటు కుందేళ్లు, శునకాలు, పిల్లులు, గబ్బిలాల వంటి క్షీరదాలు పరిణామ క్రమంలో భూమిపై ఆవిర్భవించాయి. అవి రాక్షస బల్లులతోపాటే మనుగడ సాగించాయని బ్రిస్టల్ సైంటిస్టులు తేల్చారు. ఈ అధ్యయనం వివరాలను కరెంట్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించారు. డైనోసార్లతో ప్రాచీన మానవుల పరిచయం ఎక్కువ కాలం కొనసాగలేదని వెల్లడయ్యింది. మానవులు ఆవిర్భవించిన కొంతకాలానికే డైనోసార్లు అంతం కావడమే ఇందుకు కారణం. భూమిపై జీవనం సాగించే విషయంలో డైనోసార్ల నుంచి ఎలాంటి పోటీ లేకపోవడంతో క్షీరదాలు విస్తృతంగా ఆవిర్భవించాయని, కాలానుగుణంగా వాటిలో వైవిధ్యం సైతం చోటుచేసుకుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. -
ఆధునిక మానవుని పుట్టుకపై అధ్యయనం..మనది ఒకే మూలం కాదట
ఆధునిక మానవుని మూలాలు ఎక్కడున్నాయి? ఆఫ్రికా అన్నది అందరూ చెప్పే సమాధానం. తొలి మానవులు అక్కడే పుట్టి, అక్కణ్నుంచే ప్రపంచమంతా వ్యాపించారని దశాబ్దాలుగా వింటూ వస్తున్నాం కూడా. అంతవరకూ నిజమే అయినా మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామన్న సిద్ధాంతం మాత్రం తప్పంటోంది ఓ తాజా అధ్యయనం. మన మూలాలు ఆఫ్రికాలోని కనీసం రెండు విభిన్న జాతుల్లో ఉన్నాయని చెబుతోంది. కనుక ఆధునిక మానవుని జన్మస్థలం ఫలానా అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేమన్నది దాని సారాంశం.. మన ఆవిర్భావానికి ఒకే మూలమంటూ లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. 10 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికావ్యాప్తంగా ఉనికిలో ఉన్న పలు ఆదిమ మానవ జాతులు హోమోసెపియన్గా పిలిచే ఆధునిక మానవుని పుట్టుకకు కారణమని అంటోంది. ‘‘ఆ కాలంలో ఆఫ్రికాలో నివసించి, క్రమంగా ఆ ఖండమంతటా వ్యాపించి పరస్పరం కలిసిపోయిన కనీసం రెండు ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూలం. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జన్యు డేటాను లోతుగా పరిశోధించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. దీని వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ‘‘మన ఆవిర్భావానికి కారకుడైన ఆదిమ మానవులు ఒకే జాతికి చెందిన వారని మానవ వికాసంపై దశాబ్దాలుగా జరిగిన పరిశోధనల్లో చాలావరకు చెప్పుకొచ్చాయి. వారు ఆఫ్రికాలో తొలుత చెట్లపై నివసించి, అనంతరం క్రమంగా నేల మీదికి దిగారన్నది వాటి సారాంశం. కానీ ఆఫ్రికావ్యాప్తంగా మానవ ఆవాసాలకు సంబంధించిన శిలాజ, పురాతత్వ రికార్డులు ఈ వాదనతో సరిపోలడం లేదు. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో సంచరించిన ఒకటికి మించిన ఆదిమ జాతులు వేలాది ఏళ్లపాటు పరస్పర వలసలు తదితరాల ద్వారా కలగలిసిపోయి క్రమంగా ఆధునిక మానవుని ఆవిర్భావానికి దారితీశాయన్నది మా పరిశోధనలో తేలింది. హేతుబద్ధంగా ఆలోచించినా ‘ఒకే మూలం’ సిద్ధాంతం కంటే ఇదే సమంజసంగా తోస్తోంది కూడా’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జెనెటిసిస్ట్ డాక్టర్ బ్రెన్నా హెన్ వివరించారు. ఆ ఆధారాలే ఉంటేనా...! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి మూలాలూ కచ్చితంగా 10 లక్షల ఏళ్ల నాటి ఈ రెండు ఆదిమ జాతుల్లోనే ఉన్నట్టు కచ్చితంగా చెప్పగలమని బృందం సభ్యుడైన విస్కాన్సిన్–మాడిసన్ వర్సిటీ పాపులేషన్ జెనెటిసిస్ట్ ఆరన్ రాగ్స్డేల్ అంటున్నారు. ఎలా చూసినా మనందరి జన్మస్థానం ఆఫ్రికా లోని ఒకే ప్రాంతమన్న వాదనకు కాలం చెల్లినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కాకపోతే 10 లక్షల ఏళ్ల నాటి మానవ శిలాజ తదితర జన్యు ఆధారాలేవీ ఇప్పటిదాకా మనకు దొరకలేదు. లేదంటే ఆధునిక మానవుని (హోమోసెపియన్) ఆవిర్భావం, విస్తరణ తదితరాలపై ఈ పాటికే మరింత స్పష్టత వచ్చేది’’ అన్నారాయన. ఇలా చేశారు... డాక్టర్ హెన్ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశల్లోని ప్రఖ్యాత సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఆఫ్రికాలోని పలు ప్రాంతాలకు చెందిన 290 మంది జన్యు అమరికను వారు లోతుగా విశ్లేషించారు. దాంతోపాటు ఆఫ్రికాలో ఉన్న భిన్న జాతుల వారి డీఎన్ఏను ఇందుకు ఎంచుకున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో సియెరా లియోన్‌లో నివసించే మెండే రైతు జాతి, ఇథియోపియాలో ఆదిమ వేటగాళ్ల నుంచి రూపాంతరం చెందిన గుముజ్ జాతి, అమ్హరాగా పిలిచే అక్కడి రైతులతో పాటు నమా అనే దక్షిణాఫ్రికాలోని వేటగాళ్ల సంతతి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటిలోని వైవిధ్యాన్ని బట్టి లక్షల ఏళ్ల క్రితం ఆ డీఎన్ఏలు ఎలా ఉండేవో, ఇన్నేళ్ల పరిణామక్రమంలో ఏ విధంగా మారుతూ వచ్చాయో అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా సిమ్యులేషన్ విధానంలో ఆవిష్కరిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా లభించిన అతి పురాతన మానవ శిలాజం (3 లక్షల ఏళ్ల నాటిది) ఆఫ్రికాకు చెందినదే. అంతేగాక అతి పురాతన రాతి పనిముట్లు కూడా అక్కడే దొరికాయి. ప్రధానంగా ఈ రెండింటి ఆధారంగానే ఆఫ్రికానే మన జన్మస్థానమని గత అధ్యయనాల్లో చాలావరకు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికావాసుల డీఎన్ఏను బ్రిటిష్ వారి డీఎన్ఏతోనూ, క్రొయేషియాలో దొరికిన దాదాపు 50 వేల ఏళ్ల నాటి మన పూర్వీకుడైన నియాండర్తల్ మానవుని డీఎన్ఏతోనూ పోల్చి చూశారు. ఆఫ్రికావ్యాప్తంగా ఒకటికి మించిన ఆదిమ జాతులు వేల ఏళ్ల క్రమంలో తమలో తాము కలిసిపోయిన ఫలితంగానే మనం పుట్టుకొచ్చామని తేల్చారు. కనీసం రెండు ప్రధాన ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూల కారకులని డాక్టర్ హెన్ సూత్రీకరించారు. వాటికి స్టెమ్1, స్టెమ్2గా పేరు పెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్రను మార్చడం ఏమార్చడమే!
చరిత్రను సృష్టించకపోయినా ఫరవాలేదు. కాని, దానికి మసిపూసి మారేడుకాయ చేయడం, లేదా అసలు పాఠ్యగ్రంథాల నుంచీ, చరిత్రపుస్తకాల నుంచీ తీసివేయడం కూడదు కదా! ఇవ్వాళ కేంద్ర పాలకులు ఈ దుశ్చర్యకు పూనుకున్నారు. ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ వంటి నినాదాలతో రాజకీయాలు చేస్తున్న పెద్దల మాటలు నీటి మూటలని కొన్ని చారిత్రక అంశాలు తేల్చి చెబుతున్నాయి. అందుకే వీరు తమ సిద్ధాంతాల డొల్లతనాన్ని బయటపెట్టే చారిత్రక అంశాలకు తిలోదకాలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. మానవ పరిణామ క్రమం, మొగలాయీ చక్రవర్తుల పాలనా కాలంలోని ఘట్టాలు వంటి అనేక అంశాలు ఆ విధంగా వీరి కత్తిరింపునకు బలయ్యాయి. భారతదేశంలో పాలకులు చరిత్రను వక్రీకరించాలనే దుర్వ్యూహాలు పన్నుతున్నారు. హిందు మతవాద భావజాలం ఆధారంగా చరిత్రను బోధించాలను కోవడం ఒక అసంబద్ధ చర్యే అవుతుంది. క్రీస్తు పూర్వం 7000 నుంచి 1500 మధ్యలో ఆవిర్భవించిన వైదిక సాహిత్యం... క్రీస్తు పూర్వం 50 వేల ఏళ్ల చరిత్రను కుదించి... భారతీయ మూలాలను దెబ్బతీసింది. రాతియుగాల నుంచీ మానవుడు నేటి ఆధునిక యుగాల వరకూ ఎలా పరిణామం చెందాడనేది మానవ మహాచరిత్రలో అందరూ తెలుసు కోవలసిన ముఖ్యమైన అంశం. ప్రస్తుతం మానవుడు ఉన్న స్థితికి... వందలు, వేల తరాల మానవులు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విజ్ఞానం, దాని ఆధారంగా చేసిన ఆవిష్కరణలు ఎలా కారణమయ్యా యనేది మానవ భవిష్యత్ గమనానికి అద్భుతమైన పాఠం. కానీ ఇవ్వాళ ఇంతటి ప్రాముఖ్యం ఉన్న మానవ పరిణామ క్రమాన్నీ, ఇతర చారిత్రక అంశాలనూ ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సంస్కృత భాషా గ్రంథాల్లో చేసిన కృత్రిమ కల్పనలు, వ్యుత్ప త్తులు, నీచార్థాల ద్వారా భారతీయ మూలవాసుల సాంస్కృతిక మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగాయి. సామర్థ్యమూ, శాంతి, సమన్వయము ప్రేమతో కూడిన మూలవాసుల భావనలను ధ్వంసం చేసే క్రమంలో బీభత్స, భయానక రసాలకు ఎక్కువ ప్రాధా న్యత ఇస్తూ చాలా చరిత్ర వక్రీకరణకు గురయ్యింది. భారతదేశానికి ఆర్యుల రాక ముందటి చరిత్ర భారతీయ మూలవాసులదీ, దళితులదీ అని హిందూవాద రచయితలకు తెలుసు. అయినా దాని ప్రస్తావన చరిత్ర రచనలో రానివ్వడం లేదు. చరిత్ర నిర్మాణానికి అవసరమైన పరికరాలనూ, ఆధారాలనూ పరిగణనలోకి తీసుకోకపోవడం సరి కాదు. చరిత్రతో మానవ పరిణామానికి, పురాతత్త్వ శాస్త్రానికి, శాసనా లకు, నాణేలకు ఉన్న అనుబంధాన్ని నిరాకరించి నెట్టివేయడం చారి త్రక ద్రోహమే. ఇప్పుడు పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని అంశాలను తొలగించడాన్ని ఈ కోణంలోనే చూడాలి. భారతదేశ చరిత్ర, సంస్కృతులను నిర్మించడంలో పురావస్తు శాస్త్రానిది తిరుగులేని పాత్ర. 19వ శతాబ్దపు చతుర్ధ పాదంలో దేశంలో ఈ శాస్త్రం అడుగిడింది. ఎందరో ప్రముఖులైన బ్రిటిష్, పురాతత్వ వేత్తలు ఈ విజ్ఞానం అభివృద్ధి పొందటానికి ఎంతో తోడ్పడ్డారు. పురావస్తు శాస్త్రం వెలుగులో బయటపడ్డ కొత్త కొత్త మానవ అవశేషాలు, వాడిన పనిముట్లను ఆధారం చేసుకుని నాటి మనిషి ఆర్థిక, సామాజిక, విశ్వాస వ్యవస్థలను నిర్మిస్తూ వస్తున్నారు. అటువంటి చరిత్ర... మతాలు చెప్పే విషయాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే మత తత్త్వవాదులు తమకు ఇబ్బంది అనుకున్న అంశాలను పాఠాల నుండి, చరిత్ర గంథాల నుండి మాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాల నుంచి మానవ పరిణామ క్రమాన్ని తొలగించడం ఇందుకు మంచి ఉదాహరణ. ప్రసిద్ధ చరిత్రకారులు డీడీ కోశాంబి హిందూ పునరుద్ధరణ వాదం వల్ల వచ్చిన అనేక పరిణామాలను మన ముందుకు పరిశోధనాత్మకంగా తెచ్చారు. మూఢాచారాలు మానవ పరిణామాన్ని అడ్డుకుంటాయి అని చెప్పారు. వైదికవాదులు వ్యవసాయ సంస్కృతిని నిరసి స్తారు. కానీ వ్యవసాయం మీద వచ్చే అన్ని ఫలితాలు అనుభవిస్తారు. వాటిని దానం రూపంలో పొందుతారు. అయితే వ్యవసాయదారులను శూద్రులుగాను, వ్యవసాయ కూలీలగానూ, అతిశూద్రులు గానూ చూస్తారు. వీరు ఎంతో బౌద్ధ సాహిత్యాన్ని నాశనం చేశారు. బౌద్ధంలో దాగివున్న సమానతావాదం వీరికి వ్యతిరేకం. గుప్తుల కాలంలో అశ్వమేధ యాగాలతో క్రూరమైన హింస భారతదేశంలో కొనసాగింది. శూద్రులు, అతిశూద్రులు తీవ్ర వధకు గురయ్యారని ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని నిర్మించిన అశోకుని మానవతావాద పాలనాముద్రను చెరిపివేయాలని గుప్త వంశంలో ప్రసిద్ధుడైన సముద్ర గుప్తుడు ఎలా ప్రయత్నించాడో రొమిల్లా థాపర్ తన ‘భారతదేశ చరిత్ర’లో విశ్లేషణాత్మకంగా వివరించారు. ‘ఈ శాసనం అశోకుని ఇతర శాసనాలతో విభేదిస్తుంది. మౌర్యపాలకుడు, గుప్తులకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినా అతడు తన అధికారాన్ని అమలు పరచటంలో చాలా సాత్వికంగా ప్రవర్తించాడు.అశోకుడు దిగ్విజయ యాత్రను వదులుకుంటే, సముద్ర గుప్తుడు దిగ్విజయాలలో తేలియాడాడు. అతడు ఉత్తర రాజస్థాన్‌లోని చిన్న చిన్న రాజ్యాల అధికారాన్ని కూలద్రోశాడు. ఫలితంగా వాయవ్య భారతంపై హూణుల దండయాత్ర, చివరి గుప్త రాజులకు దురదృష్టకరంగా పరిణమించింది’. చరిత్రను వక్రీకరించాలనే ప్రయత్నం వలన భారతదేశ వ్యక్తి త్వానికి దెబ్బ తగులుతుందని తెలుసుకోలేక పోతున్నారు పాలకులు. ఇలా చేస్తే ఉత్పత్తి పరికరాలు కనిపెట్టిన దేశీయుల చరిత్ర మసక బారుతుంది. నదీ నదాలూ, కొండ కోనలూ, దట్టమైన అరణ్యాలూ, సారవంతమైన మైదానాలూ, చిట్టడవులూ... ఇలా విభిన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుకూలమైన జీవన పోరాట పద్ధతులు (స్ట్రాటజీస్)ను రూపొందించుకుని విభిన్న సాంస్కృతిక సమూహాలుగా జనం మనుగడ సాగించే క్రమంలో... అటువంటి సమూహాలను జయించి ఒకే రాజ్యంగానో, సామ్రాజ్యంగానో చేయాలని చేసిన ప్రయత్నాలు చరిత్రలో ఉన్నాయి. ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించినా... అదను చూసుకుని దేశీ సమూహాలు ఎక్కడి కక్కడ తిరుగుబాట్లు చేసి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. మొగలాయీల కాలం కావచ్చు, బ్రిటిష్ వాళ్ల కాలం కావచ్చు... మూలవాసులైన ఆదివాసుల తిరుగుబాట్లు ఎన్నో మనకు ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఈ చరిత్రను మరచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అనే నినాదాన్ని భుజానికి ఎత్తుకొని చరిత్రలోని ముఖ్యమైన ఘటనలను మాయం చేసే ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశ మూలవాసులు ఏ మతాధిపత్యానికి, కులాధి పత్యానికి లొంగలేదు. స్వతంత్ర ప్రతిపత్తితో జీవించారు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసంగానే మానవ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... అత్యధిక కాలం మనుగడ సాగించింది. చరిత్రకారుడు తారాచంద్ చెప్పినట్లు చరిత్ర అనేది అనేక వైవిధ్యాలను సమన్వయం చేస్తుంది. అంతేకాదు అనేక జాతులను, అనేక సంస్కృతులను, అనేక ధర్మాలను, అనేక వ్యక్తిత్వాలను, అనేక ప్రాంతాలను సమన్వయం చేస్తూ గమిస్తుంది. మొగల్ చక్రవర్తి అక్బర్ ఒక గొప్ప చక్రవర్తి. ఆయన చరిత్రను పాఠ్యాంశాల నుండి తొలగించినందువల్ల ఎంతో విలువైన చారిత్రక జ్ఞానాన్ని కోల్పోతాం. ఆయన కాలంలో భారతదేశంలో అనేకమైన మార్పులు జరిగాయి. అక్బరు పాలించిన సుదీర్ఘకాలంలో ఆయన ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మారుతూ వచ్చాడు. మొదట హిందూ రాజ్యాలపై కత్తి దూసిన అక్బర్... ఆ తరువాత హిందూ రాజ్యాలతో సమన్వయానికి ఎక్కువ పనిచేశాడు. ఇటువంటి రాజనీతిజ్ఞుడి పాఠం సిలబస్ నుంచి తీసివేస్తే విద్యార్థులకు భారత చరిత్రపై సరైన అవగాహన కలుగదు. నిజానికి అంబేద్కర్, మహాత్మాఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, ఝల్కారీ బాయి... ఇలా అనేక మంది సామాజిక విప్లవకారుల ప్రభావం దేశం మీద ఎంతో ఉంది. వారి జీవన చిత్రాలను కూడా మన చరిత్రలో ప్రజ్వలింపచేయాలి. అప్పుడే దేశానికి మేలు. ప్రతీ విద్యార్థికి చరిత్ర అనే వెలుగు దిక్సూచి అవుతుంది. చరిత్రను వాస్తవంగా అర్థం చేసుకున్నప్పుడే, భారతదేశాన్ని గానీ, ప్రపంచాన్ని గానీ, పునఃనిర్మించే పనిలో విద్యార్థులు, ప్రజలు విజేతలు అవుతారు. అందుకే చరిత్రను రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695 -
అమృత బిందువులు
♦ బాధల్ని మిగిల్చే బంధుత్వాల కంటే... ప్రశాంతతను ఇచ్చే ఒంటరితనం గొప్పది. అవసరాలకు పలకరించే పలకరింపుల కంటే... బాధల్ని తగ్గించే కన్నీళ్లే గొప్పవి. అవసరాల్ని తీర్చని ఆస్తుల కంటే... ఆకల్ని తీర్చే అన్నం గొప్పది. ♦ వయస్సు పెరిగే కొద్దీ సమాజంలో, మనిషి జీవితం ఆప్యాయతకి, మంచితనానికి చిరునామా, అలంకరణ కావాలి. కానీ, అహంకారానికి, ద్వేషానికి, గొడవలకు మూలం కాకూడదు. ♦ ఆశ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుంది. అత్యాశ అధఃపాతాళానికి దారితీస్తుంది. నిరాశ బతుకు మీద విరక్తిని పెంచుతుంది. ♦ సేవచేయడం, శ్రద్ధగా వినడం, గ్రహించడం, గుర్తుపెట్టుకోవడం, ఊహించడం, ΄పాటును సరిదిద్దడం, ప్రయోజనం కలిగించడం, తత్త్వజ్ఞానం అనే బుద్ధికున్న ఎనిమిది లక్షణాలు మానవుణ్ని మహోన్నతుడిగా కీర్తి శిఖరాలమీద కూర్చోబెడతాయి. ఇవే మహోన్నత మార్గాన మనిషిని నడిపిస్తాయి. ♦ నిన్నటి కన్నా నేడు మిన్నగా... నేటికన్నా మిన్నగా రేపు జీవించాలి. ♦ జీవితంలో వాస్తవం ఉండాలి. ఏం జరిగినా స్వీకరించే ధైర్యం ఉండాలి. ♦ మన జీవితాన్ని మనమే రూపు దిద్దుకోవాలి. -
గురువాణి: ఒక్క చెట్టు పెట్టు... పుణ్యం మూటకట్టు
చెట్టు అనేది ఎంత గొప్పది... ఒక మొక్క నాటడం, దానికి నీళ్ళు పోయడం, చెట్టయ్యేదాకా దానిని సంరక్షించడం... అది చెట్టుగా మారిననాడు అది నాటినవాడికి, పెంచినవాడికి, సంరక్షించినవాడికి ఎంత ఫలితం లభిస్తుందనే దానికి మన శాస్త్రాలు ఏమని చెబుతున్నాయంటే... లోకంలో శరీరం కలిగిన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. మనుష్యులే కానక్కరలేదు. శరీరం ఉన్న ప్రతి ప్రాణికీ దాని పోషణకు ఆహారం కావాలి. అది సమయానికి పడకపోతే ఆకలికి విలవిల్లాడిపోతాయి. ఆకలి గొప్ప బాధ.. క్షుత్ అగ్ని.. అది అగ్నిహోత్రం, మంట. ఆ మంట తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆకలేస్తే మొదట ఏది పోతుంది... ధర్మం. ఆకలేసిన వాడికి ధర్మ విచక్షణ ఉండదు. అయ్యా! నా ప్రాణం పోయినా సరే ధర్మాన్ని కాపాడతాను, ఏదీ దొంగిలించను అనడు కదా ! చివరకు తెగించి దొంగతనానికి పాల్పడి అయినా ఆ బాధ తీర్చుకుంటాడు. ఆ మంట అటువంటిది. దహించి వేస్తుంది. అందుకే ఆకలి అన్నది ఎక్కడా ఉండడానికి వీల్లేదు. మనుష్యులకే కాదు, సమస్త ప్రాణులకూ ఆహారం కావాలి. పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులు... ఆకలితో ఉన్న మనుష్యులకు వారి ఆర్తిని చూసి జాలిపడి ఎవరయినా ఆహారమిస్తారు.. వీటి ఆకలి ఎవరు తీరుస్తారు? చెట్టు. దానికి కాండం ఉంటుంది, ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, కాయలు, పళ్ళను కూడా ఇస్తుంది. దానిని ఆశ్రయించి మనుష్యులే కాదు, క్రిమికీటకాదులు, జంతువులు, పక్షులు తమ ఆకలిని తీర్చుకుంటాయి. దాని బెరడులో చేరిన వందలాది క్రిములు వాటి ఆకలిని అక్కడ తీర్చుకొంటాయి. జంతువులు ఆకులు తింటాయి. పక్షులు గూళ్ళు కట్టుకోవడమే కాక కాయలు, పండ్లు తింటాయి. కొన్ని చిగుళ్ళను తింటాయి. ఎన్నో రెక్కల పురుగులు దాని పూలమీద వాలి ఆకలి తీర్చుకుంటాయి. రాలిన కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు భూమిలో కలిసి అక్కడున్న ఎన్నో పురుగులకు ఆహారమవుతాయి. ఒక చెట్టు... ఒక్క చెట్టే ఇన్నింటికి జీవాధారమవుతున్నది. మొక్కనాటిన వాడు, చెట్టుగా చేసినవాడు తరువాత కాలంలో శరీరాన్ని వదిలివేయవచ్చు గాక. కానీ అసంఖ్యాకమైన జీవులకు కేవలం ఆకలి తీర్చడమే కాక, వాటి ప్రాణాలను కూడా నిలబెట్టాడు, ఎన్నో జీవులు సేదదీరడానికి కారణమయ్యాడు. చెట్టు ప్రాణవాయువు వదులుతుంది. ప్రకృతి సమతౌల్యతను కాపాడుతుంది. అది మనుష్యులతోపాటూ అనేక జీవులకు ప్రాణాధారంగా నిలబడుతుంది. అటువంటి మంచి పనికి కారణమయ్యాడు కనుక వాడికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. వారి శరీరం పతనమయిన తరువాత దేవతలు స్వాగతం పలికి వారిని ఉన్నత లోకాలకు తీసుకువెడతారట. అంతేకాదు ఎన్నో ప్రాణులకు కొన్ని సంవత్సరాల పాటు ఆకలిబాధ తీర్చాడు కనుక వారిని మేం సేవిస్తాం అని దేవతలు అంటారట. చెట్లను పెంచే పనిని ప్రోత్సహించడానికి, మనుషులు తమకే కాకుండా సమస్త జీవకోటిపట్ల బాధ్యతాయుతంగా మెలగడానికి, ప్రకృతి సమతుల్యత కాపాడేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన పూర్వీకులు‘‘యావంతి ఖాసంతి ఫలాని వృక్షాత్ క్షుద్వహ్ని దగ్ధా ...’’ అంటూ ఒక శ్లోకం ద్వారా చేసిన ధర్మబోధ ఇది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కీలక విషయాలు వెల్లడి.. 7,80,000 ఏళ్ల క్రితమే..
ఆది మానవుడు ఆహారాన్ని వండుకుని కాకుండా పచ్చిగానే తినేవాడని పుస్తకాల్లో చదువుకున్నాం. పచ్చిమాంసం, ఆకులు అలములు తిన్నట్లు కూడా చదువుకున్నాం. మానవుడు క్రమక్రమంగా పచ్చి ఆహారాన్ని కాకుండా వండుకుని తినడం నేర్చుకున్నాడు. అయితే, మానవుడు తొలిసారి వండుకున్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నాడో తెలుసా?! దాదాపు 7,80,000 ఏళ్ల క్రితం మానవుడు తొలిసారి ఆహారాన్ని వండుకున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని గెషర్ బెనోట్ యాకోవ్ ప్రాంతంలో దొరికిన వండిన చేప అవశేషాలపై అధ్యయనం చేయగా ఈ విషయం తెలిసింది. ఇప్పటివరకు మానవుడు తొలిసారి వండిన ఆహారం ఎప్పుడు తిన్నాడన్న దానిపై పలు అధ్యయనాలు జరిగాయి. అయితే, ఇప్పటిదాకా దొరికిన ఆధారాలను బట్టి 1,70,000 సంవత్సరాల క్రితం తొలిసారి వండిన ఆహారం తిన్నట్లు వెల్లడైంది. తాజాగా, టెల్ అవివ్ యూనివర్సిటీ, హెబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం, బార్–ఇలాన్ యూనివర్సిటీలు స్టీన్హార్డ్ మ్యూజియం ఆఫ్ నేచురల్‌హిస్టరీ, ఒరేనిమ్ అకడమిక్ కాలేజ్, ఇజ్రాయెల్ ఓషినోగ్రఫిక్ అండ్ లిమ్నోలాజికల్, లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం, మైన్జ్లోని జొహాన్నెస్ గుటెన్బర్గ్ యూనివర్సిటీలతో సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో దీనికి సంబంధించి తిరుగులేని విషయాలు వెల్లడయ్యాయి. 7,80,000 క్రితమే మానవులు మంటను నియంత్రిస్తూ ఆహారం వండినట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో ఇప్పటిదాకా వెల్లడైన అధ్యయనాల ఫలితాలకు తాజా అధ్యయనం తెరదించినట్లయింది. ఈ అధ్యయనానికి టెల్ అవివ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇరిట్ జొహర్ అనే పరిశోధకుడి నేతృత్వం వహించారు. ‘అన్ని రకాల పరికరాలున్న ఇప్పటికాలంలో మంటను నియంత్రిస్తూ వంట చేయడం చాలా సులభమే అనుకోవచ్చు. అయితే ఎలాంటి పరికరాలు లేని ఆరోజుల్లోనే మంటను నియంత్రిస్తూ వంట చేశారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆది మానవులు తమ ఆహారం కోసం చేపలకు చాలా ప్రాధాన్యమిచ్చేవారని ఈ అధ్యయనం చాటుతోంది. గెషర్ బెనోట్ యాకోవ్ ప్రాంతంలో మాకు దొరికిన చేప అవశేషాలను ఒకచోట చేర్చి పరిశీలించగా, పురాతన హులా సరస్సులో ఈ రకం చేపలున్నట్లు తెలిసింది. ఎప్పుడో అంతరించిపోయిన ఈ చేపలు దాదాపు రెండు మీటర్ల వరకు పొడవుంటాయి. గెషర్ బొనోట్ యాకోవ్‌లో పెద్ద ఎత్తున దొరికిన చేపల అవశేషాలను బట్టి చూస్తే ఆది మానవులు తరచుగా వీటిని తిన్నట్లు తెలుస్తోంది. వారే వంట చేసే పద్ధతులను అభివృద్ధి చేసినట్లు అవగతమవుతోంది. అలాగే, చేపను వండి తినడం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా ఆనాడే వారు గుర్తించినట్లు తెలుస్తోంది’ అని జొహర్ చెప్పారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
అన్నీ బాగుండాలి.. అందులో మనముండాలి!
మలేరియా, చికెన్ గున్యా, డెంగీ వ్యాధుల వ్యాప్తికి దోమలు కారణం! ఇది అందరికీ తెలిసిన విషయమే.. మరి వీధి కుక్కల వెంట్రుకల్లో ఉండే పేనుతో మనకు ప్రమాదం లేదా? పాడి పశువులకు వచ్చే రోగాలు మనకు అంటవా? పోనీ మనల్ని ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియా, వైరస్‌లతో జంతువులకు జబ్బులు రావా? అంతెందుకు నిన్న మొన్నటివరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా మూలాలు జంతువులే! ఒక్కమాటలో చెప్పాలంటే మనకొచ్చే వ్యాధుల వ్యాప్తికి సగం కారణం జంతువులే! ఈ విషయాన్ని గుర్తించడంలో ఆలస్యమైతే జరిగిందిగానీ.. పరిష్కారం కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘వన్ హెల్త్’ కార్యక్రమం మాత్రం వేగంగా అడుగులేస్తోంది (కంచర్ల యాదగిరిరెడ్డి) ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే కాలం గడుస్తున్న కొద్దీ మనుషులకు కొత్త కొత్త రోగాలు, ఆరోగ్య సమస్యలు పరిచయమవుతున్నాయి. దశాబ్దం క్రితం మనకు చికెన్ గున్యా అంటే ఏమిటో తెలియదు. డెంగీ మాట కూడా చాలా మంది విని ఉండరు. హెచ్1ఎన్1, హెచ్1ఎన్5 వంటివి కనీవినీ ఎరుగం. కానీ ఇప్పుడివన్నీ ఏటా పలకరించే చుట్టాల్లా మారిపోయాయి. ఎందుకిలా అంటే కారణాలు బోలెడు. ముఖ్యమైనది మాత్రం పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడమే. అందుకే ఐదేళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి (యూఎన్) ‘వన్ హెల్త్’ కార్యక్రమాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తోంది. ‘సర్వే సంతు నిరామయ’ వేదాల్లోని శాంతి మంత్రంలో ఓ చిన్న భాగమిది. భూమ్మీద ఉన్న వారెవరికీ వ్యాధుల బాధ లేకుండా ఉండు గాక అని అర్థం. అంటే మనుషులతోపాటు జీవజాలం మొత్తం కూడా ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటం. యూఎన్ ‘వన్ హెల్త్’ లక్ష్యం కూడా ఇదే. మానవుల ఆరోగ్యం బాగుండేందుకు.. కరోనా, ఎబోలా, వెస్ట్ నైల్ వంటి భయంకర వ్యాధులు ప్రబలకుండా, కొత్త కొత్త వ్యాధులు అంటకుండా చూసుకునేందుకు.. మన చుట్టూ ఉన్న జంతువులు, ప్రకృతిని కూడా కాపాడుకోవాలని చెబుతుంది ‘వన్ హెల్త్’. నిజానికి ఇదేమీ కొత్త విషయం కాదు. కాకపోతే ఇటీవలికాలంలో పెచ్చుమీరుతున్న జంతు వ్యాధుల నేపథ్యంలో మరింత ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడింది. విస్తరిస్తూ పోతున్న కొద్దీ.. భూమ్మీద జనాభా పెరుగుతోంది. మనిషి కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాడు. ఈ క్రమంలో మనుషులకు, అడవి జంతువులకు మధ్య ఉన్న దూరం తగ్గిపోతోంది. ఇలా ఆ జంతువులకు దగ్గరవుతున్న కొద్దీ వాటిలో ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న వ్యాధికారక సూక్ష్మజీవులు మనలోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్నాయి. అడవుల నరికివేత, వ్యవసాయ పద్ధతులు మారిపోవడం, పర్యావరణం దెబ్బతినడం దానికి ఊతమిస్తోంది. వ్యాపార, వాణిజాల్లో వృద్ధి కారణంగా వ్యాధులు ఒకచోటి నుంచి ఇంకో చోటకు ప్రయాణించడం సులువైపోయింది. అందుకే ఇటీవలికాలంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకడం ఎక్కువైందన్నమాట. కుక్కల నుంచి వచ్చే రేబిస్ మొదలుకొని సాల్మోనెల్లా, వెస్ట్‌నైల్ ఇన్ఫెక్షన్లు, క్యూ ఫీవర్, ఆంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్, లైమ్, రింగ్‌వర్మ్, ఎబోలా వంటివి మనం ఎదుర్కొంటున్న జునోటిక్ (జంతువుల నుంచి సోకేవి) వ్యాధుల్లో కొన్ని మాత్రమే. మారిన పరిస్థితులు జంతువులకూ మరిన్ని వ్యాధులు సోకేలా చేస్తూండటం ఆసక్తికరమైన అంశం. ఏయే అంశాలపై ‘వన్ హెల్త్’ దృష్టి ‘వన్ హెల్త్’ కార్యక్రమం కేవలం జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధులపై మాత్రమే దృష్టిపెట్టడం లేదు. ఈ వ్యాధులకు కారణమైన ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటోంది. యాంటీ బయాటిక్‌లకు లొంగని సూక్ష్మజీవులు వీటిలో ఒకటి. ఎందుకంటే ఈ సమస్యను పరిష్కరించని పక్షంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఆస్పత్రులు, ఆహారం, మట్టి, నీరు వంటి పలు మార్గాల ద్వారా మందులకు లొంగని వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు వ్యాప్తి చెందుతాయి. అలాగే వ్యాధికారక సూక్ష్మజీవులను మోసుకెళ్లే క్రిమికీటకాలు (దోమలు, పశువులు, జంతువులపై ఆధారపడి బతికే పేన్లు, ఇతర కీటకాలు)లను నియంత్రించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆహారంగా ఉపయోగించుకునే జంతువుల (కోళ్లు, గొర్రెలు, మేకలు, పందుల్లాంటివి) సంరక్షణ, ఆరోగ్యం కూడా ‘వన్‌హెల్త్’ కార్యక్రమంలో భాగమే. వన్ హెల్త్ కింద ఏం చేస్తున్నారు? వన్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నడుస్తున్నాయి. మానవ, జంతు వ్యాధుల నిపుణులు, పర్యావరణవేత్తలు కలిసికట్టుగా రకరకాల వ్యాధుల వ్యాప్తి ఎలా జరుగుతోందో తెలుసుకుంటున్నారు. పశువులతోపాటు మనుషుల్లోనూ యాంటీ బయాటిక్‌ల విచ్చలవిడి వాడకానికి చెక్ పెట్టేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెంపుడు జంతువుల యజమానులు, రైతుల్లోనూ వన్‌హెల్త్ కార్యక్రమం ఉద్దేశాలు, లక్ష్యాలు, జరుగుతున్న నష్టాలను వివరిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో తగిన చర్యలు చేపడుతున్నారు. కంబోడియాలో రేబిస్, ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాల నివారణ కోసం వ్యవసాయ, మత్స్య, అటవీ శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. అమెరికాలోని అట్లాంటా అక్వేరియంలోని జలచరాలు కొన్నింటికి కరోనా సోకింది. వాటికెలా సోకిందో తెలుసుకునేందుకు వన్‌హెల్త్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా ఇది ఇతర జంతువులకు మనుషులకు మళ్లీ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నవంబర్ మూడు.. వన్‌హెల్త్ డే! 1964లో కాల్విన్ ష్వాబ్ అనే పశువైద్యుడు తొలిసారి ‘వన్ మెడిసిన్’ పేరుతో రాసిన ఒక పరిశోధన వ్యాసంలో జంతువులు, మనుషులకు వచ్చే వ్యాధుల్లోని సారూప్యతలను ప్రస్తావించారు. పశు, మానవ వైద్యులు కలిసికట్టుగా పనిచేస్తే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ష్వాబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఈ అంశంపై కృషి చేయడం మొదలుపెట్టింది. 2004లో వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ, రాక్ఫెల్లర్ యూనివర్సిటీలు ‘వన్ వరల్డ్.. వన్‌హెల్త్’ పేరుతో కార్యక్రమం చేపట్టాలని సూచించాయి. సాంక్రమిక వ్యాధులను అరికట్టేందుకు జంతువులు, పర్యావరణం రెండింటిపైనా దృష్టి కేంద్రీకరించాలని, ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వాలు తగిన విధానాలను రూపొందించాలని ప్రతిపాదించాయి. అమెరికన్ హెల్త్ అసోసియేషన్ 2007లో మానవ, జంతు వైద్య పరిశోధన సంస్థల మధ్య సహకారానికి తీర్మానం చేయగా.. తర్వాతి కాలంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్), ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థలు ‘వన్ హెల్త్’ కార్యక్రమం కోసం ఓ ప్రణాళికను రూపొందించడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత కూడా పలు అంతర్జాతీయ స్థాయి సదస్సులు, చర్చలు, విధానాల రూపకల్పనతో 2016లో ‘వన్ హెల్త్ కమిషన్, వన్ హెల్త్ ప్లాట్‌ఫామ్, వన్ హెల్త్ ఇనిషియేటివ్’ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి. నవంబరు మూడో తేదీని ‘వన్ హెల్త్ డే’గా ప్రకటించాయి. నైజీరియాలో సీసంతో.. 2010లో నైజీరియాలో అకస్మాత్తుగా డజన్ల కొద్దీ బాతులు చచ్చిపోయాయి. కారణాలేవీ తెలియలేదు. బాతులే కదా అని ప్రజలూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్ని నెలల తర్వాత అదే ప్రాంతంలో వందలాది మంది పిల్లలు జబ్బు పడటం మొదలైంది. సమస్య ఎక్కడుందో వెతికేందుకు జరిగిన ప్రయత్నంలో.. ఆ ప్రాంతంలోని వారు ఎక్కువమంది ముతక పద్ధతుల్లో బంగారాన్ని అన్వేషిస్తున్నారని.. ఈ క్రమంలో విడుదలైన సీసం నీళ్లలో చేరి పిల్లల అనారోగ్యానికి కారణమైందని తేలింది. నమీబియా చీతాలతో లాభం నమీబియా చీతాలు ఇటీవలే ఇండియాకు వచ్చాయి. దశాబ్దాలపాటు భారత్‌లో కనుమరుగైపోయిన చీతాలు మళ్లీ కనిపించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు కూడా. అయితే దీనివల్ల ఇంకో ప్రయోజనమూ ఉంది. వేటాడి బతికే చీతాలు క్షీణించిపోతున్న గడ్డి మైదానాలను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. వేటాడే జంతువులు లేకపోవడం వల్ల గడ్డి తిని బతికే జంతువులు ఎక్కువై మైదానాలు లేకుండా చేస్తున్నాయని, చీతాల ప్రవేశంతో సమతౌల్యత ఏర్పడి గడ్డి మైదానాలు మళ్లీ పుంజుకుంటాయని అంటున్నారు. కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ 2007లో కాలిఫోర్నియాలో ఓ మిస్టరీ చోటు చేసుకుంది. మోంటెరీబే ప్రాంతంలో సీఒట్టర్స్ (సీల్ల తరహాలో ఉంటాయి) అని పిలిచే జలచరాలు కొన్ని జబ్బుపడ్డాయి. మరికొన్ని ప్రాణాలు కోల్పోయాయి. వాటి చిగుళ్లు పసుపుపచ్చ రంగులోకి మారిపోయాయి. కాలేయం ఉబ్బి ఉంది. మామూలు జబ్బులేవీ ఈ లక్షణాలకు కారణం కాదు. వన్‌హెల్త్ కార్యక్రమం కింద సముద్ర, మత్స్య శాఖల అధికారులు పరిశోధన మొదలుపెడితే.. పజారో నది నుంచి పింటో సరస్సుకు అక్కడి నుంచి సముద్రంలోకి కలుస్తున్న నీళ్లలో కొట్టుకొస్తున్న నాచులోని ఓ రసాయనం సీఒట్టర్స్‌ల మరణానికి కారణమని తెలిసింది. పింటో సరస్సులో విపరీతంగా పెరిగిన నాచులోని నత్తగుల్లలు తినడం సీఒట్టర్స్ ప్రాణాలమీదకు తెచ్చిందని స్పష్టమైంది. -
జంతువుల మాదిరిగానే.. మనుషులకు తోక!
ఆధునిక మానవుల పూర్వజీవులు లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో తోకలు కోల్పోవడం జరిగింది. మనుషులకు తోకలు ఉంటే, వయసు మళ్లినా జంతువుల మాదిరిగానే నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటారు కదా అని ఆలోచించారు జపానీస్ పరిశోధకులు. ఆ ఆలోచనతోనే కీయో యూనివర్సిటీ పరిశోధకులు ఒక మీటరు పొడవు ఉండే రోబోటిక్ తోకను రూపొందించారు. వెనుకవైపు వేలాడేలా దీన్ని తొడుక్కుంటే, ఇది అచ్చం జంతువుల తోకల మాదిరిగానే పనిచేస్తుంది. ఈ తోక గడియారంలోని పెండ్యూలంలా కదులుతూ, నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా చేస్తుందని కీయో వర్సిటీ పరిశోధకుడు జునిచి నబెషిమా తెలిపారు. -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్