‘సుగుణం మేలిముసుగు, దుర్గుణం దొంగముసుగు’ అన్నాడు ఫ్రెంచ్ రచయిత, రాజనీతిజ్ఞుడు విక్టర్ హ్యూగో. ‘కరోనా’ కాలంలో మనుషులందరికీ ముసుగులు అనివార్యంగా మారాయి. మహమ్మారి కాలంలో మూతిని, ముక్కును కప్పి ఉంచే ముసుగులు లేకుంటే మాయదారి మహమ్మారి రోగం మరెందరిని మట్టుబెట్టేదో! ముసుగులు పలు రకాలు. అన్నింటినీ ఒకే గాటన కట్టేయలేం. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం కుదరదు కదా! అనివార్యంగా ధరించే ముసుగులు కొన్ని, మతాచారాల కారణంగా ధరించే ముసుగులు ఇంకొన్ని– ఇవి ప్రమాదకరమైన ముసుగులు కాదు. ఇలాంటి ముసుగుల చాటున ఉన్న మనుషులను గుర్తించడమూ అంత కష్టం కాదు.
అయితే, వచ్చే చిక్కంతా దేవతా వస్త్రాల్లాంటి ముసుగులతో మన మధ్య తిరుగుతుండే మనుషులతోనే! కనిపించని ముసుగులు ధరించే మనుషుల బతుకుల్లో లెక్కలేనన్ని లొసుగులు ఉంటాయి. వాటిని దాచుకోవడానికే ముఖాలకు దేవతావస్త్రాల ముసుగులను ధరిస్తుంటారు. అలాంటివారు మన మధ్య ఉంటూ, మనతోనే సంచరిస్తుంటారు. మనం పనిచేసే కార్యాలయాల్లో, మనం నివసించే కాలనీల్లో ఉంటారు. ముసుగులకు చిరునవ్వులు అతికించుకుని మనల్ని పలకరిస్తుంటారు కూడా! వాళ్లను ముసుగులతో తప్ప ముఖాలతో గుర్తుపట్టలేని పరిస్థితికి చేరుకుం టాం. వాళ్ల అసలు ముఖాలను పోల్చుకునే సరికి కనిపించని ఊబిలో కూరుకుపోయి ఉంటాం.
గాంభీర్యం చాలా గొప్పగా ఉంటుంది గాని, చాలా సందర్భాల్లో అది పిరికిపందలు ధరించే ముసుగు. అలాగే, పలు సందర్భాల్లో భూతదయా ప్రదర్శనలు క్రౌర్యానికి ముసుగు; బహిరంగ వితరణ విన్యాసాలు లుబ్ధబుద్ధులకు ముసుగు; నిరంతర నీతి ప్రవచనాలు అలవిమాలిన అవినీతి పనులకు ముసుగు; సర్వసంగ పరిత్యాగ వేషాలు సంపన్న వైభోగాలకు ముసుగు– ఇలా చెప్పుకుంటూ పోతే ముసుగుల జాబితా కొండవీటి చేంతాడు కంటే పొడవుగా తయారవుతుంది.
‘ఒక్క బంగారు ముసుగు అన్ని వైకల్యాలనూ కప్పిపుచ్చుతుంది’ అన్నాడు ఇంగ్లిష్ నాటక రచయిత థామస్ డెకర్. బంగారు ముసుగులు తొడుక్కోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకని తెలివిమంతులు దేవతా వస్త్రాల ముసుగులలో తమ తమ లొసుగులను కప్పిపుచ్చుకుంటూ, నిక్షేపంగా సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అయిపోతుంటారు. ఇలాంటి పెద్దమనుషుల అసలు ముఖాలేవో గుర్తించడం దుస్సాధ్యం. ముసుగుల మాటునున్న ముఖాలను గుర్తించేలోపే అమాయకులు కాటుకు గురైపోతారు. సాధారణంగా ముసుగులు నాటకాది ప్రదర్శనల వేషధారణలో భాగంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో ముసుగులూ వేషాలూ దైనందిన జీవితంలో నిత్యకృత్యాలుగా మారిపోయాయి.
అతి వినయం ధూర్త లక్షణానికి ముసుగు. ‘వదనం పద్మదళాకారం వచశ్చందన శీతలం/ హృదయం కర్తరీ తుల్యం, అతి వినయం ధూర్త లక్షణం’ అని మనకో సుభాషిత శ్లోకం ఉంది. అలాగే, ‘జటిలో ముండీ లుంభిత కేశః/ కాషాయాంబర బహుకృత వేష/ పశ్యన్నిపిచ న పశ్యతి మూఢో/ ఉదర నిమిత్తం బహుకృత వేషం’ అన్నాడు ఆదిశంకరుడు. పైన ఉదహరించిన సుభాషిత శ్లోకాన్ని, ఆదిశంకరుడి శ్లోకాన్ని గమనిస్తే, ముసుగులూ వేషాలూ ఆనాటి నుంచే ఉన్నట్లు అర్థమవుతుంది.
కాకుంటే, అప్పటివి సత్తెకాలపు ముసుగులు. అతి తెలివిని ప్రదర్శించబోయిన అమాయకపు వేషాలు. ప్రధానంగా వాటి ప్రయోజనం ఉదర నిమిత్తానికే పరిమితమై ఉండేది. కేవలం ఉదర నిమిత్తం వేసుకునే ముసుగులూ వేషాల వల్ల ఎంతో కొంత వినోదమే తప్ప సమాజానికి పెద్దగా చేటు ఏమీ ఉండదు. అయినా, ఆనాటి సమాజంలోని ప్రాజ్ఞులు ముసుగులనూ, వేషాలనూ నిరసించేవారు. అలాంటివారి నిరసనల వల్ల ముసుగులూ వేషాలూ శ్రుతి మించకుండా ఉండేవి.
అప్పట్లో ముసుగులకూ వేషాలకూ పెద్దగా ప్రచారం ఉండేది కాదు. అంతగా జనాదరణ ఉండేది కాదు. సినిమాలు వచ్చాక చిత్రవిచిత్ర వేషాలకు ప్రచారమూ పెరిగింది. నాటకాలు, సినిమాలు మాత్రమే వినోద సాధనాలుగా ఉన్న కాలంలో నటీనటులు మాత్రమే పాత్రోచిత వేషాలు వేసేవారు. సమాజంలో పెద్దమనుషుల ముసుగులో ఉండే వేషధారులు అక్కడక్కడా మాత్రమే ఉండేవారు. ఇక స్మార్ట్‌ఫోన్లు చేతిలోకి వచ్చాక మనుషులంతా వేషధారులుగా మారిపోయిన పరిస్థితి దాపురించింది.
కృత్రిమ మేధ తోడయ్యాక మనుషుల అసలు ముఖాలను పోల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి వాటిల్లింది. ఇప్పుడు నటీనటులే కాదు, వారికి పోటీగా దేశాధినేతలు కూడా యథాశక్తిగా దేవతావస్త్రాల ముసుగులను తొడుక్కుని, రకరకాల వేషాలతో నవరసాభినయ చాతుర్యంతో జనాలను విస్మయంలో ముంచెత్తుతున్నారు.
‘స్మార్ట్’ వేషాల సంగతి ఒక ఎత్తయితే, ఇప్పుడు చైనాలో సిలికాన్ ముసుగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అలాంటిలాంటివి కావు, అల్ట్రా రియలిస్టిక్ ముసుగులు. ఒక నలభయ్యేళ్ల వ్యక్తి ఒక వృద్ధుడి ముఖాన్ని పోలిన సిలికాన్ ముసుగు వేసుకుని నేరాలకు పాల్పడిన సంగతి బయటపడటంతో కలకలం మొదలైంది. సిలికాన్ ముసుగుల చట్టబద్ధతపై కూడా చర్చ మొదలైంది. అయినా, ఎంత సిలికాన్ ముసుగులైతే మాత్రం అవేమైనా దేవతా వస్త్రాల ముసుగులా? అసలు ముఖాలను ఎంతకాలం దాచగలవు పాపం?!
ముసుగు మనుషులు
Published Mon, Jul 15 2024 12:11 AM | Last Updated on Mon, Jul 15 2024 12:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment