గోట్స్ థియరీ | Goats Theory | Sakshi
Sakshi News home page

గోట్స్ థియరీ

Published Sat, Sep 19 2015 1:04 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

గోట్స్ థియరీ - Sakshi

గోట్స్ థియరీ

హ్యూమర్ ప్లస్
నిజానికి మనుషులకి, గొర్రెలకీ పెద్దగా తేడా లేదు. ఈ విషయం అందరి కంటే టీవీ చానెల్స్ వారికి బాగా తెలుసు. ఒక రోజు మనుషులెవరూ దొరక్క ఒక గొర్రెని స్టూడియోకి తీసుకొచ్చి ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. ‘‘గతంలో కూడా మేము చాలా గొర్రెలతో ఇంటర్వ్యూ చేశాం. అయితే అవి మనుషుల్లా మేకప్ చేసుకుని రావడం వల్ల మీరు గుర్తు పట్టలేకపోయారు. ఈసారి ఒరిజినల్ గొర్రెనే పిలిపించాం. ఇది మనుషులకంటే తెలివైన సమాధానాలే ఇస్తుందని నమ్ముతున్నాం’’ అని ప్రారంభించింది యాంకర్.
 
ప్ర. ‘‘మేకలు మేమే అంటాయి. మీరెందుకు అలా అరవరు?’’
జ. ‘‘మే నెల అంటే మాకిష్టం లేదు. ఒకటే ఎండ’’

ప్ర. ‘‘మనుషులపై మీ అభిప్రాయం ఏమిటి?’’
జ. ‘‘గొర్రెలుగా మారాలంటే ఇంకాస్త ఎదగాలి’’

ప్ర. ‘‘ప్రజాస్వామ్యంపై మీ ఒపీనియన్?’’
జ. ‘‘అది హనుమంతుడి తోకలా ఉంటుందని నాయకులు చెబుతుంటారు కానీ అది వాస్తవానికి మా తోకంత ఉంటుంది. అధికారమనేది దుడ్డుకర్రలాంటిది. అది చేతిలో ఉంటే ఎవరో ఒకర్ని మోదాలనిపిస్తూ ఉంటుంది. ఇక మనుషులే ఏ ఒపీనియన్స్ లేకుండా జీవిస్తున్నప్పుడు గొర్రెల ఒపీనియన్స్‌ని గౌరవించడం మీ చానెళ్ల గొప్పదనాన్ని తెలియజేస్తుంది.
 
‘‘గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందని ఎందుకంటారు?’’
‘‘నమ్మినా నమ్మకపోయినా వాడెలాగూ చంపలేడు. అవిశ్వాసంతో మరణించడం కంటే, విశ్వాసంతో మరణించడం శ్రేయస్కరం. ఓటేసినా, వేయకపోయినా ఎవరో ఒకరు గెలవడం తప్పనిసరి అయినట్టు, చచ్చేవాడి నమ్మకాలతో ఒరిగేదేమీ లేదు.’’
 
‘‘మీరు ఫిలాసఫరా?’’
‘‘కాదు ఫిలాసఫరర్’’
 
‘‘మీకేమైనా థియరీస్ ఉన్నాయా?’’
‘‘తోక ఉన్నప్పటికీ విప్పలేను, చెప్పలేను, దీన్ని టెయిల్స్ థియరీ అంటారు’’
 
‘‘టెయిల్ ఉన్నప్పుడు హెడ్ కూడా ఉండాలిగా. ఆ థియరీ చెప్పండి’’
‘‘ఆఫీసుల్లో అనేకమంది హెడ్స్ ఉన్నట్టు. ఈ హెడ్స్‌లా రకరకాల థియరీలు ఉంటాయి. హెడ్ మూవ్‌మెంట్ అంటే ఎదుటివాడు చెప్పేది అక్షరం అర్థం కాకపోయినా అన్నింటికి తల ఊపే థియరీ ఇది. వీళ్లకు నాలుగు కాలాల పాటు హెడ్ పదిలంగా ఉంటుంది. హెడ్ వెయిట్ థియరీ అంటే ప్రపంచమంతా మన తలలో నుంచే నడుస్తుందని నమ్మే థియరీ. లోకం బరువు మోసి మోసి వీళ్ల తలకాయ చైనా చార్జర్‌లా పేలిపోతుందని అనుకుంటూ ఉంటారు. అందరి తలరాత రాస్తున్నామని అనుకుంటారు కానీ తలకి నూనె తప్ప ఇంకేమీ రాయలేరు. హెడ్‌లెస్ థియరీ అని ఇంకొకటుంది. బయటికెళ్లాక తల ఉంటుందో లేదో తెలియని నాలాంటి వాళ్లు చెప్పే థియరీ ఇది’’
 
‘‘థియరీస్ బావున్నాయి. ప్రాక్టికల్స్‌కి కూడా ఉన్నాయి?’’
‘‘థియరీస్ మేం చెబుతాం. నాలాంటి వాళ్లని బిరియాని వండుకుని ప్రాక్టికల్స్ మీరు చేసుకుంటారు’’
 
‘‘మనుషులకి గొర్రెలకి తేడా లేదని మా అభిప్రాయం’’
‘‘గొర్రెలకి మనుషులకి తేడా లేదని నా అభిప్రాయం’’
 
‘‘రెండు ఒకటేగా?’’
‘‘ఒకలా కనిపించేవన్నీ ఒకటి కావు. ఉప్పు కప్పురంబు పద్యం తెలుసుగా. మీరు ప్రతీది మనుషులతో పోలుస్తారు. మేం గొర్రెలతో పోలుస్తాం. మనుషులు మారాలి అని మీరంటే, గొర్రెలు మారాలి అని మేమంటాం’’
 
‘‘ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం’’
‘‘పైసా ఖర్చు లేకుండా వాట్సప్‌లో ఎవరికి వాళ్లు లక్షల సందేశాలు ఇచ్చుకుంటుంటే గొర్రెలిచ్చే సందేశం ఎవడికి కావాలి? అయినా అడిగారు కాబట్టి ఇస్తున్నా. మీరు మనుషులైనా, గొర్రెలైనా కత్తికి దొరక్కుండా జీవించండి’’
 
‘‘పొయెటిక్‌గా చెప్పారు’’
‘‘కత్తి కంటే కవిత్వం డేంజర్’’
 
‘‘మీ విలువైన అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి’’
‘‘ఆ గుంజకి కట్టిన వాడు తాడు విప్పితే నా దారిన నేను పోతాను’’
- జి.ఆర్. మహర్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement