Humor Plus
-
మునకే సుఖమనుకోవోయ్!
హ్యూమర్ ప్లస్ సుబ్బారావుకి గాలిలో తేలుతున్నట్టు కలొచ్చింది. కలవరంలో వుండగా చల్లగా తగిలింది. కళ్ళు తెరిస్తే మంచం నీళ్లలో తేలుతూ వుంది. అపార్ట్మెంట్ చెరువులా కనిపించింది. గబాలున లేస్తే కిటికీలోంచి వెంకట్రావ్ విష్ చేశాడు. ఒక ప్లాస్టిక్ కవర్లో లాప్టాప్ చుట్టుకుని ఈదుతూ వెళుతున్నాడు. ‘‘ఏంటిది ప్రళయమా?’’ అడిగాడు సుబ్బారావు. ‘‘చెరువుల్లో వూళ్లు కడితే, వూళ్లు చెరువులవుతాయి’’ వెంకట్రావ్ సాఫ్ట్‌వేరే కానీ తల్లి వేరు కవిత్వం. ‘‘చెరువుని ఈదడం సులభం, జీవితాన్ని ఈదడమే కష్టం’’ అన్నాడు వెంకట్రావు. ‘‘నాకు ఈత రాదు’’ అన్నాడు సుబ్బారావు. ‘‘లైఫ్ జాకెట్ వేసుకో’’ ‘‘జాకెట్ లేడీస్ వేసుకుంటారు. లైఫ్ షర్ట్ వుంటే చెప్పు’’ సుబ్బారావు పురుషవాది. పురుషులందు పురుషవాదులు వేరు. స్త్రీవాదులతో ఓడిపోవడం వల్లే పురుషులు రుషులుగా మారుతున్నారనేది అతని ఫిలాసఫీ. ‘‘తుపాన్లో జర్దా పాను గురించి చర్చ అవసరమా?’’ ‘‘పురుషుల్ని ఉతికి ఇస్త్రీ చేయడానికే స్త్రీలు పుట్టారని ఇంతకాలం వాదించాను. అందువల్ల జాకెట్ వేసుకోను.’’ ‘‘అయితే సెల్ఫీ తీసుకుని ఎఫ్‌బిలో పోస్ట్ చెయ్. అదే నీ ఆఖరి పోస్టింగ్ అని అందరికీ గుర్తుంటుంది’’లాహిరి లాహిరి పాడుకుంటూ వెంకట్రావ్ వెళ్లిపోయాడు. సుబ్బారావుకి బాస్ గుర్తొచ్చాడు. ప్రపంచమంతా మునిగిపోయినా ఆఫీసులు మునిగిపోవు, అదో ట్రాజెడీ. ఇంతలో కూకట్పల్లి అని అరుస్తూ ఒక పడవ వచ్చింది. దాన్నిండా జనం. ఎవరు ఎవరి మీద కూచున్నారో తెలియడం లేదు. తెడ్డుకి కూడా ఇద్దరు వేలాడుతున్నారు. కిటికీలోంచే సుబ్బారావు దాంట్లోకి దూకాడు. పడవ అటూఇటూ కదిలి హాహాకారాలు వినిపించాయి. ‘‘ఏంటిది?’’ పడవవాడ్ని అడిగాడు. ‘‘సర్వీస్ ఆటోలుగా, సర్వీస్ బోట్’’ ‘‘ఇంతమంది ఎక్కితే మునిగిపోదా?’’ ‘‘మునిగిపోతే రక్షించడానికి ఇద్దరు గజ ఈతగాళ్లున్నారు. వాళ్ల చార్జి ఎగస్ట్రా’’ హైలెస్సా హైలెస్సా అంటూ తెడ్డువేశాడు. పడుతూ లేస్తూ నిజాంపేట నుంచి కూకట్పల్లి చేరింది పడవ. ఒడ్డున సర్వీస్ ఆటో ఎక్కాడు. జనాల్ని ఆటోలో కుక్కి ఒక తాడుతో అందర్నీ కలిపి కట్టేశాడు ఆటోడ్రైవర్. ‘‘ఈ బంధనం ఎందుకు?’’ ‘‘ఇది సీట్ బెల్ట్ లాంటిది సార్. మనకు ముందర రోడ్డంటూ ఏమీ లేదు. ఒక గోతిలోంచి ఇంకో గోతిలోకి జంప్చేస్తూ వెళ్లడమే’’ అని డ్రైవర్ స్టార్ట్ చేశాడు. పిండిమరలాగా అది గుడగుడ సౌండ్ చేస్తూ కదిలింది. సర్వాంగాలు గజగజ వణికాయి. దబేల్దుబేల్మంటూ ఆటో అటూ ఇటూ ఒరుగుతూ వెళ్లింది. ఒక మాన్హోల్లోకి డైవ్ చేయడానికి ఆటో ప్రయత్నించింది కానీ సమయస్ఫూర్తితో డ్రైవర్ హ్యాండిల్‌కి వేళాడుతూ హ్యాండిల్ చేశాడు. ఈ కీలకమైన ఘట్టంలో పలువురు బాధితులు గోవిందనామస్మరణ చేస్తూ కాస్త పుణ్యం గడించారు. సామూహిక పగ్గం నుంచి ఆటోవాడు విముక్తి చేసిన తరువాత ఆఫీస్ దగ్గరికి వెళితే గుండె చెరువైంది. అక్కడ గడకర్ర సాము జరుగుతూ వుంది. యాభై రూపాయల ఫీజు ఇస్తే గడకర్రని ఇస్తున్నారు. దాన్ని వూతంగా గాల్లోకి ఎగిరితే సెకండ్‌ఫ్లోర్‌లో ల్యాండ్ అవుతాం. నీటిలో ఆఫీస్ వుండడం వల్ల ఇంకో దారిలేదు. ఆఫీస్‌కి వెళ్లాలంటే గడకర్ర, వెళ్లకపోతే బాస్ దుడ్డుకర్ర తీసుకుంటాడు. ‘‘జీవితంలో ఇలా ఎత్తుకు ఎదిగే అవకాశం పదేపదే రాదు సార్’’ అన్నాడు గడకర్రవాడు. ‘‘నాకు భయం’’ అన్నాడు సుబ్బారావు. ‘‘భయానికి విరుగుడు అభయం’’ అంటూ ఆంజనేయుడిలా భుజాల మీద ఎక్కించుకుని యాహూ అంటూ గడకర్రవాడు ఎగిరాడు. గూగుల్ అంటూ దూకాడు సుబ్బారావు. ఐరిస్ మిషన్‌కు కళ్లు చూపించాడు. ఆఫీస్‌లోకి తగలడిచావు అని మూలిగింది. ‘‘ప్రకృతితో వికృతిగా వ్యవహరిస్తే భవిష్యత్ ఆకృతి ఇదే. నాలుగు చినుకులకే చిరిగి చాటంతవుతుంది’’ అంటున్నారెవరో. - జి.ఆర్. మహర్షి -
హారర్ స్టోరీ
హ్యూమర్‌ప్లస్ ఇంతలో హీరోయిన్ వచ్చి ‘‘అంధెరీకి నమ్‌కారం’’ అంది తెలుగులో. దెయ్యం జడుసుకుని ‘‘పిశాచాలు కూడా ఇలాంటి భాష మాట్లాడవు. తెలుగు రాని అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడానికి మించిన హారర్ ఎఫెక్ట్ ఏముంటుంది?’’ అని అరిచింది. ఒక దెయ్యానికి సినిమాల్లో చేరాలని కోరిక పుట్టింది. తన సినిమాలు చూసి తానే భయపడే ఒక హారర్ డెరైక్టర్ దగ్గరికి వెళ్లింది. ‘‘ఇంతవరకూ దెయ్యం సినిమాలు తీసిన వాళ్లున్నారు కానీ, దెయ్యంతోనే సినిమాలు తీసినవాళ్లెవరూ లేరు. నాకైతే మేకప్, గ్రాఫిక్స్ అక్కరలేదు’’ అని చెప్పింది దెయ్యం. ‘‘ఫీల్డ్‌లో దెయ్యాలెవరో, మనుషులెవరో తెలుసుకోవడం కష్టంగా ఉంది. నువ్వు దెయ్యమే అనడానికి రుజువేంటి?’’ అని అడిగాడు డెరైక్టర్. దెయ్యం తన కాళ్లను వెనక్కి తిప్పి చూపించింది. కోరల్ని బయటపెట్టి గాల్లోకి ఎగిరింది. డెరైక్టర్ సంతోషించి ‘దెయ్యం భయం’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. ముహూర్తం రోజున దెయ్యం పూజ చేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టింది. ‘‘దెయ్యాలు కూడా పూజ చేస్తాయా?’’ అని అడిగాడు డెరైక్టర్. ‘‘దెయ్యాలు పూజ చేయడం, సింహాలు సన్యాసం తీసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. మనుషుల కంటే ఎక్కువగా దెయ్యాల్నే దేవుడు ప్రేమిస్తాడు’’. ‘‘ఎందుకని?’’ ‘‘భయం. కొలిచేవాడికి వరాలివ్వడం పాత పద్ధతి. కరిచేవాడికే ఇప్పుడు వరాలు’’ అంది దెయ్యం. గడియారం సరిగ్గా పన్నెండు కొడితే దెయ్యం ‘హిహిహి’ అని నవ్వుతూ వచ్చి భయపెట్టాలి. ఇది ఫస్ట్ షాట్. ‘‘ప్రేక్షకులకి కామన్సెన్స్ లేకపోయినా, దెయ్యాలకి టైం సెన్స్ వుంది. అందువల్ల మేం అర్ధరాత్రి బయటికి రావడం మానుకొని చాలాకాలమైంది’’ అంది దెయ్యం. ‘‘తరతరాలుగా సినిమాల్లో వస్తున్న సాంప్రదాయమిది’’ అన్నాడు డెరైక్టర్. ‘‘అందుకే మీరు ఆదాయం లేకుండా చస్తున్నారు. అసలు గంటలు కొట్టే గడియారాలు ఎవరి కొంపలోనైనా ఉన్నాయా? పొరపాటున ఎక్కడైనా మోగినా అది టీవీ సీరియల్లో యాడ్ అనుకుంటాం గానీ మిడ్నైట్ అయ్యిందని అనుకుంటామా?’’ అని ప్రశ్నించింది దెయ్యం. ‘‘మరి ఏదో ఒక హారర్ ఎఫెక్ట్ వుండాలి కదా’’ అన్నాడు డెరైక్టర్. ఇంతలో హీరోయిన్ వచ్చి ‘‘అంధెరీకి నమ్‌కారం’’ అంది తెలుగులో. దెయ్యం జడుసుకుని ‘‘పిశాచాలు కూడా ఇలాంటి భాష మాట్లాడవు. తెలుగు రాని అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడానికి మించిన హారర్ ఎఫెక్ట్ ఏముంటుంది?’’ అని అరిచింది. ‘‘నువ్వెక్కువ నటిస్తున్నావు. మనుషులు ఎలాగూ బతికినంతకాలం నటిస్తారు. చచ్చి కూడా నటించాల్సి రావడం నీకు పట్టిన విషాదం’’ అని కోపగించుకున్నాడు డెరైక్టర్. ‘‘నా విషాదం సంగతి పక్కనపెట్టు. అసలు నీ సినిమాలు ఎందుకు ఫెయిలవుతున్నాయో నీకు తెలుసా?’’ ‘‘జనానికి సినిమాలు చూడ్డం రాదు’’. ‘‘చూడ్డం రాక కాదు, చూడడానికి రావడం లేదు. ప్రతిరోజూ వంద రకాల భయాలతో బతుకుతున్నవాడిని ఇక కొత్తగా నువ్వేం భయపెడతావు.’’ ‘‘భయమనేది ఆక్సిజన్ లాంటిది. అది ఎంతిచ్చినా సరిపోదు. అందువల్ల వికృతంగా నవ్వి భయపెట్టు’’. ‘‘అరే హౌలా, మేము వికృతంగా నవ్వుతామని ఎవరు చెప్పార్రా నీకు? బతికినప్పుడు లక్షా తొంభైవేల సమస్యలుంటాయి. చచ్చిం తరువాత ప్రశాంతంగా వుంటాం. హాయిగా వుండేవాడు వికృతంగా ఎందుకు నవ్వుతాడు చెప్పు?’’ అని అడిగింది దెయ్యం. ‘‘తెరమీద తర్కం పనికిరాదు. రూల్స్ మిస్సయితే గోల్స్ దక్కవు’’. ‘‘ప్రాస ఎక్కువైతే శ్వాస ఆడదు. పంచ్‌లు ఎక్కువైతే పంక్చరవుతుంది’’ ‘‘సరే అదంతా ఎందుకుగానీ, నువ్వు దెయ్యం కాబట్టి ఆ చెట్టు మీద వుంటావు. కింద హీరోయిన్ వుంటుంది’’ ‘‘ఒకసారి ఆ చెట్టు చూడు, కరెంట్, డిష్, ఇంటర్నెట్ ఇన్ని వైర్లు దాని మీద నుండి వెళుతున్నాయి. ఆ తీగలకు చుట్టుకుంటే దెయ్యాలకి చాలా ప్రమాదం. ఎందుకంటే అవి రెండోసారి చావలేవు. అందుకని మేము చెట్లమీద వుండడం మానేసి చాలా కాలమైంది. ‘‘దెయ్యంతో సినిమా తీయడం ఇంత కష్టమని నాకు తెలియదు’’. ‘‘సినిమాల్లో నటించడం ఇంత కష్టమని నాకూ తెలియదు. అయినా మీ భయాలేవో మీరు భయపడకుండా నాకెందుకు చుడతారు చెప్పు. ఈరోజుల్లో మనుషులే దెయ్యాలను భయపెడుతు న్నారు. అర్ధరాత్రి వరకూ టీవీలు చూస్తూ, ఫోన్లలో మాట్లాడుతూ మాకు నిద్ర లేకుండా చంపుతున్నారు’’ అని విసుక్కుంటూ దెయ్యం ప్యాకప్ చెప్పేసింది. - జి.ఆర్.మహర్షి -
ఏం ఫ్యామిలీరా బాబూ!
హ్యూమర్‌ప్లస్ ఒకాయన ఎవరింటికో వెళ్లబోయి ఇంకెవరింటికో వెళ్లాడు. ఆ ఇంట్లో జనమంతా ఉత్సాహంగా స్టెప్పులేస్తూ కనిపించారు. ‘‘ఇది డ్యాన్సింగ్ స్కూలా?’’ అని అడిగాడు. ‘‘అదేం కాదు, ఉదయాన్నే కాఫీ తాగగానే ఒక పాట పాడతాం. టిఫిన్ తర్వాత ఒక సాంగ్. లంచ్‌కి ముందు, ఆ తరువాత ఇంకో సాంగ్ అండ్ డ్యాన్స్’’ అని ఒక పెద్దాయన చెప్పాడు. ‘‘ఆకలవడానికి ఒక పాట, అరగడానికి ఇంకో పాట అన్నమాట.’’ ‘‘అన్నమాట కాదు, అదే ఉన్న మాట. ఈ ఇంట్లోకి ఎవరు రావాలన్నా నాలుగు మంచి మాటలు చెప్పి రావాలి.’’ ‘‘సత్యమునే పలుకవలెను’’. ‘‘పాసైపోయారు’’ అంటూ ఆ పెద్దమనిషి కాఫీ తెమ్మని భార్యకి చెప్పాడు. ఆమె స్టెప్పులేస్తూనే వెళ్లి కాఫీ తీసుకొచ్చింది. ‘‘కాఫీని తాపీగా హ్యాపీగా తాగండి’’ అంటూ ఆవిడ మళ్లీ ఒక పాట ఎత్తుకుంది. జడుసుకున్న అతిథి షర్ట్‌పైన కాఫీ ఒలకబోసుకున్నాడు. ‘‘షర్ట్‌పైన మరక మంచిదే. సర్ఫ్‌తో పోతుంది. క్యారెక్టర్‌పైన మరక పడితే ఉతికినా పోదు’’. ‘‘మీరు నవలల్లోని పాత్రల్లా మారుతున్నారు.’’ ‘‘నవల, వల, పావలా, ముప్పావల, కష్టసుఖాల కవల ఈ జీవితం. ఇంట్లోని పాత్రలు రుద్దితే మెరుస్తాయి. ఒంట్లోని పాత్రలు... ’’ ఆ పెద్దమనిషి ఏదో చెప్పబోతే అతిథి దిగ్గున లేచి ‘‘ఇక వస్తానండి’’ అన్నాడు. ‘‘ఈ మంచిమాటల మల్లికార్జునరావు ఇంటికి ఎవరూ రారు. వచ్చినవాళ్లు వెనక్కి పోరు’’ అంటూ అతిథి చొక్కా ఊడబీకి బకెట్లో వేసి ఉతుకుతూ ‘‘చాకిరేవు కాడ ఏమైంది’’ అంటూ సాంగ్ స్టార్ట్ చేయగానే మిగిలినవాళ్ళంతా వచ్చి ‘ఏమైంది’ అంటూ గ్రూప్ డ్యాన్స్ చేశారు. ఇంతలో ఒక కుర్రాడు బాహుబలిలో కట్టప్పలా మోకాళ్లతో స్కేటింగ్ చేస్తూ వచ్చి ‘నాన్నగారూ’ అంటూ ఒక చెప్పుల జత పెట్టాడు. ‘‘ఇవి నావి కావు నాన్నా. తొందరపడి మామయ్యవి తెచ్చావు. సైజ్ తేడా వుంటే చొక్కా తొడుక్కోవచ్చు కానీ, చెప్పులు తొడుక్కోలేం’’ అన్నాడు నాన్న. ‘‘చెప్పులు ఆ కుర్రాడు తేవడమెందుకు? మీరే వేసుకోవచ్చుగా’’ ‘‘నా కాలికి ఆనెలు, నడవలేను’’ ‘‘మరి స్టెప్పులేస్తున్నారుగా.’’ ‘‘జీవితంలో ఎన్నో స్టెప్పులెక్కినవాణ్ణి, ఆ మాత్రం స్టెప్పులేయలేనా?’’ ‘‘ఇంతకూ మీరేం చేస్తున్నారు?’’ ‘‘సాంగ్‌కి సాంగ్‌కి మధ్య బ్రేక్‌లో బిజినెస్ చేస్తుంటాను’’ ఆ కుర్రాడు మళ్లీ స్పీడ్బీట్లా వచ్చి చెప్పులు పెట్టాడు. ‘‘కరుస్తాయని చెప్పుల్ని, తడుస్తుందని గొడుగుని వాడకుండా ఉండలేం కదా’’ ఇంతలో ఒకమ్మాయి వచ్చి ‘‘అత్తయ్య కారంపొడి దంచడానికి రమ్మంటోంది’’ అని పిలిచింది. ‘‘రండి రోకటి పాట విందురుగాని’’ ‘‘రోకటి పోటు తింటున్నాం కదా, మళ్లీ పాట కూడానా’’ అని తప్పించుకోడానికి ప్రయత్నిస్తే బలవంతంగా లాక్కెళ్లి చేతికి రోకలిని ఇచ్చారు. ‘‘దంచినోళ్లకి దంచినంత’’ అని ఆడోళ్లు పాట ఎత్తుకున్నారు. మంచి మాటలాయన కూడా నాలుగు దంచి ‘‘కారంకారం అంటాడు కానీ చెల్లెమ్మా, కారం లేని దెక్కడ చెల్లెమ్మా’’ అని చెప్పులతోనే స్టెప్పులేశాడు. ‘‘వైఫై ఉందని వైఫ్‌ని, ఫేస్బుక్ ఉందని ఫేస్‌ని మరిచిపోలేం కదా, గ్రూప్‌సాంగ్ ఉంటేనే మన బ్లడ్‌గ్రూప్ మనకి గుర్తుండేది. డాన్స్ చేస్తేనే బోన్స్ సెట్ అయ్యేది’’ దంచుతున్న కారం మీదపడి అతిథి ఒళ్లు మండింది. ‘‘ఇల్లుని పిచ్చాసుపత్రి చేసినా, పిచ్చాసుపత్రినే ఇల్లుగా మార్చుకున్నా పెద్ద తేడా లేదు. జీవితం స్ట్రెయిట్ రోడ్ కాదు, ఘాట్ రోడ్ బ్రేకుల ప్లేస్‌లో యాక్సిలేటర్, యాక్సిలేటర్ ప్లేస్‌లో బ్రేకులు ఉంటాయి. బీమిలీ బీచ్‌లాంటి ఫ్యామిలీ ఉంటే లాభం లేదు కొంచెం తెలివి కూడా ఉండాలి’’ అన్నాడు. అదేం పట్టించుకోకుండా మంచి మాటల మల్లికార్జునరావు ఆనెలు ఉన్నాయని కూడా మరిచిపోయి గాల్లోకి ఎగిరి పాట పాడేడు. అతిథి పారిపోయాడు. - జి.ఆర్. మహర్షి -
ఘటికుని జ్ఞానోదయం
హ్యూమర్ ఫ్లస్ సుబ్బారావు ఒక వేదాంతి. జ్ఞానం ఉంటే డబ్బు అక్కర్లేదని ఆయన నమ్మకం. డబ్బుంటే జ్ఞానంతో పని లేదని వాళ్లావిడ నమ్మకం. పరస్పర విరుద్ధ నమ్మకాల సంఘర్షణల సమ్మేళనమే దాంపత్యం. ప్రకృతి సహజంగా ఆమె వేధించేసరికి సుబ్బారావు వేదాంతిగా మారాల్సి వచ్చింది. వేదాంతం యొక్క ప్రత్యేకత ఏమంటే అది మనల్ని అర్థం చేసుకోదు. మనకి అర్థం కాదు. ఒకరోజు డిక్షనరీలు అమ్మే కుర్రాడు సుబ్బారావు దగ్గరికి వచ్చాడు. దిండు కంటే దిట్టంగా ఉన్న డిక్షనరీని చూపించాడు. అన్ని పదాలకి అర్థాలు, అర్థవంతమైన అన్ని పదాలూ ఇందులో ఉన్నాయని చెప్పాడు. ‘‘ఈ ప్రపంచంలో దేనికీ అర్థం లేదు. మనం ఏదైతే అర్థమైందని అనుకుంటామో, దాని అర్థం అది కాకపోవచ్చు. అర్థం కానిదంతా అర్థశాస్త్రం. అర్థమైతే అది పరమార్థం. పురుషులు అర్థమవుతారు కాబట్టి పురుషార్థం అన్నారు. స్త్రీలు అర్థం కారు కాబట్టి స్త్రీ అర్థం లేకుండా పోయింది’’ అన్నాడు సుబ్బారావు తాపీగా. డిక్షనరీల కుర్రాడు బుర్ర గోక్కుని ‘‘సార్.. ఇందులో ప్రతి వర్డ్కీ..’’ అంటూ ఏదో చెప్పబోయాడు. ‘‘వర్డ్స్‌వర్త్ అనే కవి ఉన్నాడు కానీ, వర్డ్స్కి వర్త్ లేదు. అయినా పెళ్లయిన తర్వాత డిక్షనరీలతో పని లేదు. అంతా రియాక్షనీరినే’’ ‘‘దీనికి డిస్కౌంట్ కూడా ఉంది’’. ‘‘కౌంట్, డిస్కౌంట్, ఎకౌంట్, రీకౌంట్ అన్నీ ఒక్కలా కనిపించినా ఒక్కటి కావు. జాయింట్ ఎకౌంట్ ఉంటే జాయింట్స్ సేఫ్‌గా ఉంటాయి. మోకాళ్ల రీప్లేస్మెంట్ ఉండదు. మోకాళ్ల చిప్పల మార్పిడి ఎంత ఎక్కువగా జరిగితే సొసైటీకి అంత ఎక్కువ డేంజర్. ఎందుకంటే చాలామందికి మెదడు మోకాళ్లలో ఉంటుంది కాబట్టి’’. డిక్షనరీల కుర్రాడు ఘటికుడు. డిక్షనరీలు మోసి మోసి వాడు ఎక్స్ట్రార్డినరీగా మారాడు. ఎబిసిడిలు రాని వాళ్లకు కూడా డిక్షనరీలు అమ్మిన ఘనుడు. ‘‘డిక్షనరీల వల్ల జ్ఞానమొస్తుంది సార్’’ అని నోరు జారాడు. జ్ఞానం అనే పదం వింటే సుబ్బారావుకి పూనకం వస్తుంది. ‘‘డిక్షనరీల వల్ల డిసెంట్రీ, డిఫ్తీరియా, ధనుర్వాతం రావచ్చునేమో కానీ జ్ఞానం రాదు నాయనా. జ్ఞానమనేది దురద కాదు, హఠాత్తుగా వచ్చి గోక్కుంటే పోడానికి. మన శరీరంలో రక్తంలా అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మనం గాయపడితే కనిపిస్తుంది. జ్ఞానాన్ని కళ్ల చూడాలంటే ప్రతివాడూ గాయపడాలి. ఎర్రగా కనిపించేదంతా రక్తం కానట్టే, జ్ఞానంలా కనిపించేదంతా జ్ఞానం కాదు. అజ్ఞానానికి మారువేషాలెక్కువ’’. ‘‘మీరు జ్ఞానులని ఒప్పుకుంటాను సార్, కానీ ఎంత జ్ఞానికైనా అర్థం తెలియని పదాలుంటాయి. అందుకే ఈ డిక్షనరీ’’. ‘‘అయితే అభిటృక్యనేక్సియాన్టక్స్ అనే పదానికి అర్థం చెప్పు’’. ‘‘అరబ్ పదానికి అర్థం అడిగితే ఎలా?’’అన్నాడా కుర్రాడు జడుసుకుంటూ. ‘‘అది అరబిక్ అని నీకెలా తెలుసు?’’ ‘‘సౌండ్‌ని బట్టి ఊహించా’’. ‘‘అది అరబిక్ కాదు, మక్యావో భాష’’. ‘‘ఏ దేశంలో మాట్లాడుతారు సార్’’. ‘‘ఎక్కడా మాట్లాడరు. మాటలు రానివాళ్లు మాట్లాడతారు. మనకు తెలిసిందే భాష కాదు. చూసిందే వేషం కాదు’’. డిక్షనరీలు అమ్మకుండా వెళ్లడం ఆ కుర్రాడి డిక్షనరీలోనే లేదు. ఎన్నో జిడ్డు గిరాకీలను చూశాడు కానీ, ఆముదంలో ఈదడం ఇదే మొదటిసారి. ‘‘మీరు ఫిలాసఫరా సార్’’ అని పొగడ్డానికి ప్రయత్నించాడు. ‘‘ప్రతి సఫరర్ ఫిలాసఫర్ కాకపోవచు కానీ, ప్రతి ఫిలాసఫర్ సఫరరే’’. ‘‘మీలాంటి వాళ్ల కోసమే ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సార్’’. ‘‘ఆక్స్ అంటే ఎద్దు. ఎద్దు.. చాకిరీ చేసే జంతువు. బానిస. స్లేవరీ పేరుతో ఉండే డిక్షనరీలు నేను కొనను’’ ‘‘మీకు కొనడం ఇష్టం లేదు. అందుకే ఈ జ్ఞానబోధ’’ ‘‘కొనుగోళ్లు, అమ్మకాలు మన ఇష్టాల ప్రకారం జరగవు. మనల్ని మనం అమ్ముకుంటేనే, మనకు కావాల్సినవి కొనగలం. వ్యాపారమైనా, కోళ్ల ఫారమైనా కంపు లేకుండా నడవదు. వాదం, వేదం, నిర్వేదం చివరికంతా జూదం. వెళ్లకపోతే నీకు ప్రమాదం’’. కుర్రాడు పారిపోతూ సుబ్బారావు ఇంటికి ‘నో ఎంట్రీ’ బోర్డు తగిలించి వెళ్లాడు. - జి.ఆర్.మహర్షి -
సోఫాలో సాఫీగా...
హ్యూమర్‌ప్లస్ నేల, బెంచీ, కుర్చీలు కాకుండా సోఫా క్లాసులు కూడా ఉంటాయని హైదరాబాద్ వచ్చాకే తెలిసింది. ఈమధ్య ఒక సినిమాకి వెళ్లాను. బటన్ నొక్కితే సోఫా విచ్చుకుంది. కాళ్లు చాపుకుని పడుకున్నా. పక్కసీటాయన లేపితే లేచా. ‘‘నిద్రపోండి, కానీ గురకపెట్టకండి. నా నిద్ర డిస్టర్బ్ అవుతోంది’’ అన్నాడు. ఈ సోఫా వల్ల సౌలభ్యం ఏమింటే, సినిమా బావున్నా, బాలేకపోయినా నిద్ర మాత్రం గ్యారంటీ. ఈమధ్య మా ఆవిడ సెల్లో రికార్డు చేసిన ఒక విచిత్రమైన సౌండ్ వినిపించింది. కుక్క, పిల్లి, కోతి ఒక బోనులో గొడవపడుతున్నట్టుగా వుంది. ‘‘ఏంటీ శబ్దం?’’ అని కంగారుగా అడిగాను. ‘‘మీ గురక’’ అంది. మగవాళ్ల గురక వల్ల ఆడవాళ్లకి మతి భ్రమణమైనా కలుగుతుంది. లేదా వేదాంతమైనా అబ్బుతుంది. రెంటికీ పెద్ద తేడా లేదు. ఆడవాళ్లు కూడా భారీగా గురకపెడతారు. వయసుని ఒప్పుకోనట్టే, దీన్ని కూడా ఒప్పుకోరు. నా మిత్రుడు ఒకాయన భార్య గురకకి భయపడి హౌస్‌కి వెళ్లకుండా మాన్షన్‌హౌస్ మందు తాగుతున్నాడు. మరక మంచిదే అని సర్ఫ్వాళ్లు అన్నారు కానీ, గురక మంచిదే అని ఎవరైనా అన్నారా? ఈ మధ్య మన సినిమాలు నిద్రకి మంచి మందుగా పనిచేస్తున్నాయి. నా మిత్రుడికి వ్యాపారంలో ఒక స్లీపింగ్ పార్టనర్ ఉన్నాడు. ఆయన సినిమాకెళితే టైటిల్స్ వస్తున్నప్పుడు నిద్రపోయి, రోలింగ్ టైటిల్స్‌లో లేస్తాడు. మధ్యలో ఏం జరిగినా ఆయనకి అనవసరం. ఈమధ్య సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాకి వెళ్లి చిరాకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ ప్రతి ఐదు నిముషాలకి ఒసారి తుపాకీతో కాల్చి నిద్రపట్టకుండా చేశాడట! డైలాగుల కంటే తుపాకి గుళ్లే ఎక్కువగా పేలాయట. కాల్చడం మొదలుపెడితే పవన్ ఎవరి మాటా వినడు. నిద్రలో బోలెడు రకాలుంటాయి. కునుకు, దొంగనిద్ర, కలత నిద్ర, గాఢనిద్ర, యోగనిద్ర, దీర్ఘనిద్ర. చివరిదాన్ని ఎవడూ తప్పించుకోలేడు. వెనుకటికి ప్రధానిగా ఉన్నప్పుడు దేవెగౌడ కునుకు వేయకుండా ఏ సమావేశమూ ముగించేవాడు కాదు. దొంగనిద్ర ఎలా పోవాలో శ్రీకృష్ణుడికి బాగా తెలుసు. అందుకే కురుక్షేత్రం నడిపించాడు. విజయ్‌మాల్యాకి అప్పులిచ్చినవాళ్లంతా అనుభవిస్తుండేది కలతనిద్ర. గాఢనిద్ర పసి పిల్లల ఆస్తి. స్కూల్లో చేరిన తరువాత ఆ ఆస్తిని పోగొట్టుకుని అప్పులపాలవుతాం. ఇతరుల దుఃఖాన్ని తమదిగా భావించే మహాయోగులకి అబ్బేది యోగనిద్ర. అది మనకు చేతకాదు. నిద్ర పట్టని వాళ్లుంటారు. నిద్రపోయేవాళ్లని చూస్తే వీళ్లకు జెలసీ. వీళ్లు ఆఫీస్‌లో బాస్‌లైతే మనం చచ్చినా నిద్రపోలేం. నిద్రలో నడిచేవాళ్లుంటారు. నా చిన్నప్పుడు ఒకాయనుండేవాడు. డిటెక్టివ్ పుస్తకాలు తెగ చదివేవాడు. నిద్రలో నడుస్తూ ‘‘మిస్టర్ ఏజెంట్ త్రిబుల్వన్, నీ ఆటలు డిటెక్టివ్ యుగంధర్ వద్ద సాగవు’’ అని అరుస్తూ వీధిలో వాళ్ళందరికీ జేమ్స్‌బాండ్ సినిమాలు చూపించేవాడు. నిద్రలో కలలొస్తే వరం. పీడకలలొస్తే కలవరం. జర్నలిస్ట్‌లకి సరిగా నిద్ర వుండదు కాబట్టి కలలు కూడా సరిగా రావు. జర్నలిస్ట్‌గా వున్నప్పుడు ఏది కలో, ఏది మెలకువో తెలిసేది కాదు. జర్నలిజమే ఒక వైష్ణవమాయ. తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు ఆఫీస్‌లో కొందరు నిద్రపోతూ పనిచేసేవాళ్లు. పనిచేస్తూ నిద్రపోయేవాళ్లు. ఈ నిద్రావస్థలో ఒకసారి మునిసిపల్ చైర్మన్ ఫోటోకి బదులు గజదొంగ ఫోటో పెట్టారు. జనం పెద్ద తేడా తెలుసుకోలేకపోయారు. చైర్మన్ కూడా తన మొహాన్ని గుర్తుపట్టలేకపోయాడు. (మనల్ని మనం గుర్తుపట్టడమే అన్నిటికంటే కష్టం). గజదొంగ పేపర్ చదవడు కాబట్టి, మా స్లీపింగ్ సబ్ఎడిటర్లు వాడికిచ్చిన గౌరవాన్ని గుర్తించలేకపోయారు. మనుషులే కాదు, ప్రభుత్వాలు కూడా నిద్రపోయి గురకపెడతాయి. మన ప్రభుత్వాలకి వున్న మంచి లక్షణాల్లో ఇదొకటి. నిద్రపోవడం మన హక్కు. నిద్రని నేను గౌరవిస్తాను కానీ, గురక మాత్రం ఇతరుల హక్కుల్ని హరించడమే! - జి.ఆర్. మహర్షి -
ఐడిల్‌నెస్‌తో ఐడియాలు!
హ్యూమర్ ప్లస్ సోమరితనం మంచి గుణం కాదంటూ చాలా మంది ఈసడిస్తుంటారు. భాషలకు అతీతంగా సోమరితనాన్ని తిడుతూ సామెతలు పుట్టించారు. సోమరిని మొద్దు అనీ, సోంబేరి అనీ రకరకాల ప్రాంతీయభాషల్లో తూలనాడారు. నిజానికి సోమరిగా ఉండటం వల్లనే మనిషి అనేక విధాల పురోగతి సాధించాడని కొందరి అభిప్రాయం. అసలు వ్యవసాయం అనే ప్రక్రియ పుట్టిందే బద్దకం వల్ల కావచ్చని స్థిమితంగా ఆలోచిస్తే తెలుస్తుంది. రోజూ వేటాడటం బద్దకం అనిపించిన ఆదిమానవుడు తన వృత్తికి ప్రత్యామ్నాయం కనిపెట్టాడని కాస్త బద్దకంగా పడుకొని యోచిస్తే తెలుస్తుంది. దీనికి అనేక తార్కాణాలు ఉన్నాయి. ఉదాహరణకు రోజూ కూరొండుకోవడం కష్టమనిపించి మర్నాటికి నిల్వ ఉంచడం కోసమే ముందుగా పచ్చడి కనిపెట్టాడు. అందులో మరింత అడ్వాన్స్ అయిపోయి ఫ్రిజ్జును రూపొందించాడు. అందుకే మొట్టమొదట పచ్చడిని కనుగొన్నవారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలిగానీ.. ఆ కనిపెట్టిందెవరో వెతకడం కాస్త బద్దకమనిపించి మానేశారని కొందరు అంటుంటారు. అలసత్వానికి అలవాటు పడ్డ మనిషికి ‘నడక బహు కష్టం’ అనిపించింది. రెండు కాళ్ల మీద నిలబడి, అదేపనిగా నడవటం కష్టమనిపించింది. దాంతో సీట్ మీద కూర్చొని తొక్కే సైకిల్ కనిపెట్టాడు. కానీ అక్కడితో ఆగిపోలేదు. స్టీరింగ్ ముందు బద్దకంగా కూర్చున్నా సునాయాసంగా ముందుకు వెళ్లడం కోసం కారు కనిపెట్టాడు. బద్దకానికి లెసైన్స్ ఇవ్వడం కోసం కారును దర్జాకు చిహ్నం అని వదంతులు వ్యాప్తి చేశారు. ఈ బద్దకం అనే గుణమే లేకపోతే కార్లూ, విమానాలూ ఉండేవి కాదని కాళ్లు బార్లాజాపుకొని ఆలోచిస్తే, నిదానం మీద తెలుస్తుంది. ఇక ఇదే బద్దకం బాగా పెరిగిపోయి, వాహనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ‘ఆ... మళ్లీ ఎవడు స్టార్ట్ చేస్తాడులే’ అంటూ తన గుణాన్ని వాహనం ఇంజన్‌కూ నేర్పుతాడు. ఇలా ఇంజన్ చేత ఇంధనం ఖర్చు పెట్టిస్తాడు. కాలుష్యమైనా పెంచుతాడు కానీ కార్బ్యురెటర్ కాక తగ్గనివ్వడు. సాధారణంగా మగవాళ్లే సోమరితనానికి అలవాటు పడి ఉంటారు. ‘ఏవోయ్... కాస్త కాఫీ ఇవ్వు... ఆ పేపర్ ఇలా అందించు... కళ్లజోడు అందుకో... టీవీ ఆన్ చెయ్ / టీవీ ఆఫ్ చెయ్’ అంటూ వాళ్ల పార్ట్నర్కు పనులు పురమాయిస్తుంటారు. ఇలాంటి వ్యాలిడ్ రీజన్ వల్లనే సోమరి‘పోతు’ అనే మాట పుట్టింది. సోమరుల బుర్ర దెయ్యాలకు వర్క్‌షాప్ అంటుంటారు. ఆ సామెతను అపార్థం చేసుకుంటారు. కానీ ‘దెయ్యాలకు తగిన పని దొరుకుతుంది కదా, అవి సదరు మెదడును కార్యక్షేత్రం చేసుకొని పాపం కష్టించి పనిచేస్తున్నాయి కదా’ అని ఆలోచించరు. పైగా ‘బుర్రతిరుగుడు’ అని కూడా నిందించే అవకాశం ఉంది. కానీ అవి వచ్చి పనిచేయడం వల్లనే కదా... కొత్త కొత్త ఆలోచనలు పుట్టి, కొత్త కొత్త ఆవిష్కారాలు జరుగుతున్నాయి. అందుకే ఆ ఇంగ్లిష్ సామెత విషయంలో మనుషులందరూ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ మీటింగులు అవీ పెట్టడం, పునరాలోచించుకోవడం వంటివి తిరిగి మనకే శ్రమను పెంచే పనులు. అందుకే ఎవరికి వారు ఒకసారి ‘ఇటీజ్ ఐడియల్ టు బి ఐడిల్’ అని ఒకసారి తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. - రాంబాబు -
లవ్-ఇష్క్-కాదల్
హ్యూమర్ ప్లస్ మనిషితో పాటే ప్రేమ పుట్టింది. కాకపోతే తొలి ప్రేమ వెనుక సైతాను ఉన్నాడు. ఆ మహానుభావుడు లేకపోయినా ఆడం, ఈవ్లు ఆపిల్‌ను తినేసి మన కొంప ముంచేవాళ్లు. మంచి చెబితే వినకపోవడం అక్కణ్ణుంచే మొదలైంది. ప్రేమ, దోమ ఎప్పుడూ కుడుతూనే ఉంటాయి. కొంతమందికి లేట్‌గా. కొందరికి టూ ఎర్లీగా. మా స్కూల్లో బాబు అని ఒకడుండేవాడు. టూమచ్ వాడు. మేస్టార్ ఎంత చావబాదినా ఇంగ్లిష్‌లో వాడు నేర్చుకున్నది ఒకే ఒక వాక్యం.. ఐ లవ్ యూ. అమ్మాయిలు కనిపిస్తే గజనీలాగా పిచ్చి చూపులు చూసి తనలోని అపరిచితుణ్ణి బయటికి తెచ్చేవాడు. కమ్యూనికేషన్లు లేని కాలం. సినిమాల్లో తప్ప బయట ఫోన్లు చూసినవారు, చేసినవారు అరుదు. లవ్ లెటర్లే దిక్కు. వీటితో సమస్య ఏమిటంటే కష్టపడి రాయాలి. ధైర్యంగా ఇవ్వాలి. బాబు స్పెషాలిటీ ఏమంటే వాడికి ఏ భాషా రాదు. ఆ విషయం వాడికి తెలియదు. ఒకమ్మాయికి లెటర్ ఇచ్చాడు. వీడి బాడీ లాంగ్వేజీ అర్థమైంది కానీ, లెటర్లో లాంగ్వేజీ అర్థం కాలేదు. తీసుకెళ్లి వాళ్ల నాన్నకిచ్చింది. ఆయన బాబు వాళ్ల నాన్నకు షేర్ చేశాడు. కట్ చేస్తే జల్లికట్టులో ఎద్దు పరిగెత్తినట్టు బాబు వీధుల్లో పరిగెత్తాడు. వెనుక కర్రతో వాళ్ల నాన్న. అనేక దండయాత్రల్లో ఓడిపోయినా, చివరికి ఈ బాబు ఒకమ్మాయిని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వాడు ఇంగ్లిష్‌లో నేర్చుకున్న రెండో వాక్యం లవ్ ఈజ్ ఇన్జ్యూరియస్ టు హెల్త్. దేవదాసు, మజ్నూలు భగ్న ప్రేమికులు కాబట్టే కథల్లోకి ఎక్కారు కానీ, పెళ్లయి ఉంటే వాళ్ల కథ కంచికి చేరేది. అక్కడ పార్వతి, లైలాలు కలిసి పట్టు చీరలు షాపింగ్ చేసేవాళ్లు. బోలెడంత మంది గొప్ప ప్రేమికులు పెళ్లయింతర్వాత వేదాంతులుగా మారిపోయారు. కొందరు సన్యాసుల్లో చేరిపోయారు. సన్యాసుల్ని చేయడమే తప్ప, సన్యాసంలో కలిసిపోయే అవకాశం ఆడవాళ్లకు లేనందువల్ల వాళ్లు గరిటెతో క్రికెట్ ఆడడం నేర్చుకున్నారు. గ్రౌండ్‌కి బదులు మొగుడి బుర్ర ఉంటుంది అంతే తేడా. సోక్రటీసుది కూడా లవ్ మ్యారేజే అయి ఉంటుంది. లేకపోతే నెత్తిన నీళ్ల కుండ బోర్లించేంత కోపం ఆవిడకెందుకొస్తుంది? జంకు లేకుండా విషం తాగడం వెనుక ఆయనకి అలాంటి అనుభవాలు బోలెడు ఉండే ఉంటాయి. ప్రేమించుకునేటప్పుడు లైన్లో లవర్స్ మాత్రమే ఉంటారు. పెళ్లయిన తర్వాత పాలవాడు, అద్దెవాడు, కిరాణా కొట్టు వాడు.. ఇలా కొట్టి డబ్బులు లాక్కోడానికి చాలామంది లైన్లో కొస్తారు. ఆ తర్వాత పిల్లలు లైన్లోకి వస్తారు. గుర్రుపెట్టి నిద్రపోతున్న మొగుణ్ణి చూసి ఈ ఎలుగుబంటినా నేను లవ్ చేసింది అని కంగారుతో నిద్రలేచిన భార్యలు ఎందరో ఉన్నారు. ప్రతి రోజూ ప్రేమికుల రోజే. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ప్రేమికుల రోజు వచ్చింది. అయితే కొందరు పూనకం వచ్చి అడ్డుకోవాలని కూడా చూస్తున్నారు. ప్రేమని, గాలిని బంధించడం కష్టం. టెక్నాలజీ పెరిగి ప్రేమ కూడా సులభమైపోయింది. ఫేస్‌బుక్‌లు, వాట్సప్‌లతో ఎదిగిపోతూ ఉంది. గతంలో ప్రేమ పెరగడానికి, విరగడానికి కాస్త టైమ్ పట్టేది. ఇప్పుడంతా పర్ఫెక్ట్ టైమింగ్. ఉదయం స్టార్ట్ అయి, ఈవెనింగ్‌కి బ్రేకప్ కూడా అయిపోతూ ఉంది. మచ్చల్ని వెతకడం మూర్ఖత్వం. చంద్రుణ్ణి చూడడం ఆనందం. - జి.ఆర్.మహర్షి -
సర్ప సందేశం!
‘‘పాపం... దానికింత జండూబామ్ ఇచ్చే దిక్కుండదు. కానీ నడుములు పడిపోయేలా డాన్స్ చేస్తుంటుందిరా’’ అన్నాడు రాంబాబు. ‘‘ఎవరది?’’ విషయం తెలియక అడిగా. ‘‘ఇంకెవరు... మన నాగుపామే. పగలూ, రాత్రీ తేడా లేకుండా ఎవడి నిధి, నిక్షేపాలకో సెక్యూర్టీ గార్డు డ్యూటీ చేస్తుంటుందా! రోజంతా నెత్తిన మణి పెట్టుకొని ఆ మోతబరువంతా మోస్తుందా! మళ్లీ మరో చోట గారడీవాడి జేబులోకి నాలుగు కాసులు రాలడానికి, పొద్దస్తమానం వాడి బుట్టలో పడుకోడానికి తయారు. దాని త్యాగాన్ని చూస్తే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి రా’’ అన్నాడు రాంబాబు గాడు. రోజురోజుకూ మా రాంబాబు ధోరణికి బీపీ రెయిజ్ అవుతోంది నాకు. ఏది ఏమైనా వాడిని దారికి తెచ్చుకోవాల్సింది నేనే కదా. అందుకే వాడికి రెండు హితవు మాటలు చెప్పా. ‘‘ఒరేయ్ లోకమంతా ఓ దారయితే నువ్వు మరో రూటు రా. కాటేసే పాముకు మంచితనం ఏంట్రా?’’ అని అననైతే అన్నాను కానీ... వాడు చెప్పింది విన్న తర్వాత నాకూ పెద్దగా తప్పనిపించలేదు. అలంకార్ టాకీస్ దగ్గర గారడీవాడు ప్రదర్శించిన, ఉచిత పబ్లిక్ షో చూసి వస్తున్నాట్ట. వెంటనే వాడు నాగుపాము పక్షం వహించాడు. ‘‘అదెంత మంచిదో... దాని శ్రమను అప్పనంగా దోచుకునే గారడీవాణ్ణి చూడు. అదెంత మంచిదో... అమాయకంగా వాడు ఆడించినట్టల్లా ఎలా ఆడుతుందో చూస్తే తెలుస్తుంది. ఒక్క వాడికనే ఏమిటిలే అలనాటి మన శ్రీదేవి దగ్గర్నుంచి మొన్నటి మల్లికా షెరావత్ వరకూ అందరికీ తన రోల్స్ ధరించే అవకాశం ఇచ్చింది. తన కాస్టూమ్స్ వేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్లలా ఫ్యామిలీ పాములుండేవి. నువ్వు నమ్మవుగానీ... అప్పట్లో ఫ్యామిలీ పాముల కాన్సెప్టుతో నోము లాంటి సినిమాలూ వచ్చేవి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ ఎవరిమాటా కాదనదురా పాపం పాము...’’ ‘‘సామాన్యుల మాట కూడా కాదనదా?’’ ‘‘అవును. నాగుల చవితి రోజున పాలు పోస్తుంటే తన ఒళ్లూ ఇల్లూ గుల్లయ్యేలా పబ్లిక్ పాలు పోస్తున్నా... వద్దు అనదు రా అది. ఏమైనా చెప్పాలంటే పళ్లు లేక, కోరలు పీకి ఉన్న అది ‘బుస్ బుస్’ అంటూ మూగగా రోదిస్తుంటుంది. గారడీవాడు బూర పైకి లేపినప్పుడల్లా ఇది తోక మీద లేవాలి కదా. దాంతో వాడి బూర ఊదుడుకు తగ్గట్లు డాన్స్ చేయడానికి దాని తల ప్రాణం తోకకు వస్తుందిరా’’ అన్నాడు. ‘‘ఇంకొక్క మాట మాట్లాడితే బుర్ర బద్దలు కొట్టేస్తా. ఇంక నోర్ముయ్’’ అని కోప్పడ్డాను. వెంటనే వాడు... ‘‘ఒరేయ్... మంచితనం అన్నది కొబ్బరి నీళ్ల లాంటిది, కానీ సదరు మంచితనాన్ని మన ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలంటే బొండాకు బొక్కెట్టకుండా, టెంకాయను పగలగొట్టకుండా, పాముకు పడగ విప్పనియ్యకుండా పనవుతుందా? అందుకే రా అనాదిగా నీలాంటి వాళ్ల చేతుల్లో మాలాంటివాళ్ల బుర్రబద్దలు అవుతూనే ఉన్నాయి. గారడీవాడి బూరలకు అమాయకప్పాముల పడగలు వాచిపోతున్నాయి’’ అంటూ ఆవేశపడ్డాడు. ఇలా మాటల్లో నడుస్తూ, నడుస్తూ... మా అక్కవాళ్ల ఇంటి దగ్గరకు చేరాం. నేను చెబితే ఎలాగూ వినడం లేదు. పెద్దవాడు... కనీసం మా బావతోనైనా చెప్పిద్దామని ఆయనతో విషయమంతా చెబితే... ‘‘పాములు విషం కక్కుతాయనీ, నేను నిజం కక్కుతాననీ ప్రతీతి. అయినా రాంబాబు గాడు చెప్పింది నిజమేనేమోరా... అంతే అందంగా ఉండి, ఒకవేళ విషం గానీ లేకపోతే మన నాగుపామును పెంచుకోవాలని ఉబలాటపడనివాడు ఎవడైనా ఉంటాడా? అయినా ఒక్క మాట చెబుతా వినండ్రా. అక్రమంగా ‘మనీ’ సంపాదించే ‘కాల్’నాగుల కంటే... మన కాలనాగు బెటర్ కాదంటావా?’’ అన్నాడు మా బావ చిద్విలాసం చిందిస్తూ!! - యాసీన్ -
మనిషి గతి ఇంతే!
హ్యూమర్ ప్లస్ మనుషులు లక్షా తొంభై రకాలు. మనకు గట్టిగా తొంభై రకాలే పరిచయమవుతారు. మిగిలిన లక్ష గురించి తెలుసుకోవడం ఇతరుల బాధ్యత. మనం చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం కానీ మన డిఫెక్ట్స్ ఎదుటివాళ్లు కనిపెడతారు. ఇతరుల పిచ్చిని తెలుసుకోవడమే పనిగా పెట్టుకున్నవాళ్లు కొందరుంటారు. వాళ్లే పిచ్చాసుపత్రి డాక్టర్లు. జీతం తీసుకుని మరీ పిచ్చివాళ్లతో కలిసి జీవిస్తుంటారు. నాకు తెలిసిన డాక్టర్ ఒకాయన ఉన్నాడు. నైజీరియా ప్రభుత్వం డాక్టరేట్ ఇచ్చి సన్మానం చేస్తుందని ఈ-మెయిల్ వస్తే ఖర్చుల కోసం 50 వేలు బ్యాంక్‌లో కట్టాడు. ఆ తరువాత నైజీరియా నుంచి సమాధానం నై. అసలు నైజీరియా వాళ్లకి కొట్టుకు చావడానికే టైం లేదు, మధ్యలో ఈయన్ని పిలిచి సన్మానం ఎందుకు చేస్తారు. వాళ్లకేమైనా పిచ్చా? అందరి పిచ్చిని తెలుసుకునే ఈయన ఇది తెలుసుకోలేక డబ్బు పోగొట్టుకున్నాడు. మన గురించి ఎవడైనా గొప్పగా అనుకుంటే చాలు ఒళ్లు మరిచిపోతాం. మనకు అంత సీన్ ఉందా లేదా అనేది అవసరం. ఎవడి పెళ్లికి వాడే హీరో అయినట్టు మన జీవితానికి మనమే కథానాయకులం. మనంతటి వారు లేరనేది మన ఫిలాసఫీ. తాగినప్పుడు ఇది చాలామందికి తలకెక్కుతుంది. మీరు తాగుబోతులైనా కాకపోయినా పర్లేదు. అయితే మరీ మంచిది. కల్లు కాంపౌండ్‌లో గానీ వైన్‌షాప్‌లో గానీ కాసేపు కూర్చుని చూడండి. బోలెడంత వేదాంత చర్చ జరుగుతూ ఉంటుంది. ‘‘నేనెవర్ని? ఎలాంటివాన్ని? ఈ లోకాన్ని అడగండి అదే చెబుతుంది. డబ్బుదేముంది. మనుషులు ముఖ్యం. అన్నీ చూడ్డానికి దేవుడున్నాడు. కొంచెం సోడా పొయ్. ఆ బాయిల్డ్ పల్లీ తీసుకో.’’ ఇది ఫస్ట్ రౌండ్ చర్చ. థర్డ్‌కి వెళితే భాష బాషా సినిమాలో రజనీకాంత్‌లా విజృంభిస్తుంది. ‘‘నన్షు అందర్షు మోసమ్ష్ చేసినా నేనెవర్షి షేయలేద్షు...’’ నిషా కదా ష అక్షరం అంతటా తానై నర్తిస్తుంది. ‘ష’ ఒక వూతకర్రతో నడిచినట్టు తాగుబోతుల అడుగులు కూడా బడతడుతాయి. ఎంత తడబడినా మనం మనింటికే వెళితే సేఫ్, లేదంటే వీపు సాప్. మనుషులందరికీ వాస్తవం కంటే భ్రాంతి ఎక్కువ ఇష్టం. రియాల్టీలో క్రూయాల్టీ ఉంటుంది. దాన్ని తట్టుకోవడం కష్టం. అందుకే సినిమాలకెళ్లి రంగుల్లో కలల్ని కొనుక్కుంటాం. కొంతమంది దర్శకులు తెలివి మీరి తెరపైన కూడా జీవితాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. అంతకంత అనుభవిస్తారు. ఉన్న జీవితంతోనే చస్తుంటే డబ్బిచ్చి కూడా జీవితాన్నే చూడమంటే ఎవరు చూస్తారు? లైఫ్ నుంచి, వైఫ్ నుంచి పారిపోవడానికి తాగడం మొదలుపెడతారు. ఎక్కింది దిగగానే ఎదురుగా నైఫ్లే వైఫ్. ఒకాయన ఉన్నాడు. ఆయనెప్పుడూ నోరే తెరవడు. ఒకటి మాట్లాడితే భార్య తంతుంది. రెండు మాట్లాడితే ఉతుకుతుంది. అందుకే ఆ మౌనదీక్ష. కాని మందు పడితే మౌనం పారిపోతుంది. అరుపులు, పెడబొబ్బలు, సవాళ్లు... బండి డౌన్ కాగానే గాలి తీసిన బెలూన్, మూగవాడి పిల్లనగ్రోవి. మనదేశం గొప్పతనం ఏమంటే ఇక్కడ కల్తీ కల్లు తాగి చచ్చిపోతారు. కల్తీ కల్లు దొరక్కపోతే కూడా చచ్చిపోతారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా పోయేది బరియల్ గ్రౌండ్‌కే! - జి.ఆర్.మహర్షి -
గోట్స్ థియరీ
హ్యూమర్ ప్లస్ నిజానికి మనుషులకి, గొర్రెలకీ పెద్దగా తేడా లేదు. ఈ విషయం అందరి కంటే టీవీ చానెల్స్ వారికి బాగా తెలుసు. ఒక రోజు మనుషులెవరూ దొరక్క ఒక గొర్రెని స్టూడియోకి తీసుకొచ్చి ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. ‘‘గతంలో కూడా మేము చాలా గొర్రెలతో ఇంటర్వ్యూ చేశాం. అయితే అవి మనుషుల్లా మేకప్ చేసుకుని రావడం వల్ల మీరు గుర్తు పట్టలేకపోయారు. ఈసారి ఒరిజినల్ గొర్రెనే పిలిపించాం. ఇది మనుషులకంటే తెలివైన సమాధానాలే ఇస్తుందని నమ్ముతున్నాం’’ అని ప్రారంభించింది యాంకర్. ప్ర. ‘‘మేకలు మేమే అంటాయి. మీరెందుకు అలా అరవరు?’’ జ. ‘‘మే నెల అంటే మాకిష్టం లేదు. ఒకటే ఎండ’’ ప్ర. ‘‘మనుషులపై మీ అభిప్రాయం ఏమిటి?’’ జ. ‘‘గొర్రెలుగా మారాలంటే ఇంకాస్త ఎదగాలి’’ ప్ర. ‘‘ప్రజాస్వామ్యంపై మీ ఒపీనియన్?’’ జ. ‘‘అది హనుమంతుడి తోకలా ఉంటుందని నాయకులు చెబుతుంటారు కానీ అది వాస్తవానికి మా తోకంత ఉంటుంది. అధికారమనేది దుడ్డుకర్రలాంటిది. అది చేతిలో ఉంటే ఎవరో ఒకర్ని మోదాలనిపిస్తూ ఉంటుంది. ఇక మనుషులే ఏ ఒపీనియన్స్ లేకుండా జీవిస్తున్నప్పుడు గొర్రెల ఒపీనియన్స్‌ని గౌరవించడం మీ చానెళ్ల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ‘‘గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందని ఎందుకంటారు?’’ ‘‘నమ్మినా నమ్మకపోయినా వాడెలాగూ చంపలేడు. అవిశ్వాసంతో మరణించడం కంటే, విశ్వాసంతో మరణించడం శ్రేయస్కరం. ఓటేసినా, వేయకపోయినా ఎవరో ఒకరు గెలవడం తప్పనిసరి అయినట్టు, చచ్చేవాడి నమ్మకాలతో ఒరిగేదేమీ లేదు.’’ ‘‘మీరు ఫిలాసఫరా?’’ ‘‘కాదు ఫిలాసఫరర్’’ ‘‘మీకేమైనా థియరీస్ ఉన్నాయా?’’ ‘‘తోక ఉన్నప్పటికీ విప్పలేను, చెప్పలేను, దీన్ని టెయిల్స్ థియరీ అంటారు’’ ‘‘టెయిల్ ఉన్నప్పుడు హెడ్ కూడా ఉండాలిగా. ఆ థియరీ చెప్పండి’’ ‘‘ఆఫీసుల్లో అనేకమంది హెడ్స్ ఉన్నట్టు. ఈ హెడ్స్లా రకరకాల థియరీలు ఉంటాయి. హెడ్ మూవ్మెంట్ అంటే ఎదుటివాడు చెప్పేది అక్షరం అర్థం కాకపోయినా అన్నింటికి తల ఊపే థియరీ ఇది. వీళ్లకు నాలుగు కాలాల పాటు హెడ్ పదిలంగా ఉంటుంది. హెడ్ వెయిట్ థియరీ అంటే ప్రపంచమంతా మన తలలో నుంచే నడుస్తుందని నమ్మే థియరీ. లోకం బరువు మోసి మోసి వీళ్ల తలకాయ చైనా చార్జర్‌లా పేలిపోతుందని అనుకుంటూ ఉంటారు. అందరి తలరాత రాస్తున్నామని అనుకుంటారు కానీ తలకి నూనె తప్ప ఇంకేమీ రాయలేరు. హెడ్‌లెస్ థియరీ అని ఇంకొకటుంది. బయటికెళ్లాక తల ఉంటుందో లేదో తెలియని నాలాంటి వాళ్లు చెప్పే థియరీ ఇది’’ ‘‘థియరీస్ బావున్నాయి. ప్రాక్టికల్స్‌కి కూడా ఉన్నాయి?’’ ‘‘థియరీస్ మేం చెబుతాం. నాలాంటి వాళ్లని బిరియాని వండుకుని ప్రాక్టికల్స్ మీరు చేసుకుంటారు’’ ‘‘మనుషులకి గొర్రెలకి తేడా లేదని మా అభిప్రాయం’’ ‘‘గొర్రెలకి మనుషులకి తేడా లేదని నా అభిప్రాయం’’ ‘‘రెండు ఒకటేగా?’’ ‘‘ఒకలా కనిపించేవన్నీ ఒకటి కావు. ఉప్పు కప్పురంబు పద్యం తెలుసుగా. మీరు ప్రతీది మనుషులతో పోలుస్తారు. మేం గొర్రెలతో పోలుస్తాం. మనుషులు మారాలి అని మీరంటే, గొర్రెలు మారాలి అని మేమంటాం’’ ‘‘ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం’’ ‘‘పైసా ఖర్చు లేకుండా వాట్సప్‌లో ఎవరికి వాళ్లు లక్షల సందేశాలు ఇచ్చుకుంటుంటే గొర్రెలిచ్చే సందేశం ఎవడికి కావాలి? అయినా అడిగారు కాబట్టి ఇస్తున్నా. మీరు మనుషులైనా, గొర్రెలైనా కత్తికి దొరక్కుండా జీవించండి’’ ‘‘పొయెటిక్‌గా చెప్పారు’’ ‘‘కత్తి కంటే కవిత్వం డేంజర్’’ ‘‘మీ విలువైన అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి’’ ‘‘ఆ గుంజకి కట్టిన వాడు తాడు విప్పితే నా దారిన నేను పోతాను’’ - జి.ఆర్. మహర్షి -
తత్వబాదుడు
హ్యూమర్ ప్లస్ జాతి వైరం కూడా మరచి ఒక కుక్క, పిల్లి స్నేహం కలిపాయి. దట్టమైన ఆ స్నేహానికి కారణం పరస్పర గౌరవమే. మియ్యావ్ అనేది శబ్దం కాదని, ఒక నాదమని, అది సరిగమల మిశ్రమమని కుక్క విశ్లేషించేది. భౌభౌ అనే పదంలో భౌతిక సూత్రాలకు అందని భావుకత్వ ఆనందతత్వం వుందని పిల్లి పేర్కొనేది. కూతలో చేతనత్వం, మేతలో అనంత ఆత్మ ప్రబోధం వుందని పసర్పరం సంభాషించుకుంటూ తోకలు పెనవేసుకుంటూ ఉండేవి. పొగుడుకుంటే పోయేదేమీ లేదని సిద్ధాంతీకరించుకుని అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవి. సిద్ధాంతం, రాద్ధాంతం, వేదాంతం - ఈ మూడింటివల్లే ప్రపంచం నడుస్తూ వుందని నమ్మిన ఒక యూనివర్సిటీ వాళ్లు పనేమీ లేక ఒక సెమినార్ పెట్టి ఈ స్నేహితులని ఆహ్వానించారు. తత్వబోధన - ఒక వీరబాదుడు అనే అంశంపై వీలైతే క్లుప్తంగా ప్రసంగించమని ప్రాధేయపడ్డారు. మైకుల్ని, ప్రేక్షకుల్ని గజగజ వణికించడం ప్రాసంగిక ధర్మమని తెలిసి కూడా వాళ్లు ఈ కోరిక కోరడంలో వక్తల్లో రౌద్రరసం ఉప్పొంగింది. కుక్క ఆవేశంగా లేచి ఒక మైకు విరగ్గొట్టింది. తరువాత రెండో మైకు అందుకుని ‘‘మైకు విరవడం ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణమని మా మిత్రులు పిల్లిగారు చెపుతుంటారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. నా మిత్రుడి మాటల్లో చెప్పాలంటే తోక వూపడానికి మించిన తత్వశాస్త్రం లేనేలేదు. కుడి, ఎడమలు కాకుండా నిట్టనిలువుగా కూడా తోకను ఊపవచ్చు. ఈ మూడు రకాలు తెలిసినవాడు ముల్లోకాలు జయిస్తాడు. క్లుప్తత అంటే సంక్లిష్టత. అందరూ క్లుప్తతను ఇష్టపడతారు కానీ ఎవడి క్లుప్తత వాడికుంటుంది. క్లుప్తత వల్ల నిర్లిప్తత, నిర్లిప్తత వల్ల నిర్వేదం, దానివల్ల వైరాగ్యం, ఆ తరువాత ఆరోగ్యం సంప్రాప్తిస్తాయి. బోధన, బాదుడు ఈ రెండూ పరస్పర ఆశ్రీతాలు. బాదితేనే బోధన అర్థమయ్యేది. తత్వాన్ని బోధించడం ఎవడివల్లా కాదు. మన తత్వాన్ని ఎదుటివాడు, ఎదుటివాడి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడమే బోధన. పాలు దొరికినా దొరక్కపోయినా మా మిత్రుడు మియ్యావ్ అనే అంటాడు. మి అంటే తెలుగులో మీరు అని, ఇంగ్లీష్‌లో నేను అని అర్థం. సర్వేజనో అనే భావం ఇందులో ఇమిడి ఉంది. రష్యా, చైనా భాషల్లో ఇంకా బోలెడు అర్థాలున్నాయి. అవేవీ మనకు అర్థం కావు. అర్థమైనవాటిని అర్థమయ్యేలా చెప్పడానికే నానా చావు చస్తున్నాం. అర్థంకాని వాటి జోలికి పోకుండా వుండడమే అర్థశాస్త్రం. ఈ విషయం తెలియక కౌటిల్యుడు అనవసరంగా పెద్ద పుస్తకమే రాశాడు. ఎదుటివాడి డబ్బుని లాక్కోవడం, మన డబ్బుని ఎదుటివాడు లాక్కోకుండా కాపాడుకోవడం ఇదే కదా అర్థశాస్త్రం. దీనికి పుస్తకాలు చదవడం దండగని మా మిత్రుడి అభిప్రాయం. ఆయన భావజాలాన్ని నేను ప్రచారం చేసినట్టే నా భావ ఇంద్రజాలాన్ని ఇప్పుడు ఆయన వివరిస్తాడు’’ అని చెప్పింది. పిల్లి లేచి ఒళ్లు విరుచుకుని, తోకని జెండాలా వూపి, మీసాలు సవరించుకుని ‘‘భౌభౌ అంటే భయం లేకుండా భవబంధ సాగరాన్ని ఈదడం. అరవడం, కరవడమే జీవన్ముక్తికి మార్గమని మిత్రుడి ఉపదేశం. మనం కరచినవాళ్లంతా తిరిగి కరుస్తారని, కరవనివాళ్లంతా మనల్ని కరవకుండా వుంటారని అనుకోవడమే భ్రాంతి. పాలగిన్నె, దుడ్డుకర్ర ఈ రెండే నిజాలు. కర్రకు దొరక్కుండా బర్రెపాలు తాగాలి. ఇదే నీతి, నేతి. ఇది తెలియనివాళ్లు నూతిలో కప్పలా మిగిలిపోతారు...’’ సభికుల్లోంచి ఒక కప్ప లేచి ‘‘అయ్యా! నేను బావిలోని కప్పను కాను. బావులన్నీ ఎండిపోయి యాభై ఏళ్లయింది. మీ మిత్రులిద్దరూ ఒకరి డోలు ఇంకొకరితో కొట్టిస్తున్న తీరు అద్భుతం. మీరు మనుషులకి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ల మనోధర్మ సంగీతాన్ని అనుసరిస్తున్నారు. కానీ పొగడ్డం, పొగిడించుకోవడం చేతకాని నాలాంటి వాళ్ల సంగతేమిటి? బెకబెక శబ్దానికి విలువేలేదా?’’ అని నిలదీసింది. కప్ప మాట్లాడింది సత్యమే అయినా, సత్యం మాట్లాడ్డానికి కప్పని అనర్హురాలిగా ప్రకటించి ‘‘ఆల్ ఫ్రాగ్స్ ఆర్ రోగ్స్’’ అనే సిద్ధాంతాన్ని ఆవిష్కరించి, దాన్ని చైనీస్ కర్రీ సెంటర్‌కి పార్సిల్ చేసి సభ ముగించారు. - జి.ఆర్. మహర్షి -
వంటింటి కథ
హ్యూమర్ ఫ్లస్ సుందరి, సుబ్బారావులు భార్యాభర్తలు. అయినా ఒకే మాటపై ఉంటారు. సినిమాల్లోలా ఒకే పాట పాడుతారు. ఇద్దరికీ వంటలంటే ఇష్టం. స్టార్ వరల్డ్‌లో వచ్చే మాస్టర్ చెఫ్‌తో మొదలుపెట్టి లోకల్ ఛానల్స్‌లో వచ్చే మీ ఇంటి వంట వరకూ అన్నీ చూస్తారు. పేపర్లలోని రెసిపీలను కట్‌చేసి దాచుకుంటారు. ఉల్లిపాయల్ని ఎన్ని రకాలుగా కోస్తారో, క్యాలిఫ్లవర్ని ఏ రకంగా కడుగుతారో నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తారు. ఇంటికి గెస్ట్ వస్తే ఇద్దరూ పోటీపడి మాట్లాడుతారు. ‘‘దేవుడొక్కడే అయినా రూపాలు అనేకం అయినట్టు, కోడి ఒక్కటే కానీ, కూరలు కోకొల్లలు. చికెన్ ఉంటేనే కిచెన్‌కి అందం. కోడి లేకుండా పకోడి ఉండచ్చు. చికెన్ లేకుండా చికెన్ 65 ఉండదు. తందూరి ఎలా వండుతారంటే...’’ అని సుబ్బారావు స్టార్ట్ చేస్తే సుందరి దూరి, ‘‘చిల్లీ చికెన్‌లో మిర్చీ కనపడనట్టు, బటర్ చికెన్‌లో పెరుగు అంతర్లీనంగా ఉన్నట్టు దేన్నీ మనం నేరుగా చూపకూడదు, చెప్పకూడదు. వంట కూడా ఒక మార్మిక కళ. 64 కళల్లో పాకశాస్త్రం ముఖ్యమైంది. వంటవాళ్లలో నలభీములు ముఖ్యులు...’’ఈ ప్రవాహం ఇలా సాగుతూ ఉండగా ఒక నిమ్మకాయతో సుబ్బారావు వస్తాడు. ‘‘చికెన్ కబాబైనా, రుబాబైనా, పత్తర్‌కి ఘోష్, కలాపత్తర్కి ఫిష్ అయినా నిమ్మ పిండితే ఆ టేస్టే వేరు. నిమ్మని రెండు రకాలుగా పిండొచ్చు. చేత్తో పిండితే గింజలు చెయ్యిజారిపోతాయి. అదే జ్యూసర్లో వేస్తే తొక్క తుక్కయిపోతుంది. నిమ్మ చెక్కయినా, తొక్కయినా...’’ సుందరి అడ్డుపడి, ‘‘నిమ్మకి పెద్దన్న దానిమ్మ. పెరుగన్నంలోకి దానిమ్మ వేస్తే...’’ ‘‘నువ్వు కాస్తాగు. బాబాయిగారికి టమోటా టాంటాం గురించి చెబుతా. టమోటాని దీర్ఘ చతురస్రాకారంగా కోసి ఉప్పు చల్లి, ఉడికించి, మిరియాలు వేసి, ఆవాలు తిరగమోత పెట్టి...’’ అంటాడు సుబ్బారావు. ‘‘అసలు పాలకూర జావ తాగితే ఉంటుంది రుచి... పాలకూరని పద్దెనిమిదిసార్లు కడిగి, ఇరవై సార్లు జాడించి, పొయ్యి వెలిగించకముందే బాణలి పెట్టి...’’ సుందరి దెబ్బకి అతిథి పారిపోతాడు. ఆ తరువాత వీళ్లిద్దరూ కూచుని గోరంత పసుపు పొడితో కొండంత జబ్బులు ఎలా మాయమవుతాయో చర్చిస్తారు. ఒకసారి ఏదో పేపర్లో వంకాయలు కోసే విధానం గురించి తప్పుగా రాశారని, ఆ ఎడిటర్‌కి చేత్తో ఉత్తరం రాయడంతో పాటు, ఈమెయిల్ పంపి, ఫేస్బుక్లో డిబేట్ పెట్టారు. తమ వాదనని సమర్థించుకోవడానికి హోరాహోరీగా పోరాడారు. ధమ్ బిరియాని గురించి సుబ్బారావు ఒక వ్యాసం రాస్తే, ధమ్మర్ధమ్ బిరియాని గురించి సుందరి ఇంకో వ్యాసం రాసింది. రెంటికి తేడా ఏంటో అర్థంకాక, పాఠకులు జుత్తు పీక్కుంటే ములక్కాయల రోస్ట్ తింటే జుత్తు ఏపుగా పెరుగుతుందని చిట్కా కూడా రాశారు. వంటల గురించి ఏళ్ల తరబడి యుద్ధం చేసిన ఈ దంపతులు వండగా చూసినవాళ్లు లేరు, తిన్నవాళ్లూ లేరు. వీళ్లను చూసి నవ్వినవాళ్లూ లేరు. జీవితమంతా ఆదర్శాలు, ఆశయాల గురించి కలవరిస్తూ, ఒక్కక్షణం కూడా ఆచరించకుండా జీవించేవాళ్లు కోట్లాది మంది ఉండగా, వీళ్లను చూసి నవ్వడమెందుకు? ఈ దంపతులు నిజంగా అమాయకులు. - జి.ఆర్.మహర్షి -
మగాళ్లకి కూడా దెయ్యం పట్టించేంతగా...
హ్యూమర్ ప్లస్ మా ఊళ్లో ఒకాయనుండేవాడు. పనేమీ చేసేవాడు కాదు. మూడు పూట్లా తిని ఆరు పూట్ల నిద్రపోయేవాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకునేవాడు. ఒక్కసారి నిద్రపోతూ కూడా మాట్లాడేవాడు. మర్రిచెట్టు కింద కూచుని వచ్చీపోయే వాళ్లకి తత్వబోధ చేసేవాడు. విన్నవాళ్లకి బుర్ర తిరిగిపోయేది. వినకపోతే కర్రతో బుర్రపై ఒకటిచ్చేవాడు. విన్నా వినకపోయినా జ్ఞాన బాధే.బాధలతోనే ఈ ప్రపంచం పుట్టిందని, బాధలతోనే అంతరిస్తుందని ఆయన సిద్ధాంతం. ఈయనతో బాధలు పడిపడి ఆయన భార్యకు ఒకరోజు పిచ్చెక్కింది. ఆమె మలయాళంలో బూతులు తిడుతూ దొరికినవన్నీ దొరికినట్టు ఉతకసాగింది. మనుషులకే బస్సులు లేక సర్వీస్ ఆటోలకు వేలాడుతున్న కాలంలో ఒక దెయ్యం రెండు రాష్ట్రాలు దాటి మా ఊరికొచ్చి ఈమెను పట్టుకోవడంలో ఆంతర్యమేమిటో చెట్టుకింద పండితులకి ఎవరికీ అర్థం కాలేదు. మనుషులు తమ బాధల్ని తీర్చుకోవటానికి ఇతరుల్ని బాధించినట్టు దెయ్యాలు కూడా బాధావిముక్తి కోసం ఇలాంటి క్రియాశీలక చర్యలకు దిగుతుంటాయని ఆమె భర్త వాదించాడు. ఈ మాట అన్న మరుక్షణం ఆ దెయ్యపు భార్య దుడ్డుకర్రని గిరగిర తిప్పి భర్త మోకాళ్లకు గురిచూసి కొట్టి మలయాళాన్ని ఎత్తుకుంది. ఇంతకూ ఆమె మాట్లాడుతున్నది మలయాళమో కాదో ఎవ్వరికీ తెలియదు. మా ఊళ్లో ఎవరికీ మలయాళం రాదు, వినలేదు. తెలుసుకోవాలనే కోరికుండాలే కానీ, దానికి దారులు అనేకముంటాయి. తాడిపత్రి బస్టాండులో టీ అమ్ముకునే నాయరుని ప్రవేశపెట్టారు. వాడు రావడం రావడమే టీ కెటిల్‌తో వచ్చి అందరికీ టీ అందించి, డబ్బులు వసూలు చేశాడు. డబ్బు వల్ల జ్ఞానమూ, జ్ఞానం వల్ల అజ్ఞానం సంభవిస్తాయని దెయ్యపు భర్త కొత్త సిద్ధాంతాన్ని ఎత్తుకున్నాడు. భర్త గొంతు వినగానే మలయాళ దెయ్యం విజృంభించింది. అనేకమంది కకావికలై పారిపోగా, కొంతమంది ధైర్యవంతులు ఆమెని నిలువరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ముందస్తు చర్యగా దెయ్యపు భర్త దుడ్డుకర్రకి అందకుండా చెట్టెక్కాడు. ఆమె ఉగ్రరూపం చూసి నాయరు తాడిపత్రి వైపుకి తిరిగి పిక్కబలం కొద్దీ పారిపోసాగాడు. ఈ హడావుడిలో టీ కెటిల్ కూడా మరిచిపోయాడు. ఎలాగోలా వాడిని వెనక్కి లాక్కొచ్చారు. ఆమె మాట్లాడింది మలయాళమే కానీ, తనకేమీ అర్థం కాలేదని నాయర్ చెప్పాడు. నిరూపితం కానప్పుడు ఏ భాషకీ శాస్త్రీయత ఉండదని చెట్టుపైన ఉన్న భర్త వాదించడానికి ప్రయత్నించాడు కానీ, ఎవరూ పట్టించుకోలేదు. ఇలా కాదని టవున్ నుంచి డాక్టర్ని తీసుకొచ్చారు. రోగితోనూ రోగంతోనూ నిమిత్తం లేకుండా ఆయన ప్రతివాడికి మూడు ఇంజెక్షన్లు వేస్తాడు. ఒకవేళ రోగాన్ని ఆయన పసిగడితే ఇంజక్షన్ల సంఖ్య పెరుగుతుంది. ఒకసారి పొరపాటున రోగితో పాటు వెళ్లిన సహాయకునికి కూడా మూడు సూది పోట్లు పొడిచాడు. వాడు కళ్లు తిరిగి పడిపోతే వాడి కులపోళ్లు వచ్చి ధర్నా చేశారు. చేతి చమురు వదిలించుకున్న పరిజ్ఞానంతో అప్పటినుంచి మనిషి ముఖకవళికల ఆధారంగా సూదిమొనను సవరిస్తాడు. దెయ్యపు స్త్రీ దగ్గరకెళ్లి నాడిని చూశాడు. గుండె శబ్దాన్ని విన్నాడు. ఎప్పటిలాగే సూది వేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో డాక్టర్‌కి తెలియదు. కళ్లు తెరిచేసరికి తన ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇదంతా జరుగుతూ ఉండగా మా పెద్దమ్మ సీన్లోకొచ్చింది. ఆమె రిటైర్డ్ టీచర్. దెయ్యపు స్త్రీ దగ్గరికెళ్లి ఆప్యాయంగా అదుముకుంది. భర్తని చెట్టు దింపి చెంప పగలగొట్టింది. ‘‘నువ్వు వాగడమే కానీ, దాన్ని ఏనాడైనా నాలుగు మాటలు మాట్లాడనిచ్చావా? చివరికి తిట్టడానికి కూడా భాష మరిచిపోయింది. ఇప్పటికైనా నోర్మూసుకుని ఉంటే ఉంటావు, లేదంటే పోతావు’’ అని వెళ్లిపోయింది. కాలం ఎవడి అదుపాజ్ఞల్లో ఉండదు. మారుతూ ఉంటుంది. మా ఊళ్లో ఆడవాళ్లు ఇప్పుడు ఎంతలా మారారంటే మగాళ్లకి కూడా దెయ్యం పట్టించేంతగా. - జి.ఆర్.మహర్షి -
ఆల్ లైక్ లైక్స్
హ్యూమర్ ప్లస్ నిద్రలేవడంతోనే సుబ్బలక్ష్మి బిజీ. దారినపోయే కుక్కపిల్లని ఫొటో తీసి ఫేస్బుక్లో గుడ్మానింగ్ అని పోస్ట్ చేసింది. అప్పటికే ఫేస్బుక్ నెట్వర్కంతా జూలు దులిపి నిద్రలేచింది. ఎవరికి వాళ్లు విజృంభించారు. ‘ఆ కుక్కకి ఎంచక్కా ఓ బ్రెడ్ ముక్క అందిస్తే ఏం పోయిందక్కా’ అని ఓ చెల్లి కామెంట్. ‘బ్రెడ్డు, గుడ్డు... దాని ఫుడ్డు కాదు చెల్లీ’ అని సమాధానం. ఎన్ని లైక్‌లు వచ్చాయో ఇరువర్గాలూ లెక్కచూసుకుని కత్తినూరి తలా ఒక పోస్ట్ వదిలారు. ‘ఈవాళ వడియాలు ఎండలేదెందుకో’ అని ఇంకో ఆవిడ వచ్చి బాణం వదిలింది. ‘ఎండలేదు కదా’ అని పంచ్. ఫేస్బుక్ సిటీ బస్సులా ఒక్క కుదుపునకు గురైంది. ‘ఉప్మా ఇలా మాడిందేమిటి చెప్మా’ అని నల్లటి బాణలి ఫొటో. ‘ఉప్మా చేయడమే ఒక తప్మా, అది తింటే పైకి టప్మా’ అని కామెంట్. ఆపై ఉప్మా మేకర్సంతా గోదాలోకి దిగారు. ఉప్మాకి, సిమెంట్ కాంక్రీట్కి తేడా తెలియకుండా వండడమెలాగో ఒకరు వివరించారు. కొందరు మగ కుక్‌లు కూడా చొరబడి ‘ఉప్మా - ఒక జనాభా నివారణ’ అని చర్చపెట్టారు. తాను వండిన ఉప్మా తిని ఇల్లు వదిలి ఎటో వెళ్లిపోయిన వాళ్లావిడ గురించి ఒకాయన వాకబు చేశాడు. ఆమె తిరిగి ఇల్లు చేరకుండా ఉండేలా సహకరించినవారికి తగిన బహుమతి ఇస్తానని ప్రకటించాడు. స్త్రీవాదులంతా ఒంటికాలిపై లేచి వాడిని ఎడాపెడా ఫుట్‌బాల్ ఆడారు. ఇంతలో సుబ్బలక్ష్మి భర్త సుబ్బారావు నిద్రలేచాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని అందుకున్నట్టు సెల్ తీసు కున్నాడు. ‘కాఫీ ఉంటేనే సూఫీయిజం. టోపీ ఉంటేనే సోషలిజం’ అని కవిత్వం వదిలాడు. వహ్వా అని లైక్స్ వచ్చాయి. ‘ఎడ్డెమంటే తెడ్డెమంటే సంసారం. గడ్డం అడ్డమైతే జీవనసారం’ అని ఇంకోటి వదిలాడు. సుబ్బలక్ష్మి కోసం అటు ఇటు చూసి గడ్డం గీసుకునే సెల్ఫీని వాట్సప్‌లో పెట్టాడు. అది చూసి సుబ్బలక్ష్మి ‘మీరు సింహం లాంటివాళ్లు. అది గడ్డం గీసుకోలేదు. మీరు గీసుకుంటారు’ అని కామెంట్ పెట్టింది. ‘సింహమే కానీ పెళ్లయ్యాక గర్జన మరిచిపోయింది’ అని సుబ్బారావు. ‘ఆర్జన మరిచిపోకండి. అది ముఖ్యం’ - సుబ్బలక్ష్మి. టిఫిన్ ఏం చేయాలా అనే విషయంపై ఇద్దరూ కాసేపు మెసేజ్‌లు పెట్టుకుని చివరికి ఫాస్ట్ఫుడ్స్లో పార్సిల్ తెప్పించుకోవాలని నిర్ణయించుకున్నారు.ఎవరి ఫేస్‌బుక్‌లు వాళ్లు చదువుకుంటూ ఇద్దరూ ఆఫీసులకి బయలుదేరారు. బస్సెక్కిన తరువాత ‘సిటీ బస్సు కిటకిట, ఎక్కినవారు తకిటతకిట’ అని పోస్ట్ చేశాడు సుబ్బారావు. పొలోమని అందరూ బస్సులపై పడి తమ అభిప్రాయాల్ని ప్రకటించారు.‘ఆఫీస్‌లో ఉక్కబోత, జీవితమే కష్టసుఖాల కలబోత’ అని సుబ్బలక్ష్మి లైకర్సంతా ఎండాకాలాన్ని ఉతికి ఆరేశారు. క్యాంటీన్లో ఏం తింటున్నారో ఇద్దరూ ఫొటోలు పెట్టుకునిఓదార్చుకున్నారు. సాయంత్రం ఇల్లు చేరారు. టీ తాగుతూ ‘పొగకి, పగకి తేడా ఏంటంటే, పొగ పైకి పోతుంది. పగ పైకి పంపుతుంది’ అని సుబ్బారావు పోస్ట్ చేశాడు. ‘సంసారం ఒక పొగ, దాంపత్యం ఒక పగ’ అని సుబ్బలక్ష్మి. ‘సెగ కూడా.’ ఇలా పోస్టింగ్‌లు, మెసేజ్‌ల తరువాత అలసిపోయి నిద్రపోయారు. వరద బాధితులు, భూకంప బాధితుల్లాగా వీళ్లు ఫేస్బుక్ బాధితులు. - జి.ఆర్.మహర్షి