ఏం ఫ్యామిలీరా బాబూ! | Humor Plus of G.R. Maharishi story | Sakshi
Sakshi News home page

ఏం ఫ్యామిలీరా బాబూ!

Published Mon, Jun 6 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

ఏం ఫ్యామిలీరా బాబూ!

ఏం ఫ్యామిలీరా బాబూ!

హ్యూమర్‌ప్లస్
ఒకాయన ఎవరింటికో వెళ్లబోయి ఇంకెవరింటికో వెళ్లాడు. ఆ ఇంట్లో జనమంతా ఉత్సాహంగా స్టెప్పులేస్తూ కనిపించారు.
‘‘ఇది డ్యాన్సింగ్ స్కూలా?’’ అని అడిగాడు.
‘‘అదేం కాదు, ఉదయాన్నే కాఫీ తాగగానే ఒక పాట పాడతాం. టిఫిన్ తర్వాత ఒక సాంగ్. లంచ్‌కి ముందు, ఆ తరువాత ఇంకో సాంగ్ అండ్ డ్యాన్స్’’ అని ఒక పెద్దాయన చెప్పాడు.
 
‘‘ఆకలవడానికి ఒక పాట, అరగడానికి ఇంకో పాట అన్నమాట.’’
 ‘‘అన్నమాట కాదు, అదే ఉన్న మాట. ఈ ఇంట్లోకి ఎవరు రావాలన్నా నాలుగు మంచి మాటలు చెప్పి రావాలి.’’
 ‘‘సత్యమునే పలుకవలెను’’.
 ‘‘పాసైపోయారు’’ అంటూ ఆ పెద్దమనిషి కాఫీ తెమ్మని భార్యకి చెప్పాడు. ఆమె స్టెప్పులేస్తూనే వెళ్లి కాఫీ తీసుకొచ్చింది.
 ‘‘కాఫీని తాపీగా హ్యాపీగా తాగండి’’ అంటూ ఆవిడ మళ్లీ ఒక పాట ఎత్తుకుంది. జడుసుకున్న అతిథి షర్ట్‌పైన కాఫీ ఒలకబోసుకున్నాడు.
 
‘‘షర్ట్‌పైన మరక మంచిదే. సర్ఫ్‌తో పోతుంది. క్యారెక్టర్‌పైన మరక పడితే ఉతికినా పోదు’’.
 ‘‘మీరు నవలల్లోని పాత్రల్లా మారుతున్నారు.’’
 ‘‘నవల, వల, పావలా, ముప్పావల, కష్టసుఖాల కవల ఈ జీవితం. ఇంట్లోని పాత్రలు రుద్దితే మెరుస్తాయి. ఒంట్లోని పాత్రలు... ’’ ఆ పెద్దమనిషి ఏదో చెప్పబోతే అతిథి దిగ్గున లేచి ‘‘ఇక వస్తానండి’’ అన్నాడు.
 ‘‘ఈ మంచిమాటల మల్లికార్జునరావు ఇంటికి ఎవరూ రారు. వచ్చినవాళ్లు వెనక్కి పోరు’’ అంటూ అతిథి చొక్కా ఊడబీకి బకెట్లో వేసి ఉతుకుతూ ‘‘చాకిరేవు కాడ ఏమైంది’’ అంటూ సాంగ్ స్టార్ట్ చేయగానే మిగిలినవాళ్ళంతా వచ్చి ‘ఏమైంది’ అంటూ గ్రూప్ డ్యాన్స్ చేశారు.
 
ఇంతలో ఒక కుర్రాడు బాహుబలిలో కట్టప్పలా మోకాళ్లతో స్కేటింగ్ చేస్తూ వచ్చి ‘నాన్నగారూ’ అంటూ ఒక చెప్పుల జత పెట్టాడు.
 ‘‘ఇవి నావి కావు నాన్నా. తొందరపడి మామయ్యవి తెచ్చావు. సైజ్ తేడా వుంటే చొక్కా తొడుక్కోవచ్చు కానీ, చెప్పులు తొడుక్కోలేం’’ అన్నాడు నాన్న.
 ‘‘చెప్పులు ఆ కుర్రాడు తేవడమెందుకు? మీరే వేసుకోవచ్చుగా’’
 ‘‘నా కాలికి ఆనెలు, నడవలేను’’
 ‘‘మరి స్టెప్పులేస్తున్నారుగా.’’ ‘‘జీవితంలో ఎన్నో స్టెప్పులెక్కినవాణ్ణి, ఆ మాత్రం స్టెప్పులేయలేనా?’’
 
‘‘ఇంతకూ మీరేం చేస్తున్నారు?’’
 ‘‘సాంగ్‌కి సాంగ్‌కి మధ్య బ్రేక్‌లో బిజినెస్ చేస్తుంటాను’’
 ఆ కుర్రాడు మళ్లీ స్పీడ్‌బీట్‌లా వచ్చి చెప్పులు పెట్టాడు.
 ‘‘కరుస్తాయని చెప్పుల్ని, తడుస్తుందని గొడుగుని వాడకుండా ఉండలేం కదా’’
 ఇంతలో ఒకమ్మాయి వచ్చి ‘‘అత్తయ్య కారంపొడి దంచడానికి రమ్మంటోంది’’ అని పిలిచింది.
 ‘‘రండి రోకటి పాట విందురుగాని’’
 
‘‘రోకటి పోటు తింటున్నాం కదా, మళ్లీ పాట కూడానా’’ అని తప్పించుకోడానికి ప్రయత్నిస్తే బలవంతంగా లాక్కెళ్లి చేతికి రోకలిని ఇచ్చారు.
 ‘‘దంచినోళ్లకి దంచినంత’’ అని ఆడోళ్లు పాట ఎత్తుకున్నారు.
 మంచి మాటలాయన కూడా నాలుగు దంచి ‘‘కారంకారం అంటాడు కానీ చెల్లెమ్మా, కారం లేని దెక్కడ చెల్లెమ్మా’’ అని చెప్పులతోనే స్టెప్పులేశాడు.
 ‘‘వైఫై ఉందని వైఫ్‌ని, ఫేస్‌బుక్ ఉందని ఫేస్‌ని మరిచిపోలేం కదా, గ్రూప్‌సాంగ్ ఉంటేనే మన బ్లడ్‌గ్రూప్ మనకి గుర్తుండేది. డాన్స్ చేస్తేనే బోన్స్ సెట్ అయ్యేది’’
 దంచుతున్న కారం మీదపడి అతిథి ఒళ్లు మండింది.
 
‘‘ఇల్లుని పిచ్చాసుపత్రి చేసినా, పిచ్చాసుపత్రినే ఇల్లుగా మార్చుకున్నా పెద్ద తేడా లేదు. జీవితం స్ట్రెయిట్ రోడ్ కాదు, ఘాట్ రోడ్ బ్రేకుల ప్లేస్‌లో యాక్సిలేటర్, యాక్సిలేటర్ ప్లేస్‌లో బ్రేకులు ఉంటాయి. బీమిలీ బీచ్‌లాంటి ఫ్యామిలీ ఉంటే లాభం లేదు కొంచెం తెలివి కూడా ఉండాలి’’ అన్నాడు.
 అదేం పట్టించుకోకుండా మంచి మాటల మల్లికార్జునరావు ఆనెలు ఉన్నాయని కూడా మరిచిపోయి గాల్లోకి ఎగిరి పాట పాడేడు. అతిథి పారిపోయాడు.
- జి.ఆర్. మహర్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement