తత్వబాదుడు
హ్యూమర్ ప్లస్
జాతి వైరం కూడా మరచి ఒక కుక్క, పిల్లి స్నేహం కలిపాయి. దట్టమైన ఆ స్నేహానికి కారణం పరస్పర గౌరవమే. మియ్యావ్ అనేది శబ్దం కాదని, ఒక నాదమని, అది సరిగమల మిశ్రమమని కుక్క విశ్లేషించేది. భౌభౌ అనే పదంలో భౌతిక సూత్రాలకు అందని భావుకత్వ ఆనందతత్వం వుందని పిల్లి పేర్కొనేది. కూతలో చేతనత్వం, మేతలో అనంత ఆత్మ ప్రబోధం వుందని పసర్పరం సంభాషించుకుంటూ తోకలు పెనవేసుకుంటూ ఉండేవి. పొగుడుకుంటే పోయేదేమీ లేదని సిద్ధాంతీకరించుకుని అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవి.
సిద్ధాంతం, రాద్ధాంతం, వేదాంతం - ఈ మూడింటివల్లే ప్రపంచం నడుస్తూ వుందని నమ్మిన ఒక యూనివర్సిటీ వాళ్లు పనేమీ లేక ఒక సెమినార్ పెట్టి ఈ స్నేహితులని ఆహ్వానించారు. తత్వబోధన - ఒక వీరబాదుడు అనే అంశంపై వీలైతే క్లుప్తంగా ప్రసంగించమని ప్రాధేయపడ్డారు. మైకుల్ని, ప్రేక్షకుల్ని గజగజ వణికించడం ప్రాసంగిక ధర్మమని తెలిసి కూడా వాళ్లు ఈ కోరిక కోరడంలో వక్తల్లో రౌద్రరసం ఉప్పొంగింది.
కుక్క ఆవేశంగా లేచి ఒక మైకు విరగ్గొట్టింది. తరువాత రెండో మైకు అందుకుని ‘‘మైకు విరవడం ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణమని మా మిత్రులు పిల్లిగారు చెపుతుంటారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. నా మిత్రుడి మాటల్లో చెప్పాలంటే తోక వూపడానికి మించిన తత్వశాస్త్రం లేనేలేదు. కుడి, ఎడమలు కాకుండా నిట్టనిలువుగా కూడా తోకను ఊపవచ్చు. ఈ మూడు రకాలు తెలిసినవాడు ముల్లోకాలు జయిస్తాడు. క్లుప్తత అంటే సంక్లిష్టత. అందరూ క్లుప్తతను ఇష్టపడతారు కానీ ఎవడి క్లుప్తత వాడికుంటుంది.
క్లుప్తత వల్ల నిర్లిప్తత, నిర్లిప్తత వల్ల నిర్వేదం, దానివల్ల వైరాగ్యం, ఆ తరువాత ఆరోగ్యం సంప్రాప్తిస్తాయి. బోధన, బాదుడు ఈ రెండూ పరస్పర ఆశ్రీతాలు. బాదితేనే బోధన అర్థమయ్యేది. తత్వాన్ని బోధించడం ఎవడివల్లా కాదు. మన తత్వాన్ని ఎదుటివాడు, ఎదుటివాడి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడమే బోధన. పాలు దొరికినా దొరక్కపోయినా మా మిత్రుడు మియ్యావ్ అనే అంటాడు. మి అంటే తెలుగులో మీరు అని, ఇంగ్లీష్‌లో నేను అని అర్థం. సర్వేజనో అనే భావం ఇందులో ఇమిడి ఉంది.
రష్యా, చైనా భాషల్లో ఇంకా బోలెడు అర్థాలున్నాయి. అవేవీ మనకు అర్థం కావు. అర్థమైనవాటిని అర్థమయ్యేలా చెప్పడానికే నానా చావు చస్తున్నాం. అర్థంకాని వాటి జోలికి పోకుండా వుండడమే అర్థశాస్త్రం. ఈ విషయం తెలియక కౌటిల్యుడు అనవసరంగా పెద్ద పుస్తకమే రాశాడు. ఎదుటివాడి డబ్బుని లాక్కోవడం, మన డబ్బుని ఎదుటివాడు లాక్కోకుండా కాపాడుకోవడం ఇదే కదా అర్థశాస్త్రం. దీనికి పుస్తకాలు చదవడం దండగని మా మిత్రుడి అభిప్రాయం. ఆయన భావజాలాన్ని నేను ప్రచారం చేసినట్టే నా భావ ఇంద్రజాలాన్ని ఇప్పుడు ఆయన వివరిస్తాడు’’ అని చెప్పింది.
పిల్లి లేచి ఒళ్లు విరుచుకుని, తోకని జెండాలా వూపి, మీసాలు సవరించుకుని ‘‘భౌభౌ అంటే భయం లేకుండా భవబంధ సాగరాన్ని ఈదడం. అరవడం, కరవడమే జీవన్ముక్తికి మార్గమని మిత్రుడి ఉపదేశం. మనం కరచినవాళ్లంతా తిరిగి కరుస్తారని, కరవనివాళ్లంతా మనల్ని కరవకుండా వుంటారని అనుకోవడమే భ్రాంతి. పాలగిన్నె, దుడ్డుకర్ర ఈ రెండే నిజాలు. కర్రకు దొరక్కుండా బర్రెపాలు తాగాలి. ఇదే నీతి, నేతి. ఇది తెలియనివాళ్లు నూతిలో కప్పలా మిగిలిపోతారు...’’
సభికుల్లోంచి ఒక కప్ప లేచి ‘‘అయ్యా! నేను బావిలోని కప్పను కాను. బావులన్నీ ఎండిపోయి యాభై ఏళ్లయింది. మీ మిత్రులిద్దరూ ఒకరి డోలు ఇంకొకరితో కొట్టిస్తున్న తీరు అద్భుతం. మీరు మనుషులకి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ల మనోధర్మ సంగీతాన్ని అనుసరిస్తున్నారు. కానీ పొగడ్డం, పొగిడించుకోవడం చేతకాని నాలాంటి వాళ్ల సంగతేమిటి? బెకబెక శబ్దానికి విలువేలేదా?’’ అని నిలదీసింది. కప్ప మాట్లాడింది సత్యమే అయినా, సత్యం మాట్లాడ్డానికి కప్పని అనర్హురాలిగా ప్రకటించి ‘‘ఆల్ ఫ్రాగ్స్ ఆర్ రోగ్స్’’ అనే సిద్ధాంతాన్ని ఆవిష్కరించి, దాన్ని చైనీస్ కర్రీ సెంటర్‌కి పార్సిల్ చేసి సభ ముగించారు.
- జి.ఆర్. మహర్షి