ఖననం చేస్తుండగా అక్కడే తిరుగుతున్న శునకం
కేసముద్రం(మహబూబాబాద్): ఓ కొండెంగ.. మరో కొండెంగ పిల్లపై దాడి చేసి చంపగా.. గతంలో దానితో జాతి వైరం మరిచి స్నేహం చేసిన శునకం గ్రామస్తులు నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని గ్రామ శివారులో ఖననం చేసే సమయంలో కొండెంగ కలేబరాన్ని ఆత్మీయంగా తాకుతూ.. తాన స్నేహాన్ని చాటిన సంఘటన కేసముద్రం మండలం కల్వల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం. కల్వల గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్ అనే రైతు పంటపొలాల్లో, గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో రెండు కొండెంగలను తీసుకువచ్చి సాకుతున్నాడు. కొండెంగలకు ఆరునెలల క్రితం పిల్ల జన్మించింది. ఈ మేరకు తల్లికొండెంగను చెట్టుకు కట్టేయగా, పిల్ల కొండెంగ అటుఇటూ తిరుగుతుండగా, ఇదే గ్రామంలో గుట్టయ్య అనే రైతు పెంచుకుంటున్న కుక్క జాతివైరాన్ని మరచి ఆ కొండెంగ పిల్లతో స్నేహం చేస్తూ వచ్చింది.
కొండెంగ పిల్ల ఎక్కడుంటే ఆ శునకం అక్కడే ఉంటూ, దాన్ని నిమురుతూ స్నేహంగా మెదలాడాన్ని స్థానికులు చూసి ఆశ్చర్యపోయేవారు. ఊళ్లో కొండెంగలు ఉండటం వలన గ్రామానికి కోతులు రాకపోవడంతో, గ్రామస్తులు నిత్యం ఆ కొండెంగలకు పండ్లు, కూరగాయలు పెడుతూ వచ్చారు. ఈక్రమంలో అటవీ ప్రాంతం నుంచి ఊళ్లోకి చేరుకున్న మరో కొండెంగ గత కొద్దిరోజులుగా , పెంచుకునే కొండెంగలపై దాడిచేసే ప్రయత్నం చేస్తుండగా, గమనించిన గ్రామస్తులు ఆ కొండెంగను బెదిరించి పంపించేవారు. ఈ క్రమంలో సోమవారం తల్లి కొండెంగను గొలుసుతో చెట్టుకు కట్టేయగా, పిల్ల కొండెంగ చెట్టు ఎక్కడాన్ని గమనించిన అడవి కొండెంగ మెడకొరికి దాడిచేసి చంపేసింది.
దీంతో గ్రామస్తులు ఆ కొండెంగకు మేళతాళాల నడుమ, పాడెను కట్టి, ఊరి చివర వరకు తీసుకెళ్లి, ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా ఇన్ని రోజులుగా జాతివైరాన్ని మరిచి స్నేహం చేసిన శునకం మృత్యువాతపడిన కొండెంగ వద్దకు వచ్చి నిమురుతూ, ఆ తర్వాత పాడెకట్టి తీసుకెళ్తుంటే దానివెంటే వెళ్లి, చివరకు ఖననం చేసే ప్రాంతానికి చేరుకుని దానిచుట్టూ తిరిగింది. మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా మరో జంతువుపై ఇంత ప్రేమ ఉంటుందా.. అని గ్రామస్తులు ఆశ్చార్యానికి లోనయ్యారు. పైగా ఒకే జాతి కొండెంగ చంపగా, మరో జాతికి చెందిన శునకం మాత్రం స్నేహభావాన్ని చాటింది.
Comments
Please login to add a commentAdd a comment