G.R.Maharishi
-
మునకే సుఖమనుకోవోయ్!
హ్యూమర్ ప్లస్ సుబ్బారావుకి గాలిలో తేలుతున్నట్టు కలొచ్చింది. కలవరంలో వుండగా చల్లగా తగిలింది. కళ్ళు తెరిస్తే మంచం నీళ్లలో తేలుతూ వుంది. అపార్ట్మెంట్ చెరువులా కనిపించింది. గబాలున లేస్తే కిటికీలోంచి వెంకట్రావ్ విష్ చేశాడు. ఒక ప్లాస్టిక్ కవర్లో లాప్టాప్ చుట్టుకుని ఈదుతూ వెళుతున్నాడు. ‘‘ఏంటిది ప్రళయమా?’’ అడిగాడు సుబ్బారావు. ‘‘చెరువుల్లో వూళ్లు కడితే, వూళ్లు చెరువులవుతాయి’’ వెంకట్రావ్ సాఫ్ట్‌వేరే కానీ తల్లి వేరు కవిత్వం. ‘‘చెరువుని ఈదడం సులభం, జీవితాన్ని ఈదడమే కష్టం’’ అన్నాడు వెంకట్రావు. ‘‘నాకు ఈత రాదు’’ అన్నాడు సుబ్బారావు. ‘‘లైఫ్ జాకెట్ వేసుకో’’ ‘‘జాకెట్ లేడీస్ వేసుకుంటారు. లైఫ్ షర్ట్ వుంటే చెప్పు’’ సుబ్బారావు పురుషవాది. పురుషులందు పురుషవాదులు వేరు. స్త్రీవాదులతో ఓడిపోవడం వల్లే పురుషులు రుషులుగా మారుతున్నారనేది అతని ఫిలాసఫీ. ‘‘తుపాన్లో జర్దా పాను గురించి చర్చ అవసరమా?’’ ‘‘పురుషుల్ని ఉతికి ఇస్త్రీ చేయడానికే స్త్రీలు పుట్టారని ఇంతకాలం వాదించాను. అందువల్ల జాకెట్ వేసుకోను.’’ ‘‘అయితే సెల్ఫీ తీసుకుని ఎఫ్‌బిలో పోస్ట్ చెయ్. అదే నీ ఆఖరి పోస్టింగ్ అని అందరికీ గుర్తుంటుంది’’లాహిరి లాహిరి పాడుకుంటూ వెంకట్రావ్ వెళ్లిపోయాడు. సుబ్బారావుకి బాస్ గుర్తొచ్చాడు. ప్రపంచమంతా మునిగిపోయినా ఆఫీసులు మునిగిపోవు, అదో ట్రాజెడీ. ఇంతలో కూకట్పల్లి అని అరుస్తూ ఒక పడవ వచ్చింది. దాన్నిండా జనం. ఎవరు ఎవరి మీద కూచున్నారో తెలియడం లేదు. తెడ్డుకి కూడా ఇద్దరు వేలాడుతున్నారు. కిటికీలోంచే సుబ్బారావు దాంట్లోకి దూకాడు. పడవ అటూఇటూ కదిలి హాహాకారాలు వినిపించాయి. ‘‘ఏంటిది?’’ పడవవాడ్ని అడిగాడు. ‘‘సర్వీస్ ఆటోలుగా, సర్వీస్ బోట్’’ ‘‘ఇంతమంది ఎక్కితే మునిగిపోదా?’’ ‘‘మునిగిపోతే రక్షించడానికి ఇద్దరు గజ ఈతగాళ్లున్నారు. వాళ్ల చార్జి ఎగస్ట్రా’’ హైలెస్సా హైలెస్సా అంటూ తెడ్డువేశాడు. పడుతూ లేస్తూ నిజాంపేట నుంచి కూకట్పల్లి చేరింది పడవ. ఒడ్డున సర్వీస్ ఆటో ఎక్కాడు. జనాల్ని ఆటోలో కుక్కి ఒక తాడుతో అందర్నీ కలిపి కట్టేశాడు ఆటోడ్రైవర్. ‘‘ఈ బంధనం ఎందుకు?’’ ‘‘ఇది సీట్ బెల్ట్ లాంటిది సార్. మనకు ముందర రోడ్డంటూ ఏమీ లేదు. ఒక గోతిలోంచి ఇంకో గోతిలోకి జంప్చేస్తూ వెళ్లడమే’’ అని డ్రైవర్ స్టార్ట్ చేశాడు. పిండిమరలాగా అది గుడగుడ సౌండ్ చేస్తూ కదిలింది. సర్వాంగాలు గజగజ వణికాయి. దబేల్దుబేల్మంటూ ఆటో అటూ ఇటూ ఒరుగుతూ వెళ్లింది. ఒక మాన్హోల్లోకి డైవ్ చేయడానికి ఆటో ప్రయత్నించింది కానీ సమయస్ఫూర్తితో డ్రైవర్ హ్యాండిల్‌కి వేళాడుతూ హ్యాండిల్ చేశాడు. ఈ కీలకమైన ఘట్టంలో పలువురు బాధితులు గోవిందనామస్మరణ చేస్తూ కాస్త పుణ్యం గడించారు. సామూహిక పగ్గం నుంచి ఆటోవాడు విముక్తి చేసిన తరువాత ఆఫీస్ దగ్గరికి వెళితే గుండె చెరువైంది. అక్కడ గడకర్ర సాము జరుగుతూ వుంది. యాభై రూపాయల ఫీజు ఇస్తే గడకర్రని ఇస్తున్నారు. దాన్ని వూతంగా గాల్లోకి ఎగిరితే సెకండ్‌ఫ్లోర్‌లో ల్యాండ్ అవుతాం. నీటిలో ఆఫీస్ వుండడం వల్ల ఇంకో దారిలేదు. ఆఫీస్‌కి వెళ్లాలంటే గడకర్ర, వెళ్లకపోతే బాస్ దుడ్డుకర్ర తీసుకుంటాడు. ‘‘జీవితంలో ఇలా ఎత్తుకు ఎదిగే అవకాశం పదేపదే రాదు సార్’’ అన్నాడు గడకర్రవాడు. ‘‘నాకు భయం’’ అన్నాడు సుబ్బారావు. ‘‘భయానికి విరుగుడు అభయం’’ అంటూ ఆంజనేయుడిలా భుజాల మీద ఎక్కించుకుని యాహూ అంటూ గడకర్రవాడు ఎగిరాడు. గూగుల్ అంటూ దూకాడు సుబ్బారావు. ఐరిస్ మిషన్‌కు కళ్లు చూపించాడు. ఆఫీస్‌లోకి తగలడిచావు అని మూలిగింది. ‘‘ప్రకృతితో వికృతిగా వ్యవహరిస్తే భవిష్యత్ ఆకృతి ఇదే. నాలుగు చినుకులకే చిరిగి చాటంతవుతుంది’’ అంటున్నారెవరో. - జి.ఆర్. మహర్షి -
హారర్ స్టోరీ
హ్యూమర్‌ప్లస్ ఇంతలో హీరోయిన్ వచ్చి ‘‘అంధెరీకి నమ్‌కారం’’ అంది తెలుగులో. దెయ్యం జడుసుకుని ‘‘పిశాచాలు కూడా ఇలాంటి భాష మాట్లాడవు. తెలుగు రాని అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడానికి మించిన హారర్ ఎఫెక్ట్ ఏముంటుంది?’’ అని అరిచింది. ఒక దెయ్యానికి సినిమాల్లో చేరాలని కోరిక పుట్టింది. తన సినిమాలు చూసి తానే భయపడే ఒక హారర్ డెరైక్టర్ దగ్గరికి వెళ్లింది. ‘‘ఇంతవరకూ దెయ్యం సినిమాలు తీసిన వాళ్లున్నారు కానీ, దెయ్యంతోనే సినిమాలు తీసినవాళ్లెవరూ లేరు. నాకైతే మేకప్, గ్రాఫిక్స్ అక్కరలేదు’’ అని చెప్పింది దెయ్యం. ‘‘ఫీల్డ్‌లో దెయ్యాలెవరో, మనుషులెవరో తెలుసుకోవడం కష్టంగా ఉంది. నువ్వు దెయ్యమే అనడానికి రుజువేంటి?’’ అని అడిగాడు డెరైక్టర్. దెయ్యం తన కాళ్లను వెనక్కి తిప్పి చూపించింది. కోరల్ని బయటపెట్టి గాల్లోకి ఎగిరింది. డెరైక్టర్ సంతోషించి ‘దెయ్యం భయం’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. ముహూర్తం రోజున దెయ్యం పూజ చేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టింది. ‘‘దెయ్యాలు కూడా పూజ చేస్తాయా?’’ అని అడిగాడు డెరైక్టర్. ‘‘దెయ్యాలు పూజ చేయడం, సింహాలు సన్యాసం తీసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. మనుషుల కంటే ఎక్కువగా దెయ్యాల్నే దేవుడు ప్రేమిస్తాడు’’. ‘‘ఎందుకని?’’ ‘‘భయం. కొలిచేవాడికి వరాలివ్వడం పాత పద్ధతి. కరిచేవాడికే ఇప్పుడు వరాలు’’ అంది దెయ్యం. గడియారం సరిగ్గా పన్నెండు కొడితే దెయ్యం ‘హిహిహి’ అని నవ్వుతూ వచ్చి భయపెట్టాలి. ఇది ఫస్ట్ షాట్. ‘‘ప్రేక్షకులకి కామన్సెన్స్ లేకపోయినా, దెయ్యాలకి టైం సెన్స్ వుంది. అందువల్ల మేం అర్ధరాత్రి బయటికి రావడం మానుకొని చాలాకాలమైంది’’ అంది దెయ్యం. ‘‘తరతరాలుగా సినిమాల్లో వస్తున్న సాంప్రదాయమిది’’ అన్నాడు డెరైక్టర్. ‘‘అందుకే మీరు ఆదాయం లేకుండా చస్తున్నారు. అసలు గంటలు కొట్టే గడియారాలు ఎవరి కొంపలోనైనా ఉన్నాయా? పొరపాటున ఎక్కడైనా మోగినా అది టీవీ సీరియల్లో యాడ్ అనుకుంటాం గానీ మిడ్నైట్ అయ్యిందని అనుకుంటామా?’’ అని ప్రశ్నించింది దెయ్యం. ‘‘మరి ఏదో ఒక హారర్ ఎఫెక్ట్ వుండాలి కదా’’ అన్నాడు డెరైక్టర్. ఇంతలో హీరోయిన్ వచ్చి ‘‘అంధెరీకి నమ్‌కారం’’ అంది తెలుగులో. దెయ్యం జడుసుకుని ‘‘పిశాచాలు కూడా ఇలాంటి భాష మాట్లాడవు. తెలుగు రాని అమ్మాయిని హీరోయిన్గా తీసుకోవడానికి మించిన హారర్ ఎఫెక్ట్ ఏముంటుంది?’’ అని అరిచింది. ‘‘నువ్వెక్కువ నటిస్తున్నావు. మనుషులు ఎలాగూ బతికినంతకాలం నటిస్తారు. చచ్చి కూడా నటించాల్సి రావడం నీకు పట్టిన విషాదం’’ అని కోపగించుకున్నాడు డెరైక్టర్. ‘‘నా విషాదం సంగతి పక్కనపెట్టు. అసలు నీ సినిమాలు ఎందుకు ఫెయిలవుతున్నాయో నీకు తెలుసా?’’ ‘‘జనానికి సినిమాలు చూడ్డం రాదు’’. ‘‘చూడ్డం రాక కాదు, చూడడానికి రావడం లేదు. ప్రతిరోజూ వంద రకాల భయాలతో బతుకుతున్నవాడిని ఇక కొత్తగా నువ్వేం భయపెడతావు.’’ ‘‘భయమనేది ఆక్సిజన్ లాంటిది. అది ఎంతిచ్చినా సరిపోదు. అందువల్ల వికృతంగా నవ్వి భయపెట్టు’’. ‘‘అరే హౌలా, మేము వికృతంగా నవ్వుతామని ఎవరు చెప్పార్రా నీకు? బతికినప్పుడు లక్షా తొంభైవేల సమస్యలుంటాయి. చచ్చిం తరువాత ప్రశాంతంగా వుంటాం. హాయిగా వుండేవాడు వికృతంగా ఎందుకు నవ్వుతాడు చెప్పు?’’ అని అడిగింది దెయ్యం. ‘‘తెరమీద తర్కం పనికిరాదు. రూల్స్ మిస్సయితే గోల్స్ దక్కవు’’. ‘‘ప్రాస ఎక్కువైతే శ్వాస ఆడదు. పంచ్‌లు ఎక్కువైతే పంక్చరవుతుంది’’ ‘‘సరే అదంతా ఎందుకుగానీ, నువ్వు దెయ్యం కాబట్టి ఆ చెట్టు మీద వుంటావు. కింద హీరోయిన్ వుంటుంది’’ ‘‘ఒకసారి ఆ చెట్టు చూడు, కరెంట్, డిష్, ఇంటర్నెట్ ఇన్ని వైర్లు దాని మీద నుండి వెళుతున్నాయి. ఆ తీగలకు చుట్టుకుంటే దెయ్యాలకి చాలా ప్రమాదం. ఎందుకంటే అవి రెండోసారి చావలేవు. అందుకని మేము చెట్లమీద వుండడం మానేసి చాలా కాలమైంది. ‘‘దెయ్యంతో సినిమా తీయడం ఇంత కష్టమని నాకు తెలియదు’’. ‘‘సినిమాల్లో నటించడం ఇంత కష్టమని నాకూ తెలియదు. అయినా మీ భయాలేవో మీరు భయపడకుండా నాకెందుకు చుడతారు చెప్పు. ఈరోజుల్లో మనుషులే దెయ్యాలను భయపెడుతు న్నారు. అర్ధరాత్రి వరకూ టీవీలు చూస్తూ, ఫోన్లలో మాట్లాడుతూ మాకు నిద్ర లేకుండా చంపుతున్నారు’’ అని విసుక్కుంటూ దెయ్యం ప్యాకప్ చెప్పేసింది. - జి.ఆర్.మహర్షి -
మనిషి గతి ఇంతే!
హ్యూమర్ ప్లస్ మనుషులు లక్షా తొంభై రకాలు. మనకు గట్టిగా తొంభై రకాలే పరిచయమవుతారు. మిగిలిన లక్ష గురించి తెలుసుకోవడం ఇతరుల బాధ్యత. మనం చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం కానీ మన డిఫెక్ట్స్ ఎదుటివాళ్లు కనిపెడతారు. ఇతరుల పిచ్చిని తెలుసుకోవడమే పనిగా పెట్టుకున్నవాళ్లు కొందరుంటారు. వాళ్లే పిచ్చాసుపత్రి డాక్టర్లు. జీతం తీసుకుని మరీ పిచ్చివాళ్లతో కలిసి జీవిస్తుంటారు. నాకు తెలిసిన డాక్టర్ ఒకాయన ఉన్నాడు. నైజీరియా ప్రభుత్వం డాక్టరేట్ ఇచ్చి సన్మానం చేస్తుందని ఈ-మెయిల్ వస్తే ఖర్చుల కోసం 50 వేలు బ్యాంక్‌లో కట్టాడు. ఆ తరువాత నైజీరియా నుంచి సమాధానం నై. అసలు నైజీరియా వాళ్లకి కొట్టుకు చావడానికే టైం లేదు, మధ్యలో ఈయన్ని పిలిచి సన్మానం ఎందుకు చేస్తారు. వాళ్లకేమైనా పిచ్చా? అందరి పిచ్చిని తెలుసుకునే ఈయన ఇది తెలుసుకోలేక డబ్బు పోగొట్టుకున్నాడు. మన గురించి ఎవడైనా గొప్పగా అనుకుంటే చాలు ఒళ్లు మరిచిపోతాం. మనకు అంత సీన్ ఉందా లేదా అనేది అవసరం. ఎవడి పెళ్లికి వాడే హీరో అయినట్టు మన జీవితానికి మనమే కథానాయకులం. మనంతటి వారు లేరనేది మన ఫిలాసఫీ. తాగినప్పుడు ఇది చాలామందికి తలకెక్కుతుంది. మీరు తాగుబోతులైనా కాకపోయినా పర్లేదు. అయితే మరీ మంచిది. కల్లు కాంపౌండ్‌లో గానీ వైన్‌షాప్‌లో గానీ కాసేపు కూర్చుని చూడండి. బోలెడంత వేదాంత చర్చ జరుగుతూ ఉంటుంది. ‘‘నేనెవర్ని? ఎలాంటివాన్ని? ఈ లోకాన్ని అడగండి అదే చెబుతుంది. డబ్బుదేముంది. మనుషులు ముఖ్యం. అన్నీ చూడ్డానికి దేవుడున్నాడు. కొంచెం సోడా పొయ్. ఆ బాయిల్డ్ పల్లీ తీసుకో.’’ ఇది ఫస్ట్ రౌండ్ చర్చ. థర్డ్‌కి వెళితే భాష బాషా సినిమాలో రజనీకాంత్‌లా విజృంభిస్తుంది. ‘‘నన్షు అందర్షు మోసమ్ష్ చేసినా నేనెవర్షి షేయలేద్షు...’’ నిషా కదా ష అక్షరం అంతటా తానై నర్తిస్తుంది. ‘ష’ ఒక వూతకర్రతో నడిచినట్టు తాగుబోతుల అడుగులు కూడా బడతడుతాయి. ఎంత తడబడినా మనం మనింటికే వెళితే సేఫ్, లేదంటే వీపు సాప్. మనుషులందరికీ వాస్తవం కంటే భ్రాంతి ఎక్కువ ఇష్టం. రియాల్టీలో క్రూయాల్టీ ఉంటుంది. దాన్ని తట్టుకోవడం కష్టం. అందుకే సినిమాలకెళ్లి రంగుల్లో కలల్ని కొనుక్కుంటాం. కొంతమంది దర్శకులు తెలివి మీరి తెరపైన కూడా జీవితాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు. అంతకంత అనుభవిస్తారు. ఉన్న జీవితంతోనే చస్తుంటే డబ్బిచ్చి కూడా జీవితాన్నే చూడమంటే ఎవరు చూస్తారు? లైఫ్ నుంచి, వైఫ్ నుంచి పారిపోవడానికి తాగడం మొదలుపెడతారు. ఎక్కింది దిగగానే ఎదురుగా నైఫ్లే వైఫ్. ఒకాయన ఉన్నాడు. ఆయనెప్పుడూ నోరే తెరవడు. ఒకటి మాట్లాడితే భార్య తంతుంది. రెండు మాట్లాడితే ఉతుకుతుంది. అందుకే ఆ మౌనదీక్ష. కాని మందు పడితే మౌనం పారిపోతుంది. అరుపులు, పెడబొబ్బలు, సవాళ్లు... బండి డౌన్ కాగానే గాలి తీసిన బెలూన్, మూగవాడి పిల్లనగ్రోవి. మనదేశం గొప్పతనం ఏమంటే ఇక్కడ కల్తీ కల్లు తాగి చచ్చిపోతారు. కల్తీ కల్లు దొరక్కపోతే కూడా చచ్చిపోతారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా పోయేది బరియల్ గ్రౌండ్‌కే! - జి.ఆర్.మహర్షి -
తత్వబాదుడు
హ్యూమర్ ప్లస్ జాతి వైరం కూడా మరచి ఒక కుక్క, పిల్లి స్నేహం కలిపాయి. దట్టమైన ఆ స్నేహానికి కారణం పరస్పర గౌరవమే. మియ్యావ్ అనేది శబ్దం కాదని, ఒక నాదమని, అది సరిగమల మిశ్రమమని కుక్క విశ్లేషించేది. భౌభౌ అనే పదంలో భౌతిక సూత్రాలకు అందని భావుకత్వ ఆనందతత్వం వుందని పిల్లి పేర్కొనేది. కూతలో చేతనత్వం, మేతలో అనంత ఆత్మ ప్రబోధం వుందని పసర్పరం సంభాషించుకుంటూ తోకలు పెనవేసుకుంటూ ఉండేవి. పొగుడుకుంటే పోయేదేమీ లేదని సిద్ధాంతీకరించుకుని అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవి. సిద్ధాంతం, రాద్ధాంతం, వేదాంతం - ఈ మూడింటివల్లే ప్రపంచం నడుస్తూ వుందని నమ్మిన ఒక యూనివర్సిటీ వాళ్లు పనేమీ లేక ఒక సెమినార్ పెట్టి ఈ స్నేహితులని ఆహ్వానించారు. తత్వబోధన - ఒక వీరబాదుడు అనే అంశంపై వీలైతే క్లుప్తంగా ప్రసంగించమని ప్రాధేయపడ్డారు. మైకుల్ని, ప్రేక్షకుల్ని గజగజ వణికించడం ప్రాసంగిక ధర్మమని తెలిసి కూడా వాళ్లు ఈ కోరిక కోరడంలో వక్తల్లో రౌద్రరసం ఉప్పొంగింది. కుక్క ఆవేశంగా లేచి ఒక మైకు విరగ్గొట్టింది. తరువాత రెండో మైకు అందుకుని ‘‘మైకు విరవడం ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణమని మా మిత్రులు పిల్లిగారు చెపుతుంటారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. నా మిత్రుడి మాటల్లో చెప్పాలంటే తోక వూపడానికి మించిన తత్వశాస్త్రం లేనేలేదు. కుడి, ఎడమలు కాకుండా నిట్టనిలువుగా కూడా తోకను ఊపవచ్చు. ఈ మూడు రకాలు తెలిసినవాడు ముల్లోకాలు జయిస్తాడు. క్లుప్తత అంటే సంక్లిష్టత. అందరూ క్లుప్తతను ఇష్టపడతారు కానీ ఎవడి క్లుప్తత వాడికుంటుంది. క్లుప్తత వల్ల నిర్లిప్తత, నిర్లిప్తత వల్ల నిర్వేదం, దానివల్ల వైరాగ్యం, ఆ తరువాత ఆరోగ్యం సంప్రాప్తిస్తాయి. బోధన, బాదుడు ఈ రెండూ పరస్పర ఆశ్రీతాలు. బాదితేనే బోధన అర్థమయ్యేది. తత్వాన్ని బోధించడం ఎవడివల్లా కాదు. మన తత్వాన్ని ఎదుటివాడు, ఎదుటివాడి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడమే బోధన. పాలు దొరికినా దొరక్కపోయినా మా మిత్రుడు మియ్యావ్ అనే అంటాడు. మి అంటే తెలుగులో మీరు అని, ఇంగ్లీష్‌లో నేను అని అర్థం. సర్వేజనో అనే భావం ఇందులో ఇమిడి ఉంది. రష్యా, చైనా భాషల్లో ఇంకా బోలెడు అర్థాలున్నాయి. అవేవీ మనకు అర్థం కావు. అర్థమైనవాటిని అర్థమయ్యేలా చెప్పడానికే నానా చావు చస్తున్నాం. అర్థంకాని వాటి జోలికి పోకుండా వుండడమే అర్థశాస్త్రం. ఈ విషయం తెలియక కౌటిల్యుడు అనవసరంగా పెద్ద పుస్తకమే రాశాడు. ఎదుటివాడి డబ్బుని లాక్కోవడం, మన డబ్బుని ఎదుటివాడు లాక్కోకుండా కాపాడుకోవడం ఇదే కదా అర్థశాస్త్రం. దీనికి పుస్తకాలు చదవడం దండగని మా మిత్రుడి అభిప్రాయం. ఆయన భావజాలాన్ని నేను ప్రచారం చేసినట్టే నా భావ ఇంద్రజాలాన్ని ఇప్పుడు ఆయన వివరిస్తాడు’’ అని చెప్పింది. పిల్లి లేచి ఒళ్లు విరుచుకుని, తోకని జెండాలా వూపి, మీసాలు సవరించుకుని ‘‘భౌభౌ అంటే భయం లేకుండా భవబంధ సాగరాన్ని ఈదడం. అరవడం, కరవడమే జీవన్ముక్తికి మార్గమని మిత్రుడి ఉపదేశం. మనం కరచినవాళ్లంతా తిరిగి కరుస్తారని, కరవనివాళ్లంతా మనల్ని కరవకుండా వుంటారని అనుకోవడమే భ్రాంతి. పాలగిన్నె, దుడ్డుకర్ర ఈ రెండే నిజాలు. కర్రకు దొరక్కుండా బర్రెపాలు తాగాలి. ఇదే నీతి, నేతి. ఇది తెలియనివాళ్లు నూతిలో కప్పలా మిగిలిపోతారు...’’ సభికుల్లోంచి ఒక కప్ప లేచి ‘‘అయ్యా! నేను బావిలోని కప్పను కాను. బావులన్నీ ఎండిపోయి యాభై ఏళ్లయింది. మీ మిత్రులిద్దరూ ఒకరి డోలు ఇంకొకరితో కొట్టిస్తున్న తీరు అద్భుతం. మీరు మనుషులకి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ల మనోధర్మ సంగీతాన్ని అనుసరిస్తున్నారు. కానీ పొగడ్డం, పొగిడించుకోవడం చేతకాని నాలాంటి వాళ్ల సంగతేమిటి? బెకబెక శబ్దానికి విలువేలేదా?’’ అని నిలదీసింది. కప్ప మాట్లాడింది సత్యమే అయినా, సత్యం మాట్లాడ్డానికి కప్పని అనర్హురాలిగా ప్రకటించి ‘‘ఆల్ ఫ్రాగ్స్ ఆర్ రోగ్స్’’ అనే సిద్ధాంతాన్ని ఆవిష్కరించి, దాన్ని చైనీస్ కర్రీ సెంటర్‌కి పార్సిల్ చేసి సభ ముగించారు. - జి.ఆర్. మహర్షి