మునకే సుఖమనుకోవోయ్!
హ్యూమర్ ప్లస్
సుబ్బారావుకి గాలిలో తేలుతున్నట్టు కలొచ్చింది. కలవరంలో వుండగా చల్లగా తగిలింది. కళ్ళు తెరిస్తే మంచం నీళ్లలో తేలుతూ వుంది. అపార్ట్‌మెంట్ చెరువులా కనిపించింది. గబాలున లేస్తే కిటికీలోంచి వెంకట్రావ్ విష్ చేశాడు. ఒక ప్లాస్టిక్ కవర్‌లో లాప్‌టాప్ చుట్టుకుని ఈదుతూ వెళుతున్నాడు.
‘‘ఏంటిది ప్రళయమా?’’ అడిగాడు సుబ్బారావు.
‘‘చెరువుల్లో వూళ్లు కడితే, వూళ్లు చెరువులవుతాయి’’
వెంకట్రావ్ సాఫ్ట్‌వేరే కానీ తల్లి వేరు కవిత్వం.
‘‘చెరువుని ఈదడం సులభం, జీవితాన్ని ఈదడమే కష్టం’’ అన్నాడు వెంకట్రావు.
‘‘నాకు ఈత రాదు’’ అన్నాడు సుబ్బారావు.
‘‘లైఫ్ జాకెట్ వేసుకో’’
‘‘జాకెట్ లేడీస్ వేసుకుంటారు. లైఫ్ షర్ట్ వుంటే చెప్పు’’
సుబ్బారావు పురుషవాది. పురుషులందు పురుషవాదులు వేరు. స్త్రీవాదులతో ఓడిపోవడం వల్లే పురుషులు రుషులుగా మారుతున్నారనేది అతని ఫిలాసఫీ.
‘‘తుపాన్‌లో జర్దా పాను గురించి చర్చ అవసరమా?’’
‘‘పురుషుల్ని ఉతికి ఇస్త్రీ చేయడానికే స్త్రీలు పుట్టారని ఇంతకాలం వాదించాను. అందువల్ల జాకెట్ వేసుకోను.’’
‘‘అయితే సెల్ఫీ తీసుకుని ఎఫ్‌బిలో పోస్ట్ చెయ్. అదే నీ ఆఖరి పోస్టింగ్ అని అందరికీ గుర్తుంటుంది’’లాహిరి లాహిరి పాడుకుంటూ వెంకట్రావ్ వెళ్లిపోయాడు.
సుబ్బారావుకి బాస్ గుర్తొచ్చాడు. ప్రపంచమంతా మునిగిపోయినా ఆఫీసులు మునిగిపోవు, అదో ట్రాజెడీ.
ఇంతలో కూకట్‌పల్లి అని అరుస్తూ ఒక పడవ వచ్చింది. దాన్నిండా జనం. ఎవరు ఎవరి మీద కూచున్నారో తెలియడం లేదు. తెడ్డుకి కూడా ఇద్దరు వేలాడుతున్నారు.
కిటికీలోంచే సుబ్బారావు దాంట్లోకి దూకాడు. పడవ అటూఇటూ కదిలి హాహాకారాలు వినిపించాయి.
‘‘ఏంటిది?’’ పడవవాడ్ని అడిగాడు.
‘‘సర్వీస్ ఆటోలుగా, సర్వీస్ బోట్’’
‘‘ఇంతమంది ఎక్కితే మునిగిపోదా?’’
‘‘మునిగిపోతే రక్షించడానికి ఇద్దరు గజ ఈతగాళ్లున్నారు. వాళ్ల చార్జి ఎగస్ట్రా’’
హైలెస్సా హైలెస్సా అంటూ తెడ్డువేశాడు. పడుతూ లేస్తూ నిజాంపేట నుంచి కూకట్‌పల్లి చేరింది పడవ.
ఒడ్డున సర్వీస్ ఆటో ఎక్కాడు.
జనాల్ని ఆటోలో కుక్కి ఒక తాడుతో అందర్నీ కలిపి కట్టేశాడు ఆటోడ్రైవర్.
‘‘ఈ బంధనం ఎందుకు?’’
‘‘ఇది సీట్ బెల్ట్ లాంటిది సార్. మనకు ముందర రోడ్డంటూ ఏమీ లేదు. ఒక గోతిలోంచి ఇంకో గోతిలోకి జంప్‌చేస్తూ వెళ్లడమే’’ అని డ్రైవర్ స్టార్ట్ చేశాడు.
పిండిమరలాగా అది గుడగుడ సౌండ్ చేస్తూ కదిలింది. సర్వాంగాలు గజగజ వణికాయి. దబేల్‌దుబేల్‌మంటూ ఆటో అటూ ఇటూ ఒరుగుతూ వెళ్లింది. ఒక మాన్‌హోల్‌లోకి డైవ్ చేయడానికి ఆటో ప్రయత్నించింది కానీ సమయస్ఫూర్తితో డ్రైవర్ హ్యాండిల్‌కి వేళాడుతూ హ్యాండిల్ చేశాడు. ఈ కీలకమైన ఘట్టంలో పలువురు బాధితులు గోవిందనామస్మరణ చేస్తూ కాస్త పుణ్యం గడించారు. సామూహిక పగ్గం నుంచి ఆటోవాడు విముక్తి చేసిన తరువాత ఆఫీస్ దగ్గరికి వెళితే గుండె చెరువైంది.
అక్కడ గడకర్ర సాము జరుగుతూ వుంది.
యాభై రూపాయల ఫీజు ఇస్తే గడకర్రని ఇస్తున్నారు. దాన్ని వూతంగా గాల్లోకి ఎగిరితే సెకండ్‌ఫ్లోర్‌లో ల్యాండ్ అవుతాం. నీటిలో ఆఫీస్ వుండడం వల్ల ఇంకో దారిలేదు. ఆఫీస్‌కి వెళ్లాలంటే గడకర్ర, వెళ్లకపోతే బాస్ దుడ్డుకర్ర తీసుకుంటాడు.
‘‘జీవితంలో ఇలా ఎత్తుకు ఎదిగే అవకాశం పదేపదే రాదు సార్’’ అన్నాడు గడకర్రవాడు.
‘‘నాకు భయం’’ అన్నాడు సుబ్బారావు. ‘‘భయానికి విరుగుడు అభయం’’ అంటూ ఆంజనేయుడిలా భుజాల మీద ఎక్కించుకుని యాహూ అంటూ గడకర్రవాడు ఎగిరాడు. గూగుల్ అంటూ దూకాడు సుబ్బారావు.
ఐరిస్ మిషన్‌కు కళ్లు చూపించాడు. ఆఫీస్‌లోకి తగలడిచావు అని మూలిగింది. ‘‘ప్రకృతితో వికృతిగా వ్యవహరిస్తే భవిష్యత్ ఆకృతి ఇదే. నాలుగు చినుకులకే చిరిగి చాటంతవుతుంది’’ అంటున్నారెవరో.
- జి.ఆర్. మహర్షి