ఘటికుని జ్ఞానోదయం
హ్యూమర్ ఫ్లస్
సుబ్బారావు ఒక వేదాంతి. జ్ఞానం ఉంటే డబ్బు అక్కర్లేదని ఆయన నమ్మకం. డబ్బుంటే జ్ఞానంతో పని లేదని వాళ్లావిడ నమ్మకం. పరస్పర విరుద్ధ నమ్మకాల సంఘర్షణల సమ్మేళనమే దాంపత్యం. ప్రకృతి సహజంగా ఆమె వేధించేసరికి సుబ్బారావు వేదాంతిగా మారాల్సి వచ్చింది. వేదాంతం యొక్క ప్రత్యేకత ఏమంటే అది మనల్ని అర్థం చేసుకోదు. మనకి అర్థం కాదు.
ఒకరోజు డిక్షనరీలు అమ్మే కుర్రాడు సుబ్బారావు దగ్గరికి వచ్చాడు. దిండు కంటే దిట్టంగా ఉన్న డిక్షనరీని చూపించాడు. అన్ని పదాలకి అర్థాలు, అర్థవంతమైన అన్ని పదాలూ ఇందులో ఉన్నాయని చెప్పాడు.
‘‘ఈ ప్రపంచంలో దేనికీ అర్థం లేదు. మనం ఏదైతే అర్థమైందని అనుకుంటామో, దాని అర్థం అది కాకపోవచ్చు. అర్థం కానిదంతా అర్థశాస్త్రం. అర్థమైతే అది పరమార్థం. పురుషులు అర్థమవుతారు కాబట్టి పురుషార్థం అన్నారు. స్త్రీలు అర్థం కారు కాబట్టి స్త్రీ అర్థం లేకుండా పోయింది’’ అన్నాడు సుబ్బారావు తాపీగా.
డిక్షనరీల కుర్రాడు బుర్ర గోక్కుని ‘‘సార్.. ఇందులో ప్రతి వర్డ్‌కీ..’’ అంటూ ఏదో చెప్పబోయాడు.
‘‘వర్డ్స్‌వర్త్ అనే కవి ఉన్నాడు కానీ, వర్డ్స్‌కి వర్త్ లేదు. అయినా పెళ్లయిన తర్వాత డిక్షనరీలతో పని లేదు. అంతా రియాక్షనీరినే’’
‘‘దీనికి డిస్కౌంట్ కూడా ఉంది’’.
‘‘కౌంట్, డిస్కౌంట్, ఎకౌంట్, రీకౌంట్ అన్నీ ఒక్కలా కనిపించినా ఒక్కటి కావు. జాయింట్ ఎకౌంట్ ఉంటే జాయింట్స్ సేఫ్‌గా ఉంటాయి. మోకాళ్ల రీప్లేస్‌మెంట్ ఉండదు. మోకాళ్ల చిప్పల మార్పిడి ఎంత ఎక్కువగా జరిగితే సొసైటీకి అంత ఎక్కువ డేంజర్. ఎందుకంటే చాలామందికి మెదడు మోకాళ్లలో ఉంటుంది కాబట్టి’’.
డిక్షనరీల కుర్రాడు ఘటికుడు. డిక్షనరీలు మోసి మోసి వాడు ఎక్స్‌ట్రార్డినరీగా మారాడు. ఎబిసిడిలు రాని వాళ్లకు కూడా డిక్షనరీలు అమ్మిన ఘనుడు.
‘‘డిక్షనరీల వల్ల జ్ఞానమొస్తుంది సార్’’ అని నోరు జారాడు.
జ్ఞానం అనే పదం వింటే సుబ్బారావుకి పూనకం వస్తుంది. ‘‘డిక్షనరీల వల్ల డిసెంట్రీ, డిఫ్తీరియా, ధనుర్వాతం రావచ్చునేమో కానీ జ్ఞానం రాదు నాయనా. జ్ఞానమనేది దురద కాదు, హఠాత్తుగా వచ్చి గోక్కుంటే పోడానికి. మన శరీరంలో రక్తంలా అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మనం గాయపడితే కనిపిస్తుంది. జ్ఞానాన్ని కళ్ల చూడాలంటే ప్రతివాడూ గాయపడాలి. ఎర్రగా కనిపించేదంతా రక్తం కానట్టే, జ్ఞానంలా కనిపించేదంతా జ్ఞానం కాదు. అజ్ఞానానికి మారువేషాలెక్కువ’’.
‘‘మీరు జ్ఞానులని ఒప్పుకుంటాను సార్, కానీ ఎంత జ్ఞానికైనా అర్థం తెలియని పదాలుంటాయి. అందుకే ఈ డిక్షనరీ’’.
‘‘అయితే అభిటృక్యనేక్సియాన్‌టక్స్ అనే పదానికి అర్థం చెప్పు’’.
‘‘అరబ్ పదానికి అర్థం అడిగితే ఎలా?’’అన్నాడా కుర్రాడు జడుసుకుంటూ.
‘‘అది అరబిక్ అని నీకెలా తెలుసు?’’
‘‘సౌండ్‌ని బట్టి ఊహించా’’.
‘‘అది అరబిక్ కాదు, మక్యావో భాష’’.
‘‘ఏ దేశంలో మాట్లాడుతారు సార్’’.
‘‘ఎక్కడా మాట్లాడరు. మాటలు రానివాళ్లు మాట్లాడతారు. మనకు తెలిసిందే భాష కాదు. చూసిందే వేషం కాదు’’.
డిక్షనరీలు అమ్మకుండా వెళ్లడం ఆ కుర్రాడి డిక్షనరీలోనే లేదు. ఎన్నో జిడ్డు గిరాకీలను చూశాడు కానీ, ఆముదంలో ఈదడం ఇదే మొదటిసారి.
‘‘మీరు ఫిలాసఫరా సార్’’ అని పొగడ్డానికి ప్రయత్నించాడు.
‘‘ప్రతి సఫరర్ ఫిలాసఫర్ కాకపోవచు కానీ, ప్రతి ఫిలాసఫర్ సఫరరే’’.
‘‘మీలాంటి వాళ్ల కోసమే ఈ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ సార్’’.
‘‘ఆక్స్ అంటే ఎద్దు. ఎద్దు.. చాకిరీ చేసే జంతువు. బానిస. స్లేవరీ పేరుతో ఉండే డిక్షనరీలు నేను కొనను’’
‘‘మీకు కొనడం ఇష్టం లేదు. అందుకే ఈ జ్ఞానబోధ’’
‘‘కొనుగోళ్లు, అమ్మకాలు మన ఇష్టాల ప్రకారం జరగవు. మనల్ని మనం అమ్ముకుంటేనే, మనకు కావాల్సినవి కొనగలం. వ్యాపారమైనా, కోళ్ల ఫారమైనా కంపు లేకుండా నడవదు. వాదం, వేదం, నిర్వేదం చివరికంతా జూదం. వెళ్లకపోతే నీకు ప్రమాదం’’.
కుర్రాడు పారిపోతూ సుబ్బారావు ఇంటికి ‘నో ఎంట్రీ’ బోర్డు తగిలించి వెళ్లాడు.
- జి.ఆర్.మహర్షి